సూరపనేని శ్రీధర్

సినీ నటుడు

సూరపనేని శ్రీధర్ (డిసెంబర్ 21, 1939 - జూలై 11, 2007) తెలుగు సినిమా నటుడు. మూడు దశకాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో సుమారు 150 సినిమాలలో నటించిన శ్రీధర్ తెలుగు సినిమా రంగములో ముత్యాల ముగ్గు సినిమాతో గుర్తింపు పొందాడు.

సూరపనేని శ్రీధర్
Telugucinema muthyalamuggu4.jpg
ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీధర్
జననం
సూరపనేని శ్రీధర్

డిసెంబర్ 21, 1939
మరణంజూలై 11, 2007
విద్యబి.ఏ
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1975-1994
పిల్లలుముగ్గురు అమ్మాయిలు

జననంసవరించు

కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.[1] మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వపనుల శాఖలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళుతూ బి.ఏ పూర్తిచేశాడు. కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యాడు. పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఈయన ప్రధానపాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ యొక్క ద్వితీయ బహుమతి అందుకున్నాడు.[2]

ఒకప్పుడు ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలన్నింటిలోనూ శ్రీధర్ కనిపించేవాడు. జస్టిస్ ఛౌదరి సినిమాలో ఎన్టీ రామారావు కొడుకుగా నటించాడు. ప్రతిభావంతమైన కళాకారుడైన శ్రీధర్ ఏనాడు వేషాలకోసం అర్ధించలేదు. తనకు అవకాశం వచ్చిన సినిమాలలో నటించాడు. నటుడిగా ఉండగా ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులతో, తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు.[3]

చివరాఖరిలో ఆయనకు టివి సీరియళ్లు అవకాశం వెతుక్కుంటూ వస్తే అందులో నటించడానికి ఇష్టపడలేదు. ఆ సీరియళ్లు నటిస్తే శ్రమ ఎక్కువ తప్పితే ఆర్థికంగా ఫలితాలు బహు తక్కువ అని తెలుసుకుని నటనకు దూరంగా ఉన్నాడు. స్వంతచిత్ర నిర్మాణాలపై ఆసక్తి కనబరచలేదు. హీరోవేషాలు వస్తున్నప్పుడు శ్రీధర్‌చే ఎన్‌టిఆర్‌ తనస్వంతచిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. దాంతో శ్రీధర్‌కు వచ్చే హీరోవేషాలు కూడా రాకుండా పోయాయి. అంతకుముందు ఎన్‌టిఆర్‌ గుహుడు వేషానికి డ్రయివర్‌రాముడులో సెకెండ్‌హీరో వేషానికి లింకుపెట్టి ఇచ్చారు. కానీ, డ్రయివర్‌రాముడు చిత్రం హిట్‌కూడా శ్రీధర్‌ను మరిన్ని చిత్రాలలో హీరోని చేయలేకపోయాయి. సహాయ పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇలా శ్రీధర్‌కు తాను నటించిన హిట్‌చిత్రాలు ఎలాంటి లాభాలను చేకూర్చలేదనే చెప్పాలి. ఆయన విభిన్న పాత్రల్లో కనిపించాడు. వాటిల్లో అమెరికాఅమ్మాయి, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలున్నాయి.[4] ఈయన కనిపించిన చివరి చిత్రం గోవిందా గోవిందా.

సినిమాల జాబితాసవరించు

 1. తల్లా? పెళ్లామా? (1970)
 2. విశాలి (1973)
 3. చక్రవాకం (1974)
 4. దేవదాసు (1974)
 5. మాంగల్య భాగ్యం (1974)
 6. ముత్యాల ముగ్గు (1975)
 7. యశోదకృష్ణ (1975)
 8. శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
 9. అమెరికా అమ్మాయి (1976)
 10. దొరలు దొంగలు (1976)
 11. బంగారు మనిషి (1976)
 12. భక్త కన్నప్ప (1976)
 13. వెలుగుబాటలు (1976)
 14. అడవి రాముడు (1977)
 15. తరం మారింది (1977)
 16. మనవడి కోసం (1977)
 17. అంగడిబొమ్మ (1978)
 18. ఇంద్రధనుస్సు (1978)
 19. కరుణామయుడు (1978)
 20. గోరంత దీపం (1978)
 21. పల్లెసీమ (1978)
 22. బొమ్మరిల్లు (1978)
 23. శ్రీరామ పట్టాభిషేకం (1978)
 24. సీతామాలక్ష్మి (1978)
 25. జూదగాడు (1979)
 26. డ్రైవర్ రాముడు (1979)
 27. బొట్టు కాటుక (1979)
 28. ఆడది గడప దాటితే (1980)
 29. కలియుగ రావణాసురుడు (1980)
 30. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
 31. పొదరిల్లు (1980)
 32. బంగారు బావ (1980)
 33. మంచిని పెంచాలి (1980)
 34. మూగకు మాటొస్తే (1980)
 35. సంధ్య (1980)
 36. సంసార బంధం (1980)
 37. దేవుడు మావయ్య (1981)
 38. మా పెళ్ళి కథ (1981)
 39. ఆపద్బాంధవులు (1982)
 40. ఈనాడు (1982)
 41. జస్టిస్ చౌదరి (1982)
 42. డాక్టర్ మాలతి (1982)
 43. కిరాయి కోటిగాడు (1983)
 44. నేటి చరిత్ర (1990)
 45. గోవిందా గోవిందా (1994)

మరణంసవరించు

ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించాడు. శ్రీధర్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.

మూలాలుసవరించు

 1. "ఈనాడు దినపత్రికలో శ్రీధర్ మరణవార్త". Archived from the original on 2007-10-07. Retrieved 2020-05-15.
 2. "Muthyala Muggu Sridhar". Archived from the original on 2012-06-27. Retrieved 2013-07-09.
 3. "Telugu Cinema News : Muthyalamuggu hero Sridhar dead". Archived from the original on 2013-10-20. Retrieved 2013-07-09.
 4. "విశిష్టనటుడు ముత్యాలముగ్గు శ్రీధర్‌ - విశాలాంధ్ర 5 Feb 2011". Archived from the original on 12 ఆగస్టు 2016. Retrieved 10 జూలై 2013.