తాతినేని ప్రకాశరావు

భారతీయ చిత్ర దర్శకుడు
(టి.ప్రకాశరావు నుండి దారిమార్పు చెందింది)

తాతినేని ప్రకాశరావు (నవంబరు 24, 1924 - జూలై 1, 1992) సుప్రసిద్ధ తెలుగు, హిందీ, తమిళ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ గారి షావుకారు సినిమాకు, కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశారు. తర్వాత పరివర్తన, పల్లెటూరు, జయం మనదేరా మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్ మొదలైన అగ్రనటులతో ఎన్నో తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో దాదాపు పెద్ద నటులందరితోనూ 25 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా సుమారు 60 పైగా దర్శకత్వం వహించినవాటిలో కొన్ని చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. వీరు తాష్కెంట్ చలన చిత్రోత్సవంలోను, ఉజ్ బెకిస్థాన్ లోను రెండు సార్లు డెలిగేషన్ లో పాల్గొన్నారు. కొత్త తరం దర్శకులుగా, తెలుగు చిత్రసీమకు చక్కని చిత్రాలు అందించగల టాలెంటెడ్‌ డైరక్టర్లుగా 50వ దశకంలో టి. ప్రకాశరావుతో పాటు సి.ఎస్‌.రావు, డి. యోగానంద్‌, కె.బి. తిలక్‌, ఆదుర్తి సుబ్బారావులను పరిగణించేవారు. వీరంత కూడా యువరక్తం పొంగుతూంటే చక్కని కుటుంబకథా చిత్రాలు, ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలను రూపొందించినవారే. అంతేకాదు వీరి చిత్రాల్లో మెలొడీ పాటలకూ ప్రాధాన్యత ఉండేది.

తాతినేని ప్రకాశరావు
తాతినేని ప్రకాశరావు
జననంతాతినేని ప్రకాశరావు
నవంబరు 24, 1924
కృష్ణాజిల్లాలోని కపిలేశ్వరపురం
మరణంజూలై 1, 1992
ప్రసిద్ధిసుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు
తండ్రివీరరాఘవయ్య

తొలి జీవితం

మార్చు

తాతినేని ప్రకాశరావు పుట్టింది 1924లో నవంబరు 24. కృష్ణాజిల్లాలోని కపిలేశ్వరపురంలో తండ్రి వీరరాఘవయ్య కాంగ్రెస్‌వాది. అయినా విప్లవ భావాలుండేవి. ప్రకాశరావుని దత్తత తీసుకున్న చిన్న తాత సుబ్బయ్య ఈ కారణంగానే ప్రకాశరావుని తండ్రి వద్దకు పంపేసారట. తండ్రి నుంచి రాజకీయం, విప్లవ భావాలు వారసత్వంగా సంక్రమించాయి. అదనంగా సినిమా ఆసక్తి ఏర్పడింది. టూరింగ్‌ టాకీస్‌లో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం కలిగించుకున్నారు చిన్న తనంలోనే. విద్యార్థిగా వుంటూనే రాజకీయాలు వేపు ఆసక్తి చూపడంతో గొడవలు రావడం కూడా ఎక్కువయింది. తను ఉచితంగా సినిమా చూసే టూరింగ్‌ టాకీస్‌లో అసిస్టెంట్‌ ఆపరేటర్‌ వుద్యోగం సంపాదించుకున్నారు. అదీ వదిలేయాల్సి వచ్చింది కొంతకాలానికి. ప్రజానాట్యమండలి వేపు, కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు వేపు ఆకర్షితులయ్యారు తాతినేని ప్రకాశరావు. ప్రజానాట్యమండలి ప్రదర్శించే కళా కార్యక్రమాలను నిర్వహించే పనిలో పడ్డారు.

చలనచిత్రరంగ జీవితం

మార్చు

ఏదో మీటింగుకని ప్రకాశరావు 1946లో మద్రాసు వెళ్ళారు. దర్శకుడు ఎల్.వి.ప్రసాద్‌తో పరిచయం ఏర్పడగా అది పెంపొందించుకున్నారు. మళ్ళీ కృష్ణాజిల్లాకి తిరిగి వచ్చేసినా, ఏడాది పూర్తి కాకుండానే తను నిర్వహించే రాజకీయ సాంస్కృతిక వ్యవహారాలకు స్వస్తి చెప్పేసి మద్రాసు చేరుకుని ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో కె.ఎస్.ప్రకాశరావు హీరోగా రూపొందిన ద్రోహి చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌ అయ్యారు. ఎల్‌.వి.ప్రసాద్‌ వద్దనే మనదేశం, సంసారం, షావుకారు, పెళ్ళి చేసి చూడు చిత్రాలకు. కె.వి.రెడ్డి వద్ద పాతాళభైరవి చిత్రానికి సహాయ దర్శకుడుగా పనిచేసారు.

పీపుల్స్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రంలో దర్శకుడయ్యారు ప్రకాశరావు. సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాలు, గ్రామాల్లో ఉండే చెడుగుడు ఆట వంటివి అత్యంత సహజంగా చిత్రీకరించడమే కాకుండా సంక్రాంతి పండుగ గురించి ఒక పాట, దేశభక్తిని ప్రబోధించే పాట ఒకటి, తెలుగు తేజం వివరించే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. పాటని చిత్రీకరించారు. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, సావిత్రి, నాగభూషణం ఈ చిత్రాలకి ముఖ్య పాత్రధారులు. పల్లెటూరు అందాలు, ఆనందాలు వర్ణించిన ఈ చిత్రం 1952లో విడుదలై విజయం సాధించింది. 1953లో ఎన్టీఆర్‌ నటించిన పిచ్చి పుల్లయ్యని డైరక్ట్‌ చేసారు.తరువాత 'అన్నాచెల్లెలు' నాటకం ఆధారంగా అక్కినేని, ఎన్టీఆర్‌, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించగా పరివర్తన చిత్రం రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో డబ్‌ అయి ఘన విజయం సాధించింది. 1954లో విడుదలైన ఈ చిత్రంలో నీతి నియమాలు, మానవతా విలువులు ఆదర్శాలు చక్కగా చిత్రీకరించారు. అక్కినేనితో నిరుపేదలు చిత్రాన్ని తీసి 1954లోనే విడుదల చేసారు. 1959లో విడుదలైన ఇల్లరికం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. 1958లో 'అమర్‌దీప్‌' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా బాలీవుడ్‌లోనూ ప్రవేశించారు. జయం మనదే, మా బాబు, మైనర్‌బాబు, సంసారం, చిరంజీవి రాంబాబు, గాలిపటాలు, గంగాభవాని, పొగరుబోతు, ఆశాజ్యోతి, భారతంలో అర్జునుడు తదితర చిత్రాలకు తెలుగులో దర్శకత్వం వహించారు.

తెలుగుయేతర భాషా చిత్రాలు

మార్చు

తమిళ చిత్ర సీమలో ప్రవేశించి 'మాతుర్కుల మాణిక్కం' చిత్రం రూపొందించి 1956లో విడుదల చేసారు. తెలుగులో అక్కినేని, ఎన్టీఆర్‌ హీరోలుగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచన ఆధారంగా ప్రకాశరావు డైరక్ట్‌ చేసిన చరణదాసి చిత్రానికి రీమేక్‌ ఇది. చరణదాసి కూడా తెలుగులో ఘనవిజయం సాధించింది.

తమిళంలో 24 చిత్రాలు డైరక్ట్‌ చేసారు. శివాజీ గణేశన్‌తో 'అమరదీపం', ఉత్తమ పుత్రన్‌ చిత్రాలు, కతిరుండ్‌ కనకాల్‌, నల్ల తీర్పు, కన్నిరైంధ కన్నవాన్‌, పదకోటై, ఎంగలమం ముదియం, ఎల్లారం ఇన్నట్టు మన్బార్‌, అన్చుమగన్‌ ముఖ్యమైనవి. నన్హా ఫరిస్తా, కాలేజ్‌ గర్ల్‌, బహు భేటీ, సీతంఘర్‌, సూరజ్‌ , దునియా, ఇజ్జత్‌, హమారా సంసార్‌, హమ్‌రాహి, ససురాల్‌, కబ్‌ తక్‌ చుప్‌ రహూఁగీ, ఘర్‌ ఘర్‌ కీ కహానీ, బహు రాణీ, రివాజ్‌ మున్నగు చిత్రాలను హిందీలో దర్శకత్వం వహించారు ప్రకాశరావు.

ఇతర విశేషాలు

మార్చు

తాతినేని ప్రకాశరావు కజిన్‌ అయిన తాతినేని రామారావు, ప్రకాశరావు వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసి ఈయన కూడా ఆయన బాటలో ప్రయాణం చేసి, తెలుగు చిత్రాలు, హిందీ చిత్రాలు డైరక్ట్‌ చేసారు. హిందీలో స్టార్‌ డైరక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. కె.ప్రత్యగాత్మ కూడా తాతినేని ప్రకాశరావు శిష్యుడే. ప్రత్యగాత్మ హిందీ చిత్ర రంగాన్నీ యేలారు కె.పి.ఆత్మగా.

వి.మధుసూదనరావు, గుత్తా రామినీడు, కె. హేమాంబరధరరావు, తాతినేని ప్రకాశరావు వద్దనే దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది హిట్‌ చిత్రాల దర్శకులుగా రాణించారు. తెలుగు హిందీ భాషలలో కొన్ని చిత్రాలను డైరక్ట్‌ చేసిన టి.ఎల్‌.వి.ప్రసాద్‌, తాతినేని ప్రకాశరావు కుమారుడు. ఈయన తాతినేని ప్రసాద్‌గా కూడా కొన్ని చిత్రాలను డైరక్ట్‌ చేసారు.

వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించాలని సమాజంలోని సమస్యలను కూడా చర్చించాలని, కుటుంబపరమైన సమస్యలు, సరదాలు చక్కగా చూపించాలని ప్రయత్నించి, సఫలం చెందేవారు. దర్శకుడుగా, అందుకే తాతినేని ప్రకాశరావు చిత్రాలలో కథ; కథనం నాటకీయంతో ఆకట్టుకునేలా ఉండేది.

తాతినేని ప్రకాశరావు 1992, జూలై 1న దివంగతులయ్యారు.

సినిమాలు

మార్చు

బయటి లింకులు

మార్చు