ఎ.కోదండరామిరెడ్డి
ఎ. కోదండరామిరెడ్డి ఒక తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకునిగా ఇతని తొలిచిత్రం సంధ్య (1980). హిందీ చిత్రం తపస్య ఆధారంగా ఈ సినిమాను తీసారు. ఇది కుటుంబచిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. దానితో చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. చిరంజీవిని తారాపథానికి తీసుకెళ్ళిన ఖైదీ చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. న్యాయం కావాలి చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం ముఠా మేస్త్రి సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 25 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఆ కాలంలోని కథానాయకుల్లో ఒక్క ఎన్.టి.ఆర్తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసాడు. ఎ.కోదండరామిరెడ్డి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.[1]
ఎ.కోదండ రామిరెడ్డి | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1980-2009 |
జీవిత భాగస్వామి | భారతి |
పిల్లలు | సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి |
తల్లిదండ్రులు |
|
విశేషాలు
మార్చుకోదండరామిరెడ్డి నెల్లూరు జిల్లా మైపాడులో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వెంకూరెడ్డి, తల్లి రమణమ్మ. ఇందుకూరుపేట, నరసాపురంలలో చదువు కొనసాగించి, ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నాడు. విద్యార్థిదశనుండే నాటకాలంటే కోదండరామిరెడ్డికి పిచ్చి. పీయూసీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో రైలెక్కి మద్రాసు వచ్చాడు. అక్కడ తన బంధువు ప్రభాకరరెడ్డి ద్వారా పి.చంద్రశేఖరరెడ్డి పరిచయమయ్యాడు. అతని సలహా మేరకు హీరో వేషాలకై ప్రయత్నాలు మానివేసి మనుషులు మారాలి సినిమాకు వి.మధుసూధనరావు వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. వి.మధుసూధనరావు వద్ద సుమారు ఏడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు. ఇతడు దర్శకునిగా తొలి అవకాశం రామ్ రాబర్ట్ రహీమ్ సినిమాతో రావలసి ఉండగా నిర్మాత కొత్త దర్శకునితో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక పోవడంతో ఆ అవకాశం తప్పిపోయింది.[2] తరువాత ఇతడు సూర్యనారాయణబాబు నిర్మాతగా సుజాతను కథానాయికగా నిర్మించబడిన సంధ్య అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు.[3][4]
సంధ్య సినిమా తరువాత ఇతనితో క్రాంతి కుమార్ చిరంజీవి హీరోగా న్యాయం కావాలి సినిమా తీశాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇతని దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అభిలాష, రక్తసింధూరం, మరణమృదంగం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, వేట, కిరాతకుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ మొదలైన సినిమాలు సుమారు 25 వరకు వెలువడ్డాయి. చిరంజీవిని ఎక్కువ సినిమాలకు డైరెక్ట్ చేసిన ఘనత ఇతనికే దక్కింది.[3]
ఇతడు కృష్ణతో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీరుద్రయ్య వంటి సినిమాలు, నందమూరి బాలకృష్ణతో అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు, రక్తాభిషేకం, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం, నిప్పురవ్వ మొదలైన సినిమాలు, అక్కినేని నాగార్జునతో కిరాయిదాదా, విక్కీదాదా, ప్రెసిడెంటుగారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి సినిమాలు తీశాడు.[3] ఇంకా అక్కినేని నాగేశ్వరరావు, మోహన్ బాబు, కమల్ హాసన్ వంటి అనేక నటుల సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు.
ఇతని దర్శకత్వంలో రాధిక, శ్రీదేవి, మాధవి, రాధ, సుహాసిని, ఊర్వశి, జయసుధ, భానుప్రియ, జయప్రద, విజయశాంతి, శోభన, నిరోషా, రమ్యకృష్ణ, మాధురీ దీక్షిత్, రోజా, మీనా, గ్రేసీ సింగ్ వంటి కథానాయికలు నటించారు. రాధికను న్యాయం కావాలి చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయం చేశాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఇతని భార్య పేరు భారతి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సునీల్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఎం.బి.ఎ. చదివాడు. రెండవ కుమారుడు వైభవ్ రెడ్డి చెన్నైలో బి.కాం. చదివాడు. ఇతనికి సినిమాల పట్ల ఆసక్తి ఉంది. తండ్రితో పాటు షూటింగులలో పాల్గొన్నాడు. రాజశేఖర్‌తో తీసిన మొరటోడు నా మొగుడు సినిమాలో ఒక పాటలో నటించాడు. ఇద్దరూ ఇద్దరే సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో నటించాడు. ప్రస్తుతం వైభవ్ రెడ్డి సినిమా నటునిగా రాణిస్తున్నాడు. కథానాయకునిగా ఇతని తొలి సినిమా గొడవను తండ్రి కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించాడు.[3]
చిత్రసమాహారం
మార్చుదర్శకుడిగా
మార్చు- గొడవ (2007)
- తప్పుచేసి పప్పుకూడు (2002)
- ఒకటో నంబర్ కుర్రాడు (2002)
- ముఠా మేస్త్రి (1993)
- చిట్టెమ్మ మొగుడు (1992)
- జమై రాజా (1990)
- కొండవీటి దొంగ (1990)
- ఇద్దరూ ఇద్దరే (1990)
- అత్తకి యముడు అమ్మాయికి మొగుడు (1989)
- నారీ నారీ నడుమ మురారి (1989)
- త్రినేత్రుడు (1988)
- మరణ మృదంగం (1988)
- రక్తాభిషేకం (1988)
- జేబుదొంగ (1987)
- పసివాడి ప్రాణం (1987)
- దొంగ మొగుడు (1987)
- భార్గవ రాముడు (1987)
- రాక్షసుడు (1986)
- వేట (1986)
- కిరాతకుడు (1986)
- అనసూయమ్మగారి అల్లుడు (1986)
- దేశోద్ధారకులు (1986)
- విజేత (1985)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985)
- రక్త సింధూరం (1985)
- దొంగ (1985)
- మహా సంగ్రామం (1985)
- పల్నాటి సింహం (1985)
- రుస్తుం (1984)
- ఛాలెంజ్ (1984)
- అనుబంధం (1984)
- గూండా (1984)
- ఖైదీ (1983)
- శివుడు శివుడు శివుడు (1983)
- అభిలాష (1983)
- ప్రేమ పిచ్చోళ్ళు (1983)
- రామరాజ్యంలో భీమ రాజు (1983)
- శ్రీరంగనీతులు (1983)
- కిరాయి రౌడీలు (1981)
- న్యాయం కావాలి (1981)
రచయితగా
మార్చు- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989) (స్క్రీన్ ప్లే)
- దొంగ మొగుడు (1987) (కథ)
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు (1985) (స్క్రీన్ ప్లే)
- గూండా (1984) (స్క్రీన్ ప్లే)
- అభిలాష (1983) (స్క్రీన్ ప్లే)
నటుడిగా
మార్చు- రైన్ బో (2008)
పురస్కారాలు
మార్చుచలనచిత్ర రంగంలో ఇతడు చేసిన సేవలను గుర్తించి 2016లో ఉత్తర అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగిన నాటాసభలలో ఇతడికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు.[5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (9 April 2014). "వైఎస్ఆర్సీపీలో చేరిన కోదండరామిరెడ్డి, కారుమూరి". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ ఎ.కోదండరామిరెడ్డితో ఇంటర్వ్యూ
- ↑ 3.0 3.1 3.2 3.3 సంపాదకుడు (30 December 2007). "38 మెట్లు నేను ఎక్కా - ఎ.కోదండరామిరెడ్డితో ఇంటర్వ్యూ". ఈనాడు ఆదివారం. Retrieved 23 March 2018.
- ↑ కె.క్రాంతికుమార్ రెడ్డి (14 April 2013). "తొలి సంధ్య వేళలో". సాక్షి ఫన్‌డే. Retrieved 23 March 2018.
- ↑ అలరించిన నాటా[permanent dead link]