కంచె (సినిమా)
కంచె 2015 అక్టోబరు 22 న విడుదలైన తెలుగు సినిమా.[1] ఈ చిత్ర కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది.[2] 2015 ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ఆకట్టుకున్నది.[3]
కంచె (సినిమా) | |
---|---|
దర్శకత్వం | జాగర్లమూడి రాధాకృష్ణ |
రచన | సాయిమాధవ్ బుర్రా (సంభాషణలు) |
నిర్మాత | సాయిబాబు జాగర్లమూడి వై. రాజీవ్ రెడ్డి |
తారాగణం | వరుణ్ తేజ్ ప్రగ్యా జైస్వాల్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | సూరజ్ జగ్‌తప్ రామకృష్ణ అర్రం |
సంగీతం | చిరంతన్ భట్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 22 అక్టోబరు 2015 |
సినిమా నిడివి | 169 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹19 crore (US$2.4 million) |
కథ
మార్చురెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ- యుద్ధానికి ముందు కాలంలోనూ - రెండు కాలాలలో నడిచే రెండు విడివిడి కథల సంపుటి ఇది. 1939 లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో బ్రిటన్ తరపున పాల్గొనేందుకు రాయల్ ఇండియన్ ఆర్మీలో చేరి ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) కూడా వెళ్తాడు. మొన్నటి వరకూ ఇదే యుద్ధంలో జర్మనీ, జపాన్ లతో కలిసి మిగిలిన దేశాలకి (మిత్ర పక్షాలు) వ్యతిరేకంగా యాక్సిస్ దేశంగా వున్న ఇటలీ, ఆ కూటమి నుంచి విడిపోయి మిత్రపక్షాల వైపు చేరుతుంది. దీంతో జర్మన్ నాజీలు హిట్లర్ ఆదేశాలతో ఇటలీ పనిబట్టాలని చూస్తూంటారు. ఆ జర్మనీ- ఇటలీ సరిహద్దులో ఇటలీ తరపున యుద్ధం చేస్తున్న దళంలో సైనికుడుగా హరిబాబు వుంటాడు. ఇతడి నేస్తంగా దాసు (అవసరాల శ్రీనివాస్) ఉంటాడు. ఇతను అతి భయస్థుడు, పిరికివాడు కూడా. ఇదే దళంలో మరో తెలుగు వాడైన ఈశ్వర్ (నికితిన్ ధీర్) అనే కల్నల్ ఉంటాడు. వీళ్ళందరికీ బ్రిటిష్ సైనికాధికారి సారథ్యం వహిస్తూంటాడు.
అయితే హరిబాబుకీ, ఈశ్వర్‌కీ పడదు. పాత పగలతో బద్ధ శత్రువుల్లా వుంటారు. దీనికి కారణాల్ని వెల్లడిస్తూ ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది- 1936 లో మద్రాసులో హరిబాబు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, అదే కాలేజీలో చదివే సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్)తో పరిచయం ప్రేమా ఏర్పడతాయి. సీతాదేవి రాచకొండ సంస్థానానికి చెందిన జమీందారు (అనూప్ పురీ) వారసురాలు. ఆ దేవరకొండ గ్రామంలో క్షురకుడి (గొల్లపూడి మారుతీరావు) మనవడు హరిబాబు. వీళ్ళిద్దరి ప్రేమ సీత అన్న ఈశ్వర్‌కి నచ్చదు. అతను కులాల అంతరాల్ని తెరపైకి తెస్తాడు. సీతాదేవికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు ఈశ్వర్. నిమ్నకులస్థుడైన హరిబాబుని అడ్డు తొలగించుకునేందుకు తండ్రి చెప్పిన పథకంతో, వూళ్ళో కులఘర్షణలు రేకెత్తిస్తాడు. ఆ ఘర్షణల్లో హరిబాబుని చంపేస్తే అది ఆ ఘర్షణల మీదికి పోతుందని ఆలోచన. ఘర్షణలతో ఊరు రెండుగా విడిపోతుంది. నిమ్న కులస్థుల ఇళ్ళకీ, ఉన్నత కులస్థుల ఇళ్ళకీ మధ్య కంచె కట్టేస్తారు. అలా హరిబాబు మీద కూడా దాడి చేయడంతో అతడు సీతాదేవి ఇంటికే వచ్చి, అందరి ముందూ తాళి కట్టి ఆమెని తీసికెళ్ళి పోతాడు. దీంతో ఆగ్రహించి హీరోని చంపేసేందుకు వెళ్ళిన ఈశ్వర్‌ని, సీతాదేవి అడ్డుకోవడంతో ఆమెని తోసేస్తాడు. ఆమె ఇనుప చువ్వ మీద పడి కడుపులో గాయంతో విలవిల్లాడుతుంది.
ఒక పక్క ఈ ప్రేమకథ అంతకంతకీ విషమంగా మారుతుంటే, దీనికి విరుద్ధంగా ప్రస్తుత యుద్ధకథ అనేక మలుపులు తిరుగుతూ సాగుతూంటుంది.
అకస్మాత్తుగా జర్మన్లు వైమానిక దళంతో దాడి చేసేసరికి వాళ్ళ ధాటికి తట్టుకోలేక లొంగిపోతుంది హరిబాబు వున్న దళం. హరిబాబూ దాసూ దాక్కుని ఆ తతంగం గమనిస్తూంటారు. జెనీవా ఒప్పందం ప్రకారం లొంగిపోయిన శత్రుదేశపు సైనికులపై ఏ దురాగతాలకీ పాల్పడకూడదు. కానీ ఇక్కడ చూస్తే ఈ జర్మన్లు ఆ ఒప్పందాన్ని గౌరవించేలాలేరు. మాట తేడా వచ్చిందని కళ్ళముందే లొంగిపోయిన కొందరు సైనికుల్ని కాల్చేశారు. ఓ పదిమందిని సజీవంగా పట్టుకెళ్ళారు. వాళ్ళల్లో బ్రిటిష్ సైనికాధికారితో బాటు, ఈశ్వర్ కూడా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోవాలని హరిబాబు ఒక సాహసోపేత ఆపరేషన్‌కి నడుం బిగిస్తాడు. ఆ జర్మన్ దళం మీద ఎటాక్ చేసి తమ వాళ్ళని విడిపించుకునే ఆపరేషన్. ఆ లక్ష్యంతో తన దళంతో శత్రుదేశంలోకి ప్రవేశించినప్పుడు, అక్కడా జర్మన్ దళాధికారి బృందం యూదు కుటుంబాన్ని హతమారుస్తూంటారు. జర్మన్ యువకుడు, యూదు యువతీ పెళ్లి చేసుకుంటే పుట్టిన ‘చెడు రక్తపు’ ఆర్నెలల పసిపాపని చంపెయ్యడానికి సిద్ధమవుతారు. ఇక్కడ హరిబాబు లక్ష్యం బందీలుగా వున్న తన దళాన్ని విడిపించుకోవడమే అయినప్పటికీ, కళ్ళ ముందు పసిపాపతో జరుగుతున్న అకృత్యాన్ని సహించలేకపోతాడు. తన వూళ్ళో తనకి జరిగినట్టే ఇక్కడ కూడా జాతి రక్తమంటూ రాక్షసత్వం జడలు విప్పుకుంటోంది. ఇక సాహసంతో దాడి చేసి ముందు ఆ పసిపిల్లనీ, యూదుకుటుంబాన్నీ విడిపించుకుని పారిపోతాడు. జర్మన్లు వెంటపడతారు. ఒక శిథిల భవనంలో దాక్కున్నప్పుడు జర్మన్లు దాడి చేస్తారు. వాళ్ళ వాహనంలోనే బందీలుగా వున్న హీరో దళ సభ్యుల్లోంచి ఈశ్వర్ తనకి తానే తప్పించుకుని పోరాటం చేయడం మొదలెడతాడు. పసిపిల్లని కాపాడుకుంటూ హరిబాబు కూడా జర్మన్ల మీద దాడి చేసి తన దళాన్ని విడిపించుకుని, ఒక నదిని దాటేందుకు ప్రయత్నిస్తాడు. నది దగ్గర తిష్టవేసిన జర్మన్ దళాల మీదికి తెగించి దాడికి పోతాడు.
ఇలా ఓ యుద్ధ కథ, ఇంకో ప్రేమ కథా విడివిడిగా సాగుతూ, ముగింపులో కలిసిపోయి ఒకటవుతాయి. రైలులో హరిబాబు మృతదేహంతో వూరికి చేరుకుంటాడు ఈశ్వర్. ప్రజల కన్నీళ్ళ మధ్య సీతాదేవి సమాధి పక్కనే హరిబాబుని సమాధి చేస్తారు. ఇలా పూర్వ కథతో వచ్చి ప్రత్యక్ష కథ కలుస్తుంది.[2]
నటవర్గం
మార్చు- వరుణ్ తేజ్ - దూపాటి హరిబాబు
- ప్రగ్యా జైస్వాల్ - రాచకొండ సీతాదేవి
- అనూప్ పూరి - సీతాదేవి తండ్రి
- నికితిన్ ధీర్ - ఈశ్వర్ ప్రసాద్, సీతాదేవి అన్నయ్య
- అవసరాల శ్రీనివాస్ - హరిబాబు స్నేహితుడు దాసు
- గొల్లపూడి మారుతీరావు - హరిబాబు తాతయ్య
- షావుకారు జానకి - సీతాదేవి తాతమ్మ
- రవి ప్రకాష్ - జనార్ధన శాస్త్రి
- పోసాని కృష్ణమురళి
- సత్యం రాజేష్
సాంకేతికవర్గం
మార్చు- కథ - జాగర్లమూడి రాధాకృష్ణ
- దర్శకుడు - జాగర్లమూడి రాధాకృష్ణ
- సంభాషణలు - సాయిమాధవ్ బుర్రా
- సంగీతం - చిరంతన్ భట్
- ఛాయాగ్రహణం - ఛోటా కె. నాయుడు[1]
- పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కూర్పు - సూరజ్ జగ్ తాప్, అర్రం రామకృష్ణ
- కళ - సాయిసురేష్
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, హిందీ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని పాటలు:
- ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో
- విద్వేషం పాలించే దేశం ఉంటుందా
- భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో..
విశేషాలు
మార్చు- ఈ సినిమా నిర్మాణం 19 కోట్ల రూపాయల బడ్జెట్టుతో, 55 రోజుల్లో పూర్తి చేశారు.
విడుదల
మార్చుఈ చిత్రం 2015 అక్టోబరు 22న విడుదలైనది.[4]
పురస్కారాలు
మార్చు- కంచె సినిమా 63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నికచేయబడింది.[5]
- 2015 సైమా అవార్డులు: సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (ప్రగ్యా జైస్వాల్), ఉత్తమ గీత రచయిత (సిరివెన్నెల సీతారామ శాస్త్రి - ఇటు ఇటు ఇట)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Kanche Story Line". moviearts.in. 2015-10-22. Retrieved 2015-10-22.[permanent dead link]
- ↑ 2.0 2.1 సికిందర్. "గ్లోకల్ వాస్తవికత - కంచె". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 1 మే 2016. Retrieved 6 May 2018.
- ↑ "Unexpected response for first teaser". TNP LIVE. Hyderabad, India. 15 August 2015.
- ↑ "'Kanche' Trailer: Varun Tej is convincing in Krish's World War 2 drama"
- ↑ "63rd National Film Awards: Complete List of Winners". The Indian Express. 28 March 2016. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 28 March 2016.