పాములపర్తి వెంకట నరసింహారావు

బహుభాషావేత్త, రచయిత, భారత దేశ 10 వ ప్రధాన మంత్రి (1921-2004)
(పివినరసింహారావు నుండి దారిమార్పు చెందింది)

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగింది.[3] 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.[4] కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

పాములపర్తి వెంకట నరసింహారావు
పి. వి. నరసింహారావు
పి. వి. నరసింహారావు
భారతదేశపు 9వ ప్రధానమంత్రి
In office
21 జూన్ 1991 – 16 మే1996
అధ్యక్షుడుఆర్. వెంకట్రామన్
శంకర దయాళ్ శర్మ
అంతకు ముందు వారుచంద్రశేఖర్
తరువాత వారుఅటల్ బిహారీ వాజపేయి
రక్షణ శాఖామంత్రి
In office
6 మార్చి1993 – 16 మే1996
ప్రధాన మంత్రిఅతనే ప్రధాని
అంతకు ముందు వారుశంకర్ రావు చవాన్
తరువాత వారుప్రమోద్ మహాజన్
In office
31 డిసెంబరు1984 – 25 సెప్టెంబరు1985
ప్రధాన మంత్రిరాజీవ్ గాంధీ
అంతకు ముందు వారురాజీవ్ గాంధీ
తరువాత వారుశంకర్ రావు చవాన్
విదేశే వ్యవహారాల శాఖా మంత్రి
In office
31 మార్చి1992 – 18 జనవరి1994
ప్రధాన మంత్రిఆయనే ప్రధాని
అంతకు ముందు వారుమాధవ్ సింగ్ సోలంకి
తరువాత వారుదినేష్ సింగ్
In office
25 జూన్1988 – 2 డిసెంబరు1989
ప్రధాన మంత్రిరాజీవ్ గాంధీ
అంతకు ముందు వారురాజీవ్ గాంధీ
తరువాత వారువి. పి. సింగ్
In office
14 జనవరి1980 – 19 జులై1984
ప్రధాన మంత్రిఇందిరా గాంధీ
అంతకు ముందు వారుశ్యాం నందన్ ప్రసాద్ మిశ్రా
తరువాత వారుఇందిరా గాంధీ
హోం శాఖా మంత్రి
In office
12 మార్చి1986 – 12 మే1986
ప్రధాన మంత్రిరాజీవ్ గాంధీ
అంతకు ముందు వారుశంకర్ రావు చవాన్
తరువాత వారుసర్దార్ బూటా సింగ్
In office
19 జులై1984 – 31 డిసెంబరు1984
ప్రధాన మంత్రిఇందిరా గాంధీ
రాజీవ్ గాంధీ
అంతకు ముందు వారుప్రకాష్ చంద్ర సేథీ
తరువాత వారుశంకర్ రావు చవాన్
4th ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
In office
30 సెప్టెంబరు1971 – 10 జనవరి1973
గవర్నర్ఖండూభాయ్ కసాంజీ దేశాయ్
అంతకు ముందు వారుకాసు బ్రహ్మానంద రెడ్డి
తరువాత వారురాష్ట్రపతి పాలన
పార్లమెంటు ఎంపి (లోక్ సభ)
In office
15 మే1996 – 4 డిసెంబరు1997
అంతకు ముందు వారుగోపీనాథ్ గజపతి
తరువాత వారుజయంతి పట్నాయక్
నియోజకవర్గంబర్హాంపూర్ లోక్ సభ నియోజకవర్గం
In office
20 జూన్ 1991 – 10 మే1996
అంతకు ముందు వారుగంగుల ప్రతాప రెడ్డి
తరువాత వారుభూమా నాగిరెడ్డి
నియోజకవర్గంనంద్యాల పార్లమెంటు నియోజకవర్గం
In office
31 డిసెంబరు1984 – 13 మార్చి 1991
అంతకు ముందు వారుబార్వే జాతిరాం చితరం
తరువాత వారుతేజ్ సింగ్ రావు భోస్లే
నియోజకవర్గంరాంతెక్
In office
23 మార్చి1977 – 31 December 1984
అంతకు ముందు వారురాజ్యాంగం స్థాపన
తరువాత వారుచెందుపట్ల జంగారెడ్డి
నియోజకవర్గంహనుమకొండ లోక్ సభ నియోజక వర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1921-06-28)1921 జూన్ 28
లక్నేపల్లి, నర్సంపేట,[1] హైదరాబాదు సంస్థానం, బ్రిటిష్ రాజ్యం
(ప్రస్తుతం తెలంగాణ)
మరణం2004 డిసెంబరు 23(2004-12-23) (వయసు 83)
కొత్త ఢిల్లీ
మరణ కారణంగుండెపోటు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సత్యమ్మ
(m. 1943; died 1970)
[2]
సంతానం8, including పి. వి. రాజేశ్వరరావు, సురభి వాణి దేవి, పీవీ ప్రభాకర్‌రావు (పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్ పర్సన్)
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం (బి.ఎ)
ముంబై విశ్వవిద్యాలయం
నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం (ఎల్.ఎల్.ఎమ్)
వృత్తి
 • న్యాయవాది
 • రాజకీయ నాయకుడు
 • రచయిత

కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహరావుకు భారతరత్న పురస్కారాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది.[5]

తొలి జీవితం

తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతనిని దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అతన్ని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్.ఎల్.బి చదివాడు.[6] స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ

1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.

కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతనికి కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని అతను రాజకీయ నేపథ్యం అతనికి 1971 సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ముఖ్యమంత్రిగా

ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి.[7] పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు.[8] రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.[9] ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు.

అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కారణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య అతని గురించి వ్రాశాడు. శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు.

కేంద్ర రాజకీయాల్లో పీవీ

తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం

మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరచాడు.

ప్రధానమంత్రిగా పీవీ

 
పీవీ జాతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ ( 1992)

ఆయనకి ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు అతనుపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో అతనుకు ఉన్న అపార అనుభవం అతనుకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం అతను రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే అతను్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు అతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.

పీవీ విజయాలు

 • పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
 • పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
 • కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
 • ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
 • 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. అతను కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.[10]

పీవీపై విమర్శ

పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.

 • 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
 • 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన అతను ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం అతను వైఫల్యాల్లో అతిపెద్దది.
 • సాధువులకు, బాబాలకు అతను సన్నిహితంగా ఉండేవాడు.

అవినీతి ఆరోపణలు

ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగి పోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయనను వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. చివరి కేసు అతను మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. చాలా నిరాడంబరంగా జీవించి, తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచాడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది.[11] అతను ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:

 • జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబరు 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
 • సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీతో విభేదించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎక్కౌంటు తెరిచిన కేసది.
 • లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.

పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి.[12] ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.

సాహితీ కృషి

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే అతను ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమయింది. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం ఉంది.[13]

అతను రచనలు:

 • సహస్రఫణ్: విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం చేశారు. ఈ పుస్తకానికై పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
 • అబల జీవితం: పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
 • ఇన్‌సైడర్: అతను రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ అతను జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదం అయింది.[14]
 • ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
 • తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో "విస్మృత కథ" సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది.[15]

ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో వ్రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో వ్రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.[9]

వ్యక్తిగత జీవితం

నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నాడు. సత్యమ్మరావు 1970, జూలై 1న మరణించింది. వారికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు పి.వి. రంగారావు, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశాడు. రెండవ కుమారుడు పి.వి. రాజేశ్వర్ రావు, సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభ ( 1996 మే 15 - 1997 డిసెంబర్ 4) పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.[16][17] కూతరు సురభి వాణి దేవి చిత్రకారిణిగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నది.[18][19] 2021 మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందింది.[20]

మరణం

తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం అతనుకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

అంత్యక్రియలపై సందిగ్ధం, అవమానం

పీవీ నరసింహారావు మరణించిన తర్వాత అతని కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పీవీ నరసింహారావు కుటుంబసభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగడానికి ఒప్పించారు. ఢిల్లీ నుంచి పీవీ నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అయితే శవం సగమే కాలిందనీ, అర్థరాత్రి కుక్కలు శవాన్ని బయటకు లాగాయని టీవీ ఛానెళ్ళు వీడియోలు ప్రదర్శించాయి, వార్తలు వచ్చాయి. పి.వి.కి సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కే ప్రసాద్‌ దీనిని ఖండించారు. "అతను దేహం సగంకాలిన స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది... ఏమైనా అతను మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పి.వి. శరీరం సగమే కాలిందన్న భావన అతనుకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే." అని అన్నారు.[21]

పురస్కారాలు, స్మృతి చిహ్నాలు

 
పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ రహదారి

పి.వి. నరసింహారావుకు 2024 ఫిబ్రవరి 9 న కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది[22][23].

పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు. ఇది 2009 అక్టోబరు 19 న ప్రారంభం అయ్యింది. దీనిని మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.

పుస్తకాలు

పివి జీవితచరిత్ర పై హాఫ్ లయన్ [21] అనే పుస్తకం వినయ్ సీతాపతి రాశాడు. ఇది 2016 లో విడుదలైంది.

 
2016 జూన్ 27న హాఫ్ లయన్ పుస్తకం విడుదల, హమీద్ అన్సారీ ద్వారా

జైరామ్ రమేష్ రచించిన 'TO THE BRINK & BACK: INDIA's 1991 STORY' లో ప్రధానంగా భారతదేశ ఆర్థిక సంస్కరణలు నరసింహారావు నేతృత్వంలో ఎలా రూపుదిద్దుకున్నాయో చర్చింపబడింది.

పీవీ నిర్వహించిన పదవులు

కాలం పదవి
1951 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యత్వం
1957-77 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
1962-64 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1964-67 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
1967 ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
1968-71 ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1971-73 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1977 లోక్‌సభ సభ్యత్వం
1980 లోక్‌సభ సభ్యత్వం
1980 జనవరి-1984 జూలై కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
1984 జూలై-1984 డిసెంబర్ కేంద్ర హోం శాఖమంత్రి
1984 లోక్‌సభ సభ్యత్వం (మూడో సారి)
1984 నవంబరు-1985 ఫిబ్రవరి భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
1985 జనవరి-1985 సెప్టెంబరు కేంద్ర రక్షణ శాఖమంత్రి
1985 సెప్టెంబరు-1988 జూన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
1986 జూలై- 1988 ఫిబ్రవరి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
1988 జూన్-1989 డిసెంబర్ విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
1989 లోక్‌సభ సభ్యత్వం (నాలుగోసారి)
1991 మే 29 - 1996 కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
1991 జూన్ – 1996 మే 10 ప్రధానమంత్రి
1991 నవంబరు ఉప ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదవసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

శత జయంతి వేడుకలు

పి.వి. నరసింహరావు శత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2020, జూన్ 28 నుండి 2021, జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జూన్ 28 ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించారు.[24][25][26] పి.వి. నరసింహరావు శత జయంతి సమీక్ష సమావేశములో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పి.వి. నరసింహరావుకు భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటమును పార్లమెంటులో పెట్టాలని, వారు నెలకొలిపిన కేంద్రీయ యూనివర్సిటీకి పి.వి. నరసింహరావు పేరు పెట్టాలని అసెంబ్లిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వమునకు పంపుటము జరుగుంతుందని పేర్కొన్నారు. పి.వి. జన్మించన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాల్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు.[27] పీవీ నరసింహారావు గారికి జయంతి సందర్భంగా 2021 జూన్ 28న హుస్సేన్‌సాగర్‌ సమీపంలోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని, ఆయనకు నివాళిగా ప్రచురితం అయినా తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు.[28] వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో పీవీ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు. నెక్లెస్‌రోడ్‌ పేరును పీవీ మార్గ్‌గా ప్రభుత్వం మార్చింది.[29][30]

వనరులు, మూలాలు

 1. Staff Reporter (25 June 2014). "People hail decision on PV's birth anniversary". The Hindu. Retrieved 31 December 2019 – via www.thehindu.com.
 2. "Rao And His Sons: Uneasy Ties | Outlook India Magazine". Outlook (India). Retrieved 31 December 2019.
 3. "Narasimha Rao – a Reforming PM". news.bbc.co.uk. BBC News. 23 December 2004. Retrieved 2 March 2007.
 4. Eenadu (9 November 2023). "ఉమ్మడి జిల్లా నుంచి తొలి మంత్రి.. ఒకే ఒక ముఖ్యమంత్రి". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
 5. "తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న | PV Narasimha Rao Conferred Bharat Ratna By Indian Government - Sakshi". web.archive.org. 2024-02-09. Archived from the original on 2024-02-09. Retrieved 2024-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 6. "How Rao got admission to Law College". 2004.
 7. R Akhileswari (2004-12-24). "A polyglot whose achievements went unrecognised". Archived from the original on 2014-12-27. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2004-12-27 suggested (help)
 8. శతవసంతాల కరీంనగర్ (1905-2005). మానేరుటైమ్స్ ప్రచురణ. p. 52.
 9. 9.0 9.1 V. Venkatesan (1–14 January 2005). "Obituary: A scholar and a politician". Frontline. 22 (1). Archived from the original on 30 January 2010. Retrieved 30 March 2010.
 10. K. Subrahmanyam. "P.V. Narasimha Rao and the Bomb". South Asian Media Network. Archived from the original on 2006-01-04.
 11. కె.విజయరామారావు, ఈనాడు,8.11.2009
 12. "Narasimha Rao acquitted in Lakhubhai Pathak case". The Hindu. 2003-12-23. Archived from the original on 2004-02-19. Retrieved 2006-01-22.
 13. తెలుగు తూలిక, నిడదవోలు మాలతి కథలు, వ్యాసాలు. "బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు". tethulika.wordpress.com. Retrieved 23 December 2017.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
 14. "The tale of an outsider". Frontline. 1998-04-25. Archived from the original on 2012-06-10. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2012-06-03 suggested (help)
 15. తెలంగాణ విముక్తి పోరాట కథలు. 1995.
 16. "Biographical Sketch of P.V. Rajeshwar Rao". Parliament of India. Archived from the original on 12 August 2010. Retrieved 26 ఫిబ్రవరి 2021.
 17. "Sri. P.V.Rajeswara Rao". Matrusri Institute of P.G. Studies. Archived from the original on 21 July 2011. Retrieved 26 ఫిబ్రవరి 2021.
 18. "Photos: Painting Exhibition by P.V.Narasimha Rao's Daughter Smt. S. Vani Devi at Salar Jung Museum, Hyderabad". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 26 February 2021.
 19. Ifthekhar, J. S. (7 September 2015). "Art parallels Nature". The Hindu. The Hindu. Retrieved 26 February 2021.
 20. Telangana Today, Telangana (20 March 2021). "TRS candidate Vani Devi wins Graduates MLC election". Archived from the original on 20 March 2021. Retrieved 17 April 2021.
 21. 21.0 21.1 వినయ్ సీతాపతి (2016). "...చితిపై పి.వి. పార్థివ దేహం కాలుతూనే ఉంది". Half Lion. ఆంధ్రజ్యోతి. Archived from the original on 2018-10-20.
 22. "Message to farmers, strike at Congress, as Modi govt announces 3 more Bharat Ratnas". The Indian Express (in ఇంగ్లీష్). 2024-02-09. Retrieved 2024-02-09.
 23. "Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న". EENADU. Retrieved 2024-02-09.
 24. నమస్తే తెలంగాణ, తెలంగాణ (29 June 2020). "నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం". www.ntnews.com. Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.
 25. ఈనాడు, తెలంగాణ (29 June 2020). "నవభారత నిర్మాత పీవీ". www.eenadu.net. Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.
 26. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (29 June 2020). "హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టాలి". www.andhrajyothy.com. Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.
 27. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2020-08-31.
 28. TV9 Telugu (28 June 2021). "PV Jayanthi: 26 అడుగుల పీవీ కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌రణ‌.. పీవీ ఒక కీర్తి శిఖ‌రం అంటూ పొగిడిన కేసీఆర్‌.. - CM KCR And Governor Tamilisai In PV Shatha Jayanthi Celebrations And Inaugurates PV Statue PV Marg Hyderabad". TV9 Telugu. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 29. V6 Velugu (28 June 2021). "కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 30. Namasthe Telangana (28 June 2021). "కేయూలో పీవీ పీఠం". Namasthe Telangana. Archived from the original on 29 జూన్ 2021. Retrieved 29 June 2021.

బయటి లింకులు


ఇంతకు ముందు ఉన్నవారు:
చంద్రశేఖర్
భారత ప్రధానమంత్రి
21/06/1991—16/05/1996
తరువాత వచ్చినవారు:
అటల్ బిహారీ వాజపేయి


ఇంతకు ముందు ఉన్నవారు:
కాసు బ్రహ్మానంద రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
30/09/1971—10/01/1973
తరువాత వచ్చినవారు:
జలగం వెంగళరావు