నువ్వే కావాలి
నువ్వే కావాలి 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో తరుణ్, రిచా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవికిషోర్ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి రచయిత. కోటి సంగీతం అందించాడు. హరి అనుమోలు కెమెరా బాధ్యతలు నిర్వహించగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అక్టోబరు 13, 2000 న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
నువ్వే కావాలి | |
---|---|
దర్శకత్వం | కె. విజయ భాస్కర్ |
రచన | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
నిర్మాత | రామోజీరావు, స్రవంతి రవికిషోర్ |
తారాగణం | తరుణ్ , రిచా |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | అక్టోబరు 13, 2000 |
సినిమా నిడివి | 146 ని. |
భాష | తెలుగు |
బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ కు కథానాయకుడిగా ఇదే మొదటి సినిమా. ఇది హిందీలో తుఝే మేరీ కసమ్ అనే పేరుతో పునర్మించారు. మలయాళ చిత్రం నిరం ఈ చిత్రానికి మాతృక.
కథ
మార్చుతరుణ్, మధు చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరిదీ విడదీయరాని స్నేహం. ఇద్దరూ ఒకేరోజు, ఒకే హాస్పిటల్లో పుట్టి ఉంటారు. వాళ్ళ కుటుంబాల మధ్య కూడా అంతే స్నేహం ఉంటుంది. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని అందరికీ తెలుసు. వర్ష అనే అమ్మాయి తరుణ్ ని మనసులోనే ఆరాధిస్తుంటుంది. తరుణ్, మధు చనువుగా తిరగడం చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అని అడుగుతుంది. దానికి తరుణ్ నవ్వుతూ కొట్టి పడేస్తాడు. ఒకసారి పాటల పోటీల్లో మొదటి బహుమతి సాధించిన ప్రకాష్ అనే అబ్బాయి అదే కళాశాలలో చేరతాడు. మధును చూడగానే మనసు పారేసుకుంటాడు.
నటవర్గం
మార్చు- తరుణ్ గా తరుణ్
- మధు గా రిచా పల్లాడ్[1]
- ప్రకాష్ గా సాయి కిరణ్
- సునీల్
- ఎం. ఎస్. నారాయణ
- గిరిబాబు
- చలపతిరావు
- రుక్కు గా కోవై సరళ
- ఢిల్లీ రాజేశ్వరి
- లైలా
- శంకర్ మెల్కోటే
- ప్రకాష్ బామ్మ గా అన్నపూర్ణ
- వర్ష (వర్ష)
నిర్మాణం
మార్చుఈ చిత్రాన్ని నిర్మించాలని మొదట అనుకున్నది ఎక్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి రవికిషోర్. ఈ చిత్రానికి మలయాళీ మాతృకయైన నిరం చూసినప్పటి నుండి అలాంటి సినిమా తెలుగులో కూడా చేస్తే బాగుంటుందని రవికిషోర్ అనుకున్నాడు. దర్శకుడు కె. విజయభాస్కర్ ను సంప్రదించి తన ఆలోచన చెప్పాడు. తర్వాత రవికిషోర్, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్ లు ముగ్గురూ కలిసి మళ్ళీ ఆ సినిమా చూసి స్క్రిప్టు తయారు చేశారు. నిరం చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా తెలుగులో సన్నివేశాలు చాలా వరకు వేరుగా ఉంటాయి. కానీ ఆ సమయానికి రవికిషోర్ ఆర్థిక స్తోమత సరిగాలేదు. అంతకు మునుపే ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు రవికిషోర్ తో కలిసి మంచి సినిమా చేయాలని అనుకుని ఉన్నారు. దాంతో రామోజీరావును చిత్ర నిర్మాణంలో సహాయం చేయమని కోరాడు. రవికిషోర్ పనితనం మీద నమ్మకం ఉన్న రామోజీరావు తెలుగు స్క్రిప్టు పూర్తిగా చూడకుండగానే నిర్మాతగా ఉండటానికి అంగీకరించాడు.[2]
నటీ నటుల ఎంపిక
మార్చుఒక మంచి యువ నటుడితో బడ్జెట్ లో సినిమా తీసి లాభాలు అందుకోవాలని రవికిషోర్ ఆలోచన. అప్పుడే మహేష్ బాబు కథానాయకుడిగా ప్రవేశించాడు. అతనికి నిరం చిత్రం చూడమని ప్రింట్ పంపించాడు. రెండు నెలలయినా స్పందన రాలేదు. రెండో ప్రత్యామ్నాయంగా సుమంత్ అనుకున్నారు. కానీ సుమంత్ అప్పటికే యువకుడు, పెళ్ళిసంబంధం చిత్రాల్లో నటిస్తూ ఖాళీ లేకుండా ఉన్నాడు.[3] తర్వాత రాం గోపాల్ వర్మ హిందీ సినిమా మస్త్ లో నటిస్తున్న ఆఫ్తాబ్ శివదాసానీ ని కూడా పరిశీలించారు. అయితే తమ బడ్జెట్ లో అయ్యేలా కనిపించలేదు. చివరగా కొత్త వాళ్ళతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన తరుణ్ పెద్దయిన తర్వాత ఒక వ్యాపార ప్రకటనలో కనిపించాడు. తరుణ్ కుటుంబం కూడా అతన్ని కథానాయకుడిగా ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే రవికిషోర్ తమ సినిమాను గురించి చెప్పి అతన్ని ఒప్పించారు. ఆ సినిమాకు తరుణ్ పారితోషికం 3 లక్షలు. కథానాయిక కోసం చాలా వెతుకులాట జరిగింది. చివరికి వద్దనుకున్న ఫోటోల్లో మళ్ళీ వెతుకుతుంటే రిచా సరిపోతుందనిపించింది. రెండో కథానాయకుడిగా గాయకుడు రామకృష్ణ కొడుకు సాయికిరణ్ ను ఎంచుకున్నారు.[4]
విడుదల, ఫలితం
మార్చుఈ చిత్రం అక్టోబరు 13, 2000 న విడుదలైంది. మొదట్లో ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి. హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండీ ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.[5] సుమారు మూడు కోట్లమందికి పైగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసినట్లు ఒక అంచనా. 1.3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.[5] ఈ చిత్ర విజయంతో స్రవంతి రవికిషోర్ ఆర్థిక కష్టాలు కూడా తీరిపోయాయి.
సాంకేతిక సిబ్బంది
మార్చు- దర్శకత్వం: కె. విజయ భాస్కర్
- రచయిత: త్రివిక్రమ్ శ్రీనివాస్
- కెమెరా: హరి అనుమోలు
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
- నృత్యాలు: సుచిత్ర చంద్రబోస్
పురస్కారాలు
మార్చుపాటలు
మార్చుఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. ఈ చిత్రానికి సంగీతం కూర్చడానికి కోటి 15 రోజుల సమయం తీసుకున్నాడు. చెన్నైలో ఒంటరిగా ఆలోచించి బాణీలు సిద్ధం చేసుకుని వచ్చాడు. తర్వాత చిత్ర బృందానికి ఆ బాణీలు వినిపించగా వారు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. మాధుర్య ప్రధానమైన సంగీతం కావాలన్నారు. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది పాట బాణీ వినిపించాడు. దర్శకుడు కె. విజయభాస్కర్, నిర్మాత స్రవంతి రవికిషోర్ కు అది బాగా నచ్చింది. తర్వాత మిగతా పాటలకు బాణీలు కట్టాడు.[6]
- అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే, రచన: భువనచంద్ర , గానం. దేవన్, అనురాధ శ్రీరామ్.
- అనగనగా ఆకాశం ఉందీ గానం: జయచంద్రన్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
- ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ,గానం: శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- షుక్రియా షుక్రియా , రచన: భువనచంద్ర , గానం. కోటి, సుజాత మోహన్
- ఓలే ఓలె ఒలే, రచన: భువన చంద్ర, గానం. రాధిక
- కళ్ళలోకి కళ్ళు పెట్టి గానం: కె. ఎస్. చిత్ర , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
- ↑ "'నువ్వేకావాలి' తెర వెనుక కథ ఇదే..!". www.eenadu.net. Retrieved 2020-10-12.
- ↑ "అందుకే 'నువ్వేకావాలి' వదులుకున్నా". EENADU. Retrieved 2024-08-09.
- ↑ "ఫ్లాష్ బ్యాక్ - మేకింగ్ ఆఫ్ నువ్వే కావాలి - Telugu 360". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
- ↑ 5.0 5.1 Focus, Filmy; Focus, Filmy. "20 ఏళ్ళ 'నువ్వే కావాలి' గురించి మనకు తెలియని నిజాలు..!". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-17. Retrieved 2020-10-16.
- ↑ "'నువ్వేకావాలి' పాటల వెనుక కథ ఇది!". www.eenadu.net. Retrieved 2020-10-10.