తెలంగాణ విమోచనోద్యమం
హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధ పోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామ పోరాటమది. హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం[1] నానా అరాచకాలు సృష్టించారు.[2] అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి, వెయ్యి నాల్కలతో విషం కక్కాయి.[3] హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు, వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృత రూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 18న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకునే వరకు కొనసాగింది.
నిజాం పాలనలో దురాగతాలు
మార్చునీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.[4] చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడ, కాగే నూనెలో వేళ్లు ముంచడం ఆనాడు సాధారణమైన శిక్షలు[5] ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.
తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు.[6] నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్లు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్ను చేసి ఎత్తుకుపోయేవారు.[7]
చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నిలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు.[8]
దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్ ఖాన్ , బందగి, షోయబుల్లాఖాన్ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగి విస్నూర్ రాపాక రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.
సర్దార్ పటేల్ పాత్ర
మార్చుసైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి భారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్‌లోనైన విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడు. నిజాం ఐక్యరాజ్యసమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేదు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు.[9] లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్ అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాదు శాసనసభ రద్దుచేయబడింది. హైదరాబాదు రోడ్ల మీద ఇక తలెత్తుకు తిరగలేమని భావించిన లాయక్‌అలీ, ఖాసింరజ్వీలు మూటాముల్లెలు సర్దుకొని పాకిస్తాన్ పారిపోయారు.
ఆపరేషన్ పోలో
మార్చునిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు. జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 13న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది. సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో పూర్తయింది. సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశాడు. ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు.
ఉద్యమ స్పూర్తి ప్రధాతలు
మార్చుతెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో అప్పంపల్లి, ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాదు జిల్లా ఇందూరు, తదితర ప్రాంతాలలో పోరాటం పెద్ద ఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, ధర్మభిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, షోయబ్ ఉల్లాఖాన్, మల్లు స్వరాజ్యం రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి కృషిచేశారు. వీరందరి కృషి, దాశరథి, కాళోజీల కవితల స్ఫూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరుఊరున, వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, గుత్పలు, కారం ముంతలు, వడిసెలను ఆయుధాలుగా మలుచుకొని పోరాడారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగంలోకి దిగారు.
తెలంగాణ విముక్తి పోరాటంలో కొందరు మహిళలు
మార్చుసుందరి: 1914 జన్మించారు. మేడిచర్ల తాలుకా కొంపల్లి జన్మస్థలము. 10-8-1948 హైదరాబాదు సంస్థానము స్వతంత్ర భారతదేశంలో విలీనము కావాలని చేసిన పోరాటంలో నిర్బంధింప బడ్డారు. సికింద్రాబాదు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించింది.
యశోదాబాయి: హైదరాబాదు నివాసులు. భర్త ట్రేడ్ యూనియన్ నాయకుడైన రతీలాల్, ఆల్ ఇండియా మహిళా కాన్ఫరెన్స్లో ప్రతినిధిగా ఉండి ఎంతో కృషిచేసారు. 15-8-1947లో హైదరాబాదు నగరములో నిజాము సంస్థానము భారత రాజ్యాంగంలో కలవాలని చేసిన ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా భారత జాతీయ జెండాను ఎగురవేసారు. నిజాము వ్యతిరేక చర్యగా నిర్బంధింపబడి 17-8-1947 నుంచి 19-9-1949 వరకు హైదరాబాదు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించింది.
అహల్యాబాయి: హైదరాబాదు నివాసము. 1929 ప్రాంతంలో జన్మింనది. హైదరాబాదు సంస్థానము భారత రాజ్యాంగంలో కలవాలని చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం నిర్భధించింది. 5-9-1947 నుంచి 3-12-1947 వరకు 3నెలలు హైదరాబాదు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించింది.
సార్జుబాయి: 1909లో హైదరాబాదులో జన్మించింది. తండ్రి మోతిలాల్ విజయవాఘ్ర. హిందీలో భూషన్ పాసై హిందీ టీచరుగా పనిచేసారు. స్టేట్ కాంగ్రెస్లో చేరి తెలంగాణా విముక్తికై ఎంతగానో కృషిచేసారు. హైదరాబాదు సంస్థానము భారతరాజ్యాంగంలో విలీనం కావాలని 1947-48లో జరిగిన పోరాటంలో పాల్గొన్నందుకు 5-9-1947నుండి 30-5-1948 వరకు నిర్బంధింపబడ్డారు. హైదరాబాదు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. ఎన్.సత్యవతి:1916లో జన్మించారు. భర్త సుబ్రహ్మణ్యము . నివాస స్థలము హైదరాబాదు. భారత రాజ్యాంగంలో హైదరాబాదు సంస్థానము కలవాలని చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నిజాము ప్రభుత్వముచే నిర్భధింపబడి 26-9-1947నుండి 19-9-1948 వరకు హైదరాబాదు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించింది.
కుమారిరాజం: నివాసము ఆదిలాబాదు జిల్లా అసిఫాబాద్ తాలుకా బెల్లంపల్లి. భారత రాజ్యాంగంలో హైదరాబాదు సంస్థానము కలవాలని చేసిన ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను 27-3-1948 నుంచి 18-4-1948 వరకు బెల్లంపల్లి పోలీసు స్టేషనులో నిర్బంధంలో ఉంది. తరువాత జైలు శిక్షవిధించారు. 19-4-48 నుంచి 17-8-48 వరకు అసిఫాబాద్ జైలులో శిక్ష అనుభవించింది.
వివిధ జిల్లాలలో తెలంగాణ విమోచన పోరాటాలు
మార్చుఆదిలాబాదు జిల్లా
మార్చుఆదిలాబాదు జిల్లాలో నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా ఊపిరిలూదిన వ్యక్తులుగా రాంజీ గోండు, కొమరంభీం ప్రసిద్ధి చెందినారు.[10] నిర్మల్ కేంద్రంగా చేసుకొని ఎందరో పోరాటయోధులు రజాకార్లను ఎదిరించారు. బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. జల్-జమీన్-జంగల్ కోసం గిరిజనుల తరఫున పోరాడిన కొమరంభీం, రాంజీగోండుల పోరాటాలు, త్యాగాలు గుర్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 17న పలు రాజకీయ పార్టీలు పోటాపోటీ ఏర్పాట్లు చేసుకుంటాయి. రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరితీశారు. ఆ మర్రి "గోండ్ మర్రి", "ఉరులమర్రి"గా ప్రసిద్ధిచెందింది.[11] ఇదే వెయ్యి ఉరులమర్రి సంఘటనగా ప్రసిద్ధిచెందింది. ప్రస్తుతం ఆ చెట్టు లేదు.[12] ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఉంది. గోపిడి గంగారెడ్డి, గంగిశెట్టి విఠల్‌రావు, రాంపోశెట్టి, భీంరెడ్డి తదితరులు తెలంగాణ విమోచనోద్యమ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం సంస్థానంపై పోలీసు చర్య ప్రారంభమై విమోచన పూర్తయ్యే వరకు 5 రోజులపాటు ఆసిఫాబాదు వాసులు ప్రాణాలకు పణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేసి రజాకార్లను ముప్పుతిప్పలు పెట్టారు.
కరీంనగర్ జిల్లా
మార్చుకరీంనగర్ జిల్లాలో తెలంగాణ విమోచన, సాయుధ పోరాటానికి హుస్నాబాదు మండలం మహ్మదాపూర్ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు సాయుధ పోరాటం బాటపట్టారు. నిజాం అరాచకాలు భరించలేక వారికి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన అనభేరి ప్రభాకరరావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల నాయకత్వంలో ప్రజాసైన్యం 1946 మార్చి 14న మహ్మదాపూర్ చేరగా నిజాం సైనికులు అత్యంత పాశవికంగా గుండ్ల వర్షం కురిపించారు.[13] మంథనికి చెందిన రఘునాథరావు కాచే జిల్లాలో మొట్టమొదటి సత్యాగ్రహిగా నిజాం పాలనను వ్యతిరేకించి చరిత్ర సృష్టించాడు. దేశమంతటా ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ పొందగా నిజాం సంస్థానం ప్రజలకు స్వాతంత్ర్యం లేకపోవడంతో నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు మంథని సమరయోధులు ప్రాణాలు కూడా లెక్కచేయక ఉద్యమానికి ముందు ఉండి పోరాటాన్ని కొనసాగించారు. రావి నారాయణరెడ్డి పిలుపుతో పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకంట్ల చంటయ్య, డి.రాజన్న, రాంపెల్లి కిష్టయ్య, ఎలిశెట్టి సీతారాం తదితరులు సాయుధ సంగ్రామంలో దూకి బెబ్బులి వలె గర్జించారు. శ్రీరాములు నేతృత్వంలోని బృందం స్ఫూర్తితో మహాదేవ్ పూర్ తాలుకాలోని ప్రజలు ఉద్యమంలోకి దూకారు. వేధింపులు అధికం కావడంతో శ్రీరాములు అజ్ఞాతంలోకి వెళ్ళి 1948 సెప్టెంబర్ 17న బయటకు వచ్చాడు. 1952 శాసనసభ ఎన్నికలలో శ్రీరాములు శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.
ఖమ్మం జిల్లా
మార్చుతెలంగాణా ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ భోగలాలసమైన, విలాసవంతమైన జీవితాలు గడిపే నిజాం నిరంకుశ పాలన రోజుల్లో ఖమ్మం జిల్లాలో విమోచన పోరాటం ఉధృతంగా సాగింది. ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం పరిధిలో రజాకార్లతో సాగించిన పోరాటం చారిత్రాత్మకం. అనేక ప్రజా ఉద్యమ దళాలకు తుమ్మ శేషయ్య, పాటి జగ్గయ్య, సుంకరి మల్లయ్య, దామినేని వేంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.[14] జమలాపురం కేశవరావు కలెక్టరేట్ కార్యాలయంలోని ఉద్యోగాన్ని వదిలి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. బొమ్మకంటి సత్యనారాయణ రావు స్వచ్ఛందదళాన్ని ఏర్పాటుచేసి మతదురహంకారులైన రజాకార్లపై దాడులు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మంలో నాయకత్వం వహించి రజాకార్లను ఎదుర్కొన్నాడు. మాజీ ఎమ్మెల్సీ కవి, నవలాకారుడైన హీరాలాల్ మోరియా జాయిన్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అండగా నిలబడ్డాడు.
మెదక్ జిల్లా
మార్చునిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విముక్తి కోసం జరిగిన పోరాటంలో మెదక్ జిల్లాకు చెందిన పలువులు యోధులు పాలుపంచుకున్నది. నైజామ్ పోలీసుల చిత్రహింసలు, నిర్భంధాలు, కారాగార శిక్షలకు కూడా లెక్కచేయకుండా పోరాటం కొనసాగించారు. ఆయుధాలను చేతపట్టి దాడులు చేస్తూ రజాకార్లను గడగడలాడించారు. నిజాం నవాబు హిందూ దేవాలయాలలో భజనలు చేయవద్దని హుకుం జారీచేస్తే దాన్ని ధిక్కరించి భజనలు చేశారు. నైజాం సర్కారు ఆజ్ఞలను ధిక్కరించి ఆగస్టు 15న జాతీయ జెండాలను రెపరెపలాడించారు. మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఇండీయన్ నేషనల్ ఆర్మీలోని ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న సైనిక పరిజ్ఞానంతో రజాకార్ల దాడులను తిప్పికొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటుచేశాడు.[15] వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా అక్షరాయుధాలను సంధించి నిజాంపై గళమెత్తాడు. అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు రాసి ప్రజలలో చైతన్యం నింపినాడు. మాణిక్యరావు రాసిన "రైతు పుస్తకం"ను నిజామ్ సర్కారు నిషేధించింది. తొలి ఆంధ్రమహాసభలు జిల్లాలోని జోగిపేటలోనే నిర్వహించారు. 1946లో జిల్లాలోని కందిలో ఈ సభలు జరిగాయి.
నల్గొండ జిల్లా
మార్చుతెలంగాణ విమోచనోద్యమానికి బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనే. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య ల స్ఫూర్తితో ఎందరో పోరాటయోధులు తయారై నిరంకుశ నిజాంకు, అతడి తొత్తులైన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా నిజాం తూటాలకు అమరుడైన వ్యక్తిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచాడు.[16] విసునూరు ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి కేంద్రబిందువు మల్లారెడ్డి గూడెం. ఖాసింరజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డి గూడెం పోరుబిడ్డలది. చిన్నపిల్లలు సైతం వరిసెలతో రాళ్ళు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు.[17] 1946 డిసెంబరు 1న నిజాం మిలటరీ అకస్మాత్తుగా గ్రామంపై దాడిచేయగా రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మలు కాల్పులకు గురయ్యారు.[18]. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన జిల్లా పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రేణికుంట రామిరెడ్డి కదలనుపాక ప్రాంతములో ఉద్యమానికి ఊపిరిపోశారు. కరీంనగర్ నుంచి వచ్చిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు ఉద్యమానికి దోహదపడ్డారు. కొండవీటి రాధాకృష్ణ, కొండవీటి సత్తిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి[19] మల్లు స్వరాజ్యం, కోదాటి నారాయణరావు తదితరులు నిరంకుశ నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడినారు.
మహబూబ్ నగర్ జిల్లా
మార్చుమహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి సంఘటన. 1947 అక్టోబరు 7న ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి నిజామ్ సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్‌డ్ దళాలను రప్పించి సైనిక చర్య జరిపారు. బెల్లం నాగన్నతో పాటు పలు ప్రముఖులను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించిననూ ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరపడంతో 11 మంది ఉద్యమకారులు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.[20] అదే సమయంలో నెల్లికొండికి చెందిన కుక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలుకా గిర్దావర్, పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి పారిపోయారు. మహబూబ్ నగర్ పట్టణంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తూర్పుకమాన్‌పై జాతీయజెండాను ఎగురవేయాలని స్వాతంత్ర్యసమరయోధులు సంకల్పించారు. నిజాంపోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్‌పై జెండాను ఎగురవేసి తమపంతం నెగ్గించుకున్నారు. తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
నిజామాబాదు జిల్లా
మార్చుజిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ తెలంగాణ విమోచన పోరాటానికి నాందిపలికింది. నిజాం వ్యతిరేక పోరాటంలో జిల్లాలో ఇందూరు మొదట నిలిచింది.[21] ఆర్యసమాజం స్ఫూర్తినిచ్చింది. ఇందూరులో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషన్ మోదానిని ముష్కరులు కాల్చిచంపారు. ఆయన మరణంతో ఉద్యమం తీవ్రమైంది. వందలాది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాదు ఖిల్లా జైలులో బంధించి రజాకార్లను ఉసిగొల్పి నిజాం అకృత్యాలకు పాల్పడ్డాడు. ఈ ఖిల్లా వందలాది యోధుల మరణానికి మూగసాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని నిజాం ప్రకటించాడు. ఈ అణచివేతలను నిరసిస్తూ అక్కడే ఉన్న ప్రముఖ కవి దాశరథి ఓ నిజాము పిశాచమా అని గద్దించాడు. నిజామాబాదు జైలులో ఉన్నప్పుడే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఖిల్లా జైలు గోడలపై రాశాడు. కామారెడ్డి ప్రాంతంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యాన్ని భిక్నూరు రైల్వేస్టేషన్ సమీపంలోని గిర్నీలో దాచేవారు. 1947లో సాయుధ యోధులు ధాన్యాగారంపై దాడిచేశారు. ఈ సంఘటనలో కీలకపాత్ర వహించిన కుర్రిబాల్ లింగం, వెంకటబాలయ్య తదితర ఐదుగురిని నిజామాబాదు ఖిల్లాజైలుకు పంపింవారు. తాడ్వాయి మండలానికి చెందిన రాఘవరెడ్డి ఆర్యసత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు జైలుకు వెళ్ళాడు. కామారెడ్డికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫణిహారం రంగాచారి నిజామ్ దురాగతాలపై చిత్రాలు గీసి, ప్రదర్శించి ప్రజలలో చైతన్యం తెచ్చాడు. ఇతని చిత్రాలు ఇప్పటికీ హైదరాబాదులోని ముక్దుం భవన్‌లో ఉన్నాయి. బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య 100 మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించాడు. రజాకర్ ఖాసింరజ్వీ తమ్ముడు అబ్బాస్ రజ్వీ కామారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కాలంలో అతను పెట్టిన బాధలను అనుభవించిన వారిలో కామారెడ్డి మాజీ శాసన సభ్యులు బి.బాలయ్య ఒకరు.[22] దేశభక్తి గీతాలు పాడినందుకు చావుదెబ్బలు తినవలసి వచ్చింది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో సుంకి కిష్టయ్య నిజామ్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.[23] 1947 గాంధీజయంతి రోజున కళ్యాణిలో జరిగిన పోరాటంలో ఏడుగురిని అరెస్టు చేసి బీదర్ జైల్లో ఉంచారు. మారుమూల పల్లె మానాల రజాకార్ల గుండెల్లో రైళ్ళు నడిపించింది. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకులు, మందుగుండులు స్వతంగా తయారుచేసుకున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, సిర్పూర్ ప్రాంతాలకు మానాల కేంద్రంగా పనిచేసింది. బద్దం ఎల్లారెడ్డి తదుతరులు ఇక్కడే పోరాటయోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చేవారు.
వరంగల్ జిల్లా
మార్చుకాకతీయులు ఏలిన గడ్డపై రజాకార్లను ఎదిరించిన వ్యక్తిగా బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయారు.[24] స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న సమయంలో వరంగల్ తూర్పు కోటలో బత్తిని మొగిలయ్య గౌడ్ ఆగస్టు 11, 1946న రజాకార్ల దాష్టీకాలకు గురై బలయ్యాడు. దీనితో వరంగల్లులో రజాకార్ల ఉద్యమం ఊపందుకుంది. బైరాన్‌పల్లి గ్రామంపై పడి ఊరును వల్లకాడు చేసి దొరికినవన్నీ నేలరాల్చి కౄరత్వాన్ని ప్రదర్శించిన రజాకార్లు కూటిగల్ మీద అదే ప్రతాపాన్ని చూపారు. 18 మందిని నిలబెట్టి రాక్షసంగా కాల్చిచంపారు. ఆ తర్వాత విమోచనకారులు నిజాంపై, రజాకార్లపై ఎదురుదాడులకు తిరిగారు. చాకలి ఐలమ్మ ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. పోరాటయోధులు తొర్రూరులో పోలీసు క్యాంపుపై దాడిచేసి దాన్ని లేవనెత్తించారు.కడవెండి అమ్మాపూర్ (తొర్రూర్),నాంచారిమడూర్కి చెందిన అనేకమంది పోరులో పాల్గొన్నారు.
హైదరాబాదు
మార్చుహైదరాబాదులో, ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో కూడా నిజాం, రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. నారాయణరావు పవార్, గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, వెదిరే రమణారెడ్డి, ఆర్.కేశవులు, తొండుపల్లి వెంకటరావు, మందుముల నర్సింగరావు, షోయబుల్లాఖాన్, కాటం లక్ష్మీనారాయణ తదితరులు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. నారాయణరావు పవార్ ఏకంగా నిజాంపై బాంబులు విసిరి సంచలనం సృష్టించాడు. షోయబుల్లాఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రచించినందుకు నడిరోడ్డుపైనే గుండాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. రజాకారుల నిరంకుశత్వానికి విసిగిపోయి శంషాబాద్ ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్‌తో కలిసి నిజాంపై బాంబుదాడిలో పాల్గొన్నాడు. రజాకార్లు సాగించిన అత్యాచారాలను వర్ణించాలంటే గుండెలు అదిరిపోవడమే కాదు కళ్లలోంచి రక్తాశ్రువులు ప్రవహిస్తాయి.[25] శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లో వేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.[26] ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు. వీరిలో మద్దికాయల ఓంకార్ ప్రముఖుడు. యాచారం ప్రాంతంలో బర్ల శివయ్య విమోచన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పరిగి మండలానికి చెందిన అల్కిచర్ల అంతయ్య, ధరూరు మండలానికి చెందిన రుమ్మ కిష్టప్పలు కూడా పోరాటంలో పాల్గొన్నారు. రాజాకార్ సైన్యంలోని ఒక శాఖ ఉన్న షాబాద్‌లో రజాకార్లను ఒంటిచేతితో ఎదుర్కొన్న ఘనత కిష్టయ్య జోషికి దక్కుతుంది. రజాకార్లు తుపాకులు, బల్లేలు పట్టుకొని గ్రామంలో తిరుగుతూ బలవంతపు వసూళ్ళూ, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న సమయంలో కిష్టయ్య జోషి ఇంటిలో మర్రిచెన్నారెడ్డి (మాజీ ముఖ్యమంత్రి), సత్యనారాయణ రెడ్డి (మాజీ గవర్నరు) తదితరులు సమావేశమై పోరాటమార్గం చేశారు.
విమోచనోద్యమ కాలంలో స్పూర్తినిచ్చిన గేయాలు
మార్చునిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ఎందరో కవులు, రచయితలు ప్రముఖపాత్ర వహించారు. వారు తమ కవితలు, రచనల ద్వారా ప్రజలలో జాగృతిని కల్పించడమే కాకుండా స్వయంగా ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు. దాశరథి లాంతి వారు కారాగారంలోనే ఉంటూ గోడలపై బొగ్గుతో నిజాం వ్యతిరేక కవితలు రాశారు, ప్రజాకవి కాళోజీ లాంటివారు స్థానిక ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉర్రూతలూగించే కవితలు జనంలోకి తీసుకువెళ్ళారు.
- నిజామనగ ఎంతరా ... వాడి తహతెంతరా...
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా.......- నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)
- నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
- మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........
కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె (కాళోజి)- నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా (యాదగిరి)
- నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
- ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని .......
నా తెలంగాణ కోటి రతనాల వీణ (దాశరథి కృష్ణమాచార్య)- నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న (దాశరథి కృష్ణమాచార్య)
- నిన్ను గెలవాలేక రైతన్నా......
- ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా!
ఈ జులుమీ జబర్ దస్తీ, వెగురదన్నీ వేయరా! (సుద్దాల హనుమంతు)- ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా?
అందరం కలిసి తంతే, అంతు దొరక కుందురా! (కొండేపూడి లక్ష్మీనారాయణ) (ఈతడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి)
- ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా?
- 0పాలన పేరుతో పల్లెపల్లెలో జరిగిన పాపము చాలింక
రక్షణ కై ఏర్పడిన బలగమే చేసే భక్షణ చాలింక (కాళోజి)
కాలరేఖ
మార్చు- 1930: మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నైజాం ఆంధ్రమహాసభ జరిగింది.
- 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
- 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
- 1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
- 1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
- 1946: నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
- 1947, డిసెంబరు 4: నిజాంపై నారాయణరావు పవార్ బాంబుదాడి.
- 1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగిలయ్య గౌడ్ హత్య.
- 1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.[27]
- 1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
- 1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
- 1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.
తెలంగాణ విలీనదినం
మార్చు- సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినంగా జరపాలని జేఏసీ నిర్ణయించింది. ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయజెండాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగరేయాలి. జాతీయగీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని సంస్మరించుకోవాలి' అని జేఏసీ ఛైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.[28]
- రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ 2022 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడురోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.[29][30]
సంగిశెట్టి శ్రీనివాస్ చెప్పిన కొన్ని విశేషాలు
మార్చు- 1950 ఏప్రిల్ 1న నిజాంకు, భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాంకు ఏడాదికి (ఎలాంటి పన్నులు లేకుండా) యాభై లక్షల రూపాయల భరణం చెల్లించడానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాదు రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా, 1956 అక్టోబరు 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉన్నారు.
- ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాదు న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం.
- రజాకార్లలో ముస్లింలతో బాటుగా శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు వారి అనుచరగణం కూడా ఉన్నారు.
- కమ్యూనిస్టులు ఆనాడు 'ఆజాద్ హైదరాబాదు' అనే నినాదమిచ్చారు.[31]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి, 2006 ప్రచురణ, పేజీ 176
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-209
- ↑ స్వాతంత్ర్య సమర నిర్మాతలు, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ ప్రచురణ, 1994, పేజీ 48
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ హైదరాబాదు విముక్తి పోరాటం, నిజాంపై బాంబుదాడి, స్వాతంత్ర్య సమరవీరుడు నారాయణరావు పవార్ (రచయిత- ఎ.పండరీనాథ్) ప్రథమ ముద్రణ జూలై 2010, పేజీ 5
- ↑ నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, ప్రచురణ 2001, పేజీ 43
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 16-09-2011
- ↑ నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, ప్రచురణ 2001, పేజీ 149
- ↑ ఈనాడు ఆదివారం అనుబంధం పుస్తకం, తేది 13-09-1998, ఎస్.ఎన్.శాస్త్రి వ్యాసం.
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ నిర్మల్ చరిత్ర, అంకం రాములు రచన, ప్రథమ ముద్రణ, మే 2007, పేజీ 38
- ↑ మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ 273
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఖమ్మం జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, నల్గొండ జిల్లా టాబ్లాయిడ్, తేది 16-09-2011
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, నల్గొండ జిల్లా టాబ్లాయిడ్, తేది 15-09-2011
- ↑ ఈనాడు దినపత్రిక, నల్గొండ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ ప్రజాశక్తి, మార్క్సిస్టు (3 November 2016). "విప్లవ యోధుడు మల్లు వెంకట నరసింహారెడ్డి". యు రామకృష్ణ. Archived from the original on 29 అక్టోబరు 2017. Retrieved 8 November 2017.
- ↑ సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 11, తేది 17.09.2008
- ↑ ఈనాడు దినపత్రిక, నిజామాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, నిజామాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 15-9-2011
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, నిజామాబాద్ జిల్లా టాబ్లాయిడ్, తేది 14-09-2011
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక, వరంగల్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ హైదరాబాదు విముక్తిపోరాటం, నిజాంపై బాంబుదాడి, స్వాతంత్ర్య సమరవీరుడు నారాయణరావు పవార్ (రచన- ఎ.పండరీనాథ్) ప్రథమముద్రణజూలై 2010, పేజీ 25
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2011
- ↑ ఈనాడు దినపత్రిక, హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-2009
- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక తేది 31-8-2010
- ↑ "Telangana News: సెప్టెంబరు 17 జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తాం: కేబినెట్". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
- ↑ telugu, NT News (2022-09-03). "కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం." Namasthe Telangana. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
- ↑ సంగిశెట్టి శ్రీనివాస్, తెలంగాణ హిస్టరీ సొసైటీ,ఆంధ్రజ్యోతి దినపత్రిక తేది 15-9-2010