పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)

(పి.సి.రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పి.చంద్రశేఖరరెడ్డి (1933, అక్టోబరు 15 - 2022, జనవరి 3) తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దాదాపు 80 సినిమాలకు దర్శకత్వం వహించాడు.

పి.చంద్రశేఖర రెడ్డి

P. Chandrasekhara Reddy (1933, October 15 - 2022, January 3) was a Telugu film director. He has directed about 80 films.

విశేషాలు

మార్చు

పి.సి.రెడ్డి, పి.చంద్రశేఖరరెడ్డిగా సినిమారంగంలో పరిచితుడైన పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రంపేట మండలానికి చెందిన అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతని తండ్రి ఆ గ్రామ మునసబుగా పనిచేశాడు. ఇతడు ఆ గ్రామంలో మూడవ తరగతి వరకు చదివి పై చదువులకు మద్రాసు వెళ్ళి తన అన్నయ్య బలరామిరెడ్డి వద్ద పెరిగాడు. మద్రాసులో నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ పచ్చయప్ప కళాశాలలో చదివాడు. అక్కడ ప్రముఖ దర్శకుడు వి.మధుసూధనరావు, వల్లం నరసింహారావులు ఇతనికి పరిచయమయ్యారు.[2]

సినిమారంగం

మార్చు

ఇతడు వల్లం నరసింహారావు ప్రోద్బలంతో శ్రీకృష్ణ రాయబారం చిత్రానికి ఎన్.జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా 1959లో చేరి సినీరంగ ప్రవేశం చేశాడు. తరువాత వి.మధుసూధనరావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా 11 సంవత్సరాలు పనిచేశాడు. తరువాత ఆదుర్తి సుబ్బారావు వద్ద పూలరంగడు సినిమాకు కో డైరెక్టర్‌గా చేశాడు. ఇలా 11 ఏళ్ళకు పైగా అనుభవం సంపాదించుకున్న తర్వాత ఇతడు అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించాడు. అనూరాధ మొదట దర్శకత్వం వహించిన సినిమా అయినా మొదట విడుదలైన సినిమాలు విచిత్ర దాంపత్యం, అత్తలు కోడళ్లు. ఇవి 1971 ఏప్రిల్ 14వ తేదీన విడుదలయ్యాయి. కొత్త దర్శకుని రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైన అరుదైన సందర్భం ఇది. అనూరాధ కూడా అదే సంవత్సరంలో విడుదలై ఒక దర్శకుని మూడు సినిమాలు ఒకే సంవత్సరం విడుదలైన రికార్డు సృష్టించాడు. తరువాత ఇతడు 2005 వరకు సుమారు 75 సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2005 తరువాత ఇతడు సినిమాలకు దూరమైనా కొన్ని టి.వి.సీరియళ్లకు దర్శకత్వం వహించాడు. ఇటీవల వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా నిర్మించబడి 2014 డిసెంబరు 19న విడుదలైన జగన్నాయకుడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[3] బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య, పి.ఎన్.రామచంద్రరావు, శరత్, వై.కె.నాగేశ్వరరావు మొదలైనవారు ఇతని వద్ద శిష్యరికం చేసి తరువాత గొప్ప దర్శకులుగా ఎదిగారు.[4]

దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు

మార్చు
  1. అత్తలు కోడళ్లు (1971)
  2. అనురాధ (1971)
  3. విచిత్ర దాంపత్యం (1971)
  4. ఇల్లు ఇల్లాలు (1972)
  5. బడిపంతులు (1972)
  6. మానవుడు - దానవుడు (1972)
  7. తల్లీ కొడుకులు (1973)
  8. మమత (1973)
  9. స్నేహ బంధం (1973)
  10. గౌరి (1974)
  11. పెద్దలు మారాలి (1974)
  12. కొత్త కాపురం (1975)
  13. పండంటి సంసారం (1975)
  14. పుట్టింటి గౌరవం (1975)
  15. సౌభాగ్యవతి (1975)
  16. పాడిపంటలు (1976)
  17. ఒకే రక్తం (1977)
  18. జన్మజన్మల బంధం (1977)
  19. పల్లెసీమ (1977)
  20. భలే అల్లుడు (1977)
  21. అనుకున్నది సాధిస్తా (1978)
  22. నాయుడుబావ (1978)
  23. పట్నవాసం (1978)
  24. రాముడు-రంగడు (1978)
  25. స్వర్గసీమ (1978)
  26. ముత్తయిదువ (1979)
  27. మానవుడు - మహనీయుడు (1980)
  28. భోగభాగ్యాలు (1981)
  29. జగ్గు (1982)
  30. పగబట్టిన సింహం (1982)
  31. బంగారు భూమి (1982)
  32. నవోదయం (1983)
  33. ప్రళయ గర్జన (1983)
  34. పులిజూదం (1984)
  35. ప్రళయ సింహం (1984)
  36. యమదూతలు (1984)
  37. ఈ ప్రశ్నకు బదులేది (1985)
  38. మాయలాడి (1985)
  39. రగిలేగుండెలు (1985)
  40. నా పిలుపే ప్రభంజనం (1986)
  41. అత్తగారు జిందాబాద్ (1987)
  42. తాండవ కృష్ణుడు (1987)
  43. పరాశక్తి (1987)
  44. ముద్దు బిడ్డ (1987)
  45. ఉక్కు సంకెళ్ళు (1988)
  46. రాకీ (1988)
  47. తొలిపొద్దు (1991)
  48. కాలచక్రం (1993)

పి. చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ 2022, జనవరి 3న చెన్నైలో మరణించాడు.[5][6]

మూలాలు

మార్చు
  1. సినీగోయర్స్ డాట్ కామ్‌ కు పి.సి.రెడ్డి ఇచ్చిన ఇంటర్యూ ఆధారంగా
  2. "కుటుంబకథా చిత్రాల దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి". NTV (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-14. Archived from the original on 2022-01-03. Retrieved 2022-01-03.
  3. "రాజా కథానాయకుడిగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో 'జగన్నాయకుడు' చిత్రం ప్రారంభం". Archived from the original on 2020-08-14. Retrieved 2017-02-28.
  4. "పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి.. సూపర్ స్టార్ కృష్ణ ఎమోషనల్". Samayam Telugu. Retrieved 2022-01-03.
  5. Sakshi (3 January 2022). "విషాదం: ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ మృతి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
  6. Namasthe Telangana (3 January 2022). "సినీ ద‌ర్శ‌కుడు పి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నుమూత‌". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.