తెలంగాణ నదులు, ఉపనదులు

(తెలంగాణలోని నదులు, ఉపనదులు నుండి దారిమార్పు చెందింది)
కృష్ణానదిపై నాగార్జనసాగర్ ఆనకట్ట

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, భీమ, మంజీరా, మూసీ, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని, మున్నేరు, పాలేరు, పెన్ గంగ, వైరా, తాలిపేరు మొదలైన నదులు, ఉపనదులు ఉన్నాయి.[1][2] తెలంగాణ రాష్ట్ర భూభాగమంతా వాయవ్యంలో ఎత్తుగా, ఆగ్నేయ దిశలో వాలి ఉండడంతో ఇక్కడ ప్రవహించే నదులన్ని వాయవ్య దిశ నుండి ఆగేయ దిశకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.[3]

గోదావరి నదిపై ఖమ్మం జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన దుమ్ముగూడెం బ్యారేజీ
చాదర్‌ఘాట్ వద్ద మూసీనది
ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది
ఖమ్మం పట్టణంలో మున్నేరుపై రెండు వంతెనలు

నదులుసవరించు

 1. గోదావరి నది: ద్వీపకల్ప నదులన్నింటిలో ఇది అతిపెద్ద నది. మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకంలో జన్మించి ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశించి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మీదుగా 1465 కి.మీ. ప్రయాణించి ఆంధ్ర ప్రదేశ్ లోని బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రాణహిత, మంజీరా, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, వార్థా, పెన్‌గంగ, వెయిన్‌గంగ మొదలైన ఉపనదులు కలిగివున్న ఈ నదిపై కరీంనగర్‌లో ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, వరంగల్‌లో దేవాదుల ఎత్తిపోతల పథకం, పీవీ నర్సింహారావు పథకం, ఖమ్మంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలైనవి నిర్మిచబడ్డాయి.
 2. కృష్ణా నది: ఇది తెలంగాణలోని రెండో అతిపెద్ద నది. పశ్చిమ కనుమలులోని మహాబలిపురం వద్ద జన్మించి, మహబూబ్‌నగర్ జిల్లా మఖ్తల్ మండలంలోని తంగడి గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశించి, నల్లగొండ జిల్లా మీదుగా ప్రయాణించి ఆంధ్ర ప్రదేశ్ లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. డిండి, కొయినా, ఘటవూపభ, మలవూపభ, దూద్‌గంగ, భీమ, తుంగభద్ర, మున్నేరు, మూసీ మొదలైన ఉపనదులు కలిగివున్న ఈ నదిపై మహబూబ్‌నగర్‌లో జూరాలా ప్రాజెక్టు, నల్లగొండలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొదలైనవి నిర్మిచబడ్డాయి.

ఉపనదులుసవరించు

 1. తుంగభద్ర: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన తుంగభద్ర నది కర్నాటకలోని వరాహ కొండల్లో తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వలన జన్మిస్తుంది. మహబూబ్‌నగర్‌లోని ఆలంపూర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణా నదితో కలుస్తుంది. దీనికి కుముద్వతి, వరద, వేదవతి ఉపనదులు ఉన్నాయి.
 2. మంజీరా నది: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన మంజీరా నది మహారాష్ట్రలోని ‘బాలాఘాట్’ పర్వతాల్లో జన్మించి, అక్కడ నుంచి ఆగ్నేయ దిశగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ద్వారా ప్రవహించి, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి పోచంపాడు వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. దీని పొడవు 644 కి.మీ. ఈ నదిపై నిజామాబాద్ జిల్లాలోని అచ్చంపేట సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు, మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణ సమీపంలో సింగూర్ డ్యాం నిర్మించడం జరిగింది.
 3. మూసీ నది: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన మూసీ నది రంగారెడ్డి జిల్లా శివారెడ్డిపేట వద్ద అనంతగిరి కొండల్లో జన్మించి, హైదరాబాద్‌ నుండి ప్రవహించి నల్లగొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీనిని గండిపేట చెరువు అని కూడా అంటారు.1920లో ఈ నది పైన ఉస్మాన్‌సాగర్ డ్యామ్‌ను నిర్మించబడింది. ఈసా, ఆలేరు అనేవి దీనికి ఉపనదులు.
 4. డిండి నది: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన డిండి నది మహబూబ్‌నగర్‌లో షాబాద్‌ గుట్టలో జన్మించి దేవరకొండ ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని పొడవు 153 కి.మీ.
 5. ప్రాణహిత నది: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన ప్రాణహిత నది మధ్యప్రదేశ్‌లోని సాత్పురా పర్వతాలలో పెన్‌గంగా, వైన్‌గంగా, వార్ధా నదుల కలయిక వలన ఏర్పడి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ద్వారా ప్రయాణించి, ఆదిలాబాద్ సరిహద్దు ద్వారా ప్రవహిస్తూ కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించి, మహదేవ్‌పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలుస్తోంది. ఈ నదిపై ప్రాణహిత చేవెళ్ళ ఎత్తి పోతలపథకం నిర్మించబడింది.
 6. కిన్నెరసాని: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన కిన్నెరసాని నది వరంగల్ జిల్లాలో మేడారం-తాడ్వాయి కొండసానువుల్లో జన్మించి ఆగ్నేయ దిశగా ఖమ్మం జిల్లా ద్వారా ప్రవహిస్తూ భద్రాచలంకు సమీపాన గల బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్య గోదావరితో కలుస్తోంది. సుమారు 96 కి.మీ. పొడవున్న కిన్నెరసాని ఉపనది ‘ముర్రేడు’.
 7. మున్నేరు: కృష్ణానది ఉపనదులలో ఒకటైన మున్నేరు నది వరంగల్‌ జిల్లా పాకాల చెరువు నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం జిల్లాల ద్వారా ప్రవహించి అంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలోని ఏలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. సుమారు 198 కి.మీ. పొడవున్న ఈ నదికి వైరా, కట్లేరు దీని ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి.
 8. పాలేరు నది: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన పాలేరు నది వరంగల్‌ జిల్లా దక్షిణ భాగంలోని బాణాపురం ప్రాంతంలో పుట్టి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. సుమారు 145 కి.మీ. పొడవున్న ఈ నదిపై నిజాంల కాలంలో ఖమ్మం జిల్లాలోని ‘పాలేరు’ పట్టణ సమీపంలో రిజర్వాయర్ నిర్మించబడింది.
 9. భీమా నది: కృష్ణానదికి గల ఉపనదులలో ఒకటైన భీమా నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
 10. పెన్ గంగ: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన పెన్ గంగ నది అదిలాబాదు గుండా ప్రవహిస్తుంది.
 11. వైరా నది: ఇది ఖమ్మం జిల్లాలో ప్రవహించే చిన్న నది.
 12. తాలిపేరు నది: గోదావరినదికి గల ఉపనదులలో ఒకటైన తాలిపేరు నది ఖమ్మం జిల్లాలో చర్ల మండలంలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో కలుస్తుంది. దీనిపై తాలిపేరు ప్రాజెక్టు నిర్మించబడింది.

మూలాలుసవరించు

 1. నమస్తే తెలంగాణ (15 June 2016). "తెలంగాణ జాగ్రఫీ- గ్రూప్స్ ప్రత్యేకం". మూలం నుండి 30 ఆగస్టు 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 29 August 2018. Cite news requires |newspaper= (help)
 2. సాక్షి (9 April 2015). "తెలంగాణ - నదీ వ్యవస్థ". మూలం నుండి 30 August 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 30 August 2018. Cite news requires |newspaper= (help)
 3. నవతెలంగాణ (29 June 2016). "తెలంగాణలో నదులు-నీటిపారుదల ప్రాజెక్టులు". మూలం నుండి 30 August 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 30 August 2018. Cite news requires |newspaper= (help)

వెలుపలి లంకెలుసవరించు