అచ్యుత దేవ రాయలు

(అచ్యుత రాయలు నుండి దారిమార్పు చెందింది)

అచ్యుత దేవ రాయలు (అచ్యుతరాయలు) విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. తుళువ నరస నాయకుని మూడవ భార్య అయిన ఓబాంబ కుమారుడు. అచ్యుతరాయలు, తుళువ నరసనాయకుని దక్షిణ దండయాత్ర అనంతరం రామేశ్వరం దర్శించివచ్చిన తర్వాత జన్మించాడని "అచ్యుతరాయాభ్యుదయము", "వరదాబింక పరిణయం"లో పేర్కొనబడినది. [1] శ్రీకృష్ణదేవరాయల సవతి సోదరుడు. శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు. ఇతడు 1529 నుండి 1542 వరకు పరిపాలించాడు.

అచ్యుతరాయలు తన భార్య వరదాంబికతో సహా తిరుమలలో
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

శ్రీకృష్ణదేవరాయల మరణంతో విజయనగరములో అంతఃకలహాలు చెలరేగాయి. అచ్యుతరాయల్ని వారసునిగా ప్రకటించడం నచ్చని కృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయలు ప్రతిఘటించి అధికారం కైవసం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ విశ్వాసపాత్రులైన సాళువ నరసింగనాయకుడు వంటి సామంతులు ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు.

పట్టాభిషేకము

మార్చు
 
చంద్రగిరి మ్యూజియంలో ఉన్న అచ్యుతదేవరాయ ఆయన దేవేరి వరాదరాజమ్మల విగ్రహాలు

ఇతడు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు[1].అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన అచ్యుతరాయాభ్యుదయములో వివరముగా వర్ణించాడు.

  • మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు.[2][3] ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.
  • తరువాత 1529 అక్టోబర్ 21 న (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి) శ్రీ కాళహస్తిలో రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వల్ల తెలుస్తుంది.[4][5]
  • తరువాత 1529 నవంబర్ 20విజయనగరంలో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.

యుద్ధాలు

మార్చు

అచ్యుతరాయలు రాజ్యము చేపట్టేనాటికి వారసత్వ పోరు కారణంగా విజయనగర రాజధానిలోని కల్లోల పరిస్థితులను ఆసరాగా తీసుకొని సామ్రాజ్యంపై ప్రతాపరుద్ర గజపతి దండెత్తినాడు. అయితే రాయలు గజపతిని తిప్పికొట్టాడు. 1530లో గోల్కొండ సుల్తాను కులీ కుత్బుల్ ముల్క్ దండెత్తి కొండవీడును ముట్టడించగా వెలుగోటి గని తిమ్మనాయుడు అతన్ని ఓడించి సుల్తాను అశ్వదళానికి అపార నష్టం కలిగించి దండయాత్రను తిప్పికొట్టాడు. ఇతను అనేక యుద్ధములందు విజయం సాధించాడు.

శత్రు దండయాత్రల ప్రమాదాన్ని గుర్తించిన అచ్యుతరాయలు, రామరాయలుతో సంధి చేసుకున్నాడు. కానీ సాళువ నరసింగనాయకునికి (సెల్లప్ప) అది నచ్చక ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధిపతులతో కలిసి తిరుగుబాటు చేశాడు. అయితే అచ్యుతరాయల బావమరుదులైన సలకం పెద తిరుమలరాజు, సలకం చిన తిరుమరాజులు తిరుగుబాటును అణచివేసి శాంతిని నెలకొల్పారు.

కులీ కుత్బుల్ ముల్క్ తో కోయిలకొండ దగ్గర జరిగిన యుద్ధములో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షా మరణించగా, అతని కొడుకు మల్లూ ఆదిల్‌షా రాజ్యాన్ని చేపట్టాడు. ఇతని పాలన నచ్చని ప్రజలు అసద్ ఖాన్ లారీ అనే ఉద్యోగి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఇదే అదనుగా 1535లో అచ్యుతరాయలు దండెత్తి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు.

రామరాయల కుట్రలు

మార్చు
మరింత సమాచారం: అళియ రామ రాయలు వ్యాసంలో

రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగసాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. కందనవోలు, అనంతపూరు, ఆలూరు, అవుకు దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి ఇబ్రహీం ఆదిల్‌షా గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.[6]

1536లో గుత్తి ప్రాంతములోని తిరుగుబాటును అణచి తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు.[7] మధుర, కొచ్చిన్ ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్ఠించారు.

రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబ్రహీం ఆదిల్‌షా నాగలాపురాన్ని నేలమట్టం చేసి రాజధాన్ని సమీపించాడు. ఆదిల్‌షా ప్రతిపక్షంలో చేరతాడన్న భయముతో అచ్యుతరాయలు గానీ, రామరాయలు గానీ అతడిని ప్రతిఘటించలేదు. ఇద్దరూ ఆదిల్‌షా సహాయము అర్ధించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అంతలో బీజాపూరులో ఆదిల్‌షాపై అసద్ ఖాన్ లారీ మొదలైన ఉద్యోగులు కుట్రలు ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన ఆదిల్ షా అచ్యుత, రామరాయల మధ్య సయోధ్య కుదిర్చి బీజాపూర్ తిరిగి వెళ్ళాడు.

చివరి రోజులు

మార్చు

రామరాయలతో ఒప్పందం అయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య వ్యవహారాలను బావమరిది సలకం పెద తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురములోనే గడిపినట్లు, దానితో ప్రభుత్వం నీరసించినట్లు తెలుస్తున్నది.[8] తుదకు అచ్యుతరాయలు ప్రజాభిమానం కోల్పోయి 1542లో మరణించాడు.

మరణానంతర రాజకీయ పరిస్థితులు

మార్చు

అచ్యుతరాయల మరణంతో రామరాయలు, సలకం తిరుమలల మధ్య స్పర్ధలు తీవ్రమై రాజ్యాన్ని అంతర్యుద్ధంలో ముంచెత్తాయి. అచ్యుతరాయలు కొడుకైన వెంకటపతిని సింహాసనంపై ఎక్కించి, తాను సంరక్షకునిగా అధికారం హస్తగతం చేసుకుని సింహాసనం ఆక్రమించటానికి తిరుమల ప్రయత్నం చేశాడు. దీనికి వ్యతిరేకంగా రాయరాయలు గుత్తి దుర్గంలో సదాశివరాయల్ని రాజుగా ప్రకటించాడు. సదాశివరాయలు అచ్యుతరాయల అన్న రంగరాయల కుమారుడు. అందుచే అచ్యుతరాయల కంటే విజయనగర సింహాసనంపై సదాశివునకు బలమైన హక్కు ఉందని చాటడం రామరాయల ఉద్దేశం.

తిరుమల, రామరాయల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం అవకాశంగా తీసుకొని ఇబ్రహీం ఆదిల్‌షా రెండుసార్లు విజయనగరంపై దండెత్తాడు. మొదట్లో తిరుమలుని దురాశ నుండి తన కుమారుడు వెంకటపతిని రక్షించే ఉద్దేశముతో వరదాంబిక ఆదిల్‌షాను ఆహ్వానించింది. కానీ తిరుమలుడతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించాడు. తిరిగి రామరాయల అభ్యర్ధనపై ఆదిల్‌షా విజయనగరంపై దండెత్తినాడు. ప్రజలు భయభ్రాంతులై సలకం తిరుమలుని విజయనగర సింహాసనం ఎక్కించారు. తిరుమల దేవ మహారాయలనే పేర పట్టాభిషిక్తుడై ఆదిల్‌షాను ఓడించి పారదోలటమే కాక రాజధానికి తిరిగి వచ్చి మేనల్లుడు వెంకటపతిని హత్యచేసి, తనకు ప్రతికూలురైన రాజోద్యోగులను హింసించాడు. అతని నిరంకుశపాలనకు ప్రజలు విసుగెత్తారు.

పరిస్థితిని గమనించి, రామరాయలు గుత్తి నుండి దండెత్తి వచ్చి తుంగభద్రా తీరములో తిరుమలను ఓడించి, సదాశివరాయలను రాజధానిలో పట్టాభిషిక్తుని చేసాడు.

వ్యక్తిత్వము

మార్చు

న్యూనిజ్ రచనలు అచ్యుతరాయలను వ్యసనలోలునిగా, కౄరునిగా చిత్రీకరించినా, ఈయన ప్రశంసనీయుడని, సామ్రాజ్యపు గౌరవాన్ని, సంపదను నిలబెట్టేందుకు పోరాడాడని చెప్పటానికి ఆ తరువాత కాలములో శాసన, సాహిత్య ఆధారాలు లభించాయి.[9] ఇతడు సమర్ధుడనే కృష్ణదేవరాయలు తన వారసునిగా ఎన్నుకున్నాడు. అచ్యుతరాయల యొక్క జీవితము, పాలనను రెండు సంస్కృత కావ్యాలు, రెండవ రాజనాథ డిండిమ రాసిన అచ్యుతాభ్యుదయం, అచ్యుతరాయల భార్య తిరుమలాంబ రచించిన వరదాంబికా పరిణయం వివరముగా వర్ణిస్తాయి.[10]

అచ్యుత రాయలు విజయనగర సామంతుడైన సలకరాజు కుమార్తె వరదాంబికను వివాహమాడినాడు. వరదాంబికా పరిణయములో అచ్యుతరాయలు పెళ్ళినాటికే చక్రవర్తిగా రాసిన శాసనాధారాలు అచ్యుతరాయలు పట్టాభిషిక్తుడయ్యేనాటికి వరదాంబికతో వివాహమై, కుమారుడు చిన వెంకటపతి కూడా జన్మించియున్నాడని తెలుస్తున్నది. అచ్యుతరాయలతో వియ్యమందిన తరువాత సలకరాజు కుమారులు సలకం తిరుమలుల రాజకీయ ప్రాభవం పెరిగినా పెళ్ళికి ముందునుండే సలకం చిన తిరుమలుడు విజయనగరంలో సేనానిగా పనిచేస్తున్నాడని తెలుస్తున్నది.

కళాపోషణ

మార్చు
 
హంపిలోని అచ్యుతరాయ ఆలయ ముఖద్వారము

ఇతని పరిపాలనా కాలములో హంపిలోని తిరువేంగళనాధుని ఆలయము నిర్మించాడు. ఈ ఆలయం అక్కడ కొలువై ఉన్న దేవుని పేరుమీదుగా కంటే అచ్యుతరాయ ఆలయము అన్న పేరుతోనే ప్రసిద్ధి చెందింది.

ఇప్పుడు కపిల తీర్ధముగా ప్రసిద్ధమైన తిరుపతి లోని ఆళ్వార్ తీర్ధాన్ని అచ్యుతరాయలు నిర్మింపజేశాడు. తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు. 1533లో స్వామివారి పుష్కరిణి మెట్లు బాగుచేయించి పాత పుష్కరిణి పక్కనే కొత్త పుష్కరిణిని కట్టించాడు. తిరుమలలో ఆలయానికి దక్షిణము వైపున అచ్యుతరాయలు, ఆయన భార్య వరదాంబికల రాతి విగ్రహాలు చూడవచ్చు.[11] తమిళనాట దిండిగల్కు సమీపంలో వున్న తాడికొంబు ఆలయాన్ని తిరుమలరాయలు నిర్మింపజేసాడు.

కృష్ణదేవరాయల లాగానే అచ్యుతరాయలు కూడా సాహిత్య పోషకుడు. ప్రతి సంవత్సరం ఒక గ్రంథం రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సమర్పించేవాడు.[12] అచ్యుతరాయలు స్వయంగా తాళమహోదధి అనే గ్రంథం సంస్కృతంలో రాశాడు. ఈయన ఆస్థానములో కన్నడ కవి చాటు విఠలనాధుడు, ప్రముఖ సంగీతకారుడు పురందరదాసు, సంస్కృత విద్వాంసుడు రెండవ రాజనాథ డిండిమభట్టు ఉండేవారు. డిండిమభట్టు అచ్యుతరాయాభ్యుదయముతో పాటు సంస్కృతములో భాగవత చంపు వ్రాసి అచ్యుతరాయలకు అంకితమిచ్చాడు. ఈయన ఆస్థానములోని తెలుగు కవులలో రాధామాధవ కవి ముఖ్యుడు. ఈయన రచించిన తారకబ్రహ్మరాజీయమును అచ్యుతరాయల మంత్రి నంజ తిమ్మనకు అంకితం చేశాడు. కృష్ణరాయల సభ భువనవిజయములాగే, అచ్యుతరాయల సభను వెంకట విలాస మండపము అని పిలిచేవారు.

అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన శ్లోకాలు హంపిలోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి.[13] ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు.[10] ఈ కాలములోనే మోహనాంగి అనే మరో రచయిత్రి ఉంది. ఈమె మారిచీపరిణయం వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి.[13]

అచ్యుత రాయలు స్వయంగా మంచి వీణా విద్వాంసుడు కూడా.[14] ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ అచ్యుతభూపాళీ వీణగా పేరొందినది.[15][16]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Jackson, పేజీ.181 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Jackson181" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమ
  3. The Sources of Vijayanagara history No.1 Madras University Historical Series పేజీ.161
  4. ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3
  5. Annual Reports of Epigraphy, Madras. 157 of 1924
  6. ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.59
  7. ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.60
  8. ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.75
  9. వి.వ్రిద్ధగిరీషన్, పేజీ.15
  10. 10.0 10.1 వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)
  11. "అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి". Archived from the original on 2006-11-06. Retrieved 2006-12-03.
  12. ఆరుద్ర, పేజీ.237-238
  13. 13.0 13.1 ఆరుద్ర, పేజీ.14-15
  14. Filliozat (1999), పేజీ.50-51
  15. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-13. Retrieved 2006-12-04.
  16. రామయామాత్య (బయకార రామప్ప) రచించిన స్వరమేళకళానిధి

వనరులు

మార్చు
  • బి.ఎస్.ఎల్, హనుమంతరావు (1997). "ఆంధ్రుల చరిత్ర". విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
  • K.A, Nilakanta Sastri (1955). "History of South India, From Prehistoric times to fall of Vijayanagar". Oxford University Press, New Delhi.
  • _, ఆరుద్ర (1970). "సమగ్ర ఆంధ్ర సాహిత్యం (ఏడవ సంపుటం, మలిరాయల యుగం)". {{cite book}}: |last= has numeric name (help)
  • Shastri, Surya Kanta (1970). Tirumalāmbāviracitā Varadāmbikā-pariṇaya-campūḥ. Caukhambā Saṃskṛta Sīrīj Āphis, Varanasi. OCLC 16124944.
  • Filliozat, Vasundhara (1999). "Vijayanagar". National Book Trust, India. Filliozat.
  • V, Vriddhagirisan; Chidambaram, Srinivasachari (1942). "The nayaks of Tanjore". Annamalai University. OCLC 38145371.
  • N., Venkataramanayya (1935). "Studies in the history of the third dynasty of Vijayanagara ". University of Madras.
  • Jackson, William (2005). "Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature". Ashgate Publishing. ISBN 0-7546-3950-9.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
విజయనగర రాజులు  
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
శ్రీ కృష్ణదేవ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1529 — 1542
తరువాత వచ్చినవారు:
సదాశివ రాయలు