తెలుగు బాలల చిత్రాలు

వెండితెర సందడి
తెలుగు సినిమా
• తెలుగు సినిమా వసూళ్లు
• చరిత్ర
• వ్యక్తులు
• సంభాషణలు
• బిరుదులు
• రికార్డులు
• సినిమా
• భారతీయ సినిమా
ప్రాజెక్టు పేజి

తెలుగు సినిమా ప్రారంభమైన నాటినుండి ఎన్నో బాలల చిత్రాలు వచ్చాయి. బాలల సినిమా అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది లవకుశ (1963). తెలుగులో పూర్తి కలర్‌తో వచ్చిన మొట్టమొదటి చిత్రం ఇది. ఇందులో లవుడిగా మాస్టర్ నాగరాజు, కుశుడుగా మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించారు. దీని నిర్మాణం 1958లో మొదలై మధ్యలో కొంతకాలం ఆగిపోయి ఐదు సంవత్సరాలపాటు సాగింది. అతి సుదీర్ఘకాలం అవటం వలన లవకుశులుగా నటించిన పిల్లల ఆకారాల్లో మార్పులు వచ్చాయి. వీళ్లు కొన్ని సన్నివేశాల్లో పెద్దగా, కొన్ని సందర్భాల్లో చిన్నగా కనిపిస్తారు. కథలో లీనమైపోయిన ప్రేక్షకులు ఈ తేడాలు పట్టించుకోలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించి స్వర్ణోత్సవం జరుపుకుంది. లవకుశలో నటిస్తుండగానే వీరికి వేరే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. వారిద్దరూ కలిసి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)లో నటించారు. మహానటి సావిత్రి తమ్ముడుగా నాగరాజు, బాలకృష్ణుడుగా సుబ్రహ్మణ్యం కనిపిస్తారు. నాగరాజు ఇంకా మహాకవి కాళిదాసు (1960), బబ్రువాహన (1964) మొదలైన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించాడు.

లవకుశ తర్వాత బాలపాత్రకు అంతటి ప్రాముఖ్యత గల మరో చిత్రం భక్తప్రహ్లాద (1967). దీనిలో ప్రహ్లాదుడిగా బేబీ రోజారమణి నటించింది. రోజారమణికి అప్పటికి ఐదేళ్లు. పాములను మెడలో వేసుకోవాలంటే పెద్దవాళ్లకే వెన్నులోనుంచి చలి పుడుతుంది. అలాంటిది ఈ పాప పామును మెడలో వేసుకుని స్టూడియో అంతా తిరిగేది. సమాస భూయిష్టమైన పదాలను చక్కటి ఎక్స్‌ప్రెషన్‌తో, సరైన లిప్ మూవ్‌మెంట్స్‌తో సింగిల్ టేక్‌లో ఇచ్చేది. భక్తప్రహ్లాదలో పాటలకు పద్యాలకు రోజారమణి ఇచ్చిన లిప్ మూవ్‌మెంట్‌ను పరిశీలించేందుకు ఆ సినిమాను రెండవసారి చూశానని అక్కినేని నాగేశ్వరరావు ఒక సందర్భంలో చెప్పారు. తర్వాత రోజారమణి, మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు (1968)లోను, రామాలయం (1971), శ్రీదేవి (1970), సత్తెకాలపు సత్తెయ్య (1969) మొదలైన చిత్రాల్లో నటించింది.

లేత మనసులు (1966)లో బేబీ పద్మిని ద్విపాత్రాభినయం చేసింది. హరనాధ్, జమున, రేలంగి, జి.వరలక్ష్మి వంటి సీనియర్ నటీనటులున్నా కథంతా పద్మిని చుట్టూనే తిరుగుతుంది. పిల్లల గురించి రాసిన ‘పిల్లలు దేవుడూ చల్లనివారే!’ అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ‘లేత మనసులు’ సినిమాలో హరనాధ్‌కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. అవార్డు ఫంక్షన్‌లో బేబీ పద్మిని ‘కథంతా నామీదే ఉంటే అవార్డు నాకివ్వకుండా హీరోకిస్తున్నారే?’ అని వచ్చీరాని హిందీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని నిలదీసి ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. ఆ పాప ధైర్యానికి ఇందిరాగాంధీ ముచ్చటపడి ‘ఇంకోసారి ఆ సినిమాను చూసి అవసరమైతే ఆ పాపకు కూడా ఇవ్వండి’ అని అవార్డు కమిటీని ఆదేశించారు. పద్మిని శకుంతల (1966)లో భరతుడిగాను, ఏకవీర (1969), కథానాయకుడు (1969) వంటి సినిమాల్లో నటించింది.

దిగ్గజాల వంటి నటీనటులతో నదురు బెదురు లేకుండా నువ్వా నేనా? అన్నట్టుగా నటించిన గడుగ్గాయి బేబీ రాణి. స్టంట్ మాస్టర్ సాంబశివరావు కుమార్తె అయిన ఈ పాప అతి చిన్న వయసులో అంటే రెండేళ్ల వయసులో సతీ సక్కుబాయి (1965)లో బాలకృష్ణుడిగా నటించింది. మాతృదేవత (1969) అదృష్టవంతులు (1969), బంగారు పంజరం (1969) మొదలైన చిత్రాల్లో నటించింది. ‘బంగారుపంజరం’లో నాకన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంది అనేవారు శోభన్‌బాబు. పాపకోసం (1968)లో జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటిగా అవార్డు అందుకుంది బేబీ రాణి.

చక్రాల్లాంటి కళ్లు, ఉంగరాల జుట్టు, బూరెల్లాంటి బుగ్గలతో అందరినీ ఆకర్షించేవాడు సీనియర్ నటి పుష్పవల్లి కుమారుడు మాస్టర్ బాబ్జీ. చెంచులక్ష్మి (1958)లో ప్రహ్లాదుడుగా, మాయాబజార్ (1957)లో చిన్ని కృష్ణుడిగా, సువర్ణ సుందరి (1957)లో నాగేశ్వరరావు కుమారుడిగా కనిపిస్తాడు బాబ్జీ. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే కన్నుమూశాడు. ఇతని సోదరి పుష్పవల్లి కుమార్తె భానురేఖ రంగులరాట్నం (1967)లో చిన్నప్పటి వాణిశ్రీగా నటించి అనంతర కాలంలో హిందీ చిత్రసీమలో రేఖ గా పాపులర్ అయింది.

యశోద కృష్ణ (1975)లో బాల కృష్ణుడిగా వివిధ వయసులలో ముగ్గురు చిన్నారులు కనిపిస్తారు. వారు బేబీ డాలి, బేబి రోహిణి, బేబీ శ్రీదేవి కాగా బాల బలరాముడుగా మాస్టర్ ప్రభాకర్ నటించాడు.

బేబీ శ్రీదేవి బాల భారతం (1972)లో దుస్సలగా, మీనా (1973)లోచిన్నప్పటి విజయనిర్మల గా, శ్రీమంతుడు (1971) లో చిన్నప్పటి జమునగా ఇంకా చాలా చిత్రాల్లో బాలతారగా ఎంతో ప్రఖ్యాతి పొందింది. కృష్ణంరాజు కుమార్తెగా బడిపంతులు (1972)లోను, ఘట్టమనేని కృష్ణ కుమార్తెగా పచ్చని సంసారం (1970)లోను, అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా భక్త తుకారాం (1973) లోను, శోభన్ బాబు కుమార్తెగా నా తమ్ముడు (1971)లోను, ఎన్టీఆర్ మనవరాలిగా బడిపంతులు (1972)లోను నటించి అనంతర కాలంలో వారందరి సరసన హీరోయిన్‌గా నటించింది.

మాస్టర్ ప్రభాకర్ బాలరాజు కథ (1970), బాల భారతం (1972)లోను, బేబీ రోహిణి జీవన తీరాలు (1977)లోను, బేబీ డాలీ పవిత్ర బంధం (1971), పండంటి కాపురం (1972)లోను బాలపాత్రలు ధరించారు.

అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించిన విజయనిర్మల, భూకైలాస్ (1958)లో సీతగా, పాండురంగ మహాత్మ్యం (1957)లో కృష్ణుడుగా నటించారు. దాగుడు మూతలు (1964)లో బి.సరోజాదేవి చెల్లెలుగా మరో బాలపాత్రలో తళుక్కున మెరిసారు విజయనిర్మల.

పెద్దవాళ్లు ఉన్నా కూడా ఎక్కువమంది బాలలతో వచ్చిన చిత్రం బాల భారతం (1972). ఇందులో దుర్యోధనుడిగా మాస్టర్ ప్రభాకర్, దుస్సలగా శ్రీదేవి, ఉలూకుడిగా మాస్టర్ విశ్వే శ్వరరావు, ఇంకా ఎంతోమంది బాలలు నటించారు. అసలు పెద్దవాళ్లే లేకుండా పూర్తిగా చిన్న పిల్లలతో వచ్చిన చిత్రాలు భక్త ధృవ మార్కండేయ (1982), బాల రామాయణం (1996), బాలానందం (1954), పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం (1960) మొదలైనవి. భక్త ధృవ మార్కండేయ చిత్రానికి భానుమతీ రామకృష్ణ కథ, మాటలు, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించారు. ఇందులో ధృవుడిగా మాస్టర్ వంశీకృష్ణ, మార్కండేయునిగా మాస్టర్ హరి, నారదుడిగా మాస్టర్ సాయికుమార్, సునీతిగా బేబీ శోభన, సురుచిగా బేబీ రోహిణి నటించారు.

బాల రామాయణంలో శ్రీరాముడిగా మాస్టర్ ఎన్టీరామారావు, సీతగా బేబీ స్మితా మాధవ్, రావణాసురుడిగా బేబి స్వాతి, హనుమంతుడిగా మాస్టర్ అరుణ్ గంగాధర్ ప్రధానపాత్రలు పోషించారు.

బాలానందం శీర్షిక కింద బూరెల మూకుడు, రాజయోగం, కొంటె కిష్టయ్య అనే ఒక్కొక్కటి గంట నిడివిగల మూడు చిన్న చిన్న సినిమాలు తీశారు. వీటిలో బేబీ తుర్లపాటి విజయలక్ష్మి, మాస్టర్ కుందు, మాస్టర్ రేలంగి సత్యనారాయణ, బేబీ మల్లిక, బేబీ జోగాభాయి నటించారు. జోగాభాయి ప్రముఖ నటి జయసుధ తల్లి. రేలంగి సత్యనారాయణ హాస్యనటుడు రేలంగి కుమారుడు. లతా మంగేష్కర్ తొలిసారిగా తెలుగులో పాడిన ‘నిదుర పోరా తమ్ముడా!’ అనే పాట చిత్రీకరించింది తుర్లపాటి విజయలక్ష్మిపైనే సంతానం (1955) చిత్రంలో. ఈ అమ్మాయి ఇంకా బంగారుపాప (1955)లోచిన్నప్పటి కృష్ణకుమారిగా, దొంగరాముడు (1955)లో చిన్నప్పటి జమునగా కనిపిస్తుంది. మాస్టర్ కుందు పెళ్ళి చేసి చూడు (1952), తోడి కోడళ్లు (1958)లో కనిపిస్తాడు.

హీరో హీరోయిన్లు లేకుండా కేవలం చిన్నపిల్లవాడిని ఆధారం చేసుకుని నిర్మించిన చిత్రం పాపం పసివాడు (1972). ఎడారిలో తప్పిపోయిన చిన్న పిల్లవాడి ఒంటరి పోరాటమే ఈ చిత్ర కథాంశం. నలువైపులనుంచీ మృత్యువు తరుముతున్నా నిబ్బరం కోల్పోకుండా చేసిన పోరాటమే మృత్యుముఖం నుంచి తప్పించి తల్లి ఒడి చేరుస్తుంది. మాస్టర్ రాము ప్రధాన పాత్ర పోషించాడు. ‘అమ్మా చూడాలి, నిన్ను నాన్నని చూడాలి’ అనే పాట ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత మాస్టర్ రాము జీవన తీరాలు (1977)లో శివాజీ గణేశన్ పెంపుడు కొడుకుగా నటించాడు. ఇంకా భక్త తుకారాం (1973), పసి హృదయాలు (1973) మొదలైన చిత్రాల్లో నటించాడు.

ఒక మూగపిల్లవాడికి మాటలు తెప్పించే ప్రయత్నంలో తండ్రి పడే ఆవేదనే రాము (1968) చిత్ర కథాంశం. రాముగా మాస్టర్ రాజ్‌కుమార్ నటించాడు. మూగనోము (1969)లో అబ్బాయి పాత్రలో కనిపించినది బేబీ బ్రహ్మాజీ. చిత్రం ద్వితీయార్ధం మొత్తం ఆ అబ్బాయి చుట్టూనే తిరుగుతుంది. విడిపోయిన తల్లీ, తండ్రినీ కలుపుతాడు. బేబీ బ్రహ్మాజీ ఇంకా బుద్ధిమంతుడు (1969), ప్రేమ కానుక (1969), ప్రేమ్‌నగర్ (1971)లో నటించింది.

శ్రీకృష్ణావతారం (1970)లో బాలకృష్ణుడుగా కనిపించి సంచలనం సృష్టించిన మాస్టర్ హరికృష్ణ, తల్లాపెళ్లమా (1971)లో కూడా ప్రధాన పాత్ర పోషించాడు.

రాజు-పేద (1954)లో బాలనటుడు మాస్టర్ సుధాకర్ ద్విపాత్రాభినయం చేసాడు. మార్క్‌ట్వైన్ రచించిన ‘ప్రిన్స్ అండ్ పాపర్’ ఈ చిత్రానికి మూలం. పేదవాడి వేషంలోకి రాజకుమారుడు, రాజకుమారుడి వేషంలోకి పేదవాడు మారతాడు. తర్వాత ద్విపాత్రాభినయ చిత్రాల్లో ఒకే పోలికతో ఉన్న ఇద్దరు తారుమారు అవుతూ అనేక చిత్రాలు వచ్చాయి. వాటన్నింటికీ మూలం ఈ చిత్రమే అనవచ్చు.

మహామంత్రి తిమ్మరుసు (1962)లో రాయలవారి కుమారుడిగా ముద్దు ముద్దు మాటలతో మాస్టర్ బాబు బొబ్బిలి యుద్ధం (1964), గుడిగంటలు (1964), మంగమ్మశపథం (1965), అమరశిల్పి జక్కన (1964), మంచి మనిషి (1964) మొదలైన చిత్రాల్లో నటించాడు.

స్ర్తి ప్రధానంగా మాతృమూర్తి. ఆ తర్వాతే భార్యగా, చెల్లిగా రకరకాల పాత్రలు పోషిస్తుంది. మాతృత్వానికి పరాకాష్ఠ అనిపించే చిత్రం జీవన జ్యోతి (1975). అందులో కథానాయిక పెంచుకునే కొడుకుగా బేబీ వరలక్ష్మి నటించింది. ఆ తర్వాత వరలక్ష్మి సీతాకల్యాణం (1976)లో వామనుడిగాను, శంకరాభరణం (1980)లో శంకరశాస్ర్తీ కుమార్తెగాను నటించింది.

బాలమిత్రుల కథ (1973)లో బాలమిత్రులుగా మాస్టర్ దేవానంద్, మాస్టర్ సురేంద్ర నటించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముని మనవరాలు బేబీ అవంతి మోహినీ భస్మాసుర (1966)లో ఎస్.వి. రంగారావు కుమార్తెగా కనిపిస్తుంది. బాలనాగమ్మ (1959)లో బాలవర్ధిరాజుగా నటించిన సత్యనారాయణ కనకతార (1954)లోనూ కనిపిస్తాడు.

బాలనటులు ప్రధాన పాత్రలో నటించిన చిత్రాలు చాలానే వచ్చాయి. మాస్టర్ వెంకటేశ్వర్‌ కి ముద్దుబిడ్డ (1956), బేబీ సుజిత కి పసివాడి ప్రాణం (1987), మాస్టర్ షణ్ముఖ శ్రీనివాస్‌ కి శ్రుతిలయలు (1987), మాస్టర్ మంజునాధ్‌కి స్వాతికిరణం (1992), బేబీ షాలిని కి బంధం (1986), బేబీ షామిలి కి అంజలి (1990), మాస్టర్ తరుణ్‌కి తేజ (1992) చక్కటి గుర్తింపును ఇచ్చాయి.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు