వేణుమాధవ్

సినీ హాస్యనటుడు
(వేణు మాధవ్ నుండి దారిమార్పు చెందింది)

వేణుమాధవ్ (సెప్టెంబరు 28, 1969 - సెప్టెంబరు 25, 2019) తెలుగు సినిమా హాస్యనటుడు. మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. 2006 లో లక్ష్మి సినిమాకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. కాలేయ సంబంధిత వ్యాధితో 2019లో మరణించాడు.

వేణుమాధవ్
జననం
వేణుమాధవ్

(1969-09-28)1969 సెప్టెంబరు 28
మరణం2019 సెప్టెంబరు 25(2019-09-25) (వయసు 49)
జీవిత భాగస్వామిశ్రీవాణి
తల్లిదండ్రులుప్రభాకర్, సావిత్రి

బాల్యం

మార్చు

వేణుమాధవ్ 1969, సెప్టెంబరు 28న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రభాకర్‌, తల్లి సావిత్రి.[1] నాన్న టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్‌ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా కోదాడలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.

ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో బాంబే (ప్రస్తుతం ముంబై) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటిసారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే ఎలిమినేటి మాధవ రెడ్డి కూడా వేణుమాధవ్ ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్” అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.[2]

ఆ పరిచయంతో వేణుకు హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణు హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీసులో చేరాడు. అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ఆఫీసుకు వఛ్ఛే పది కాల్స్ లో తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. దీంతో క్రమంగా అన్నగారి కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీలోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు.[3]

సినీ ప్రస్థానం

మార్చు

అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో గుల గుల గులాబ్ జామ్ అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా. అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ. 70వేలు పారితోషికంగా ఇచ్చారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారం చిత్రంలో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు.[4] తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాలో వేణుమాధవ్ పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది. 2006లో విడుదలైన లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు.[5] ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు సై, ఛత్రపతి, మొదలైనవి. చివరిసారిగా రుద్రమదేవి, డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ (2016) సినిమాలలో నటించాడు. హంగామా, భూకైలాష్, ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు.[6]

ఇండస్ట్రీలో వేణుమాధవ్ కి చిరంజీవి, బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం. చిరు 150వ సినిమా, బాలయ్య 100వ సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు. వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ ని పాటించడు. పరిశ్రమకొచ్చినప్పట్నుంచీ తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు. వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవాడు. చిరంజీవితో కలిసి జై చిరంజీవ సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి కోసం రూల్ బ్రేక్ చేసి కేక్ కట్ చేశాడు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నాడు.

రాజకీయరంగం

మార్చు

తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అనేకసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. 2014లో కోదాడ నుంచి పోటీ చేయాలని భావించిన వేణుమాధవ్... ఈ విషయాన్ని టీడీపీ అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు. చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకొన్నారు. అయితే ఆ తరువాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన వేణుమాధవ్... క్రమంగా రాజకీయాలకు, టీడీపీకి కూడా దూరంగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు కొన్ని వందల సినిమాల్లో నటించిన వేణుమాధవ్‌కు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న తన బలమైన కోరిక తీరకుండానే కన్నుమూశారు.

నటుడిగా

మార్చు
 

నిర్మాతగా

మార్చు

ప్రేమాభిషేకం

పురస్కారాలు

మార్చు
  • 2006 లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది బహుమతి

కాలేయ సంబంధవ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 25 మధ్యాహ్నం గం. 12.21 ని.లకు మరణించాడు.[13][14][15]

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తాజావార్తలు (25 September 2019). "ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  2. సాక్షి, ఫ్యామిలీ (25 September 2019). "నేను మౌలాలి మెగాస్టార్‌ని!". Sakshi. డి.జి. భవాని. Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  3. బిబిసీ తెలుగు, వార్తలు (25 September 2019). "సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూత". Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  4. మే 17, 2009 ఈనాడు ఆదివారం సంచిక
  5. సాక్షి, సినిమా (25 September 2019). "'నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...'". Sakshi. Retrieved 25 September 2019.
  6. సాక్షి, ఫ్యామిలీ (25 September 2019). "నేను మౌలాలి మెగాస్టార్‌ని!". Sakshi. Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  7. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  8. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  9. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  10. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.
  11. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
  13. ఈనాడు, తాజావార్తలు (25 September 2019). "వేణుమాధవ్‌ కన్నుమూత". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  14. సాక్షి, సినిమా (25 September 2019). "నవ్వు చిన్నబోయింది". Sakshi. Archived from the original on 25 September 2019. Retrieved 25 September 2019.
  15. Namasthe Telangana (27 March 2021). "గ‌త ప‌దేళ్ల‌లో దూరమైన సినీ ప్రముఖులు". Archived from the original on 2021-03-27. Retrieved 30 November 2021.