తెలుగు వర్ణమాలలో "ఋ" ఏడవ అక్షరం. (అంతర్జాతీయ ధ్వని వర్ణమాల) లో దీని సంకేతం [R]. అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల దీని సంకేతం [R], ఐఎస్ఒ 15919 లోనూ దీని సంకేతం [r̥]. దీని యూనీ కోడ్ U+0C0B.[1] ఇది హ్రస్వము (కురుచగా పలుకబడునవి) లలో ఒకటి.[2] వర్ణోత్పత్తి స్థానాములాలో ఈ అక్షరం మూర్ధన్యములకు (నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి) చెందినది.[3]

ఋ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

రక్షణ కోల్పోతున్న అక్షరం

మార్చు

ప్రస్తుతం "ఋ" అనే అక్షరానికి బదులు కొన్ని సందర్భాలలో "రు" గా రాస్తున్నారు. ఉదాహరణకు ‘ఋగ్వేదము’ అన్న పదాన్ని ‘రుగ్వేదము’ అని వ్రాస్తున్నారు. ‘ఋ’ వాడవలసిన చోట ‘రు’ వాడడంవల్ల రెండు రకాల వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. అర్థాలు మారిపోవడం మొదటిది. పద్య కవిత్వానికి ప్రాతిపదిక అయిన 'ఛందస్సు" నియమాలు భంగపడుతుండడం రెండవ వైపరీత్యం. ఋక్’ అని అంటే నిర్దిష్ట ఛందస్సుతో నిబద్ధమైన కవిత్వం. ఈ ఋక్కులతో కూడి వున్నది ఋగ్వేదము. ‘రుక్’ అని అంటే ‘రోగి’ అని అర్థము. ‘రుగ్వేదము’ అని అంటే ‘రోగాల వేదము’ లేదా ‘రోగుల వేదము’ అవుతోంది. ఇలా భాషను భ్రష్టుపట్టించడం ద్వారా భావాన్ని భంగపరుస్తున్నారు[4].ఇదే విషయంపై ప్రస్తావిస్తూ, మాకినీడి సూర్య భాస్కర్ తన వ్యాసం 'తెలుుగు లిపి పరిణామం - పరిశీలన'లో (తెలుగు అకాడమీ ప్రచురణ 1991 తెలుగు మాసపత్రిక) అంటారు - "1967 - 68 విద్యాసంవత్సరంలో తాను 1వ తరగతి చదువుతున్నప్పుడు 'ఋషి ', 'ౠష్మము' వంటి పదాలు ఉండేవనీ, ప్రస్తుతం అవి 'రు', 'రూ' లతో స్థానభ్రంశం చెంది దాదాపుగా మరుగున పడిపోయాయంటాడు. అలాగే 'ఐదు', 'ఔను' వంటి పదాలను' అయిదు', 'అవును' గా ప్రస్తుత కాలంలో రాస్తూండటం బట్టి, 'ఐ', ఔలు కూడా త్వరలో వాటి నెలవులు తప్పుతాయనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇంకా 'ఝ', 'ణ', 'ళ', 'శ', 'ష' వంటి అక్షరాలు కూడ కాలక్రమంలో తప్పుకుంటాయేమోో అని భయం వేస్తోందంటాడు. ఎందుకంటే, నేటి దినపత్రికల్లో వాటికి బదులుగా' జ', 'న', 'ల', 'స' అక్షషరాలను వాడటం పరిపాటైందని అంటాడు.

ఋప్రాసము

మార్చు

ఛందస్సులో ఋ అనే అక్షరం రేఫతో (ర తో) ప్రాస కుదరటమే ఋప్రాసము. యణాదేశ సంధిలో ఋ అనే అక్షరము ర గా మారుతుంది.[5] అలా "ర"కు, "ఋ" కు  ప్రాస పొసుగుటనే ఋప్రాసము అందురు. ఉదాహరణకు:

గారాబుసొగబుల యువతి
నారాధించి,తరియించఁగారాజెలమిన్
యారాణినిఁబెండ్లాడియు
తా ఋషి ధర్మంబుతోడ తరుణింగూడెన్.

పై ఉదా హరణలో  1, 2, 3   పాదాలలో రేఫ యు.,,4 వ పాదములో ఋ కారము ప్రాసాక్షారము గా వాడబడినది.[6]

సంధులలో

మార్చు
  • సవర్ణ దీర్ఘ సంధిలో ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును. ఉదాహరణకు

పితృ + ఋణము = పితౄణము

  • గుణసంధిలో అకారమునకు ఇ,ఉ,ఋ లు పరమయినపుడు ఏ,ఓ,ఆర్ లు ఏకాదేశముగా వచ్చును.

రాజ + ఋషి = రాజర్షి

  • యణాదేశ సంధిలో ఇ,ఉ,ఋ లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా య,వ,ర ఔ ఆదేశముగా వచ్చును.

దశ + ఋణము = దశార్ణము

శబ్దార్థము

మార్చు

ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) -1953 ప్రకారం అచ్చులలో నిది యేడవ యక్షరము. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) -1966 ప్రకారం వర్ణమాలలోని ఏడవ యక్షరము. హ్రస్వము. మూర్ధన్యము. హ్రస్వదీర్ఘప్లుతములు, ఉదాత్తానుదాత్త స్వరితములు, అనునాసికాననునాసికములు - అను భేదము గలిగి యిది మొత్తము పదునెనిమిది రూపములు కలదియగును. సావర్ణ్యమున ఇది పండ్రెండు విధములైన ఌకారమునకును సంజ్ఞయగును. ఏనుగు, కొండ, బుద్ధి విశేషము, దేవత, శతృవు వంటి అర్థాలున్నాయి.[7]

మూలాలు

మార్చు
  1. AG, Compart. "Find all Unicode Characters from Hieroglyphs to Dingbats – Unicode Compart". compart.com/en/unicode/U+0C0B (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  2. "పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/7 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-01-16.[permanent dead link]
  3. "పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/8 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-01-16.[permanent dead link]
  4. "రక్షణ కోల్పోతున్న అక్షరాలు.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  5. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-01-16.[permanent dead link]
  6. "తెలుగు వ్యాకరణం..." (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  7. "నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - AndhrabhArati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". www.andhrabharati.com. Archived from the original on 2014-02-09. Retrieved 2020-01-16.
"https://te.wikipedia.org/w/index.php?title=ఋ&oldid=4272379" నుండి వెలికితీశారు