త్యాగరాజు
త్యాగరాజు (మే 4, 1767 [1] - జనవరి 6, 1847[2]) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజ స్వామి వారిలో మూర్తీభవించాయి. ఇతను కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా. వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే సాగింది.[3]
కాకర్ల త్యాగబ్రహ్మం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | తిరువయ్యూర్, తంజావూరు రాజ్యం | 1767 మే 4
మరణం | 1847 జనవరి 6 | (వయసు 79)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు,కృతి కర్త |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుత్యాగరాజు జన్మస్థలం, పుట్టిన తేదీల గురించి ప్రామాణిక సమాచారం అందుబాటులో లేదు.[4] అతని శిష్య పరంపరల ద్వారా కొన్ని వివరాలు తెలియగా, అతను రాసిన కీర్తనల నుంచి కూడా మరికొన్ని వివరాలు లభ్యమవుతున్నాయి. చాలామంది ఆమోదించిన అతని జీవిత చరిత్రకు ఆధారాలు రెండు. మొదటిది త్యాగరాజు ప్రత్యక్ష శిష్యుడైన వలజాపేట వెంకటరమణ భాగవతార్ దగ్గరున్న తాళపత్రాలు, ఇంకొకటి వెంకటరమణ భాగవతార్ కొడుకు కృష్ణస్వామి భాగవతార్ దగ్గరున్న నోటు పుస్తకం.
త్యాగరాజు 1767 మే 4 వ తేదీన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉన్న తిరువారూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగబ్రహ్మం. వీరు ములకనాడు తెలుగు బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రీకులు, త్రిలింగ వైదికులు, ఆపస్తంభ సూత్రులు. త్యాగరాజు పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తంజావూరు పరిసర ప్రాంతానికి (ప్రస్తుతం తమిళనాడులో భాగం) వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు తాత గిరిరాజ కవి తెలుగు వాగ్గేయకారుడు. ఇతనిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించారు. త్యాగయ్య విద్య కొరకు రామబ్రహ్మం తిరువారూర్ నుంచి తిరువయ్యూర్‌కు వెళ్ళారు. త్యాగయ్య అక్కడ సంస్కృతాన్ని, వేదవేదాంగాలను అభ్యసించారు. శొంఠి వేంకటరమణయ్య దగ్గర సంగీతం అభ్యసించారు. వేంకటరమణయ్య త్యాగయ్య చాకచక్యంను, సంగీతంనందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశం చేసారు.
జీవిత విశేషాలు
మార్చుత్యాగయ్య తండ్రి చిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య జగిగిన భాగపరిష్కారాలలో త్యాగయ్య భాగంలో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహాలు వచ్చాయి. ఆ ప్రతిమలను అతి భక్తితో పూజించేవాడు. త్యాగయ్య జీవితమంతయూ ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యంగా సాగించేవారు. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో నిమగ్నమైయ్యేవారు. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామాలు జపించి వారి దర్శనం పొంది, వారి ఆశీర్వాద పొందినట్లు కథనాలు. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ అతను 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత అతను పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ అతను ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
సంగీత ప్రతిభ
మార్చుత్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి, తంజావూరు రాజుకు చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజు భావించారు. సంగీతంలోని రాగ, తాళాలను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే చూసారు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక, దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయాలను, తీర్థాలను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందారు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవం" ఇచ్చారనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతాడు. ఈ పుస్తకం వల్ల త్యాగయ్య సంగీతంలో అత్యుత్కృష్టమైన విషయాలను తెలిసికొనినట్లు తెలుస్తుంది. శంకరాభరణం లోని "స్వరరాగ సుధారసం" అను కృతిలో ఈ గ్రంథం గురించి త్యాగయ్య పేర్కొన్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించారు. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించారు. "ప్రహ్లాద భక్త విజయం", "నౌకా చరిత్రం" అను సంగీత నాటకాలు కూడా రచించారు.
జీవితం సంఘటనలు
మార్చు- త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
- ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత అతను వేంకటేశ నిను సేవింప అనే పాట పాడారు.
- త్యాగయ్య పరమపదం చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపం
ఆరాధనోత్సవాలు
మార్చుఅసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా చెపుతారు. ఇతను జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు [5] (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూరులో అతను సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
అతను భక్తులు, సంగీత కళాకారులు మొదట ఊంఛవృత్తి భజన, తరువాత అతను నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి అతను సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు అతను రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల అతని సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు, కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల, సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
సమాధి
మార్చుత్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసి, ఆ స్థలాన్ని, దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా తన వశం చేసికొని పరిశుభ్రం చేయించి, గుడి, గోడలు కట్టించారు. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసలకోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించారు. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని వేయగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకం జరిగింది. స్థలాభావం వలన ఇంకా నేల కొని ఒక మంటపం, పాకశాల 1938లో నిర్మించారు. ఈ నిర్మాణాలతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భంలో చిత్తూరు నాగయ్య నాగరత్నమ్మగారిని కలిశారు. ఆమె సలహాపై నాగయ్య త్యాగరాజ నిలయం అనే సత్రాన్ని కట్టించారు.
రచనలు
మార్చు'రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం: శ్రీ త్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీ త్యాగరాజస్వామి రామభక్తామృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
కీర్తనలు
మార్చుత్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు.[6] వీటిలో చాలావరకు అతని మాతృభాష తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతంలో, తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి. త్యాగయ్య క్షేత్రాలకు వెళ్ళినపుడు, ఆయా క్షేత్రం మీదను, క్షేత్రంలోని దేవుని మీదను కృతులు రచించారు. అవి యేవనిన:
కొవ్వూరు పంచరత్నాలు
మార్చు(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామిపై వ్రాసిన ఐదు కృతులు)
సంఖ్య | పాట మొదలు | రాగం | తాళం |
1 | నమ్మివచ్చిన | కల్యాణి | రూపకం |
2 | కోరిసేవింప | ఖరహరప్రియ | ఆదితాళం |
3 | శంభోమహదేవ | పంతువరాళి | రూపకతాళం |
4 | ఈ వసుధ | శహాన | ఆదితాళం |
5 | సుందరేశ్వరుని | కల్యాణి | ఆదితాళం |
తిరువత్తియూరు పంచరత్నాలు
మార్చు(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)
సంఖ్య | పాట మొదలు | రాగము | తాళం |
1 | సుందరి నన్ను | బేగడ | రూపకం |
2 | సుందరీ నీ దివ్య | కళ్యాణి | ఆదితాళం |
3 | దారిని తెలుసుకొంటి | శుద్ధ సావేరి | ఆదితాళం |
4 | సుందరి నిన్ను వర్ణింప | ఆరభి | చాపు |
5 | కన్నతల్లి నిన్ను | సావేరి | ఆదితాళం |
పంచ రత్నాలు
మార్చు- ఘనరాగ పంచరత్నాలు : త్యాగయ్య రచింపబడిన ఘన రాగ కృతులు.
సంఖ్య | పాట మొదలు | రాగం | తాళం |
1 | జగదానంద | నాట | ఆది |
2 | దుడుకుగల | గౌళ | ఆది |
3 | సాధించినే | ఆరభి | ఆది |
4 | ఎందరో | శ్రీ | ఆది |
5 | కనకనరుచిరా | వరాళి | ఆది |
ఇవి కూడాచూడండి
మార్చుచిత్ర మాలిక
మార్చు-
తిరువయ్యూరులోని త్యాగరాజు సమాధి
-
హైదరాబాదు టాంకు బండు మీద త్యాగరాజు విగ్రహం
మూలాలు
మార్చు- ↑ ఇంకొక సాంప్రదాయం ప్రకారం, త్యాగరాజు పుట్టిన సంవత్సరం 1749. భారతీయ చాంద్రమాన పంచాంగం ప్రకారము సర్వజిత్నామ సంవత్సర 27వ సోమవారము చైత్ర శుక్ల సప్తమినాడు పుష్య నక్షత్ర లగ్నమందు జన్మించాడు.
- ↑ హిందూ పంచాంగం ప్రకారం ప్రభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి.
- ↑ మంచాళ, జగన్నాథ రావు (1981). వాడ్రేవు, పురుషోత్తం (ed.). త్యాగరాజ కీర్తనలు మొదటి భాగము (PDF). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. pp. i.
- ↑ "BRIEF BIOGRAPHY OF SAINT THYAGARAJA AND HIS HIGHNESS SWATI THIRUNAL" (PDF). shodhganga.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "త్యాగరాజ ఆరాధనోత్సవాలు". Archived from the original on 2009-01-25. Retrieved 2008-05-11.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "త్యాగరాజ స్వామి జీవితం, కీర్తనలు". Archived from the original on 2009-01-16. Retrieved మే 11, 2008.
సంబంధిత పుస్తకాలు
మార్చు- The Spiritual Heritage of Tyagaraja, by C. Ramanujachari with introduction by Dr V. Raghavan, Ramakrishna Math, Chennai.
- Tyagaraja Kritigal (in Malayalam) by Prof P. R. Kumara Kerala Varma, Dept of Cultural Publications, Govt of Kerala, Trivandrum, 2000.
- Tyagaraja Kirtanalu (in Telugu) by Smt Dwaraka Parthasarathy and Sri N.C. Parthasarathy, Tagore Publishing House, Kachiguda, Hyderabad, 1995 (Balasaraswati Book Depot, Kurnool).
- Ramachandran, K.V., "The Melakarta: A Critique", The (Madras) Music Academy Platinum Jubilee Commemoration Volume, Vol. I, 1930-1940. (Original publication in the Journal of the Music Academy in 1938.)
బయటి లంకెలు
మార్చు