రంగస్థలం (సినిమా)
రంగస్థలం 1980ల నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా. రాంచరణ్ తేజ, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మార్చి 30, 2018న ఈ సినిమా విడుదలయింది.ఈ చిత్రం అధికారికంగా ఫిబ్రవరిలో చిరంజీవి చేత ప్రారంభించబడింది, ఏప్రిల్ 2017 నుండి షూటింగ్ ప్రారంభమైంది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా 210 కోట్లు వసూల్ చేసింది.
రంగస్థలం | |
---|---|
దర్శకత్వం | సుకుమార్ |
స్క్రీన్ ప్లే | సుకుమార్ |
కథ | సుకుమార్ |
నిర్మాత | నవీన్ ఎర్నేని వై. రవిశంకర్ మోహన్ చెరుకూరి |
తారాగణం | రాంచరణ్ తేజ సమంత ఆది పినిశెట్టి జగపతిబాబు |
ఛాయాగ్రహణం | ఆర్.రత్నవేలు |
కూర్పు | నవీన్ నూలి[1] |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | మైత్రి మువీ మేకర్స్ |
పంపిణీదార్లు | కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ |
విడుదల తేదీ | 30 మార్చి 2018 |
సినిమా నిడివి | 179 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చు“రంగస్థలం” అనే గ్రామంలో 1980ల్లో జరిగే ఈ కథ చెల్లుబోయిన చిట్టిబాబు (రాంచరణ్) లారీ ప్రమాదానికి గురైన దక్షిణామూర్తి (ప్రకాష్ రాజ్)ని ఆసుపత్రిలో చేర్చి తన గతాన్ని గుర్తుచేసుకోవడంతో మొదలవుతుంది.
చిట్టిబాబు రంగస్థలం గ్రామంలో వ్యవసాయ పొలాలకు నీరు పడుతూ జీవితం సాగిస్తుంటాడు. ఇతడికి వినికిడి సమస్య ఉంటుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తప్ప వినబడదు. తండ్రి కోటేశ్వరరావు (నరేష్) ఒక దర్జీ. తల్లి కాంతమ్మ (రోహిణి), చెల్లి (యానీ/ Baby Annie ) ఉంటారు. పొలానికి నీరు పెట్టే మోటారును తన అత్త కొల్లి రంగమ్మ (అనసూయ) ద్వారా పొందుతాడు. ఊరిలో తిరుగుతూ అందరిని ఇబ్బందిపెడుతూ ఓసారి తనను కూడ కాటేసిన ఓ నల్లత్రాచు పాముని చంపడం కోసం చిట్టిబాబు తిరుగుతుంటాడు.
ఇదిలావుండగా, రంగస్థలానికి పంచాయితీ ఎన్నికలు వస్తాయి. ముప్పైయేళ్ళుగా ఎదురులేకుండా ప్రెసిడెంటుగా ఉన్న ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ఈసారి కూడా ఎన్నికలకు నామినేషన్ వేస్తాడు. మరో ప్రక్క గ్రామంలోని సొసైటీ నుండి అప్పు తీసుకున్న రైతుల దగ్గర ఆ సొసైటీ వారు అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తుంటారు. కట్టలేని వారి పొలాలు జప్తు చేస్తుంటారు. ఆ సొసైటీ చేసే ఆకృత్యాలన్నింటి వెనుక ఫణీంద్ర భూపతే ఉంటాడు.
దుబాయిలో ఉన్న చిట్టిబాబు సోదరుడు కుమారబాబు (ఆది పినిశెట్టి) గ్రామానికి తిరిగొస్తాడు. ప్రతి శనివారం పట్నంలో తన ప్రియురాలు పద్మ (పూజిత పొన్నాడ)ను కలిసి వస్తుంటాడు కుమారబాబు. నల్లత్రాచు కోసం వెతికే క్రమంలో చిట్టిబాబుకి రామలక్ష్మి (సమంత) తారసపడుతుంది. మొదటి చూపులోనే రామలక్ష్మితో ప్రేమలో పడిపోతాడు చిట్టిబాబు. కానీ అతడికున్న వినికిడి సమస్యను రామలక్ష్మి ఎదుట తన స్నేహితుడు మహేశ్ (మహేశ్ ఆచంట) సాయంతో కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. రామలక్ష్మి పొలానికి ఓసారి నీరు పట్టి, ఆ తరువాత ఓ జాతరలో ఆమెని ఎగతాళి చేసిన కాశి (శత్రు) తమ్ముళ్ళను కొట్టి ఆమెకి దగ్గరవుతాడు.
ఇదిలావుండగా, రంగస్థలంలో సోమరాజు (శేషు) అనే రైతు పొలాన్ని సొసైటీ వారు జప్తు చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకోబోగా, చిట్టిబాబు అతడిని కాపాడతాడు. అతడికి జరిగిన అన్యాయం గురించి సొసైటీలో మాట్లాడడానికి వెళ్తాడు కుమారబాబు. అదే సమయంలో రామలక్ష్మి పొలాన్ని కూడా జప్తు చేశారని తెలుసుకొని లెక్కలు చూపించమని సొసైటీ వారితో గొడవపడతాడు కుమారబాబు. ఆ సమస్య పంచాయితీకి వెళ్తుంది, ఇరవై వేలు జరిమానా విధిస్తాడు ప్రెసిడెంటు. ఆ జరిమానా కట్టడానికి తమ పొలాన్ని అమ్మలేమని కోటేశ్వరరావు అనగా, ప్రెసిడెంటు అనుచరుడు శేషునాయడు (అజయ్ ఘోష్) కోటేశ్వరరావు తల్లిని తూలనాడతడు. ఆ విషయం తెలుసుకున్న చిట్టిబాబు శేషునాయడితో గొడవపడి అతడిని చితకబాదుతాడు.
ఆ మరుసటిరోజు చిట్టిబాబుని పోలీసులు అరెస్టు చేస్తారు. తమ్ముడిని విడిపించడానికి కుమారబాబు ప్రెసిడెంటుని బ్రతిమాలినా లాభం లేకపోవడంతో వాళ్ళ ఎం.ఎల్.ఏ దక్షిణామూర్తి సిఫార్సుతో చిట్టిబాబుని జామీను మీద విడుదల చేయిస్తాడు. దక్షిణామూర్తి అండతో అతడి పార్టీ తరఫున రంగస్థలంలో ప్రెసిడెంటు ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి రాబోయే ఎన్నికల్లో ప్రెసిడెంటుగా నామినేషన్ వేస్తాడు కుమారబాబు. తమ్ముడు చిట్టిబాబుతో కలిసి తాము గొడవపడ్డ కాశిని కూడా కలుపుకొని ప్రచారం మొదలుపెడతాడు. ఊర్లో అందరూ సహకరిస్తున్నా, రంగమ్మ మాత్రం కుమారబాబుకి సహకరించదు. కారణమేంటని చిట్టిబాబు నిలదీయగా, రంగస్థలంలో ప్రెసిడెంటుకి ఎదురెళ్ళిన వారందరినీ ప్రెసిడెంటు చంపేశాడని, అందులో ఎర్ర శ్రీను (నోయెల్ సేన్), అబ్బులు, తన భర్త (రాజీవ్ కనకాల) కూడా ఉన్నారని చెబుతుంది. కుమారబాబు కూడ ప్రెసిడెంటుకి ఎదురెళ్ళి చావకూడదనే వాళ్లకు సహకరించడం లేదని చెబుతుంది. ప్రెసిడెంటు గురించి ఇదివరకే గణపతి (చంద్రశేఖర్) చెప్పిన మాట కూడా నిజమని గ్రహించిన చిట్టిబాబు కుమారబాబుని కాపాడుకొనే ప్రయత్నంలో ఉంటాడు.
ఓ రోజు, ఊర్లో తనకు సహాయంగా వార్డు మెంబర్లుగా నిలబడడానికి సిద్ధపడ్డ వారందరూ తమ నామినేషన్లు వెనక్కి తీసుకోవడానికి బయలుదేరుతారు. కారణమేమిటని కుమారబాబు ప్రశ్నించగా, చిట్టిబాబు ప్రెసిడెంటు దగ్గర డబ్బు తీసుకున్నాడని, తమ ప్రాణాలకు ముప్పు రాకూడదని నామినేషన్లు వెనక్కి తీసుకోబోతున్నారని చెబుతారు. అందుకు చిట్టిబాబుతో గొడవపడి ఇకపై తన పనికి దూరంగా ఉండమని చెబుతాడు కుమారబాబు. ఓ రోజు తమ ఊర్లో కొత్త మనుషులు వచ్చారని గమనించిన చిట్టిబాబు కుమారబాబు కోసం ఆరా తీయగా, ఆ రోజు శనివారం కావడంతో, పద్మను కలవడానికి వెళ్ళాడని తెలుసుకుంటాడు. అక్కడినుండి తిరిగొస్తున్న కుమారబాబుని ప్రెసిడెంటు మనుషులు చంపబోగా, చిట్టిబాబు వారిని అడ్డుకొని అతడిని కాపాడుకుంటాడు. ఓ దుకాణం దగ్గర ఆగి, తగిలిన దెబ్బలకు రాయడానికి చిట్టిబాబు పసుపు తీసుకొని వచ్చేలోపు కుమారబాబు గొంతుపై కత్తిగాటుతో పడివుంటాడు. చనిపోయేముందు ఏదో పేరు చెబుతాడు కుమారబాబు. అది చిట్టిబాబుకి వినబడదు.
కుమారబాబు చావుకి ప్రతీకారంగా గ్రామ ప్రజలందరూ ఫణీంద్ర భూపతిపై తిరగబడతారు. కానీ అప్పటికే అతడు ఊరు వదిలి పారిపోతాడు. మరో ప్రక్క రంగస్థలానికి ప్రెసిడెంటుగా రంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది. ఆ రోజు జరిగే జాతరలో పాడే పాట ఆధారంగా చనిపోయే సమయంలో కుమారబాబు పలికిన పేరు “శ్రీమన్నారాయణ” అని తెలుసుకుంటాడు చిట్టిబాబు. దాని గురించి దక్షిణామూర్తితో మాట్లాడడానికి చిట్టిబాబు బయలుదేరడంతో కథ వర్తమానంలోకి వస్తుంది. ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిపోయిన దక్షిణామూర్తికి రెండేళ్ళ పాటు ఆసుపత్రిలోనే చిట్టిబాబు సేవలు చేయగా, ఓ రోజు కోమాలోంచి బయటపడతాడు.
ఓ రెండు నెలల తరువాత మంత్రిగా ఎన్నికైన దక్షిణామూర్తిని కలవడానికి రామలక్ష్మితో కలిసి అతడి ఇంటికి వెళ్తాడు చిట్టిబాబు. కుమారబాబు చనిపోయిన తరువాత పారిపోయిన ఫణీంద్ర భూపతిని అంజనం సాయంతో వెతికి చంపేసానని చెబుతాడు. కుమారబాబు చావుకి కారణం దక్షిణామూర్తని తనకు తెలిసిపోయిందని కూడ చెబుతాడు. చనిపోయే సమయంలో కుమారబాబు చెప్పిన శ్రీమన్నారాయణ (అమిత్ శర్మ) దక్షిణామూర్తి మనిషేనని, తన చిన్న కూతురు పద్మను ప్రేమించినందుకే కుమారబాబుని చంపించాడని చెబుతాడు. దక్షిణామూర్తి తన చేతుల్లోనే చావాలన్న ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్ళు అతడికి సేవ చేసానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న దక్షిణామూర్తిని చంపడం సబబని చెబుతూ అతడి గొంతు కోసి చంపేస్తాడు చిట్టిబాబు.
రామలక్షిని తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్తూండగా, తన భర్తతో పద్మ లోపలికి అడుగుపెట్టడంతో కథ ముగుస్తుంది.
నటీనటులు
మార్చు- రాం చరణ్ తేజ (చిట్టిబాబు)
- సమంత (రామలక్ష్మి)
- జగపతి బాబు (ఫణీంద్ర భూపతి, రంగస్థలం ప్రెసిడెంటు)
- అనసూయ భరధ్వాజ్ (రంగమ్మ)
- ఆది పినిశెట్టి (కుమారబాబు, చిట్టిబాబు అన్నయ్య)
- ప్రకాష్ రాజ్ (దక్షిణామూర్తి)
- నరేష్ (కోటేశ్వరరావు, చిట్టిబాబు తండ్రి)[2]
- రోహిణి (కాంతమ్మ, చిట్టిబాబు తల్లి)
- మహేష్ ఆచంట (మహేష్)
- అజయ్ ఘోష్ (శేషునాయుడు)
- నోయెల్ సేన్ (ఎర్ర శ్రీను)
- రాజీవ్ కనకాల (రంగమ్మ భర్త)
- శేషు (సోమరాజు)
- బ్రహ్మాజీ (ఆఫీసర్)
- పూజిత పొన్నాడ (పద్మ)
- పూజా హెగ్డే (జిగేలు రాణి, ప్రత్యేక గీతం)
- అమిత్ శర్మ (శ్రీమన్నారాయణ)
- శత్రు(కాశి)
- బెనర్జీ (సీతారాం)
- పద్మజా లంక (దక్షిణామూర్తి భార్య)
- కాదంబరి కిరణ్ (సొసైటీ బంట్రోతు)
- రాజేశ్ దివాకర్ (సొసైటీ ఉద్యోగి)
- యానీ (చిట్టిబాబు చెల్లి)
సాంకేతికవర్గం
మార్చు- మాటలు : తోట శ్రీనివాస్, కాశి విశాల్, బుచ్చిబాబు సానా, శ్రీనివాస్ రోంగలి
- పాటలు : చంద్రబోస్
- కళాదర్శకత్వం : రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగోత్రే
- ఛాయాగ్రహణం : ఆర్.రత్నవేలు
- సంగీతం : దేవీశ్రీప్రసాద్
- కూర్పు : నవీన్ నూలి
- పోరాటాలు: రామ్ – లక్ష్మణ్, వెంకట్, డ్రాగన్ ప్రకాష్
- నృత్యాలు : ప్రేమ్ రక్షిత్, శేఖర్, జాని, పి.శోభి పాల్ రాజ్
- మేకప్ : నాని భారతి
- కాస్ట్యూమ్స్ : శివ, ఖాదర్
- కాస్ట్యూమ్ డిజైనర్లు : కృష్ణ శాంతి, దీపాలి నూర్, నీత లుల్లా, సుష్మిత కొణిదెల
- డబ్బింగ్ : జ్యోతివర్మ (సమంత)[3][4]
- నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి
- కథ, కథనం, దర్శకత్వం : సుకుమార్
నిర్మాణం
మార్చుఈ సినిమా ఫిబ్రవరి 2017లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఏప్రిల్ 2017 నుండి చిత్రీకరణ ప్రారంభమైంది.
అందాల రాక్షసి, సాహసం, జో అచ్యుతానంద సినిమాలకు పని చేసిన రామకృష్ణ తన భార్య మౌనికతో కలిసి ఈ సినిమాకు కళాదర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పోలవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. కళాదర్శకుడు రామకృష్ణ ది హిందూ వార్తాపత్రిక కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ “అప్పటివరకు అందరూ గోదావరి జిల్లాల్లోని పచ్చదనమే చూశారు. కానీ ఈ సినిమా దర్శకుడు సుకుమార్, ఛాయాగ్రాహకుడు రత్నవేలు దాన్ని బంగారపు రంగులో చూపించాలనుకున్నారు. అందుకోసం మేము మండువేసవిలో చిత్రీకరణ మొదలుపెట్టాం కానీ తరువాత వర్షాలు పడడంతో గడ్డి మళ్ళీ పచ్చగా మారిపోయింది. దాంతో, వేరే చోట నుండి మట్టి, ఎండుగడ్డిని తెప్పించి నాటడం జరిగింది. అది కఠినమైన భూభాగం కలిగివున్న ప్రాంతం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా, అక్కడి ప్రజలు తమ గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సెల్ఫోను సిగ్నళ్ళు అందని ఆ ప్రాంతంలో కేవలం 50 నుండి 100 మంది మాత్రమే ఉండేవారు” అని చెప్పాడు.[5]
సినిమాలోని “రంగస్థలం” గ్రామాన్ని 1980ల వాతావరణం ప్రతిబింబించేలా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఓ భారి సెట్ ని నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఓపెరా రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ సెట్ నిర్మాణం జరిగింది.[6]
సంగీతం
మార్చుఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. దర్శకుడు సుకుమార్ తో దేవిశ్రీ ప్రసాద్ కలసి పనిచేయడం ఇది ఏడవసారి. ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్ రచించారు. మొదటగా, "ఎంత సక్కగున్నావే" అనే పాటను 2018 ఫిబ్రవరి 13 న విడుదల చేశారు. [7] ఆ తరువాత "రంగ రంగ రంగస్థలాన" పాటను మార్చి 2న, "రంగమ్మ మంగమ్మ" పాటను మార్చి 8న విడుదల చేశారు.[8][9] ఆ తరువాత అయిదు పాటలు గల ఆల్బమ్ ని మార్చి 15న లహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేశారు.[10] కథానుసారంగా వచ్చే "ఓరయ్యో" అనే పాటను సినిమా విడుదల తరువాత విడుదల చేశారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు శ్రోతల ఆదరణను పొందాయి.
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎంత సక్కగున్నావే" | చంద్రబోస్ | దేవి శ్రీ ప్రసాద్ | 4:24 |
2. | "రంగ రంగ రంగస్థలాన" | చంద్రబోస్ | రాహుల్ సిప్లిగంజ్ | 5:04 |
3. | "రంగమ్మ మంగమ్మ" | చంద్రబోస్ | ఎం.ఎం.మానసి | 4:28 |
4. | "ఆ గట్టునుంటావా" | చంద్రబోస్ | శివనాగులు | 3:09 |
5. | "జిగేలు రాణి" | చంద్రబోస్ | రేలా కుమార్, గంట వెంకటలక్ష్మి | 5:05 |
6. | "ఓరయ్యో" | చంద్రబోస్ | చంద్రబోస్ | 5:00 |
మొత్తం నిడివి: | 27:10 |
ప్రచారం
మార్చుఈ చిత్రం యొక్క టీజర్ ను 2018 జనవరి 24 న విడుదల చేశారు. 2018 మార్చి 18 నాటికి ఇది యూట్యూబ్ ఛానల్ లో 13 మిలియన్ల అభిప్రాయాలను పొందింది. [11] అధికారిక థియేటర్ ట్రైలర్ ను 2018 మార్చి 18 న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ముందస్తు విడుదల కార్యక్రమంలో విడుదల చేశారు. [12]
విడుదల
మార్చుఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2018 మార్చి 30 న 1700 థియేటర్స్‌లో విడుదల చేశారు. [13]
బాక్సాఫీసు
మార్చుఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం చెన్నైలోని బాక్సాఫీసు వద్ద మొదటి రోజు 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంతకు ముందు నివేదికల ప్రకారం మొదటి రోజు చెన్నై బాక్సాఫీసు వద్ద అజ్ఞాతవాసి సినిమా 24 లక్షలు, స్పైడర్ సినిమా 18 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి. చెన్నై బాక్సాఫీసు వద్ద ఎస్. ఎస్. రాజమౌళి తీసిన బాహుబలి:ద బిగినింగ్ సినిమాకు తెలుగు, తమిళ భాషలలో కలిపి కలెక్షన్ 92 లక్షలు.[14] అమెరికాలో 1 మిలియన్ డాలర్లను అధిగమించి 1.2 మిలియన్ డాలర్ల వసూళ్ళను రాబట్టింది.[15]
సినిమా విడుదలయిన మొదటి వారాంతంలో 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి వారం ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 58.55 కోట్లు వసూలు చేసి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్ సినిమాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన 3వ సినిమాగా నిలిచింది.[16][17] ప్రపంచవ్యాప్తంగా, 85 కోట్లు వసూలు చేసి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్, ఖైదీ నెంబర్ 150 సినిమాల తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన 4వ తెలుగు సినిమాగా నిలిచింది.[18]
ఏప్రిల్ 7, 2018కి అమెరికాలో 3 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసి, అత్యధిక వసూళ్ళు సాధించిన 3వ తెలుగు సినిమాగా (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్ సినిమాల తరువాత), 4వ దక్షిణ భారతదేశ సినిమాగా (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్, కబాలి సినిమాల తరువాత) నిలిచింది.[19]
విడుదలయిన రెండో వారం ముగిసే సమయానికి దాదాపు 165 కోట్ల స్థూలాదాయాన్ని పొంది, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్ క్లూజన్ సినిమాల తరువాత 3వ స్థానంలో ఉన్న ఖైదీ నెంబర్ 150ని అధిగమించింది.[20] 45వ రోజుకి 125 కోట్ల షేరుని వసూలు చేసింది. అందులో 93 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లోనే వసూలు అయ్యాయి.[21]
ఈ సినిమా నేరుగా 15 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది.[22]
పురస్కారాలు
మార్చుసైమా అవార్డులు
మార్చు2018 సైమా అవార్డులు (తెలుగు)
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నటుడు
- ఉత్తమ సహాయనటి (అనసూయ)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్ - ఎంత సక్కగున్నవే)
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 మార్చి 2020. Retrieved 13 March 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి, సినిమా (9 April 2018). "లచ్మికి గొంతిచ్చిన అమ్మాయి". వైజయంతి. Archived from the original on 9 ఏప్రిల్ 2018. Retrieved 9 April 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ వెబ్ ఆర్కైవ్, ఈనాడు వసుంధర, యువ హవా. "తెరవెనక... నేనే రామలక్ష్మిని!". స్వాతి కొరపాటి. Retrieved 9 April 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Rangasthalam: The stage is set". The Hindu. Retrieved 18 September 2018.
- ↑ "Rangasthalam: Recreating a Godavari village on set". Sify Movies. Archived from the original on 3 October 2018. Retrieved 18 September 2018.
- ↑ H Hooli, Shekhar (14 February 2018). "Rangasthalam first song review: Yentha Sakkagunnaave is a soulful song and enchants all with its melody". International Business Times India. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ H Hooli, Shekhar (2 March 2018). "Rangasthalam second single released: Will it break Yentha Sakkagunnaave's record?". International Business Times India. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ H Hooli, Shekhar (8 March 2018). "Rangasthalam 3rd song Rangamma Mangamma unveiled as Women's Day treat". International Business Times India. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ H Hooli, Shekhar (15 March 2018). "Rangasthalam jukebox hits internet: Song album crosses half-million views in 12 hours". International Business Times India. Archived from the original on 9 September 2018. Retrieved 9 September 2018.
- ↑ https://www.youtube.com/watch?v=1Drha8HZN_c
- ↑ https://www.youtube.com/watch?v=sueMmTm-M4Y
- ↑ "Rangasthalam 1985 Movie Released Date". Archived from the original on 12 June 2017. Retrieved 31 May 2017.
- ↑ "'Rangasthalam' box office collections day one: Ram Charan and Samantha starrer is expected to have crossed Rs 40 Cr mark worldwide - Times of India ►". The Times of India. Retrieved 2018-04-04.
- ↑ "రంగస్థలం ఫస్ట్ డే యూఎస్ఏ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే.. -". www.andhrajyothy.com. Archived from the original on 2018-04-03. Retrieved 2018-03-31.
- ↑ http://indianexpress.com/article/entertainment/telugu/rangasthalam-box-office-collection-ram-charan-5120259/
- ↑ https://www.ibtimes.co.in/rangasthalam-3-day-box-office-collection-ram-charans-film-crosses-rs-85-crore-765582
- ↑ http://www.123telugu.com/mnews/rangasthalam-posts-3rd-all-time-highest-week-1-collections.html
- ↑ https://www.ibtimes.co.in/rangasthalam-9-day-us-box-office-collection-ram-charan-movie-crosses-3-million-766092
- ↑ https://www.ibtimes.co.in/rangasthalam-vijayotsavam-live-streaming-pawan-kalyan-attends-ram-charans-film-success-event-766615
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-03. Retrieved 2018-09-21.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-08. Retrieved 2018-09-21.