ఒక్కడు 2003 లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చాడు. ఇదే సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో పునర్మితమైంది.

ఒక్కడు
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం గుణశేఖర్
నిర్మాణం ఎం. ఎస్. రాజు
తారాగణం మహేష్ బాబు,
భూమిక,
ప్రకాష్ రాజ్
సంగీతం మణిశర్మ
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి 170 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

వెస్ట్ సైడ్ స్టోరీ అనే ఆంగ్ల చిత్రంలో రెండు యువకుల గ్యాంగులు తలపడడం ఉంటుంది, దీన్ని చూసిన దర్శకుడు గుణశేఖర్ అలాంటి సినిమా తీయాలని అనుకున్నారు. అయితే అంతకుముందు నుంచీ హైదరాబాదు లోని చార్మినార్ నేపథ్యంగా, పాతనగరంలో సినిమా తీయాలనీ అనుకున్నారు. దాంతో చార్మినార్ చుట్టుపక్కల గల్లీల్లోని కుర్రాళ్ళు, వాళ్ళలో గ్రూపులు, గ్యాంగుల గొడవలు నేపథ్యంగా లైన్ అనుకుని అభివృద్ధి చేసుకున్నారు. 1998లో గుణశేఖర్ తన చూడాలని వుంది సినిమా రీరికార్డింగ్ చేయించే సమయంలో మహేష్ బాబు హీరోగా తన తొలిచిత్రం రాజకుమారుడులో నటిస్తున్నారు. ఆ సమయంలో రెండు సినిమాలకు నిర్మాత అయిన అశ్వనీదత్ ఆఫీసులో ఇద్దరూ కలిసినప్పుడు గుణశేఖర్ మహేష్ బాబుకి ఈ కథ లైన్ చెప్పారు. ఈ లైన్ నచ్చడంతో మహేష్ గుణశేఖర్ ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా చేస్తానని చెప్పారు.
2001లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన మృగరాజు సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఆ సినిమా తర్వాత చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో అనుకున్న సినిమానే తియ్యాలని గుణశేఖర్ భావించారు. సినిమా కథ క్రమంగా నవలకు రాసినట్టు పేజీలకు పేజీలు రాస్తూ స్క్రిప్ట్ అభివృద్ధి చేశారు. ఆ కథను ప్రముఖ నిర్మాత, పత్రికాధిపతి రామోజీరావు దగ్గరకు తీసుకువెళ్ళారు దర్శకుడు, హీరో. ఆయనకు బాగా నచ్చింది. రామోజీరావు వారితో ఫిల్మ్ సిటీలోనే చార్మినార్ సెట్ వేద్దామనీ, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా ఫరవాలేదనీ, సినిమా తీద్దామని చెప్పారు. అయితే వేరేదో కారణంతో ఆ ప్రాజెక్టు రామోజీరావు చేపట్టలేకపోయారు. తర్వాత మరో నిర్మాత ఎం.ఎస్.రెడ్డి ఈ సినిమా నిర్మాణానికి ముందుకువచ్చారు. ఆయనా సెట్ కాలేదు.
పద్మాలయా స్టూడియోలో ఈ సినిమాను ఎవరు చేస్తారన్న విషయంపై గుణశేఖర్, మహేష్ చర్చించుకున్నారు. ఆ చర్చలో మహేష్ బాబు గుణశేఖర్ కి ఎం.ఎస్.రాజు అయితేనే కరెక్ట్ అని సూచించారు. దాంతో ఎమ్మెస్ రాజును ఫోన్ చేయడంతో, ఆయన పద్మాలయా స్టూడియోస్ కి వచ్చారు. మహేష్ సినిమా గురించిన వివరాలన్నీ చెప్పారు. అయితే ఒక్క కండిషన్-చార్మినార్ దగ్గర షూటింగ్ సాధ్యపడదు, పైగా ఇటీవల ఆత్మహత్యలు కూడా అక్కడ జరగడంతో పైకి ఎక్కడాన్ని కూడా నిషేధించారు. అందుకు చార్మినార్ సెట్ వేయాలి అని చెప్పారు మహేష్. అందుకు సరేనన్న ఎమ్మెస్ రాజు, ముందు తనకు కథ నచ్చాలన్నారు. గుణశేఖర్ నిర్మాతకు కథ నరేట్ చేశారు. ఆయనకు కథ నచ్చడంతో అంగీకరించారు.
సినిమాకు మొదట అనుకున్న టైటిల్ - అతడే ఆమె సైన్యం. సినిమా కథాపరంగా హీరోయిన్ ని హీరో సైన్యంలా కాపాడుతుండడంతో సరిగా కుదిరిన టైటిల్ అని దాన్నే టైటిల్ గా పెడదామనకున్నారు. అయితే అతడే ఆమె సైన్యం అన్న టైటిల్ ని అప్పటికే ఎవరో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ సినిమా వర్గాలు ఆ టైటిల్ కోసం వారిని ఎంత బతిమాలినా ఇవ్వలేదు. తర్వాత కబడ్డీ అన్న టైటిల్ పెడదామని భావించారు. చివరకు ఒక్కడు అన్న టైటిల్ ఖరారుచేశారు.[1]

నటీనటుల ఎంపిక

మార్చు

చిత్ర కథాంశాన్ని మహేష్ బాబుకు రాజకుమారుడు విడుదలైన సమయంలోనే గుణశేఖర్, అశ్వనీదత్ ఆఫీసులో వివరించారు. అప్పుడే మహేష్ సినిమా పట్ల ఆసక్తి కనపరిచారు. దాంతో ఆయననే కథానాయకునిగా అనుకుని కథ పూర్తిచేశారు. సినిమా ప్రారంభమయ్యే నాటికి యువకుడు సినిమాలో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసిన భూమికను హీరోయిన్ గా చూసి ఒకే చేశారు. సినిమాలో మహేష్ కబడ్డీ ఆటగాడి పాత్ర ధరించారు. దాంతో అప్పటివరకూ ఎప్పుడూ కబడ్డీ ఆడని మహేష్ బాబు ఈ సినిమా కోసం రెండురోజులు కబడ్డీ నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి ఆడారు.[1]

సెట్లు

మార్చు

హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి ఉన్న ఓ పదెకరాల ఖాళీస్థలాన్ని ఈ సినిమా కోసం తీసుకున్నారు. అక్కడ చార్మినార్ సెట్ వేయడం ప్రారంభించారు. చార్మినార్ ఎత్తు 176 అడుగులు, అందులో మినార్ల ఎత్తు 78 అడుగులు. కథకు అవసరమైనవి ఆ మినార్లే. దాంతో కింది ఎత్తు బాగా తగ్గించేసి, మినార్ల ఎత్తు మాత్రం అలాగే వుంచి మొత్తంగా 120 అడుగుల ఎత్తున చార్మినార్ సెట్ నిర్మించారు. చేతిలో ఉన్న పదెకరాల్లోని ఓ అయిదు ఎకరాల విస్తీర్ణంలో చార్మినార్, చుట్టూ హైదరాబాదు పాతనగరం రోడ్లు లేకుండా కేవలం ఇళ్ళు, దుకాణాల సెటప్ వేశారు. దీనికి మూడు నెలల సమయంలో 300 మంది పనివాళ్ళు కృషిచేసి నిర్మించారు. ఈ నిర్మాణానికి రూ.కోటి డెబ్భై లక్షలు ఖర్చయింది.

చిత్రీకరణ

మార్చు
 
స్ట్రాడా కెమెరా క్రేన్. ఇటువంటి క్రేన్ ఉపయోగించే సినిమాలో చార్మినార్, పాతనగరం వీధులలోని సన్నివేశాలు తీశారు

సినిమా చిత్రీకరణ హైదరాబాదు శివార్లలో వేసిన పాతబస్తీ, చార్మినార్ సెట్, కర్నూలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. చార్మినార్, పాతబస్తీ సెట్ 5 ఎకరాల విస్తీర్ణంలో అరకిలోమీటరు పొడవున వేశారు. దానిలో షూటింగ్ జరిగినప్పుడు అరకిలోమీటర్ పొడవునా లైటింగ్ చేయడానికి 15 జనరేటర్లు వాడాల్సి వచ్చింది. ఆ సెట్లో చిత్రీకరణ చేసేందుకు సాధారణమైన క్రేన్లు సరిపోకపోవడంతో స్ట్రాడా క్రేన్లను తీసుకువచ్చి చిత్రీకరించారు.[1] స్ట్రాడా కెమెరా క్రేన్ కింద కదిలేందుకు వీలైన వెహికల్ బేస్ పైన పొడవుగా ఉండే క్రేన్. దానిపై కెమెరా ఆ మూల నుంచి ఈ మూల వరకూ కదులుతూ చిత్రీకరణ జరుపుకోవచ్చు. హై యాంగిల్స్, పొడవైన స్వీప్ షాట్లకు పనికివచ్చే ఈ కెమెరా[2] సినిమాలో పాతనగరంలో ఛేజింగ్ సీన్లు, ఫైట్లు చిత్రీకరించేందుకు, చార్మినార్ చుట్టుపక్కల జనాలతో నిండిపోయిన వీధులను అక్కడ యాక్షన్ సన్నివేశాలను తీసేందుకు ఆ క్రేన్ ని ఉపయోగించారు.
సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను డిసెంబరు నెలలో చిత్రీకరించారు. మహేష్ బాబు కబడ్డీ ఆడడం, మహేష్-ప్రకాష్ రాజ్ ల మధ్య పోరాట దృశ్యాలు వంటివి జనాలతో నిండిపోయిన స్టేడియం సెట్ లో తీయాల్సివచ్చింది. పైగా రాత్రి పూట సన్నివేశాలు సెట్ చేయడంతో డిసెంబరు చలిలో వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులతో సినిమా తీసేందుకు చాలా కష్టపడాల్సివచ్చింది. పైగా మహేష్ కి ఎప్పుడూ షూ వేసుకోవడం అలవాటు కావడంతో బూట్లు లేకుండా కబడ్డీ ఆడాల్సిన సన్నివేశాలకు ఇబ్బందిపడ్డారు, మోకాళ్ళకు గాయాలు కూడా తగిలాయి. అలా కష్టపడి క్లైమాక్స్ చిత్రీకరణ చేశారు. సినిమా సెట్లు, వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టుల నడుమ సెట్ చేసివుండడంతో నిర్మాణానికి చాలా ఖర్చు అయ్యింది. సినిమా నిర్మాణానికి రూ.14 కోట్ల వరకూ ఖర్చు అయ్యింది.[1]

నిర్మాణానంతర కార్యక్రమాలు

మార్చు

సినిమా ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ చేశారు. సినిమా ఎడిటింగ్ పూర్తిచేసుకుని రష్ చూశాకా సీనిక్ ఆర్డర్ లో కీలకమైన మార్పుచేశారు. సినిమా స్క్రిప్ట్ మొదట కర్నూలులో స్వప్న (భూమిక)ను ఓబుల్ రెడ్డి (ప్రకాష్ రాజ్) బారినుంచి అజయ్ వర్మ (మహేష్ బాబు) తప్పించడంతో ప్రారంభమవుతుంది. ఆమెని హైదరాబాదు తీసుకువచ్చేశాకా అంతవరకూ జరిగిన కథంతా ఫ్లాష్ బ్యాక్ లో వివరిస్తారు. కానీ ఎడిటింగ్ పూర్తయ్యాకా రషెస్ చూసిన పరుచూరి సోదరులు ఈ ఫ్లాష్ బ్యాక్ నరేషన్ సినిమాకి నప్పదని భావించారు. మొట్టమొదటే ప్రకాష్ రాజ్ లాంటి విలన్ పాత్రని ఆవిష్కరించి, అతను ప్రాణాలు తీసినా దక్కించుకోవాలనుకున్న అమ్మాయిని హీరో తప్పించి తీసుకురావడం చూసిన ప్రేక్షకులు ఏమవుతుందన్న సస్పెన్సు మూడ్ లోనే ఉంటారని వారి వాదన. ఆ మూడ్ లో ఉన్న ప్రేక్షకులకు ఫ్లాష్ బ్యాక్ లో అప్పటికే హీరో పొటెన్షియాలిటీ చూసేయడంతో హీరో గ్యాంగ్, మరో చిల్లర విలన్ గ్యాంగ్ తో కొట్టుకోవడం చీప్ గా కనిపిస్తుందని, సస్పెన్స్ లో ఉన్న మనస్సుతో ప్రేక్షకులు హీరో కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు కూడా ఎంజాయ్ చేయలేరని భావించారు. దాంతో సినిమాలో ప్లాష్ బ్యాక్ ని స్ట్రెయిట్ నరేషన్ గా మార్చేయమని తమ జడ్జిమెంట్ చెప్పేశారు. గుణశేఖర్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ సహకారంతో ఓ పది నిమిషాల్లో సినిమాను ఫ్లాష్ బ్యాక్ నరేషన్ నుంచి స్ట్రెయిట్ నరేషన్ కు మార్చేశారు.[1][3]

విడుదల, ఫలితం

మార్చు

సినిమా జనవరి 15, 2003న సంక్రాంతి పండుగ సినిమాగా విడుదలైంది. ఆ సంవత్సరం విడుదలైన సంక్రాంతి సినిమాలన్నిటినీ మించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మహేష్ కి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా ఒక్కడు నిలిచింది.[1]

పునర్నిర్మాణం

మార్చు

సినిమాని తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేయగా భారీ విజయాన్ని సాధించింది. కన్నడంలోకి పునీత్ రాజ్ కపూర్, అనురాధా మెహతా జంటగా అజయ్ పేరిట రీమేక్ చేశారు, ఇది అంతగా విజయవంతం కాలేదు. జీతేంద్ర మద్నాని హీరోగా బెంగాలీలోకి జోర్ పేరిట రీమేక్ అయింది. 2015లో హిందీలోకి తేవర్ పేరిట అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా బోనీకపూర్ నిర్మాణంలో రీమేక్ చేశారు, సినిమా పరాజయం పాలైంది. హిందీలోకి ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అనువదించాలని ప్రయత్నాలు సాగించారు. మహేష్ బాబు హీరోగా హిందీలో తీద్దామనుకోగా, మహేష్ ఆ ప్రయత్నం పట్ల ఆసక్తి కనపరచలేదు. తర్వాత అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ల కాంబినేషన్లో తీద్దామనీ ప్రయత్నించారు కానీ కుదరలేదు.

రీమేక్స్ లో క్యారెక్టర్ మేప్

మార్చు
ఒక్కడు (2003)
(తెలుగు)
గిల్లీ (2004)
(తమిళ్)
అజయ్ (2006)
(కన్నడ)
జోర్ (2008)
(బెంగాలీ)
తెవర్ (2015)
(హిందీ)
అజయ్
(మహేష్ బాబు)
శరణన్ వేలు
(విజయ్)
అజయ్
(పునీత్ రాజ్‌కుమార్)
సూర్జా
(జీతేంద్ర మద్నానీ)
పింటూ శుక్లా
(అర్జున్ కపూర్)
స్వప్న
(భూమిక)
ధనలక్ష్మి
(త్రిష)
పద్దు
(అనురాధ మెహతా)
సుమి
(బార్షా ప్రియదర్శిని)
రాధిక మిశ్రా
(సోనాక్షి సిన్హా)
ఓబుల్ రెడ్డి
(ప్రకాష్ రాజ్)
ముత్తుపిండి
(ప్రకాష్ రాజ్)

వీరభద్ర (ప్రకాష్ రాజ్)
ఇంద్రజిత్
(సుబ్రత్ దత్తా)
గజేందర్ సింగ్
(మనోజ్ బాజ్‌పాయ్)
అజయ్ తండ్రి
(ముఖేష్ రిషి)
శివసుబ్రమణియన్
(ఆశిష్ విద్యార్థి)
సూర్జా తండ్రి
(దీపాంకర్ డే)
ఎస్పీ శుక్లా
(రాజ్ బబ్బర్)

నటవర్గం

మార్చు

అవార్డులు

మార్చు
  1. ద్వితీయ ఉత్తమ చిత్రం.
  2. మహేష్ బాబు - ఉత్తమ నటుడు.
  3. గుణశేఖర్ - ఉత్తమ దర్శకుడు.
  4. అశోక్ కుమార్ - ఉత్తమ కళా దర్శకుడు.
  5. మణిశర్మ - ఉత్తమ సంగీత దర్శకుడు.
  6. ఎ. శ్రీకర్ ప్రసాద్ - ఉత్తమ ఎడిటర్.
  7. శేఖర్ వి. జోసఫ్ - ఉత్తమ ఛాయాగ్రహణం.
  8. రాఘవన్ - ఉత్తమ ఫైట్ మాస్టర్.

ఈ చిత్రం లోని పాటల వివరాలు

మార్చు

సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా, చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.

  • అత్తారింటికి నిన్ను - (శ్రేయా ఘోషాల్, హరి హరన్)
  • చెప్పవే చిరుగాలి - (ఉదిత్ నారాయణ్, సుజాత)
  • హరే రామ హరే కృష్ణ - (శంకర్ మహదేవన్)
  • నువ్వేం మాయ చేశావో గాని (మెలోడి) - (శ్రేయా ఘోషాల్)
  • నువ్వేం మాయ (పాస్ట్ బీట్) - (కార్తీక్, చిత్ర)
  • సాహసం శ్వాసగా సాగిపో సోదరా - (మల్లికార్జున్)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 పులగం, చిన్నారాయణ (16 ఆగస్టు 2015). "అతడే ఆమె సైన్యం". సాక్షి. Retrieved 16 August 2015.
  2. "స్ట్రాడా కెమెరా క్రేన్ గురించి". Archived from the original on 2016-02-14. Retrieved 2015-08-17.
  3. పరుచూరి, గోపాలకృష్ణ. 11th అవర్.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఒక్కడు&oldid=4209231" నుండి వెలికితీశారు