తెలుగు సినిమా మైలురాళ్ళు
తెలుగులో సినిమా 1931 సంవత్సరంలో తియ్యబడినప్పటినుండి నేటి వరకూ అనేక వందల సినిమాలు తియ్యబడ్డాయి. అలా తీయబడ్డ సినిమాలు, ఆ సినిమాలు తీసిన దర్శకులు, అందులో నటించిన నటీనటులు-కథా నాయకీ నాయకులు, ప్రతినాయకులు, హాస్య నటులు, బాల నటులు-సంగీతాన్ని కూర్చిన సంగీత దర్శకులు, పాటలు పాడిన గాయనీగాయకులు, తెరమీద కనిపించినవారు, కనబడనివారు, అనేక మంది కృషితో ఇప్పుడు మన సినీ ప్రపంచం రకరకాల అంద చందాలతో అలరారుతోంది. ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో అనేక మైలు రాళ్ళు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి.
తొలి చిత్ర్రాలు
మార్చుఏ మైలురాయికైనా మొదలంటూ ఉండాలి. తెలుగు సినిమా ప్రభంజనంలో అటువంటి తొలి మైలురాళ్ళు అనేకం. తొలి తెలుగు చిత్రం దగ్గరనుంచి మొదలు పెట్టి అనేకమైన "తొలి" తొడుగు గల చిత్రాల వివరాలు ఇవ్వబడినాయి.
- తొలి పాక్షిక టాకీ చిత్రం లక్ష్మీ (1930)
- తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద (1931)
- తొలి జానపద చిత్రం చింతామణి (1933)
- తొలి సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936)
- తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937)
- తెలుగు నుండి పర భాషలోకు అనువదింపబడిన (డబ్బింగ్) తొలి చిత్రం కీలు గుర్రం (1949) --> తమిళంలో మాయ కుదిరై పేరుతో 4 ఆగస్టు, 1949 తేదీన విడుదలైంది)
- తొలి తెలుగు అనువాద చిత్రం ఆహుతి (1950) (హిందీ చిత్రమైన నీల్ ఔర్ నందా నుండి)
- అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం పాతాళ భైరవి (1951)
- విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం మల్లీశ్వరి (1951)
- తొలి సోషియో-ఫాంటసీ తెలుగు చిత్రం దేవాంతకుడు (1960)
- తొలి రంగుల చిత్రం లవ కుశ (1963)
- జాతీయ స్థాయిలో ద్వితియ ఉత్తమ చిత్రంగా నిలచిన తొలి తెలుగు చిత్రం నర్తనశాల (1963)
- తొలి అపరాధ పరిశోధక తెలుగు చిత్రం దొరికితే దొంగలు (1965)
- తొలి A సర్టిఫికెట్ చిత్రం మనుషులు మమతలు (1965)
- తొలి తెలుగు జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966)
- తొలిసారిగా సినిమా సూత్రాలను అనుకరించకుండా (ఆఫ్ బీట్) తీసిన తెలుగు చిత్రం సుడిగుండాలు (1967)
- తొలి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు (1973)
- వినోదపు పన్ను మినహాయింపు పొందిన తొలి చిత్రం తీర్పు (1975)
- జాతీయ స్థాయిలో ద్వితియ ఉత్తమ చిత్రంగా నిలచిన రెండవ తెలుగు చిత్రం శంకరాభరణం (1980)
- తొలి 3డి చిత్రం జై బేతాళ (1985)
- తొలి 70 యమ్.యమ్ చిత్రం సింహాసనం (1986)
- మలి 70 యమ్.యమ్ చిత్రం అగ్ని పుత్రుడు (1987)
సినిమా పేర్లు
మార్చుచలనచిత్రం అన్నాక పేరంటూ ఉండాలి. పేరులేని చిత్రమంటూ ఇప్పటివరకు వచ్చినట్టులేదు. పేరులేని నవలగా మొదలుపెట్టబడినా, పాఠకులు పోటీలో పేరు పెట్టబడిన మొదటి నవల "మీనా". ఆ తరువాత విజయనిర్మల దర్శకత్వంలో సినిమాగ చిత్రీకరించబడింది. కాబట్టి సినిమాకు పేరు ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. సంఖ్యా శాస్త్రాన్ని నమ్మే నిర్మాతలు/దర్శకులు వారివారి సినిమాలకు పేరు పెట్టేటప్పుడు కొన్ని అక్షరాలకు మాత్రమే పరిమితమవుతూ ఉంటారు. రాంగోపాల్ వర్మ తాను దర్శకత్వం వహించిన సినిమాలకు రెండు అక్షరాల పేర్లు ఎక్కువగా పెట్టాడు. శివ, గాయం, అంతం సినిమాలు కొన్ని ఉదాహరణలు. అలాగే, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ తన సినిమాలకు "శ" కాని "స" కాని మొదటి అక్షరంగా పెట్టటం గమనించవచ్చు. శంకరాభరణం, సప్తపది, సిరిసిరిమువ్వ, స్వయంకృషి మొదలయినవి. ఈ విధంగా తెలుగులో సినిమాలకు పేరు పెట్టటం అనేది ఒక కళగా విరాజిల్లుతోంది. ఈ విధంగా పేర్ల మీద ఎన్ని మైలు రాళ్ళు ఉన్నయో గమనిద్దాం.
- పొడువాటి పేర్లు
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- ఉమా చండీ గౌరీ శంకరుల కథ
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
- శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
- మీ ఇంటికొస్తే ఏమిస్తారు...మా ఇంటికొస్తే ఏం తెస్తారు... (2003)
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది (2001)
- పొట్టి పేర్లు
తొలి ద్విపాత్రాభినయాలు/బహుపాత్రాభినయాలు
మార్చుసినిమా తియ్యటమే గొప్పగా చాలా రోజులు గడిచింది.సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ సినిమాలలో రకరకాల ఆకర్షణలు జొప్పించబడ్డాయి. ఆవిధమైన సినీ అధ్భుతాలలో ముఖ్యమైనది ద్విపాత్రాభినయం ముఖ్యమైనది కాగా, బహు పాత్రాభినయం కూడా కొంతమంది నటులు ప్రయత్నించారు. కాని ద్విపాత్రాభినయం పొందినంత ప్రాచుర్యం బహుపాత్రాభినయం పొందలేదు. కారణం, ఒకే నటుడు ఎంత గొప్పవాడయినా, అనేక పాత్రలు ఒకే సినిమాలలో పొషించటం చాలా కష్టమైనపని, పైగా ఎబ్బెట్టుగా కూడా ఉండి, సత్య దూరంగా ఉంటుంది. దానికి తగ్గట్టు కథ వ్రాయటం మరింత కష్టమైన విషయం. ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలలో, ఆ నటుడు వేసిన పాత్రలు సామాన్యంగా ఒకదానికొకటి పూర్తి వ్యతెరేకంగా ఉంటాయి. ఉదాహరణకి బుద్ధిమంతుడు సినిమా. అతేకాకుండా, ఒక పాత్ర వేరొక పాత్రగా పొరొపాటుబడటం లేదా కావాలని ఒక పాత్ర మరొక పాత్రగా ఉండటం, ఒకేతరహా మూస చిత్రాలు ఎక్కువవటం జరిగి, ద్విపాత్రాభినయాల మీద ప్రేక్షకులకి ముఖంమొత్తింది.అందుకనే కాబోలు 1990ల నుండి ద్విపాత్రాభినయ చిత్రాల సంఖ్య చాలా పడిపోయింది, 2000 సంవత్సరాలు వచ్చేటప్పటికి, పూర్తిగా కనుమరుగైపోయినాయి. ఏదిఏమైనా ఒకే నటుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు వేశిన సందర్భాలకు సంబంధించిన మైలురాళ్ళు ఇక్కడ ఇవ్వబడినాయి.
- తొలి ద్విపాత్రాభినయ చిత్రం అపూర్వ సహోదరులు (1950 - రంజన్)
- తొలి త్రిపాత్రాభినయ చిత్రం కులగౌరవం (1972-యన్.టి.రామారావు)
- ఏకైక పంచపాత్రాభినయ చిత్రం శ్రీమద్విరాట పర్వము (1979 - యన్.టి.రామారావు)
- ఏకైక నవపాత్రాభినయ చిత్రం నవరాత్రి (1966- అక్కినేని నాగేశ్వరరావు)
- ఏకైక దశపాత్రాభినయ చిత్రం దశావతారం (2008- కమల్ హాసన్)
ఎక్కువ చిత్రాలలో నటించిన నటులు
మార్చువాశి గొప్పదా, రాశి గొప్పదా అన్న విషయానికొస్తే, తెలుగు చిత్ర పరిశ్రమ రాశికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతుంది. కొద్దొ గొప్పో పేరున్న నటుడెవరైనా సరే వందకు తక్కువ చిత్రాలు నటించింది లేదు. ఒక్కొక్క నటుడు చిత్రాల రాశిలో మరో మైలురాయి స్థాపించినప్పుడల్లా, కొంత ఆసక్తి కనబరిచి మరికొంత శ్రమపడి ఒక మంచి చిత్రాన్ని తయారు చేయటానికి ప్రయత్నించినట్టుగా అనేక ఉదాహరణలు కనబడతాయి మన సినీ చరిత్రలో. చిత్రాలలో నాయకులుగా వేసే వారికంటే, ఇతర పాత్రలు వేసే వారికే ఎక్కువ సినిమాలలో నటించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తనకిచ్చిన పాత్రలలో ఒదిగిపోయి, ఆ పాత్రగానే ప్రేక్షకులకు కనబడి, రాశిపెరిగిన కొద్దీ వాశి తగ్గుతుందన్న నానుడిని, తనవరకు నిజంకాదని నిరూపించిన విలక్షణ నటుడు అల్లు రామలింగయ్య.
సంఖ్యా పరంగా నటులు సాధించిన మైలురాళ్ళు ఇక్కడ ఇవ్వటానికి ప్రయత్నం జరిగింది.
- తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు - అల్లు రామలింగయ్య (1003 చిత్రాలు)
- తెలుగులో అత్యధిక చిత్రాలలో నటించిన హీరో- కృష్ణ (326 చిత్రాలు)
- 300 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో - యన్టీఆర్: మేజర్ చంద్రకాంత్ (1993) చిత్రంతో.
- 200 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో - యన్టీఆర్ : కోడలు దిద్దిన కాపురం (1970) చిత్రంతో.
- 100 చిత్రాలు తెలుగులోనే కాక, భారతదేశంలోనే తొలిసారి నటించిన హీరో - యన్టీఆర్ : గుండమ్మ కథ (1962) చిత్రంతో.
- 60 చిత్రాలలో నటించిన తొలి తెలుగు హీరో- అక్కినేని దొంగల్లో దొర (1957) చిత్రంతో.
శతదినోత్సవాలు
మార్చువ్యాపారపరంగా చూస్తే, చలనచిత్రానికి గీటురాయి, ఆ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అన్న విషయం ముఖ్యమైనది. సినిమా ఆడటం అన్నది చిత్రమైన తెలుగు వాడుకపదం. పూర్వం సినిమాలు ఇంకా రాని రోజుల్లో, తోలుబొమ్మల్ని ఆడించేవారట. ఆవిధంగానే సినిమాలు ఆడటం అన్న వాడుక వచ్చి ఉండవచ్చును. ఎక్కువ రోజులు ఆడిన సినిమాలన్నీ మంచి సినిమాలవాలనీ లేదు. అలాగే, ఎక్కువ రోజులు ఆడనంత మాత్రాన ఒక చిత్రం మంచి చిత్రం కాకనూ పోదు. ఈ రెండిటి మేలు కలయిక, అంటే మంచి చిత్రమయి ఎక్కువ రోజులు ఆడటం అన్నది ఎంత ఎక్కువ జరిగితే,అంత ఆ చలన చిత్రపరిశ్రమ పరిణితి చెందినదని చెప్పవచ్చును. ఏ ఏ చిత్రశాలలో 100 రోజులు చిత్రం నడిచిందో, ఆయా చిత్రశాల యజమానులకు పతకాలు/జ్ఞాపికలు ఇవ్వటం, ఆ సినిమా నటులు అటువంటి చిత్రశాలలు దర్శించటంతో మొదలుపెట్టి, ఈ శతదినోత్సవాలను అట్టహాసంగా జరపటం వరకు అభివృద్ధి చెందింది. సామాన్యంగా, రోజూ మూడు ఆటలు, పండుగలకు ఆదివారములకు నాలుగు ఆటలు అన్నది సినిమా ప్రదర్శనకు సంబంధించి, చిత్రశాల యజమానులుగాని, పపిణీదారులు గాని దశాబ్దాలపాటు అవలంభించిన విధానం. ఈ విధంగా వంద రోజులు ప్రదర్శితమయిన చిత్రాలు మాత్రమే శతదినోత్సవాలను జరుపుకోవటం ఆనవాయితీ అయ్యింది. తరువాత తరువాత, 1990లు 2000ల సంవత్సరాలు వచ్చేటప్పటికి టి.వి.,ఇంటర్నెట్, విసిడి/డివిడి ల నుండి పోటీ పెరిగిపోయి, ఈ ఆనవాయితీ పూర్తిగా సడలిపోయి, ఎక్కడో ఒకచోట, చిన్న హాలు అవ్వచ్చు, పెద్ద హాలు అవ్వచ్చు, ఎన్నో అన్ని ఆటలు, 100 రోజులు నడిస్తే చాలు, ఓ శతదినోత్సవ సభ జరుపుకోవచ్చు అని ఆరాటపడే దశ వచ్చింది
ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడి ఎటువంటి మైలురాళ్ళు సంపాయించింది అన్న విషయాలు ఇక్కడ తెలియ చెయ్యటమయినది.
- 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం పాతాళభైరవి (1951)
- 20- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం లవకుశ (1963) (72 కేంద్రాలలో)
- 30- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం అడవిరాముడు (1977) (తొలి 365 రోజుల సినిమా)
- 40-ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం పెదరాయుడు (1995)
- 50- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం ప్రేమించుకుందాం...రా! (1997)
- 60- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం చూడాలనివుంది (1998)
- 70- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం సమరసింహారెడ్డి (1999)
- 75 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం కలిసుందాం...రా! (2000)
- 100- ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం నరసింహ నాయుడు (2001)
- 192- కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం ఠాగూర్ (2003)
- 200-ఆపై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం పోకిరి (2006)
తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా కూడా చూడండి.
చిత్రశాలలు
మార్చు21వ శతాబ్దం వచ్చేటప్పటికి, ప్రేక్షకులకి సినిమా చూడాలంటే చిత్రశాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే పెద్ద పెద్ద తెరలున్న టి వి లు, సి డి ప్లెయర్లు వచ్చాయిగాని, అంతకుమందు సినిమాకి ప్రేక్షకుడికి అనుసంధానం జరిగేది చిత్రశాలలల్లోనే. చిత్రశాలలు లేకుంటే చలన చిత్రాలే లేవు అనటం అతిశయోక్తి కాదు. మళ్ళీ సినీ చరిత్రను పరికిస్తే, 1990లు వచ్చేటప్పటికి సినిమా ప్రదర్శనశాలల నిర్వహణ, వ్యాపారపరంగా లాభసాటిగా కనబడకపోవటం వల్ల, యాజమాన్యాలు అనేక చోట్ల తమ చిత్రశాలలను వివాహ వేదికలుగా లేదా వ్యాపార కూడళ్ళుగా మార్చి ఆ విధంగా వచ్చే కిరాయితో సినిమా ప్రదర్శన వల్ల తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవటం మొదలు పెట్టాయి. చలనచిత్రాలకు, ఇతర వివిధ వినోద మాధ్యమాల వల్ల వచ్చిన పొటీవల్ల, తమ అదాయం తగ్గి పోయిందన్న చిత్రశాలల యజమానుల వాదనలో కొంత వరకు నిజమున్నా, చిత్రశాలల నిర్వహణలో అలసత్వం, ఎ.సి. వెయ్యటంలో మోసకారితనం, టిక్కేట్ల నల్ల బజారు అమ్మకం, ప్రేక్షకులను అదలించి వారితో దురుసుగా ప్రవర్తించే రౌడీ నిర్వాహకులు, అభిమాన సంఘాల పేరుతో వెర్రి చేష్టలకు నిలయాలవటం వంటివి, కుటుంబ సమేతంగా చిత్రాలను చూసే సామాన్య ప్రేక్షకులను, చిత్రశాలలకు దూరం చేశాయని చెప్పక తప్పదు. 2000 సంవత్సరాల మొదటి దశాబ్దాంతానికి చిత్రశాలల,ఏక వ్యక్తి/భాగస్వామ్య యాజమాన్యాల నుండి ఐనాక్స్ (INOX), యాడ్-లాబ్స్ (Ad-Labs) వంటి కంపెనీ యాజమాన్యాల (Corporate Managements)కిందకు రావటం జరిగింది.
చిత్రపరిశ్రమకు పట్టు కొమ్మలైన చిత్రశాలలకు సంబంధించిన మైలురాళ్ళు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తొలిదశ దగ్గరనుండి చాలా ఉన్నాయి. అటువంటి చిత్రశాల-సంబంధిత మైలురాళ్ళు ఈ కింద ఇవ్వబడినాయి.
- ఆంధ్రదేశంలో తొలి పర్మనెంట్ సినిమా థియేటర్ విజయవాడ - మారుతి సినిమా (1921)
- మన రాష్ట్రంలో తొలి ఎ.సి. థియేటర్ సికిందరాబాద్ - ప్యారడైజ్ (1954)
- కోస్తాలో తొలి ఎ.సి. థియేటర్ నెల్లూరు- శ్రీరామ్ (1962)
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి 70 యమ్.యమ్. థియేటర్ హైదరాబాదు - రామకృష్ణ 70 యమ్.యమ్. (1968)
- కోస్తాలో తొలి 70 యమ్. యమ్. థియేటర్ విజయవాడ- ఊర్వశి 70 యమ్.యమ్. (1970)
- నేడు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక గ్రాస్ కెపాసిటీ థియేటర్- హైదరాబాదు - ప్రసాద్ ఐ మాక్స్ (ఒక్క ఆటకు రూ.90,000)
- నేడు కోస్తాలో అత్యధిక గ్రాస్ కెపాసిటీ థియేటర్ - వైజాగ్- జగదాంబ 70 యమ్.యమ్. ( ఒక్క ఆటకు రూ.30,060)
- నేడు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీటింగ్ కెపాసిటీ థియేటర్ హైదరాబాదు - సంధ్య 70 యమ్. యమ్. (1323 సీట్లు)
- నేడు కోస్తాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ థియేటర్ గుడివాడ - శరత్ (1170 సీట్లు)
- ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రం గల థియేటర్: హైదరాబాదు - రామకృష్ణ 70 యమ్.యమ్.లో 'షోలే' (1975) 81 వారాలు
- ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు గల కాంప్లెక్స్ - కర్నూలు: ఆనంద్, ఆదిత్య, అప్సర, అశోక, అర్చన, అశ్వనితో గల ఆరు థియేటర్ల కాంప్లెక్స్
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి మల్టీప్లెక్స్ - ప్రసాద్ మల్టీప్లెక్స్: హైదరాబాదు
- ఒకే థియేటర్‌లో అత్యధిక ప్రదర్శనలు కలిగిన తెలుగు చిత్రాలు
- ఉదయం ఆటలతో 'మరోచరిత్ర' (1978): మద్రాస్-సఫైర్‌లో 556 రోజులు
- 3 ఆటలతో 'ప్రేమాభిషేకం' (1981): గుంటూరు - విజయాలో 380 రోజులు
- 4 ఆటలతో 'పెళ్ళిసందడి' (1996): విజయవాడ- స్వర్ణలో 301 రోజులు
- 5 ఆటలతో 'ప్రతిఘటన' (1985): బెంగుళూరు-మెజెస్టిక్‌లో 203 రోజులు
- సింగిల్ థియేటర్‌లో అత్యధిక ఆటలు ప్రదర్శితమైన చిత్రం 'పెళ్ళిసందడి' (1996): విజయవాడ- స్వర్ణలో 1196 ఆటలు
- ఏ రిపీట్ రన్‌లో సింగిల్ థియేటర్‌లో అత్యధిక రోజులు రెగ్యులర్ షోస్‌తో ప్రదర్శితమైన చిత్రం 'శ్రీకృష్ణ పాండవీయం' (1986): గుంటూరు- వెంకటకృష్ణలో 55 రోజులు
వరుస విజయాలు
మార్చుసినిమా చరిత్ర చూస్తే, విజయ పరంపరలు చాలానే ఉన్నాయి. కాకపోతే వరుసగా ప్రతి సంవత్సరం విజయాలు సాధించటం అన్నది తప్పనిసరిగా ఒక మైలురాయిగా చెప్పుకొనవచ్చు. అటువంటి వరుస విజయాలతో మైలురాళ్ళు సాధించిన నటుల వివరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి.
- 1950 నుండి 1982 వరకు చిత్రరంగంలో ఉన్న 33 సంవత్సరాలలో ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు గల హీరో యన్.టి.రామారావు.
- 1955 నుండి 1974 వరకు వరుసగా 20 సంవత్సరాలు ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు కలిగిన హీరో అక్కినేని నాగేశ్వరరావు.
- 1980 నుండి 1995 వరకు వరుసగా 16 సంవత్సరాలు ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు గల హీరో చిరంజీవి.
- 1991 నుండి 2006 వరకు వరుసగా 16 సంవత్సరాలు ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు కలిగిన హీరో నాగార్జున.
- 1989 నుండి 2002 వరకు వరుసగా 14 సంవత్సరాలు ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు గల హీరో బాలకృష్ణ.
- 1976 నుండి 1986 వరకు వరుసగా 11 సంవత్సరాలు ప్రతి యేడాది శతదినోత్సవ చిత్రాలు కలిగిన హీరో కృష్ణ.
అంతర్జాతీయ చిత్రోత్సవాలలో
మార్చుఇంటగెలిచి రచ్చగెలవటం అన్నది ఒక సామెత. అటువంటి సామెతను అనేక సార్లు మన చలన చిత్రాలు నిజంచేశాయి. తెలుగు సినిమాలు, అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడటం గురించిన మైలురాళ్ళు ఇక్కడ ఉట్టంగించటం జరిగింది.
చిత్రం | సంవత్సరం | వ్యాఖ్య |
---|---|---|
పాతాళభైరవి | 1952 జనవరి 24 | భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం.
ఈ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బొంబాయి, న్యూ ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ నగరాలలో ఏకకాలంలో జరిగాయి. |
మల్లీశ్వరి | 1952 | బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. |
తోడుదొంగలు | 1955 | మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది |
నమ్మిన బంటు | 1960 | స్పెయిన్‌లో జరిగిన శాన్-సెబాస్టియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. |
మహామంత్రి తిమ్మరుసు | 1963 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది |
పదండి ముందుకు | 1963 | మాస్కో చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
లవకుశ | 1964 & 1965 | 1964లో జకార్తాలోనూ, 1965లో మాస్కోలోనూ జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. |
నర్తనశాల | 1964 | జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
కీలుబొమ్మలు | 1965 | ఐర్లాండ్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. |
అంతస్తులు | 1966 | సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
ఉమ్మడి కుటుంబం | 1968 | మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
కంచు కోట | 1968 | బెర్లిన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
దేశోద్ధారకులు | 1974 | కైరో చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
తీర్పు | 1976 | మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. |
సీతా కళ్యాణం | 1978 | లండన్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ, చికాగోలో జరిగిన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైంది. |
శంకరాభరణం | 1981 | ఫ్రాన్స్‌లోని లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ, అనేక చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. |
తిలదానం | 2002 | కొరియాలోని పుస్సాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. |
కమ్లీ | 2006 | కొరియాలోని పుస్సాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. |
ఇవి కాక... మా భూమి, రంగుల కల, దాసి తదితర చిత్రాలు కూడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శనకు నోచుకున్నాయి.
గిన్నీస్ బుక్ లో స్థానం
మార్చుమైలురాళ్ళకెల్ల మైలురాయి గిన్నీస్ బుక్. ఈ గిన్నీస్ బుక్ లోకి ఎక్కటానికి అనేక మంది అనేక విధమైన చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. మన చలన చిత్ర నటీనటులు, దర్శకులు మరి ఇతర సాంకేతిక నిపుణులు, వారివారి నైపుణ్యంతో, ప్రతిభతో గెన్నీస్ బుక్ లోకి ఎక్కిన సందర్భాలు ఇక్కడ ఇవ్వబడాయి.
- విజయనిర్మల - ప్రపంచంలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు.
- దాసరి నారాయణరావు - ప్రపంచంలో 20 సంవత్సరాల నిడివిలో 100 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు.
- రామానాయుడు - ప్రపంచంలో ఎక్కువ సినిమాలు (100+) నిర్మించిన నిర్మాత.
- రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో [1].
- బ్రహ్మానందం అత్యధిక హాస్య పాత్రలు పోషించాడు.
వసూళ్ళ మైలురాళ్ళు
మార్చుడబ్బులు రాకపోతే మళ్ళీ మళ్ళీ చిత్రాలు తియ్యటం అనేది జరగదు. సినిమా తియ్యటం అనేది కళాపోషణ కోసమైనా, డబ్బులు కళ్ళపడకపోతే కళ కూడా మూలపడిపోతుంది.కాబట్టి డబ్బులు వసూళ్ళకు సంబంధించిన మైలురాళ్ళను ఈ కింది ఇచ్చిన లింక్ ద్వారా తెలుసుకొనవచ్చును.
సంవత్సరం వారీ హిట్‌ల జాబితా కోసం తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా చూడండి.
ఇంకా
మార్చుమైలురాళ్ళను నిర్ణయించటం, వాటిని ఒక పద్ధతిలో వర్గీకరించి, ఒక్కొ వర్గాన్ని ఒక చోట పొందుపరచటం పైన వ్యాసంలో జరిగింది. ఏవర్గానికి చెందక, ఎప్పుడో ఒకసారి తళుక్కుమనే మైలురాళ్ళను ఇక్కడ ఉంచటం జరిగింది.
- హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించాడు.
- జగ్గయ్య, లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు.
- 1934లో విడుదలైన తొలి కన్నడ టాకీ చలనచిత్రము సతీ సులోచనను తీసినది తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు, తెలుగు సినీనటి లక్ష్మి తండ్రి అయిన యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు).
- తెలుగులో ఎక్కువ నిడివి గల చిత్రం దాన వీర శూర కర్ణ (1977)
- తెలుగు నుండి ఎక్కువ భాషల్లో రీ-మేక్ అయిన చిత్రం రాముడు భీముడు (1964)
మూలాలు
మార్చు- ↑ గిన్నిస్ బుక్ వెబ్ సైటులో ఇలా వ్రాసి ఉన్నది Archived 2006-10-30 at the Wayback Machine The largest film studio complex in the world is Ramoji Film City, Hyderabad, India, which opened in 1996 and measures 674 ha (1,666 acres). Comprising of 47 sound stages, it has permanent sets ranging from railway stations to temples.