తిరుమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని హిందూ పుణ్యక్షేత్రం
(యోగ నరసింహస్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)

తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు.[3] ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది, ఇది టిటిడి అధిపతిని కూడా నియమిస్తుంది, పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది.[4]

శ్రీ వేంకటేశ్వర ఆలయం, తిరుమల
తిరుమల వేంకటేశ్వర ఆలయం ముఖ ద్వారం, గర్భగుడిపైన బంగారు గోపురం చిత్రంలో వెనుక చూడవచ్చు
తిరుమల వేంకటేశ్వర ఆలయం ముఖ ద్వారం, గర్భగుడిపైన బంగారు గోపురం చిత్రంలో వెనుక చూడవచ్చు
తిరుమల is located in ఆంధ్రప్రదేశ్
తిరుమల
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు13°40′59.7″N 79°20′49.9″E / 13.683250°N 79.347194°E / 13.683250; 79.347194
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
స్థలంతిరుపతి
ఎత్తు853 మీ. (2,799 అ.)
సంస్కృతి
దైవంవేంకటేశ్వరుడు (విష్ణు)
ముఖ్యమైన పర్వాలుబ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రావిడ శైలి
దేవాలయాల సంఖ్య1
శాసనాలుకన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు[1]
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తవీర నరసింగదేవయాదవరాయ
వీరరాక్షసయాదవరాయ
రంగనాథయాదవరాయ[2]
దేవస్థాన కమిటీతిరుమల తిరుపతి దేవస్థానములు

తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన 853 మీటర్లు (2,799 అ.) ఎత్తులో ఉన్నాయి. కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు. తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారు 10.33 చ. మై. (26.75 కి.మీ2) .

ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో సా.శ. 300 లో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండైమండలం తమిళ పాలకుడు తొండమాన్ సా.శ. 8 వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు.[5] [6] గర్భగుడిని ఆనందనిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశంగా 106 స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు (తంజావూరు), పాండ్య రాజులు (మదురై), 13-14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక వేచివుండే (క్యూ) భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి.

అందే విరాళాలు, సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం.[7][8][9] ఈ ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 నుండి 100,000 మంది యాత్రికులు (సంవత్సరానికి సగటున 30 నుండి 40 మిలియన్ల మంది) సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో, యాత్రికుల సంఖ్య 500,000 వరకు వుండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమైంది.[10] 2016 నివేదిక ప్రకారం 27.3 మిలియన్ల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు.[11]

స్థల పురాణం

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !

వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశాడు, శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తరువాత, వరాహుడు ఈ కొండపై నివసించాడు. తిరుమల ఆలయం గురించి ఎక్కువగా అంగీకరించబడిన పురాణం శ్రీ వెంకటాచల మహాత్యం.[12]

కలియుగం కాలంలో, త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకొనేందులకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు. అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ, శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు. చివరికి అతను విష్ణువును సందర్శించినపుడు విష్ణువు భృగుని గమనించనట్లుగా వ్యవహరించాడు. కోపంతో, భృగు విష్ణువు ఛాతీపై తన్నాడు. దానికి విష్ణు క్షమాపణ చెప్పి, ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు. విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్లాపూర్ వెళ్తుంది. కొల్లాపూర్‌లో ఉన్న సమయంలో, లక్ష్మీ కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది. ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబయి అని అంటారు. ఆమె ఇక్కడి మహాలక్ష్మీ ఆలయం, కొల్హాపూర్లో దేవతగా పూజలందుకుంటున్నది.[12]

విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి, శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని, బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు, బ్రహ్మ ఆవు, దూడగా మారుతారు. వాటిని తిరుమల కొండలప్రాంతాన్ని పాలించే చోళ రాజుకు అప్పగిస్తుంది. ఆవు మేత కోసం వెళ్లినప్పుడు ప్రతిరోజూ శ్రీనివాసునికి పాలు ఇస్తుంది. ఒక రోజు ఆవులకాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది. శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళ రాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు. రాజు శాపవిమోచనం కోసం ప్రార్థించగా, రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో వున్న విష్ణునికి వివాహం చేయమని చెప్తాడు.[12] శ్రీనివాసుడు అక్కడ నుండి వకుళా దేవి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు పోయి ఏర్పడిన మచ్చను గమనించింది. భక్తి పూర్వకంగా, ఆమె తన జుట్టును కత్తిరించి, మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది. శ్రీనివాసుడు, ఆమె భక్తితో చలించి, కృతజ్ఞతలు తెలుపుతూ, ఆమెను దేవతగా మార్చి, తన భక్తులు జుట్టు కత్తిరించుకుని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు.

గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోదయైన వకుళా దేవి, శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. గతజన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా, కృష్ణుడు వకుళాదేవిగా జన్మంచినపుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని, ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత, అతను "అమ్మా" అని పిలవగా వకుళా దేవి దత్తత తీసుకున్నది.

మరొక వైపు, శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని, సంతానం కోసం యజ్ఞం చేయగా, బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది. ఆమెను పద్మావతిగా పెంచుతాడు. ఈమె లక్ష్మీ ప్రతిరూపమే. పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది.

ఒక రోజు, శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు, అతను పద్మావతి దేవిని గమనించి, ప్రేమించాడు. ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరుగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది. ఆ ఏనుగు గణేశుడే. పద్మావతి, ఆమె స్నేహితురాండ్లు, శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా, ఆమె స్నేహితురాండ్లు శ్రీనివాసుని వెళ్లగొడతారు. శ్రీనివాసుడు వకుళాదేవి వద్దకు వెళ్లి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడుతానని చెపుతుంది. రాజు తిరస్కరిస్తాడని భయపడి, శ్రీనివాసుడు సోదిచెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్లి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ, పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుందని, వకుళా దేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని, పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు, రాణి అంగీకరిస్తారు.

రాజకుమార్తెయైన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాసులు ఉన్నాయి. శ్రీనివాసుడు, తన తల్లి పేదవారైనందున, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు. కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు, నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు. శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు. ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు. శ్రీనివాసుడు, పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు. వెంకటేశ్వర మూర్తిలో, పద్మావతి లక్ష్మీగా ఛాతీ ఒక వైపు వుంటుంది, అలాగే మరొక వైపు లక్ష్మీ మరో అవతారమైన భూదేవి వుంటుంది.

ఈ పురాణానికి కొంచెంతేడాలతో ఇతర కూర్పులున్నాయి. మరో ప్రసిద్ధ రూపంలో పద్మావతి లక్ష్మి కాదు, వేదవతి పునర్జన్మ. ఈ సంస్కరణలో, శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత, లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకుని, శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది. లక్ష్మీ, పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు. బ్రహ్మ, శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో వున్న వారికి - కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం 7 కొండలపై ఉండాలనే ప్రభువు కోరికవలన అలా జరిగినట్లు చెప్తారు. లక్ష్మీ, పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకుని రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీ అతని ఛాతీపై ఎడమ వైపున ఉంటుంది, పద్మావతి అతని ఛాతీ కుడి వైపున ఉంటుంది.[12]

తిరుమల ఆలయం లోని లోపలి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

చరిత్ర

 
తిరుపతిలో హాథీరాంజీ మఠం... భవనము

తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 15 వందల ఏళ్ల పైగా చరిత్ర ఉంది. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు.

మధ్యయుగ చరిత్ర

పల్లవ రాజు శక్తి విటంకన్ భార్యయైన రాణి సామవై పెరిందేవి సా.శ. 966 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్ఠింపజేసింది.[13] ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. ఆమె అనేక ఆభరణాలు, రెండు ప్రాంతాలలో భూమిని (10 ఎకరాలు, 13 ఎకరాలు విస్తీర్ణంగల) విరాళంగా ఇచ్చింది. ఆ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయంలో ప్రధాన పండుగ వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. [14]

పల్లవ రాజవంశం (9 వ శతాబ్దం), చోళ రాజవంశం (10 వ శతాబ్దం), విజయనగర రాజులు (14, 15 వ శతాబ్దాలు) వెంకటేశ్వరస్వామిని ఆరాధించారు. తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు సా.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు సా.శ.1429లో, హరిహరరాయలు సా.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ ఆలయం ప్రస్తుత సంపద, పరిమాణంలో చాలా భాగం విజయనగర సామ్రాజ్యం రాజులు వజ్రాలు, బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా పొందింది.[15] సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలలో నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. కృష్ణదేవరాయలు సా.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఇచ్చిన బంగారం, ఆభరణాల దానం, 1517 లో ఆనంద నిలయం (గర్భగుడి) పైకప్పుకు బంగారు పూత పూయడానికి వీలు కల్పించింది. 1517 జనవరి 2 న కృష్ణదేవరాయ ఆలయంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆలయానికి ఇంకొన్ని విరాళాలు ఇచ్చాడు.[16] అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

1320-1369 మధ్య శ్రీరంగపట్నం రంగనాథ ఆలయ విగ్రహాలను భద్రపరచడానికి ఈ ఆలయంలో ఉంచారు.

ఆధునిక చరిత్ర

 
తిరుమలకు చెందిన స్వామి పుష్కరిణి
 
అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం

విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తరువాత, మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి రాష్ట్రాల నాయకులు భక్తులుగా పూజలు చేసి ఆలయానికి ఆభరణాలు, విలువైన వస్తువులను ఇచ్చారు. ఈ ఆలయం 1656 జూలైలో గోల్కొండ నవాబు చేతుల్లోకి వెళ్లింది. తరువాత అది కొద్ది కాలం పాటు ఫ్రెంచ్ పరిపాలనలో వుండి, ఆ తరువాత సా.శ.1801 వరకు కర్ణాటక నవాబు పరిపాలనలో ఉంది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. మరాఠా సైనికాధికారి రాఘోజీ I భోంస్లే ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ఆరాధన కోసం శాశ్వత పరిపాలనను ఏర్పాటు చేశారు.  [17]

19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారి ఆగమనంతో, ఆలయ నిర్వహణ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వచ్చింది. వారు ఆలయానికి ప్రత్యేక హోదాను ఇచ్చి కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఉన్నారు.[18] మద్రాస్ ప్రభుత్వం 1817 లో జారీచేసిన ఏడవ రెగ్యులేషన్‌ను ప్రకారం, ఆలయం ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ ద్వారా రెవెన్యూ మండలి నియంత్రణలోనికి తెచ్చింది. 1821 లో, బ్రూస్ అనే బ్రిటీషు అధికారి ఆలయ నిర్వహణ కోసం నియమాలను రూపొందించారు, దీనిని బ్రూస్ కోడ్ అని పిలుస్తారు. 7 వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆలయానికి 8,000 విరాళంగా ఇచ్చాడు.[19]

1843 లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఇతర దేవాలయాలతోపాటు తిరుమల ఆలయ పరిపాలనను హథీరాంజీ మఠం మహంతులకు బదిలీ చేసింది.[20] 1870లో యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించారు. 19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఉండే ఇళ్ళు అత్యంత సంకుచితంగా ఉండేవి. కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు.[20] 1933 లో టిటిడి చట్టం ఫలితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడే వరకు అనగా 90 ఏళ్ళ పాటు ఆరు తరాల మహంతుల పాలనలో ఉంది.[21] 1933లో రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డుమార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల-తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు.

1951లో మద్రాస్ హిందూ మత, ఛారిటబుల్ ఎండోమెంట్ చట్టం పరిధిలోకివచ్చింది.[22] 1966 లో, ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నియంత్రణలోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్టం. 1979 ప్రకారం, 1966 చట్టం రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల చట్టం ఏర్పరచారు. దీని ప్రకారం ఆలయ పరిపాలన కార్యనిర్వాహకాధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే ముగ్గురు సభ్యుల మండలికి అప్పగించబడింది. 1974లో రెండవ ఘాట్‌రోడ్డును (ప్రస్తుత ఎగువ రోడ్డు) కూడా నిర్మించారు. 1980లో తితిదే బోర్డు మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.

ఈ ఆలయంలో కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు భాషలలో సుమారు 640 శాసనాలు ఉన్నాయి.[23] తాళ్లపాక అన్నమచార్యులు, అతని వారసుల తెలుగు సంకీర్తనలు 3000 రాగి పలకలపై చెక్కబడినవి ఉన్నాయి.[24][25] ఈ సేకరణ సంగీత శాస్త్రవేత్తలకు, తెలుగు చారిత్రక భాషా శాస్త్రవేత్తకు విలువైన మూలం.

2006 లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల కొండలపై చర్చిని నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల ఏడు కొండలలో రెండు మాత్రమే హిందూ ఆరాధనకు వాడుకొని మిగిలిన వాటిని ఇతర ఉపయోగాలకోసం వాడుకోవచ్చని, క్రైస్తవం పాటించే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో నిర్ణయం చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తమవగా చివరకి, ఏడు పవిత్ర కొండల విస్తీర్ణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించాలని న్యాయస్థానం ప్రకటించింది.[26]

భౌగోళికం

 
Map

తిరుపతి నుండి 22 కి.మీ. దూరంలో తిరుమల ఉంది. ఇది విజయవాడ నుండి సుమారు 435 కి.మీ. (270.3 మై.), హైదరాబాద్ నుండి 571.9 కి.మీ. (355.4 మై.), చెన్నై నుండి, 138 కి.మీ. (85.7 మై.), బెంగళూరు నుండి 291 కి.మీ. (180.8 మై.), విశాఖపట్నం నుండి 781.2 కి.మీ. (485.4 మై.) దూరంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గం

తిరుపతిలో నాలుగు బస్ ప్రాంగణాలున్నాయి. వీటినుండి బస్సుల ద్వారా తిరుమల చేరవచ్చు. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టేషను‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్‌స్టేషను ఉంది.

రైలు మార్గం

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్‌స్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వచ్చే ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లవచ్చు

విమాన మార్గం

సమీప విమానాశ్రయం రేణిగుంట దగ్గర తిరుపతి విమానాశ్రయం. ఇక్కడ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు మొదలైన ప్రదేశాలకు నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

తిరుపతి నుండి కాలి నడకన చేరుకునే విధం

 
కాలిదారిలో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం

తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప నుండి ఉందని ప్రతీతి.

  • అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలూ దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల (తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలులో ఉంది. భక్తుల సామాను పెట్టెలను పైకి పంపించుటకు ఉచిత రవాణా సేవ ఉంది. ఈ కాలిబాటకు ప్రవేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది.
  • శ్రీవారి మెట్టు కాలిబాట: తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. ఈ కాలిబాట ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది.[27]

ఆలయ పరిపాలన

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి లేక తితిదే) అనేది తిరుమల వెంకటేశ్వర ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షణ,నిర్వహణ చేస్తుంది. దీనికి చట్ట సవరణల వలన ధర్మకర్తలమండలి సభ్యుల సంఖ్య 5 (1951) నుండి 18 (2015) కి పెరిగింది.[28] టిటిడి రోజువారీ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కార్యనిర్వాహణాధికారి చేస్తారు.

ఈ ఆలయాన్ని ప్రతిరోజూ సుమారు 75,000 మంది యాత్రికులు సందర్శిస్తారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్, 2530.10 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. సంస్థ ఆలయ ఆదాయం, భక్తుల విరాళాలనుండి ధార్మిక, సేవా సంస్థలను నడుపుతుంది.[29] ఆదాయంలో ఎక్కువ భాగం శ్రీవారి హుండి ద్వారా వస్తుంది.[30]

వాస్తుశిల్పం

 
ఆలయ ముఖభాగ దృశ్యం
 
నారాయణగిరి కొండపై శ్రీవారీ పాదాల నుండి చూసినట్లుగా తిరుమల ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (ముందు భాగంలో అర్ధ వృత్తాకార భవనం)

ద్వారములు, ప్రాకారములు

బయట నుండి గర్భగుడి చేరటానికి మూడు వాకిళ్లు ఉన్నాయి. పడికావలి అని కూడా పిలువబడే మహద్వారం మహాప్రాకారానికి (బాహ్య సమ్మేళనం గోడ) గల మొదటి ప్రవేశ ద్వారం. ఈ మహాద్వారం మీదుగా 50 అడుగుల, ఐదు అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు, దాని శిఖరాగ్రంలో ఏడు కలశాలు ఉన్నాయి. వెండివాకిలి గల నడిమి పడికావలి రెండవ ద్వారం సంపంగి ప్రాకారం (లోపలి ప్రాంగణం గోడ) లో ఉంది. దీనిపై మూడు అంతస్తుల గాలిగోపురం, శికరాగ్రంలో ఏడు కలశాలతో కూడి ఉంది. గర్భగృహానికి ప్రవేశం బంగారువాకిలి ద్వారా వుంటుంది. దీనికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ-విజయల రెండు పొడవైన రాగి చిత్రాలు ఉన్నాయి.మందపాటి తలుపు విష్ణువు దశావతారాలను వర్ణించే బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది.

ప్రదక్షిణాలు

ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి రెండు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. మొదటిది మహాప్రాకారం, సంపంగిప్రాకారం మధ్య ఉన్న ప్రాంతం. దీనిని సంపంగి ప్రదక్షిణం అని అంటారు. ఈ దారి ప్రక్క మండపాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలికుని శిల, ప్రసాద పంపిణీ గది మొదలైనవ ఉన్నాయి. ఆనందప్రదక్షిణ అనే రెండవ ప్రదక్షిణం, ఆనంద నిలయం విమానం చుట్టూ వున్నమార్గం. ఈ మార్గంప్రక్కన వరదరాజ ఆలయం, యోగా నరసింహ ఆలయం, పోటు (ప్రధాన వంటగది), బంగారు బావి (బంగారు బావి), అంకురార్పణ మండపం, యాగశాల,పరకామణి (హుండీలో వేసిన విరాళాలు లెక్కించేగది), చందనపు అర, రికార్డుల గది, భాష్యకారులు సన్నిధి, శ్రీవారి హుండీ, విష్వక్సేన విగ్రహం వున్నాయి .

ఆనందనిలయ గోపురం, గర్భగుడి

ఆనంద నిలయ గోపురం, ఇతర అనుబంధ పనుల నిర్మాణం ప్రారంభానికి తొండమాన్ రాజు ఈ ప్రదేశంలో పునాది వేశారు.

గర్భగుడిలో ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని తోపాటు ఇతర దేవతల విగ్రహాలున్నాయి. బంగారు వాకిలి, గర్భగుడికి మధ్య రెండు వాకిళ్లున్నాయి. ప్రధాన దేవత నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది, ఒకచేయి వరద భంగిమలో, ఒకటి తొడపై వుండగా రెండు చేతులు శంఖువు, సుదర్శన చక్రాలను పట్టుకొని వుంటాయి. దేవుని విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దేవుని కుడి ఛాతీపై లక్ష్మీదేవి, ఎడమవైపు పద్మావతి దేవి వుంటారు. భక్తులకు కులశేఖరపడి (మార్గం) దాటి గర్భగుడిలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు.

ఆనంద నిలయం విమానం 'గర్భగుడి'పై నిర్మించిన ప్రధాన గోపురం. ఇది మూడు అంతస్తుల గోపురం. దాని శిఖరాగ్రంలో ఒకే కలశం ఉంది. దీనికి బంగారు పూతపూసిన రాగి పలకలతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు. ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని "విమాన వెంకటేశ్వరుడని" పిలుస్తారు, ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని నమ్ముతారు.

ఆలయంలో దేవతలు

విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు ఆలయానికి ప్రధాన దేవత . మూలవిరాట్ స్వయంభు (స్వయంగా వెలసినది) అని నమ్ముతారు.[31]

పంచ బేరములు

వైఖానాస అగామాల ప్రకారం, వెంకటేశ్వరుని ప్రాతినిధ్యం ఐదు దేవతల (బేరమ్‌లు) రూపంలో వుంటుంది, వీటిని మూలావిరాట్‌తో సహా పంచ బేరములు (పంచ అంటే ఐదు; బేరం అంటే దేవత) అని పిలుస్తారు.[32] ఐదు దేవతలనగా ధ్రువ బేరం (మూలావిరాట్), కౌతుకా బేరం, స్నపనా బేరం, ఉత్సవ బేరం, బలి బేరం. అన్ని బేరములను ఆనంద నిలయం విమానం కింద గర్భ గుడిలో ఉంచారు.

  1. మూలవిరాట్ లేదా ధ్రువ బేరము - గర్భగుడి మధ్యలో ఆనంద నిలయం విమానం క్రింద, వెంకటేశ్వరుని విగ్రహం కమలంపై నిలిచివున్నభంగిమలో నాలుగు చేతులు కలిగి, రెంటిలో శంఖము, చక్రము ధరించి, ఒకటి వరద భంగిమలో, ఇంకొకటి కటి భంగిమలో వుంటుంది. ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది. వజ్ర కిరీటం, మకరకుండలాలు, నాగభరణం, మకర కాంతి, సాలిగ్రామ హరం, లక్ష్మీ హారం వంటి ఆభరణాలతో అలంకరించబడింది.[32] వెంకటేశ్వరుని భార్య లక్ష్మి వ్యూహ లక్ష్మిగా మూలవిరాట్ ఛాతీపై ఉంటుంది.
  2. భోగ శ్రీనివాస లేదా కౌటుకా బేరం - ఇది ఒక అడుగు (0.3 మీ) పరిమాణంలో గల వెండి దేవతావిగ్రహం. దీనిని క్రీస్తు శకం 614 లో పల్లవ రాణి సమావై పండుగలు నిర్వహించడం కోసం ఆలయానికి ఇచ్చారు. భోగ శ్రీనివాస విగ్రహం ఎల్లప్పుడూ మూలవిరాట్ ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంభంధ క్రూచ చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూలవిరాట్ తరపున అనేక రోజువారీ సేవలను (ఆనందాలను) అందుకుంటుంది కనుక భోగ శ్రీనివాస అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజూ ఏకాంతసేవను,[33] బుధవారంనాడు సహస్రకళాభిషేకను అందుకుంటుంది.
  3. ఉగ్ర శ్రీనివాస లేదా స్నపనా బేరం - ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది.[34][35] క్రీస్తుశకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒక రోజు అనగా కైషికా ద్వాదసినాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది . ఈ దేవత మూలవిరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది, సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం కావున స్నపన బేరం అనే పేరు వచ్చింది.
  4. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం - మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత (ఉత్సవ బేరం), అతని భార్యలైన శ్రీదేవి, భూదేవి దేవతలచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపలంకరణ సేవా, పద్మావతి పరిణ్యోత్సవం, పుష్పపల్లకి, అనివర అస్థానం, ఉగాది అస్థానం వంటి అన్ని పండుగరోజులలో పూజలందుకుంటుంది.
  5. కొలువు శ్రీనివాస లేదా బలి బేరం - కొలువు శ్రీనివాస బలి బేరమును సూచిస్తుంది. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయ సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది. రోజువారీ కొలువు సేవ (తెలుగు: కొలువు అంటే సభ) ఉదయం జరుగుతుంది, ఈ సమయంలో, మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పంచాంగ శ్రవణం జరుగుతుంది,

ఇతర మూర్తులు

పంచ బేరములతో పాటు, గర్భ గుడిలో సీతా, రామ, లక్ష్మణ, రుక్మిణి, కృష్ణ, సుదర్శనచక్రం పంచలోహ విగ్రహాలున్నాయి.[33] ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ, నరసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల గుడులు, అనంత, గరుడ, విశ్వక్సేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహం కూడా ఉన్నాయి. ఆనంద నిలయం విమాన రెండవ శ్రేణి వాయవ్య మూలలో చెక్కబడిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడుగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహానికి కచ్చితమైన ప్రతిరూపం.[32]

ఆరాధన

పూజ

ఋషి వైఖానసుడు [36][37] ప్రతిపాదించిన, అతని శిష్యులు అత్రి, భృగు, మరీచి, కశ్యపు కొనసాగించిన [38] " వైఖానస ఆగమ " ఆరాధన సంప్రదాయాన్ని ఈ ఆలయం అనుసరిస్తుంది [39] హిందూ మతం యొక్క ప్రధాన సంప్రదాయాలలో ఒకటైన ఇది ప్రధానంగా విష్ణువును, అతని అనుబంధ అవతారాలను పరమ దేవుడిగా ఆరాధిస్తుంది. దీని ప్రకారం విష్ణువుకు రోజుకు ఆరు సార్లు పూజలు (ఆరాధన) చేయాలి, వీటిలో కనీసం ఒక పూజ తప్పనిసరి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు.[40][41] సేవలను రోజువారీ, వారాన్నిబట్టి, ఆవర్తన (మరల మరల) జరిగేవిగా వర్గీకరించారు. ఆలయంలోని రోజువారీ సేవలలో (సంభవించే క్రమంలో) సుప్రభాత సేవ, తోమాల సేవా, అర్చన, కళ్యాణోత్సవం, డోలోత్సవం (ఉంజల్ సేవా), అర్జిత బ్రహ్మోత్సవం, అర్జిత వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ, ఏకాంత సేవా ఉన్నాయి. ఆలయ వారపు సేవలలో సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టాదల పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం నిజపాద దర్శనం, సడలింపు,నేత్ర దర్శనం,తిరుప్పావడ,పూలంగిసేవ ఉన్నాయి. శనివారం, ఆదివారం వారపు సేవలు లేవు. ఆవర్తన సేవలలో జ్యైష్ఠాభిషేకం, ఆనివారా అస్థానం, పవిత్రోత్సవం, కోయిల్ అల్వార్ తిరుమంజనం ఉన్నాయి.

నైవేద్యం

 
తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం ప్రసాదం లడ్డు

ప్రపంచ ప్రఖ్యాత " తిరుపతి లడ్డు "ను తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు.[42] తిరుపతి లడ్డుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైన గుర్తింపు పొందినది.[43][44] అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు. వాటిని అన్న-ప్రసాదాలు, పణ్యారములుగా విభజించారు. అన్నప్రసాదాలలో చక్రపొంగలి (తీపి), పులిహోరా, మిర్యాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పణ్యారములలో లడ్డు, వడ, దోస, ఆప్పం, జిలేబి, మురుకు, బొబ్బట్టు, పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజూ ఉచిత భోజనం పెడతారు. గురువారాలలో, తిరుప్పవాడ సేవలో భాగంగా తిరుమ్మని మండపం (ఘంట మండపం) లో పులిహోరను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి నివేదిస్తారు.[45]

దర్శనం

సాధారణ దినాలలో రోజుకు 50,000 నుండి 100,000 భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకొంటుండగా, బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు,పండుగ రోజులలో 500,000 మంది దర్శించుకొంటున్నారు. కావున ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర స్థానంగా రికార్డులకెక్కింది.[10] భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి, తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేచివుండు మండపాలను ( వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లను)1983, 2000 సంవత్సరాలలో నిర్మించింది. సాంప్రదాయం ప్రకారం, భక్తులు ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర దర్శనానికి ముందు స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉన్న భువరాహ స్వామి ఆలయాన్ని దర్శించాలి.[46]

ఇటీవల, పాదచార యాత్రికుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక క్యూలో ప్రవేశించడానికి ఉచితమైన, పరిమిత సంఖ్యలో బయోమెట్రిక్ టోకెన్లు జారీ చేయబడతాయి. టోకెన్లు మొదట వచ్చినవారికి, మొదట ఇచ్చే ప్రాతిపదికన ఇస్తారు. భక్తులు టోకెన్‌లో కేటాయించిన సమయాలలో వెంకటేశ్వరుని దర్శించవచ్చు.

తలనీలాల సమర్పణ

చాలా మంది భక్తులు తమ తలనీలాలను సమర్పిస్తారు. దీనిని "మొక్కు"గా పిలుస్తారు. మొత్తం రోజువారీ సేకరించిన టన్నుకు పైగా బరువుగల తలనీలాలను అంతర్జాతీయంగా అమ్మగా దేవాలయానికి చాలా ఆదాయం చేకూరుతుంది.[47] పురాణాల ప్రకారం, వెంకటేశ్వర తలపై ఆవులకాపరి కొట్టినప్పుడు, అతని నెత్తిమీద ఒక చిన్న భాగం బట్టతల అయింది. గంధర్వ యువరాణి నీలా దేవి ఈ విషయాన్ని గమనించి ఆమె జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి, తన మాయాజాలంతో, అతని నెత్తిపై అమర్చింది.[48] జుట్టు స్త్రీ రూపానికి అందమైన ఆస్తి కాబట్టి, ఆమె త్యాగాన్ని వెంకటేశ్వరుడు గమనించి తన ఆలయానికి వచ్చే తన భక్తులందరూ తమ జుట్టును తనకు అర్పిస్తారని, అందుకున్న వెంట్రుకలన్నింటినీ ఆమె స్వీకరించాలని కోరాడు. అందువల్ల, భక్తులు అందించే జుట్టును నీలా దేవి స్వీకరిస్తుందని నమ్ముతారు. ఏడు కొండలలో ఒకటైన నీలాద్రి అనే కొండకు ఆమె పేరు పెట్టారు.  సాంప్రదాయకంగా తలనీలాలు తీసే మంగళ్లు మగవారు. స్త్రీ భక్తులు ఆడ మంగలిని ప్రవేశపెట్టమన్న కోరిక తొలిగా విఫలమయింది కగ్గనపల్లి రాధాదేవి నేతృత్వంలోని నిరసన తరువాత ఆలయం మహిళా మంగళ్లను నియమించింది. దేవిని 2017 లో ఆంధ్రప్రదేశ్ గుర్తించబడగా,2019 లో భారత రాష్ట్రపతి నారి శక్తి పురస్కార్ తో సమ్మానించిబడింది.[49]

హుండి

స్థల పురాణం ప్రకారం, శ్రీనివాసుడు పద్మావతితో వివాహాఖర్చులకు కుబేరుడు నుండి 1 కోటి 14 లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది, దేవ శిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. ఆ అప్పు తన భక్తుల సమర్పించే వాటితో చెల్లించుతానని చెప్తాడు. భక్తులు హూండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు రోజుకి 2.25 కోట్ల రూపాయలవరకు వుండవచ్చు.[50][51]

తులాభారం

తులాభారం సాంప్రదాయంలో ఒక భక్తుడు తన బరువుతో సమానబరువుతూగే చక్కెర, బెల్లం, తులసి ఆకులు, అరటి, బంగారం, నాణేలు సమర్పిస్తారు. నవజాత శిశువులు లేదా పిల్లలతో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది.[52]

పండుగలు

 
తిరుమల వద్ద పండుగ సందర్భంగా ఏనుగుల కవాతు

తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం పండుగలకు స్వర్గదామం, ఇక్కడ సంవత్సరానికి 365 రోజులలో 433 ఉత్సవాలు "నిత్య కళ్యాణం పచ్చ తోరణం " అనే నినాదానికి ప్రతీకగా ప్రతి రోజు పండుగగా జరుపుకుంటారు.[53]

ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో జరుపుకునే తొమ్మిది రోజుల కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రధాన కార్యక్రమం. దీనిలో మలయప్పస్వామి భార్యలు శ్రీదేవి, భూదేవితో, నాలుగు మాడ వీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. వాహనాలలో ముఖ్యమైనవి ధ్వజారోహనం, పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వ భూపాల వాహనం, మోహిని అవతారం, గౌడ వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వర్ణరథం, అశ్వ వాహనం, చక్ర స్నానం. వైకుంఠ ఏకాదశి నాడు గరుడ వాహన ఊరేగింపును అత్యధికంగా లక్షలాది మంది భక్తులు చూస్తారు. ఆరోజు గర్భగుడి చుట్టుగా వున్న వైకుంఠ ద్వారం ద్వారా వెంకటేశ్వరుని దర్శనం పొందుతారు.[54][55] ఫిబ్రవరిలో జరుపుకునే రథసప్తమి పండుగ రోజున, మలయప్ప స్వామి ఊరేగింపు ఏడు వేర్వేరు వాహనాలలో తెల్లవారుజాము నుండి అర్థరాత్రి వరకు జరుగుతుంది.[56] ఇతర వార్షిక ఉత్సవాలలో ముఖ్యమైనవి రామ నవమి, జన్మాష్టమి, ఉగాది, తెప్పోత్సవం, శ్రీ పద్మావతి పరిణయోత్సవం, పుష్ప యాగం, పుష్ప పల్లకి, మార్చి-ఏప్రిల్‌లో జరుపుకునే వసంతోత్సవం (వసంత పండుగ) మొదలగునవి ఉన్నాయి.

పాటలు, స్తోత్రాలు

తిరుమల ఆలయ గర్భగుడి లోపల శయన మండపం వద్ద వెంకటేశ్వరునికి ఉదయాన్నే చేసే తొలి సేవ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. 'సుప్రభాతం' అనగా భగవంతుడిని నిద్ర నుండి మేల్కొల్పటం.[57][58] 13 వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాధి భయంకరం అన్నాంగరాచార్య స్వరపరిచారు. దీనిలో సుప్రభాతం (29), స్తోత్రం (11), ప్రపత్తి (14), మంగళశాసనాలనే (16) నాలుగు భాగాలతో మొత్తం 70 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం యొక్క పదమూడవ శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది:

లక్ష్మీదేవితో వున్న దేవా! వరాలిచ్చేదేవా! అన్ని లోకాలకు స్నేహితుడివైనటువంటి! శ్రీలక్ష్మి నివాసంగల దేవా, సముద్రమంత దయతో పోలిక లేని దేవా! ఛాతీపై లక్ష్మీ వున్నందున అందమైన రూపంగల దేవా! వేంకటాచల దేవా! నీకు శుభోదయం అగుగాక!

వెంకటేశ్వరునికి గొప్ప భక్తుడు, గొప్ప తెలుగు కవిగా పేరొందిన తాళ్లపాక అన్నమచార్య (అన్నమయ్య) వెంకటేశ్వరుని ప్రశంసిస్తూ సుమారు 32000 పాటలు పాడారు.[59] తెలుగు, సంస్కృత భాషలలో ఉన్న అతని పాటలను సంకీర్తనలు అని పిలుస్తారు. వాటిని శృంగార సంకీర్తనలు, అధ్యాత్మ సంకీర్తనలు అని వర్గీకరించారు.

ఏడు కొండలు

ఈ ఆలయం ఏడు కొండలపై ఉంది. ప్రధాన దేవతను సప్తగిరీషుడు లేదా ఏడు కొండల దేవుడు అని కూడా పిలుస్తారు.[60] ఏడు కొండలు ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయని నమ్ముతారు. ఏడు కొండలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 
తిరుమలలోని పెద్దదైన హనుమంతుడి విగ్రహం
  • వృషభాద్రి - నంది కొండ, శివుడి వాహనం, విష్ణు అవతారం
  • అంజనాద్రి - హనుమంతుని కొండ.
  • నీలాద్రి- నీలా దేవి కొండ
  • గరుడాద్రి లేదా గరుడాచలం - గరుడ కొండ, విష్ణువు వాహనం
  • శేషాద్రి లేదా శేషాచలం - విష్ణువు దాసుడైన శేషుని కొండ, ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది.
  • నారాయణాద్రి - నారాయణ కొండ. శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి.
  • వెంకటాద్రి - వెంకటేశ్వరుని కొండ

ఉప దేవాలయాలు

వరదరాజ ఆలయం

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వెండివాకిలి ఎడమ వైపున విమాన-ప్రదక్షిణంలో వరదరాజుకు అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం ఉంది.[61] ఈ దేవత ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు. ఈ దేవతా శిల్పం రాయితో కూర్చున్న స్థితిలో చెక్కబడి పడమరకు చూస్తున్నట్లు నిర్మించబడింది.

యోగ నరసింహ ఆలయం

విమాన ప్రదక్షిణం ఈశాన్య మూలలో నరసింహ దేవాలయం ఉంది.[62] 1330 – 1360 కాలంలో నిర్మించబడింది.[ఆధారం చూపాలి] యోగ నరసింహ విగ్రహం కూర్చొని వున్న భంగిమలో శంఖము, చక్రాలను పై రెండు చేతుల్లో, రెండు దిగువ చేతులను యోగ ముద్రలో వున్నట్లుగా వుంటుంది.

గరుత్మంత ఆలయం

వెంకటేశ్వర వాహనమైన గరుత్మంతునికి అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం జయ-విజయలు కావలి కాచే బంగారువాకిలికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఇది గరుడమండపంలో భాగం. ఈ విగ్రహం ఆరు అడుగుల ఎత్తుతో పశ్చిమంవైపు గర్భగుడి లోపలి వెంకటేశ్వరుని చూస్తున్నట్లుగా వుంటుంది.

భూవరాహ స్వామి ఆలయం

భూవరాహ స్వామి ఆలయం విష్ణువు అవతారమైన వరాహవతారానికి అంకితం చేసిన ఆలయం. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం కంటే పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయం స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉంది. సాంప్రదాయం ప్రకారం, మొదట నైవేద్యం భూవరాహ స్వామికి ముందు ఇచ్చి ఆ తరువాత ప్రధాన ఆలయంలోని వెంకటేశ్వరునికి ఇవ్వాలి. సాంప్రదాయం ప్రకారం, భక్తులు ముందు భూవరాహ స్వామి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి..

బేడి-అంజనేయ ఆలయం

బేడీ-అంజనేయ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడిన ఉప మందిరం. ఈ ఆలయం అఖిలాండం (కొబ్బరికాయలు అర్పించే ప్రదేశం) మహాద్వారానికి సరిగ్గా ఎదురుగా ఉంది. ఈ ఆలయంలోని దేవత తన రెండు చేతులూ కట్టకట్టినట్లు (బేడీలు) ఉంది.

వకుళమాత సన్నిధి

వకుళమాత వెంకటేశ్వరుని తల్లి. ప్రధాన ఆలయంలో వరదరాజ మందిరానికి కొంచెం ముందు ఆమెకు అంకితం చేసిన విగ్రహం ఉంది. దేవత కూర్చొని ఉన్న భంగిమలో ఉంది. పురాణాల ప్రకారం, ఆమె తన కొడుకుకు అందించే ఆహారాన్ని తయారు చేయడాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ కారణంగా వకులమాత సన్నిధికి శ్రీవారి పోటుకు మధ్యగల గోడకు రంధ్రం చేయబడింది.

కుబేరుని సన్నిధి

విమానప్రదక్షిణలో కుబేరుడికి అంకితం చేసిన ఉప మందిరం ఉంది. ఈ దేవత గర్భగుడి కుడి వైపున వెంకటేశ్వరుని దక్షిణం వైపు చూస్తున్నట్లుగా వుంటుంది.

రామానుజ మందిరం

శ్రీ రామానుజ మందిరం విమాన ప్రదక్షిణం యొక్క ఉత్తరం వైపు ఉంది. దీనిని భాష్యకార సన్నిధి అని కూడా అంటారు. ఈ మందిరం సా.శ. 13 వ శతాబ్దంలో నిర్మించబడింది

ప్రముఖ భక్తులు

 
తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తానాచార్యుడు, పద-కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య (లేదా అన్నమయ్య) - విగ్రహం

రామానుజాచార్యుడు (1017–1137) [63] శ్రీ వైష్ణవంలో అతి ప్రధాన ఆచార్యుడు . శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆరాధన విధానాలు, ఇతర వ్యవహారాల నిర్వహణ బాధ్యత వహించాడు. విష్ణువు ఆయుధాలైన పవిత్ర శంఖం, చక్రం తన సందర్శనలో సమర్పించాడు.[64][65] అతను పెద్ద జీయర్ మఠం స్థాపించాడు. ఆయనకు ఆలయం లోపల సన్నిధి (పుణ్యక్షేత్రం) ఉంది.

తాళ్లపాక అన్నమాచార్య (లేదా అన్నమయ్య) ( 1408 మే 22 - 1503 ఏప్రిల్ 4) తిరుమల వెంకటేశ్వర ఆలయం అధికారిక సంకీర్తనాచార్యుడు. వెంకటేశ్వరుని స్తుతిస్తూ తెలుగులో సుమారు 36,000 కీర్తనలను రచించాడు.[66]

అయోధ్యకు చెందిన ఒక సాధువు హథీరాం బావాజీ, సా.శ. 1500 లో తిరుమల [67] తీర్థయాత్రకు వచ్చి వెంకటేశ్వరుని భక్తుడు అయ్యాడు.[68][69]

మతపరమైన ప్రాముఖ్యత

ఈ ఆలయం విష్ణువు ఎనిమిది స్వయంభు క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఇక్కడ దేవత స్వయంగా వ్యక్తమైందని నమ్ముతారు. ఇలాంటివే దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, భూవరాహ స్వామి ఆలయం, వనమలై పెరుమాల్ ఆలయం, నేపాల్ లోని సాలిగ్రామ, ఉత్తర భారతదేశంలోని నైమిశారణ్య, పుష్కర్ బద్రీనాథ్ ఆలయం ఉన్నాయి.[70]

ఈ ఆలయాన్ని అల్వారుల దివ్య ప్రబంధం గ్రంథంలో ఆరాధిస్తారు. ఈ పుస్తకాలలో పేర్కొన్న 108 విష్ణు దేవాలయాలలో ఒకటైన ఈ ఆలయాన్ని దివ్యదేశం అని పేర్కొన్నారు. వెంకటాచల తీర్థయాత్ర ద్వారా పొందే ప్రయోజనాలు ఋగ్వేదం, అష్టాదశ పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ ఇతిహాసాలలో, వెంకటేశ్వరుడు వరాలు ఇచ్చే దేవుడని, తిరుమలకు సంబంధించిన అనేక కథనాలున్నాయి.

ఇతర ప్రదేశాలు

  • మాడ వీధులు: తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టూ వున్న ప్రధాన రహదారులను మాడ వీధులు అంటారు. ఉత్సవ సందర్భాలలో స్వామి వారిని వివిధ వాహనాలపై, రథాల పై వూరేగింపుగా ఈ మాడ వీదులలో ఊరేగిస్తారు. నాలుగు దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధి అని పిలుస్తారు.
  • గొల్ల మండపం: వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించే యాదవుల కులానికి చెందిన మహిళా గుడి మందిరం గొల్లమండపం. గొల్ల కులానికి చెందిన ఓ మహిళా తిరుమలలో పాలు అమ్ముకొని, వచ్చిన ఆదాయంతో గొల్ల మండపాన్ని నిర్మించింది.
  • శ్రీవారి గునపం: అనంతాళ్వార్ పూల తోట నీళ్ళ కోసం బావి తవ్వటానికి బాలుని రూపంలో సహాయం చేయవచ్చాడు వెంకటేశ్వరుడు. అతడు సహాయం వద్దనగా అతని భార్య సహాయం పొందగా మట్టి తట్టని దూరంగా పోసిరావడంలో సహాయపడతాడు. దీనికి కోపపడి, గునపం విసిరితే బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ సాయంత్రం గుడిలో విగ్రహం గడ్డంపై రక్తం కారడం చూసి, వేంకటేశ్వరుడే సహాయం చేయటానికి వచ్చాడని తెలుసుకుంటాడు.
  • కల్యాణకట్ట: భక్తులు మొక్కుగా తలనీలాలు సమర్పించే స్థలము.
  • పాప వినాశనము: తిరుమలకు 8 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ నీటితో స్నానమాచరిస్తే సమస్త పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నుండి తిరుమలకు నీరు సరఫరా జరుగుతుంది. ఇక్కడ జలాశయానికి కట్టిన ఆనకట్ట పేరు గోగర్భం ఆనకట్ట.

సమీప ఆలయాలు

తిరుమల సమీపంలో చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. తిరుపతి నుండి 5 కి.మీ. దూరంలో గల తిరుచానూరులో శ్రీ వెంకటేశ్వరుని భార్య పద్మావతి ఆలయం ఉంది. తిరుపతి నుండి 38 కి.మీ. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ఉంది. తిరుపతి నుండి 75 కి.మీ దూరంలోని కాణిపాకలో 10 వ శతాబ్దపు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఉంది. ఇవి కాక, గోవిందరాజ ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర ఆలయం (శ్రీనివాస మంగపురం), కోదండరామ ఆలయం, కపిల తీర్థం వంటి ఆలయాలు తిరుపతి నగరంలో ఉన్నాయి.

చిత్రమాలిక

బయటి లింకులు

  • "తిరుమల:దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు". ఈనాడు. 2021-07-10. ప్రయాణ, సేవల సమాచారం.
  • తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ-పుస్తకాలు
  • OSM పటముపై తిరుమల ప్రాంతపు ఛాయాచిత్రాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Alexandra Mack. Spiritual Journey, Imperial City: Pilgrimage to the Temples of Vijayanagara. Vedams eBooks (P) Ltd, 2002 - Hindu pilgrims and pilgrimages - 227 pages. p. 80.
  2. "Yadavas hail restoration of 'Golla Mirasi". www.thehindu.com. Archived from the original on 14 June 2020. Retrieved 12 June 2020.
  3. "Tirumala Temple". Archived from the original on 11 October 2007. Retrieved 13 September 2007.
  4. PGurus Team (24 February 2020). "All is not well in Tirumala!". PGurus. Retrieved 1 October 2020.
  5. Raguvaran (15 April 2021). "Ancient history".
  6. NavaeethaKrishnan (15 April 2021). "SANKUSTHAPANA STHAMBHAM Laying Foundation Stone".
  7. "NDTV Report". Archived from the original on 22 సెప్టెంబరు 2007. Retrieved 13 September 2007.
  8. Sivaratnam, C (1964). An Outline of the Cultural History and Principles of Hinduism (1 ed.). Colombo: Stangard Printers. OCLC 12240260. Koneswaram temple. Tiru-Kona-malai, sacred mountain of Kona or Koneser, Iswara or Siva. The date of building the original temple is given as 1580 BCE according to a Tamil poem by Kavi Raja Virothayan translated into English in 1831 by Simon Cassie Chitty ...
  9. Ramachandran, Nirmala (2004). The Hindu legacy to Sri Lanka. Pannapitiya: Stamford Lake (Pvt.) Ltd. 2004. ISBN 9789558733974. OCLC 230674424. Portuguese writer De Queyroz compares Konesvaram to the famous Hindu temples in Rameswaram, Kanchipuram, Tirupatti-Tirumalai, Jagannath and Vaijayanthi and concludes that while these latter temples were well visited by the Hindus, the former had surpassed all the latter temples by the early 1600s
  10. 10.0 10.1 "Ghazal programme at Tirumala temple". The Hindu. Chennai, India. 30 September 2003. Archived from the original on 3 October 2003.
  11. "2.73 cr devotees visited Tirumala last year: TTD". The Times of India. Hyderabad, India. 7 January 2017. Archived from the original on 20 ఫిబ్రవరి 2019. Retrieved 19 March 2021.
  12. 12.0 12.1 12.2 12.3 "Tirumala Tirupati Devasthanams-Temple Legend". Archived from the original on 2015-12-12. Retrieved 2021-07-09.
  13. ఆకెళ్ల 2019, p. 40.
  14. Feminism and World Religions 1999, p. 48.
  15. Dr. N.Ramesan (1981). The Tirumala Temple. Tirumala: Tirumala Tirupati Devasthanams.
  16. ttd, official site. "TTD Temple History". Tirumala Tirupathi Devasthanams. Temple website. Retrieved 15 December 2019.
  17. "Tirumala Tirupati Devasthanams: Temple History". Archived from the original on 12 April 2012. Retrieved 15 July 2011.
  18. V.K, Bhaskara Rao (1992). Organisational and Financial Management of Religious Institutions: With Special Reference to Tirumala Tirupati Devasthanams (TTD). Deep and Deep Publications. pp. 52, 53. ISBN 81-7100-441-5.
  19. "A 'miser' who donated generously". thehindu. 19 February 2010. Archived from the original on 5 October 2020. Retrieved 19 October 2020.
  20. 20.0 20.1 వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  21. Koutha, Nirmala Kumari (1 January 1998). History of the Hindu Religious Endowments in Andhra Pradesh. Northern Book Centre. p. 124. ISBN 81-7211-085-5.
  22. Koutha, Nirmala Kumari (1 January 1998). History of the Hindu Religious Endowments in Andhra Pradesh. Northern Book Centre. p. 136. ISBN 81-7211-085-5.
  23. "Archived copy". Archived from the original on 8 December 2015. Retrieved 22 October 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  24. Ramakrishna, Lalita (2003). Musical heritage of India. ISBN 9788187226611. Retrieved 23 September 2019.
  25. International Journal of Dravidian Linguistics: IJDL., Volume 36. 2007. Retrieved 23 September 2019.
  26. "TTD to bring 7 Hills under its control". The Times of India. 22 July 2006. Retrieved 1 October 2020.
  27. "Early closure of Srivari Mettu footpath mooted". The Hindu. Retrieved 20 August 2017.
  28. "New TTD Board Members to Take Oath on May 2". Archived from the original on 30 అక్టోబరు 2015. Retrieved 31 July 2015.
  29. "Tirumala Tirupati Devasthanams: Social Service". Archived from the original on 7 ఆగస్టు 2002. Retrieved 15 July 2011.
  30. "TTD-social service activities". Archived from the original on 2002-08-07. Retrieved 2021-07-09.
  31. York, Michael (5 August 2015). Pagan Ethics: Paganism as a World Religion. ISBN 9783319189239. Retrieved 24 September 2019.
  32. 32.0 32.1 32.2 Sri Venkateshwara. Shantha Nair. 7 January 2014. ISBN 9788184954456.
  33. 33.0 33.1 "Tiruppavai to replace Suprabhata Seva". times of india. 8 December 2016. Retrieved 27 July 2018.
  34. "Much awaited Kaisika Dwadasi falls on November 11". times of india. 6 November 2016. Retrieved 27 July 2018.
  35. "Fervour marks 'Kaisika Dwadasi' at Tirumala". The Hindu. 2 December 2016. Retrieved 27 July 2018.
  36. Singh, Nagendra Kr; Mishra, A. P. (2005). Encyclopaedia of Oriental Philosophy and Religion: Hinduism. ISBN 9788182200746. Retrieved 20 September 2019.
  37. Varadachary, T. (1999). Tirumala, the Panorama of Seven Hills. Retrieved 20 September 2019.
  38. Diehl, Carl Gustav (1956). Instrument and Purpose: Studies on Rites and Rituals South India. Gleevup. Retrieved 20 September 2019. Sage Vikhanasa atri.
  39. Varadachary, T. (1999). Tirumala, the Panorama of Seven Hills. Retrieved 20 September 2019.
  40. "Tirumala Tirupati Devasthanams-Arjitha Sevas". Archived from the original on 21 జూలై 2015. Retrieved 18 August 2015.
  41. ఎన్, వి.లక్ష్మీనరసింహారావు (1923). "  అధ్యాయము 3".   తిరుమల తిరుపతి యాత్ర. వికీసోర్స్. 
  42. "Record sale of Tirupati laddoos". The Times of India. 7 May 2007. Archived from the original on 25 October 2012. Retrieved 19 March 2021.
  43. Sivaraman, R. (3 March 2014). "Only TTD entitled to make or sell 'Tirupati laddu': High Court". The Hindu. Retrieved 23 June 2015.
  44. "Now, Geographical Indication rights for 'Tirupati laddu'". Business Standard India. Business Standard. 28 February 2014. Retrieved 23 June 2015.
  45. The Crown Divine: Diamond Crown Souvenir, December 20, 1985. 1985. Retrieved 23 September 2019.
  46. "Tirumala Tirupati Devasthanams-Sri Bhu Varaha Swamy Temple". Archived from the original on 2016-03-04. Retrieved 2021-07-09.
  47. Saritha Rai (14 July 2004). "A Religious Tangle Over the Hair of Pious Hindus". The New York Times. Retrieved 26 April 2009.
  48. Tarlo, Emma (2016-10-06). Entanglement: The Secret Lives of Hair (in ఇంగ్లీష్). Simon and Schuster. p. 66. ISBN 978-1-78074-993-8.
  49. @MinistryWCD (8 March 2019). "Ms. Kagganapalli Radha Devi - #NariShakti Puraskar 2018 Awardee in Individual category" (Tweet). Retrieved 7 January 2021 – via Twitter.
  50. "NDTV Report". Archived from the original on 22 సెప్టెంబరు 2007. Retrieved 13 September 2007.
  51. "TTD Deposits Gold with SBI". The Times of India. Archived from the original on 5 November 2012. Retrieved 13 September 2007.
  52. My Amazing Life: Journey through Success. Partridge Publishing Singapore. 2013. ISBN 9781482894905.
  53. "Tirumala- The Paradise of Festivals". Archived from the original on 20 మార్చి 2015. Retrieved 7 June 2015.
  54. Shukla, G. P. (January 2015). "Pilgrims throng Tirumala". The Hindu. Retrieved 21 June 2015.
  55. "Pilgrims throng Tirumala". Deccan Herrald. January 2015. Retrieved 21 June 2015.
  56. "Rathasapthami photos". Archived from the original on 27 October 2009.
  57. V.K., Subramanian (1996). Sacred Songs of India, Volume 10. Abhinav publications. p. 59. ISBN 81-7017-444-9.
  58. "Tirumala Tirupati Devasthanams-Suprabhatam". Tirumala Tirupati Devasthanams. Archived from the original on 8 అక్టోబరు 2015. Retrieved 29 July 2015.
  59. 101 Mystics of India. Abhinav Publications. 2006. ISBN 9788170174714.
  60. Encyclopaedia of Tourism Resources in India, Volume 2. Kalpaz publications. 2001. ISBN 9788178350189.
  61. Naidu, Thalapaneni Subramanyam (1990). Growth and development of Tirumala-Tirupati as a dimension of Indian civilization. Anthropological Survey of India, Ministry of Human Resource Development, Dept. of Culture, Govt. of India. Retrieved 24 September 2019. Varadaraja.
  62. Naidu, Thalapaneni Subramanyam (1990). Growth and development of Tirumala-Tirupati as a dimension of Indian civilization. Retrieved 24 September 2019.
  63. von Dehsen, Christian D.; Harris, Scott L. (1999). Philosophers and Religious Leaders – Google Books. ISBN 9781573561525. Retrieved 17 June 2013.
  64. Siddharth Varadarajan. Srivari Brahmotsavam: A celestial spectacle on earth. Kasturi and Sons Ltd, 2013. p. 68.
  65. S. D. S. Yadava. Followers of Krishna: Yadavas of India. Lancer Publishers, 2006 - Ahirs - 185 pages. p. 99.
  66. "S. P. Sailaja keeps audience spellbound". The Hindu News. 28 February 2012. Retrieved 2 March 2013.
  67. Shantha, Nair (2013). Sri Venkateswara: Lord Balaji and his holy abode of Thirupati. Mumbai: Jaico Publishing House. p. 12. ISBN 978-81-8495-445-6. Retrieved 26 September 2016.
  68. Ramachandra Pai, N. A. "Hathiram Baba". speakingtree.in. Speeking Tree. Retrieved 26 September 2016.
  69. Team, panditbooking. "The Story of Lord Balaji's favorite devotee Hathiramji Baba and the name of Balaji to the Lord of Tirupati". spiritual.panditbooking.com. Panditbooking. Archived from the original on 27 సెప్టెంబరు 2016. Retrieved 26 September 2016.
  70. S., Prabhu (10 May 2012). "Symbolising religious unity". The Hindu. Retrieved 13 October 2014.