నాగభూషణం (నటుడు)

నటుడు
(చక్రవర్తుల నాగభూషణం నుండి దారిమార్పు చెందింది)

చుండి నాగభూషణం (మార్చి19, 1922 - మే 5, 1995) తెలుగు సినిమా, రంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు.[2] విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను.

నాగభూషణం
నాగభూషణం
జననంచుండి నాగభూషణం
మార్చి 19, 1922
అనకర్పూడి,
ప్రకాశం జిల్లా
మరణం1995 మే 5(1995-05-05) (వయసు 73)[1][1]
ఇతర పేర్లురక్తకన్నీరు నాగభూషణం
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు,
రంగస్థల నటుడు

జీవిత విశేషాలు

మార్చు

ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు ఆర్థికలోపం కారణంగా వెనకడుగువేయడంతో ఉద్యోగాన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు నెలకు పాతిక రూపాయల జీతంతో సెంట్రల్ కమర్షియల్ సూపరిడెంట్ కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. దాంతో మద్రాసుకు మకాం మర్చారు. 1941లో సుబ్బరత్నంతో వివాహం జరిగింది. ఆమె అకాల మరణంతో శశిరేఖను మారు వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు వీరి సంతానం. ఎస్.వి.రంగారావు కొన్ని సాంఘిక చిత్రాలలో ప్రతినాయకుని వేషం వేసినా అవి సంఖ్యాపరంగా చాలా తక్కువ. ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, సత్యనారాయణలు కథానాయకునితో ఫైటింగులు చేసే ప్రతినాయకులు. విలనిజానికి ఒక ప్రత్యేక పంథాను ప్రవేశపెట్టి, కామెడీ టచ్ ఇచ్చిన నటులు నాగభూషణం. కథను హీరో నడిపిస్తుంటే ఆ హీరోను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడానికి కథలో విలనుండాలి. అందులో ఆరితేరినవాడు, కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెరరూపం నాగభూషణం. హీరో విరుచుకు పడటానికి వచ్చినప్పుడు అతనికి కావల్సినదేదో ఇచ్చి పంపేసి.. ఆనక ఇరకాటంలో పడవేయడంలో నేర్పరి నాగభూషణం. ఈయన హీరోతో ప్రత్యక్షంగా ఫైటింగుల్లో పాల్గొనరు. ఆయన తరఫు వారంతా హీరోతో పోరాడాక మహా ఐతే ఒకటి రెండు దెబ్బలు తినేవారు. 1952లో పల్లెటూరు చిత్రంతో ప్రవేశించి తొంభయ్యవ దశకం వరకూ చిత్రాలలో నటించారు. ఏది నిజం చిత్రంలో హీరోగా నటించినా మంచి మనసులు(1962) చిత్రంతో గుర్తింపు పొంది రెండు దశాబ్దాల పాటు ఉజ్వలంగా ప్రకాశించారు. ఈయన సృష్టించిన ఒరవడి తరువాత రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు ద్వారా కొనసాగింది.

నాటకాలు

మార్చు

ఆ కాలంలో అందరిలాగే ఆయన తొలుత స్టేజీ ఎక్కి, అందరి నటుల్లాగానే చప్పట్లనే జీతభత్యాలుగా భావించి వాటికి మైమరచిన నటుడు. చిన్నతనం నుండి నాటక రంగంపై మక్కువ పెంచుకున్నారు. ఆయనలోని నిజమైన నటుడ్ని వెలికి తీసింది మద్రాస్ నాటక రంగమే. మద్రాసు చేరే దాకా ఆయనకు నాటకాలంటే ఏమిటో తెలియదు. ఆయనలోని నటుడ్ని మేల్కొల్పిన వారు జి. వరలక్ష్మి, మిక్కిలినేని. ఆనాటికే ఎం.ఆర్. రాధా, సిలోన్ మనోహర్ వంటి ప్రయోక్తలు తమిళనాటకాలను భారీ సెట్టింగులతో దుమ్ము రేపేవాళ్లు. అదే నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది. చిన్నప్పటి నుంచీ వామపక్ష భావజాలానికి ఆకర్షితుడవుతూ వచ్చారు. ప్రజానాట్యమండలి, ఆ ఇద్దరితో పరిచయానికి ప్రాణం పోసింది. వారితో కలిసి ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో విరివిగా పాల్గొనేవారు. అలా నాగభూషణం-నటజీవితానికి బీజం పడింది. దాని ఫలితం ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. చదువుకొనేటప్పుడు, ఉద్యోగ జీవితంలోను (రైల్వే), నటజీవీవితంలోను (ఉన్నతస్థాయి ఉన్నప్పుడు కూడా) నాటకరంగాన్ని విడిచిపపెట్టలేదు. ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది "రక్తకన్నీరు" నాటకం గురించి. ఎమ్మార్ రాధా, మనోహర్ ఆడిన రక్తకన్నీర్ నాటకం ఆనాడు పెద్ద స్టేజ్ ప్లే సెన్సేషన్. దాన్ని తెలుగునాట చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన నాగభూషణం జీవితంలో ఓ మలుపు. సుమారు 5వేలా 500ల ప్రదర్శనలు చేసింది రక్తకన్నీరు. ఆఖరుకు అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ ఊపు సినిమా తీరాలకు చేర్చిందాయన్ను. అక్కడి నుంచి నాగభూషణం ప్రతినాయక పాత్రకు నిజంగానే భూషణంగా మారాడు. అదీ నాగభూషణం అంటే...

ఎమ్.ఆర్. రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్త కన్నీరు పేరుతో వ్రాయించి సుమారు రెండు వేల ప్రదర్శనలు ఇచ్చారు. రవి ఆర్ట్స్ థియేటరు (1956 నుండి) పేరు మీద అనేక నాటకాలు వేసి 30కుటుంబాలకు ఉపాధి కల్పించారు.

సినీ జీవితం

మార్చు

నటజీవితపు తొలిరోజుల్లో నటించిన చిత్రాలు అంత పేరు తేలేదు. పీపుల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు (1952) సినిమాలో నాగభూషణం చిన్న వేషం వేసారు. ఆ తరువాతపెంకి పెళ్లాం (1956)లో వేసిన తాగుబోతు వేషం, అమరసందేశం (1954)లో వేసిన విలన్ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అలాగే హీరోకావాలన్న కాంక్ష కూడా మనసులో బలంగా వుండేది. 1957లో వచ్చిన ఏది నిజం సినిమాతో ఎట్టకేలకు కథానాయకుడయ్యారు. ఆ సినిమాకు అన్నీ తానై చేశాడు నాగభూషణం. సినిమా బాగానే ఆడింది. రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. కొంత కాలం డబ్బింగు ఆర్టిస్టుగా పనిచేశారు. ఐతే మంచి మనసులు (మూలచిత్రం ‘కుముదం’లో ఎం.ఆర్‌. రాధ పాత్ర) చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. విలక్షణమైన సంభాషణా విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. పౌరాణిక పాత్రల్లో శివుడు (భూకైలాస్), సాత్యకి , మాయాబజార్ (1957) లో సహాయక పాత్ర, పౌండ్రక వాసుదేవుడు (శ్రీకృష్ణవిజయం), శకుని (కురుక్షేత్రం) మొదలైన పాత్రలు ధరించారు. హీరో వేషాలు కాదు కదా అసలు సాదా సీదా వేషాలకే అడ్డంకి ఏర్పడింది. హీరో వేషం వేసినవాడు మామూలు వేషాలు వేస్తాడా అన్న అనుమానంలో పడింది అప్పటి ఇండస్ట్రీ. 1960లో సుందర్ లాల్ నహతా, డూండీలు శభాష్ రాజా సినిమా తీస్తూ నాగభూషణానికి మంచి వేషం ఇచ్చారు. అంతే.. దశ తిరిగింది.

ఎన్టీరామారావుకు నాగభూషణం అంటే అభిమానం ఉండేది. తన స్వంత సినిమాలు ఉమ్మడికుటుంబం, వరకట్నం, తల్లాపెళ్లామా, కోడలుదిద్దిన కాపురం, ఇలా అన్నింటిలోనూ ఆయనకు వరుస వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో ఆయన సూర్యకాంతానికి జంటగా వేసిన ముసలి వేషంలో సైతం ప్రేక్షకజనానికి కితకితలు పెట్టారు. బాపు- రమణల బాలరాజుకథలోని పనిగండం మల్లయ్య పాత్ర తెలుగుప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. నాగభూషణం నటన గురించి చెప్పుకోడానికి ఇదీ అదని ఒక సినిమా కాదు ఆయన నటించిన ఏ సినిమా తీసుకున్నా నాగభూషణం ఓ నటభూషణమై మెరుస్తారు.

నిర్మాతగా

మార్చు

నాటక సంస్థ రవి ఆర్ట్‌ థియేటర్స్‌ పేరుతో నాటకాల రాయుడు (1969), ఒకే కుటుంబం (1970) చిత్రాలు నిర్మించారు నాగభూషణం. నాటకాల రాయుడుకి భగవాన్ హీరోగా నటించిన ‘అల్‌బేలా’ (1951) హిందీ చిత్రం ఆధారం. (హిందీ పాట' నిందియా ఆజారే ఆజా '(సి. రామచంద్ర స్వరరచన) వరుసలోనె తెలుగులో 'నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రావమ్మా రా' స్వరపరచారు.) ఒకే కుటుంబంకు తమిళచిత్రం ‘పాపమన్నిప్పు’ ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగు చేశారు. అందులో ఎం.ఆర్‌.రాధాకి నాగభూషణమే డబ్బింగ్‌ చెప్పారు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్.టి.ఆర్, కాంతారావులతో తిరిగి నిర్మించారు.

నటనా శైలి

మార్చు

నాటకీయతో కూడిన తనదైన ప్రత్యేకశైలితో ‘నాగభూషణం మార్కు’ను ఆయన సృష్టించారు. ఈ శైలి తరువాత అనేక మందిచే అనుకరించబడింది. దాసరి నారాయణరావు ఒక చిత్రంలో పూర్తిగా నాగభూషణం బాణీలో నటించారు. విలన్‌ పాత్రలతో పాటు ఆడపిల్లల తండ్రి (74) లాంటి సినిమాల్లో కరుణ రసాత్మకమైన పాత్రలు వేశారు. అమ్మమాట, కథానాయకుడు, అడవిరాముడు చిత్రాలలో నాగభూషణం నటనను గమనిస్తే తర్వాత కాలంలో రావు గోపాలరావు ధరించిన అనేక పాత్రలలో నాగభూషణం ముద్ర కనిపిస్తుంది. (అడవి రాముడు -వేటగాడు చిత్రాలలో పాత్రలు ప్రత్యేక గమనార్హం). ఆయన అడవి రాముడు చిత్రంలోచెప్పిన 'చరిత్ర అడక్కు చెప్పింది విను' 'షేక్ చినమస్తాన్‌లా' మొదలైన సంభాషణలు చాలాకాలం ప్రేక్షకుల నోళ్ళలో నానాయి.

నిజజీవితంలో కథానాయకుడే

మార్చు

సాంగ్స్ అండ్ డ్రామా కమిటీలో సలహాసంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమనిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వుంది. ఎన్ని సినిమాలు చేసినా నాగభూషణం రక్తకన్నీరు దేశవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ ఆ 25ఏళ్ల పాటూ మూడు వందల మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెరమీద హీరో వేషాల్లో అడుగడుక్కీ విఫలమవుతూ ఎంత విలన్ గా రాణిస్తూ వచ్చినా నిజజీవితంలో ఆయన కథానాయకుడే అని చెప్పడానకి ఇదొక్కటి చాలు.

తెలుగు సినిమాల జాబితా

మార్చు

ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

  1. పల్లెటూరు (1952)
  2. ఏది నిజం?(1956)
  3. పెంకి పెళ్ళాం (1956)
  4. బికారి రాముడు (1961)
  5. మంచి మనసులు (1962)
  6. వింత కాపురం (1968)
  7. ఆదర్శ కుటుంబం (1969)
  8. కథానాయకుడు (1969)
  9. ధర్మపత్ని(1969)
  10. ముహూర్త బలం (1969)
  11. అదృష్ట జాతకుడు (1970)
  12. అల్లుడే మేనల్లుడు (1970)
  13. ఆడజన్మ (1970)
  14. ద్రోహి (1970)
  15. పెళ్లి కూతురు (1970)
  16. మా మంచి అక్కయ్య (1970)
  17. కథానాయకురాలు (1971)
  18. కళ్యాణ మంటపం (1971)
  19. తాసిల్దారుగారి అమ్మాయి (1971)
  20. వింత దంపతులు (1972)
  21. ఇదా లోకం (1973)
  22. పూల మాల (1973)
  23. మొగుడా- పెళ్ళామా (1975)
  24. గంగ యమున సరస్వతి (1976)
  25. అదృష్టవంతురాలు (1977)
  26. ఈనాటి బంధం ఏనాటిదో (1977)[3]
  27. విచిత్ర జీవితం (1978)
  28. మేలుకొలుపు (1978)
  29. శ్రీరామరక్ష (1978)
  30. ముత్తయిదువ (1979)
  31. వియ్యాలవారి కయ్యాలు (1979)
  32. శంఖుతీర్థం (1979)
  33. గయ్యాళి గంగమ్మ (1980)
  34. గూటిలోని రామచిలక (1980)
  35. జాతర (1980)
  36. పంచ కళ్యాణి (1980)
  37. పెళ్ళిగోల (1980)
  38. పొదరిల్లు (1980)
  39. టింగు రంగడు (1982)

విశేషాలు

మార్చు
  • అటు సినిమాల్లోనూ, రంగస్థలం మీదా ఏకకాలంలో ‘బిజీస్టార్‌’ అనిపించుకున్న ఏకైక నటుడుగా నాగభూషణానికి పేరుంది.
  • ఒక్క ‘రక్తకన్నీరు’ నాటకాన్నే ఆయన దాదాపు రెండువేల ప్రదర్శనలు ఇవ్వగలిగారు.
  • బిజీస్టార్‌ కాకముందు ఒకే నెలలో ముప్పయ్‌ ప్రదర్శనలు, ఒకేరాత్రిలో రెండు ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనతా నాగభూషణం సాధించారు.
  • సినిమాలకి సంబంధించీ, నాటకాలకి సంబంధించీ - రెండువేపుల నుంచీ ఆయనకి సత్కారాలూ, గౌరవాలూ చాలా లభించాయి.
  • ప్రముఖ నటీమణులు వాణీశ్రీ, శారద మొదట్లో ఆయన నాటక బృందంలో వుండేవారు.

వనరులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Important people of Nellore- Nagabhushanam". Archived from the original on 2013-04-11. Retrieved 2014-12-18.
  2. "Nagabhushanam biography at Early Tollywood.com". Archived from the original on 2013-01-02. Retrieved 2014-12-18.
  3. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.

యితర లింకులు

మార్చు