పెద్దాపుర సంస్థానం

(పెద్దాపుర సంస్థానము నుండి దారిమార్పు చెందింది)
  ?పెద్దాపురం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°05′N 82°08′E / 17.08°N 82.13°E / 17.08; 82.13
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) తూర్పు గోదావరి
జనాభా 45,174 (2001 నాటికి)

పెద్దాపురం పట్టణం పెదపాత్రుడు మహారాజుచే నిర్మించబడింది. క్షత్రియ కులస్థులైన వత్సవాయి కుటుంబంచే మూడువందల సంవత్సరాలు పరిపాలించబడింది. ఈ కుటుంబ పరంపర రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహదూర్ తో ప్రారంభమైంది. 1555 నుంచి 1607 వరకులో ఇతను పరిపాలించాడు. పెద్దాపురం కోట ఇతని హయాంలోనే నిర్మించబడింది. ఇతని తరువాత, ఇతని కుమారుడు రాయ జగపతి, తరువాత ఇతని కుమారులు తిమ్మ జగపతి, బలభద్ర జగపతి పరిపాలించారు.1785 కి పెద్దాపురం రాజ్యం అటు తోటపల్లి నుంచి ఇటు నగరం వరకు మొత్తం 585 గ్రామాలు, పట్టణాలుతో విరాజిల్లింది. 1791 నుంచి 1804 వరకు వత్సవాయి రాయ జగపతి పరిపాలించాడు. రాయ జగపతి మరణాంతరం, అతని ముగ్గురు భార్యలు అయిన లక్ష్మీ నరసయమ్మ, బుచ్చి సీతయమ్మ, బుచ్చి బంగారయమ్మలు పెద్దాపురం సంస్థానాన్ని ఒకరి తరువాత ఒకరు పరిపాలించిరి. రాయ జగపతి రెండవ భార్య అయిన బుచ్చి సీతాయమ్మ 1828 నుంచి 1838 వరకు పాలించింది. ఈవిడ రెండు ధర్మ సంస్థలు ( ట్రస్టులు), ఒకటి పెద్దాపురంలోను, మరియొకటి కత్తిపూడిలోను ప్రారంభించింది. ఈ రోజుకి కూడా అక్కడ పేదవారికి రెండు పూటలా అన్నదానం చేయబడుతుంది.

వత్సవాయి మహారాజు యొక్క ఆస్థానంలో ఏనుగు లక్ష్మణకవి, వేదుల సత్యనారాయణశాస్త్రి పోషించబడ్డారు. తరువాత వారసులు లేకపోవటం చేత, 1847 లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించే వరకు, సూర్యనారాయణ జగపతి బహదూర్ ఏలిక సాగించెను. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవెన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు, లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురం నిర్మించారు.

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది

మార్చు

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు ఉన్నాయి, అందులో కొన్ని పౌరాణిక కారణాలు వినపడుతున్నాయి, కొన్ని చారిత్రిక కారణాలు కనపడుతున్నాయి.

పృథాపురం
కుంతీదేవి అసలు పేరు పృథాదేవి. కుంతిభోజుడు తనకూతురు పృథాదేవి పేరుమీద ఒక మహానగరం నిర్మించాడు. ఆ నగరం పరిసర ప్రాంతలన్నిటికంటే మిక్కిలి ఎత్తుగానూ సూర్యోదయం వేళ సముద్రంలోనూ సూర్యాస్తమయం వేళ గోదావరిలోనూ కనిపించేలా ఈ నగరం ఉండేది. ఆ మహానగరం పృథాపురంగా పిలువ బడింది.
పార్థాపురం
పురాణాలు, స్థానిక చరిత్రల ప్రకారం పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ నివసించారు. పాండవ మధ్యముడు అర్జునుడికి పార్ధ అనే పేరు కూడా వున్నది. అతడి పేరున పార్థాపురం అనే పేరుతో ఈ ప్రాంతమంతా పిలువబడేది. కాలక్రమంలో ఈ పార్థాపురం కాస్తా వ్యవహారంలో "పెద్దాపురం" గా స్థిరపడింది.
కిమ్మూరు
పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దాపురం ఉన్న ప్రాంతాన్ని కిమ్మీరుడు అనే కిరాత రాజు పరిపాలించే వాడు. ఆ కారణం చేత ఈ ప్రాంతమంతా అతని పేరునే కిమ్మూరు సీమ గా వ్యవహరింపబడేది.
పద్మాపురం
పద్మనాయకులు ఈ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలన చేయడం చేత పద్మాపురం అని పిలువబడింది.
పొర్లునాడు
పెద్దాపురం పిఠాపురం ల మద్య ఏలేరు నది ప్రవహించడం మూలాన రెడ్డి రాజులు ఈ రెండు ప్రాంతాలను పొర్లునాడు అని పిలిచేవారు.
పెద్దాపురం
ఈ ప్రాంతం వత్సవాయ వారి ఆధీనం లోనికి రాకముందు రెడ్డిరాజులు పాలించేవారు. వారికి సరదారుగా ఇసుకపల్లి పెరుమాళ్ల పాత్రుడు ఇతని అనంతరం పెద్దాపాత్రుడు ఈ ప్రాంతానికి పరిపాలకుడయ్యి ఈ ప్రాంతంలో ఉన్న రెండు పెద్ద పెద్ద మెట్టలని చదును చేయించి, ఒక కోటని కట్టించి చుట్టూ మట్టి గోడ పెట్టించి వాటిపై చుట్టూ బురుజులు తీర్పించి ఆ కోట నుండి పరిపాలన సాగించెను. అతని పేరు మీదనే ఈ ఊరికి పెద్దాపురం అని పేరు వచ్చింది.

పెద్దాపురం సంస్థానం సంక్షిప్త చరిత్ర

మార్చు

పెద్దాపురం ప్రాచీన ఆంధ్ర దేశములో పురాతన సంస్థానాలలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది. గోదావరి మండలం లోని చాలా భాగం, కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగం, విశాఖ పట్నం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప, చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానంలోనివి. సంస్థానంలోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కు ఈశాన్య దిక్కుగా 32 కి.మీ. దూరంలో ఉంది. 1803 నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు. సాలుసరి పేష్కషు (కప్పం రూపములో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు. రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయిన కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు. కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని.

అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటుగా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగం అయ్యింది.

పెద్దాపురం సంస్థాన సంస్థాపకులు వత్సవాయి తిమ్మరాజు (ముక్కు తిమ్మరాజు). కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకాలో వత్సవాయి అను గ్రామముంది.. అక్కడకు వచ్చిన సాగి రామరాజుకు ఆ గ్రామ నామమే గృహనామమైనది.

వత్సవాయి తిమ్మరాజు సా.శ. 1530న జన్మించాడు. తిమ్మరాజు తండ్రి పేర్రాజు. వీరు ఎనిమిది మంది సోదరులు. 1555న పెద్దాపురం కోటలో ప్రవేశించి సంస్థానాన్ని స్థాపించి, 1607వరకు పరిపాలించి స్వర్గస్థులయ్యారు. తిమ్మరాజు బిక్కవోలు నందుండిన తురుష్క వీరులతో ఘోరమగు యుద్ధం చేసి జయించారు. రాజమహేంద్రవరం సర్కారు తిమ్మరాజు వశమైంది. సా.శ.1572న గోల్కొండ సుల్తాను యొక్క సేనాపతియగు రాహత్‌ఖాన్ రాజమహేంద్రవరం సర్కారు మీదికి దండెత్తి వచ్చాడు. తురుష్క వాహినుల నడ్డగించుట దుస్సాహసమని నిశ్చయించుకొని, తిమ్మరాజు రాహత్‌ఖాన్ ని కలిసి రాజమహేంద్రవరం సర్కారులోని 18 పరగణాలు మాత్రం తిమ్మరాజుగారు అనుభవించుటకు సంధి చేసుకొనిరి. చతుర్భుజ తిమ్మరాజుగా వాసికెక్కిన ఈ ముసలి తిమ్మరాజు బహుపరాక్రమశాలి, కార్యఖడ్గ నిపుణుడు. పెద్దాపుర సంస్థానాన్ని స్థాపించి వృద్ధి చేసారు. పెద్దాపురం తాలూకా నంతయును, తుని, పిఠాపురం, రామచంద్రాపురం తాలూకాలలో చాలా భాగంను, తోటపల్లి, జడ్డంగి మున్నగు మన్యప్రదేశాలను పరిపాలించారు. పెద్దాపురంనందును, బిక్కవోలునందును తురుష్కులను, తూర్పుదేశాన శత్రురాజులను జయించారు.ఇతను 1607లో కాలధర్మం చెందాడు.

తిమ్మరాజు జేష్టపుత్రులైన వత్సవాయ రాయప (జగపతి) రాజు బహద్దరు (1607-1649) 1607లో పట్టాభిషికులయ్యాడు. ఇతని పాలనలో మరొక రెండు పరగణాలు జమీలో కలిసినవి. ఇతనూ తన తండ్రిగారి వలే పరాక్రమశాలి.రంపకు 4 మైళ్ళ దూరాననున్న అమ్మయ్యగట్టు చెంత తురక సైన్యాన్ని జయించాడు. అనేక మన్నె రాజులను జయించి సామంతులుగా జేసుకున్నాడు. ఇతను రౌతులపూడిలోను, అన్నవరంలోను కోటలు కట్టించాడు. రాయజగపతి కుమారులు తిమ్మరాజు, బలభద్రరాజు. వీరు 1649 నుండి 1688 వరకు పరిపాలించారు. వీరు పర్లాకోట, బావిణికోట, యోదుకోట, మన్యపు దుర్గంలను వశం చేసుకొనిరి. సార్వభౌమ తిమ్మరాజు తమ బంధువైన నారాయణరాజు చిల్లంగికోటను, వారిభూములను వశంచేసుకొని కిమ్మూరు పరగణాలలో కలుపుకున్మనారు. సంతాన హీనుడైనందున ఇతని తమ్ముడైన బలభద్రరాజు కుమారుడు రెండవ రాయపరాజు 1688 నుండి 1714 వరకు పరిపాలించాడు.

ఇతని జేష్టకుమారుడైన మూడవ (కళా) తిమ్మరాజు (1714-1734) తండ్రి మరణించుసరికి బాలుడగుట వలన ఇతని తల్లి రాఘవమ్మ బాలుని పట్టాభిషిక్తుని జేసి తామే పరిపాలన భారం వహించింది. రుస్తుంఖాన్ అనే హాజీ హుస్సేన్ రాజమహేంద్రవరం ఫౌజుదారిగా నున్న సమయంలో సైన్యసమేతముగా పెద్దాపురం వెళ్ళి పాండవులమెట్ట వద్ద రాఘవమ్మకు తమ కుమారు లిరువరిని తనవద్దకు పంపిన యెడల రాజ్యం వారికి స్థిరపరచి పోయెదనని వర్తమానం పంపాడు. ఖానుని బలమెరిగి చేయునదేమున లేక తమ పుత్రులిద్దరిని పంపించింది. కాచిన నూనెను వెన్నుపై పోయించి రుస్తుంఖాన్ వారివురిని చంపించాడు. ఈ వార్తవిని రాఘవమ్మ, మిగిలిన క్షత్రియ స్త్రీలు అగ్నిజ్వాలలకు ఆహుతిలయ్యారు. పెద్దాపుర సంస్థానం మహమ్మదీయుల వశమైనది. 3వ తిమ్మరాజుగారి పుత్రుడు జగపతి కప్పుడు ఏడు మాసాల వయసు. ఇతడిని విజయనగర సంస్థాదీశుడైన పెదవిజయరామ గజపతి విజయనగరం తీసుకొచ్చి సీతారామ సార్వభౌమ కుమారుడగు ఆనందరాజుతో పాటు పెంచారు. జగపతి విజయనగర కోటలో పెరిగి 16 సంవత్సర వయస్సులో నున్నపుడు విజయరామ గజపతి పెద్దాపుర సంస్థానమును తిరిగి రాబట్టి ఇతనిని పట్టాభిషిక్తుని గావించాడు. ఈ గజపతిరాజే చెందుర్తి యుద్ధంన విజయనగర మహారాజు ఆనందరాజు నెదురించి పోరాడి పరాజితులై పలాయనం గావించాడు తదుపరి ఆనంద గజపతి సామర్లకోటలోనున్న ఫ్రెంచివారిని గొట్టుటకై వెళ్తూండగా జగపతిరాజు పిఠాపురాధీశుడైన రావు నీలాద్రిరాయని కాకర్లపూడి వారితో కలసి కొన్నివేల సైన్యంతో ఆనంద గజపతిని సామర్లకోట సమీపాననున్న ఉండూరు వద్ద 1759 డిసెంబరులో నెదుర్కొన్నారు.గజపతి ధాటికి నిలువలేక జగపతిరాజు మరణించాడు.

వత్సవాయి నాల్గవ తిమ్మజగపతిరాజుకు (1760-1797) అప్పుడు ఏడేడ్ల వయస్సు. ఇతను పూసపాటి ఆనందగజపతి భార్య చంద్రయ్యమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆనంద గజపతి హైదరాబాద్ ముట్టడి సందర్భంలో దారిలో కాలధర్మంనొందాడు. (1760). చంద్రయమ్మ తమ దత్తుడగు చిన విజయరామగజపతిని, నాల్గవ తిమ్మజగపతిని తోడ్కొని నవాబుతో రాజీపడి విజయనగర రాజ్యము విజయరామ గజపతికిని, పెద్దాపుర రాజ్యము 4వ తిమ్మజగపతికిని స్థిరపరచెను. వీరివురును ప్రియమిత్రులు.

వత్సవాయ నాల్గవ రాయజగపతి (1797-1804) 22 సం.ల ప్రాయమున తండ్రిగారి యనంతరమున 1797లో రాజ్యమునకు వచ్చాడు. ఇతని కాలముననే సంస్థానంన శాశ్వత కర నిర్ణయం (పెర్మనెంట్ సెటిల్‌మెంట్) చేయబడి సంస్థానం విస్తరింపబడింది. ఇతని కుమారుడు బుచ్చితిమ్మరాజు (తిమ్మ జగపతిరాజు) 1807లో స్వర్గస్తులైనాడు. జ్ఞాతులగు భీమవరపు కోట శాఖకు చెందిన వత్సవాయ జగన్నాథరాజు 1808 జూలై 29 న సంస్థానాన్ని వశపరచుకొన్నాడు. రాణీగారు దావాలో తామున్నంత కాలం సంస్థానం పాలించుటకును, ఆమె యనంతరం జమీందారీ జగన్నాధరాజు చెందుటకును, జమీందారీలోని కొఠాం ఎస్టేట్ జగన్నాధరాజుకి జీవనాధారంగా నిచ్చుటకు తీర్పు ఇవ్వబడింది. రాణి లక్ష్మీనరసయమ్మ గతించిన వెంటనే రాణి బుచ్చిసీతయ్యమ్మ (1828-1833) 1828 మార్చి 13 న సంస్థానం స్వాధీనపరచుకుంది. ఈమె తర్వాత రాణి బుచ్చి బంగారయ్యమ్మ వత్సవాయ నరసరాజుగారి పౌత్రుడగు వెంకటపతిరాజనే బాలుడిని వెంకటజగపతిరాజు అను పేరుతో పెంచింది. 1834, 1835 సం.లలో సంస్థానం మరల బ్రిటీసు పరిపాలనలో నుండెనట. బుచ్చి బంగారయ్యమ్మ రెండేడ్లు పాలించి స్వర్గస్తురాలయ్యంది.

భీమవరపు కోట: వత్సవాయి జగన్నాథరాజు గారి జేష్ఠపుత్రుడు సూర్యనారాయణ జగపతిరాజు 15-09-1838 న కొఠాం ఎస్టేట్‌ను సంపాదించాడు. 1839 మార్చిలో పెద్దాపురం సంస్థానం కూడా ఇతని పరమైంది. 1847లో పెద్దాపురం సంస్థానం మరల బ్ర్రిటీసు వారి పాలైంది. అప్పుడు తుని, కొఠాం ఎస్టేట్లు కలిపివేయబడినవి. సూర్యనారాయణ జగపతి బహద్దరు తమ రాజధానిని తునికి మార్చారు.ఇతని యనంతరము జేష్ఠపుత్రుడు వెంకట జోగిజగన్నాధ జగపతిరాజు స్వల్పకాలం తుని ఎస్టేట్ ను పాలించి స్వర్గస్తులయ్యాడు. 1853లో జన్మించిన ఇతని సోదరుడు వెంకట సింహాద్రిరాజుగారు రాజ్యపాలన చేసారు. ఇతను 11-12-1903న వ్రాసిన వీలునామా ప్రకారం ఇతని భార్య వెంకట సుభద్రయ్య కొఠాం ఎస్టేట్, చర స్థిరాస్తులు యవత్తూ దఖలు పడుటయే గాక తమ యిష్టం వచ్చిన పిల్లవానిని దత్తత చేసుకొనుటకు అధికారం లభించింది. ఆమె వేదపాఠశాలను స్థాపించింది. వందలకొలది క్షత్రియ వివాహాలు జరిపించింది. భీమవరపుకొట వాస్తవ్యులు వత్సవాయ వరాహ నృసింహరాజు గారి జేష్ఠ పుత్రుడగు సత్యనారాయణని దత్తత చేసుకొని వారికి "వెంకట సూర్యనారాయణ జగపతి బహద్దర్" అని పునర్నామకరణము చేసింది. ఇతనికి పుత్రసంతానము కలుగలేదు. ఇతను 1978లో కాలధర్మంనొందాడు. ఇతని పరిపాలన కాలంలో తుని ఎస్టేట్ ఆంధ్రరాష్టంలో విలీనమైంది.ఇతని మరణంతో తుని ప్రభువుల వంశమంతరించింది.

పాలనా క్రమం

మార్చు
  1. రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి (1555-1607)
  2. రాజా వత్సవాయి రాయపరాజు (1607-1649)
  3. రాజా వత్సవాయి సార్వభౌమ తిమ్మరాజు (1649-1688)
  4. రాజా వత్సవాయి ఉద్దండ రాయపరాజు (1688-1714)
  5. రాగమ్మ రాజా వత్సవాయి కళా తిమ్మజగపతి (1714-1734)]
  6. రుస్తుం ఖాన్ (1734-1749)]
  7. రాజా వత్సవాయి రాయ జగపతి రాజు (1749-1758)
  8. మహమ్మదీయులు (1758 1760]]
  9. రాజా వత్సవాయి విద్వత్ తిమ్మ జగపతి (నాలుగవ తిమ్మరాజు) (1760-1797)
  10. రాజా వత్సవాయి రాయ జగపతి (1797 - 1804)
  11. ఆంగ్లేయులు (1804 - 1809)
  12. రాణీ లక్ష్మీ నరసాయమ్మ (1809 - 1814)
  13. ఆంగ్లేయులు (1814 - 1828)
  14. వత్సవాయి బుచ్చి సీతాయమ్మ (1828 - 1833)
  15. ఆంగ్లేయులు (1833 - 1836)
  16. బుచ్చి బంగారయ్యమ్మ (1836 - 1838)
  17. వత్సవాయి సూర్యనారాయణ జగపతి (1839 1847)
  18. ఆంగ్లేయులు (1847 - 1915)

సాహిత్యంలో పెద్దాపురం

మార్చు

పెద్దాపురాధీశుల కవి పండితపోషణ

మార్చు

ప్రాచీన కాలంనుండి పెద్దాపురం కవులకు నిలయంగా విలసిల్లింది. వత్సవాయ మహారాజుల పాలనలో అష్టదిగ్గజ కవులు పోషించబడ్డారు, కవులకు అనేక సత్కార్యాలు జరిగినట్టు చారిత్రిక గ్రంథాలు, రచనల ద్వారా స్పష్టమవుతుంది వీరిలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరి కొందరు పెద్దాపురం సంస్థానంలో సత్కరింపబడినవారు. ప్రాచీన కవుల్లో ప్రసిద్ధులైనవారు పైడిపాటి జలపాలా మాత్యుడు, వెణుతురుపల్లి విశ్వనాథకవి, ఏనుగు పెదలచ్చన్న, ఏనుగు లక్ష్మణ కవి, పరవస్తు వెంకట రంగాచార్యులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తురగా రామకవి, వక్కలంక వీరభద్రకవి, మాగాపు శరభకవి, చావలి రామశాస్త్రి, ఆణివిళ్ళ వెంకటశాస్త్రి, వత్సవాయి రాయజగపతి వర్మ, నలజర్ల గంగరాజు, బులుసు రామగోవింద శాస్త్రి, హోతా వెంకటకృష్ణ కవి, చిలుకూరి సోమనాథ శాస్త్రి, బుద్ధవరపు పట్టాభిరామయ్య, వత్సవాయి వెంకట నీలాద్రిరాజు పెద్దాపురం మహారాజులపై చాటువులు, రచించి పెద్దాపురం చరిత్ర గ్రంథాలు రచించి పెద్దాపురం మహారాజులచే సత్కరింపబడిన ప్రాచీన కవులు.

ఆధునిక పద్య గద్య కవులకూ పెద్దాపురం నిలయంగా భాసిల్లింది. ఈ కవులలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరికొందరు పెద్దాపురం ఉద్యోగం నిమిత్తం వచ్చి స్థిరపడినవారు విస్సా అప్పారావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, మధునాపంతుల వెంకట పరమయ్య, పోచిరాజు శేషగిరిరావు, మల్యాల జయరామయ్య, అల్లంరాజు లక్ష్మీపతి, ద్వివేది సత్యకవి, బుద్ధవరపు చినకామరాజు, లింగాల లక్ష్మీ నరసింహారావు, చెళ్ళపిళ్ళ బంగారేశ్వర శర్మ, శ్రీపాద కృష్ణశాస్త్రి, వడలి సుబ్బారాయడు, మారెళ్లపూడి వీరభద్రరావు, పంపన సూర్యనారాయణ, జోస్యుల కృష్ణబాబు, గుర్లింక ధర్మరాజు, చల్లా విశ్వనాథం, యాసలపు సూర్యారావు, వంగలపూడి శివకృష్ణ

చదరంగం నవల

మార్చు

పెద్దాపుర సంస్థానాన్ని నేపథ్యంగా తీసికొని, వడ్లగింజలు పేరుతో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒక చక్కని నవల (లేదా పెద్ద కథ) వ్రాశాడు. చదరంగం ఆటలో పెద్దాపుర సంస్థానాధిపతి ఉద్దండుడనీ, తనతో ఆడి గెలిచిన వారిని సన్మానిస్తాననీ, ఓడిన వారి తల తీయిస్తాననీ ప్రకటిస్తాడు. ఒక పేద బ్రాహ్మణుడు రాజుతో ఆటకు అనుమతి కోసమే రకరకాల గమనాలు చేసి, ఆటలో రాజును ఓడించి, అందులోనూ విన్యాసాలు చూపించి, చివరకు ఘనసన్మానం పొందడం ఇందులోని కథ.

పెద్దాపురం మహారాజు దర్శనం కోసం శంకరప్ప కోటకు చేరుకుంటాడు. పేద బ్రాహ్మడయిన శంకరప్పకి కోటలోకి ప్రవేశం లభించదు. ఠానేదారు, దీవాంజీలు శంకరప్పకి కోటలోకి అనుమతి లభించకుండా అడ్డుపడి వీధిలోకి గెంటేస్తారు. దిగులుతో సత్రానికి చేరుకున్న శంకరప్పని చూసి పేదరాసి పెద్దమ్మ ఓదారుస్తుంది. మహారాజు దర్శనం సంపాదించడానికి ఉపాయం చెప్తుంది. ముందు పట్టణంలో పేరు తెచ్చుకుని తద్ద్వారా మహారాజు దర్శనం సంపాదించమని హితబోధ చేస్తుంది. శంకరప్పకి జ్ఞానోదయం కలిగి ఊరి మీద పడతాడు.

అంచెలంచెలుగా పెద్దాపురంలోని చదరంగ ప్రావీణ్యులనందరినీ ఓడించి, తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఊరిలో శంకరప్ప పేరు మారు మ్రోగుతుంది. ఈ వార్త చివరికి మహారాజుని చేరి, శంకరప్ప గురించి వాకబు చేస్తాడు. శంకరప్ప చదరంగ ప్రావీణ్యం గురించి తెలుసుకుని తనతో ఆడవలసిందిగా కబురు పంపుతాడు.పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని శంకరప్ప పల్లకీలో కోటకు వెళ్ళి మహారాజుతో చదరంగం ఆడడానికి సిద్ధపడుతాడు. ఆటలో తను గెలిస్తే చదరంగంలో మొదటి గడిలో ఒక వడ్ల గింజ, రెండో గడిలో రెండు వడ్ల గింజలు, మూడో గడిలో నాలుగు వడ్ల గింజలు ఇలా చదరంగంలోని అన్ని గడులలో గింజలు రెట్టింపు చేసుకుంటూ ఇవ్వాలని కోరుతాడు.

చదరంగం ఆటలో మహారాజు శంకరప్పని ఓడించాడా? లేక శంకరప్ప గెలిచి తను కోరుకున్న వడ్లగింజలని రాజు దగ్గర నుండి అందుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే

వెంకట సింహాద్రి రాజు గారికి అంకితం ఇవ్వబడిన కువలయామోదం అనే అలంకార శాస్త్ర గ్రంథంలో పెద్దాపురం ప్రభువుల పండితపోషణ ఈవిధంగా వర్ణించబడింది.

'శ్రీ రత్నాకర మేఖలావలయిత భ్రాజన్మహీమండలీ
నానా స్థాన సరోరు నాయక మహా రత్నం సముల్లాసితం
శ్రీ పెద్దాపుర భవ్యనామక మహాసంస్థాన మాసీర్భుధైశ్శ్లాఘ్యం సత్కవి మండలైర్విలసితమ్ సంసేవితమ్ రాజభిః'

పంపన వారి పెద్దాపురం ప్రశస్తి

మార్చు

సీ॥ ఇట పాండవుల మెట్ట ఇతిహాసముల పుట్ట వత్సవాయి పతుల ప్రభల పట్టు

ఇటనేన్గులక్ష్మణ కృత సుభాషితములు తెలుగుటెదల త్రుప్పుడులిచికొట్టు

ఇటు పట్టువస్త్రాల కితరదేశాధీశ పత్నులు సైతంబు పట్టుబట్టు

ఇట మరిడమ్మయూరేగు నుత్సవము సమస్త కళాపూజ కాటపట్టు

తే.గీ॥బుచ్చి సీతమ్మ ఈవి పెంపును నిలిపెడి

సత్రశాల వెంబడి కళాశాల వెలయ

తనవని మురిసిపోవు పెద్దాపురంబు

కడు పురాతన సంస్థాన ఘనత కలిగి

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  • సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర 12వ సంపుటం పేజీ.214

బయటి లింకులు

మార్చు