పశ్చిమ గోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా
(పశ్చిమగోదావరి నుండి దారిమార్పు చెందింది)

పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు. అవశేష జిల్లాకు కేంద్రం భీమవరం. భీమవరంలోని భీమారామం, పాలకొల్లు లోని క్షీరారామం,పెనుగొండ (ప.గో) లోని శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయ సముదాయం, నరసాపురం తీరప్రాంతం, కొల్లేరు సరస్సు ముఖ్య పర్యాటక ఆకర్షణలు.

పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా వరి చేలు.
పశ్చిమగోదావరి జిల్లా వరి చేలు.
పటం
Interactive map outlining district
Coordinates: 16°42′N 81°06′E / 16.7°N 81.1°E / 16.7; 81.1
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతీయకోస్తా
ప్రధాన కార్యాలయంభీమవరం
విస్తీర్ణం
 • Total2,278 కి.మీ2 (880 చ. మై)
జనాభా
 (2011)[1][2]
 • Total18,44,898
 • జనసాంద్రత810/కి.మీ2 (2,100/చ. మై.)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
లోక్‌సభ నియోజకవర్గంనరసాపురం లోక్‌సభ నియోజకవర్గం

చరిత్ర

మార్చు
 
పాలకొల్లు లోని క్షీరారామం
 
పూర్వపు జిల్లా పరిధిలొ ఉన్న గుంటుపల్లి బౌద్ధారామాలు

బౌద్ధుల కాలంనుండి ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు సా.శ.పూ. 200 నుండి సా.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదఅమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి.[3]

ఈ ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (సా.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. సా.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు సా.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు.

తరువాత బాదామి చాళుక్యులు (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి (ఏలూరుకి సమీపంలోనిది), తరువాత రాజమండ్రికి మార్చబడింది. సా.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయ వంశజ రాణి రుద్రమదేవి నిరవద్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళుక్యుల ఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి.

బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరి జిల్లాగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[4]

2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలలో కలిపారు.[1]

భౌగోళిక స్వరూపం

మార్చు

సవరించిన పరిధి ప్రకారం జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. జిల్లాకు ఉత్తరంగా ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, తూర్పున కోనసీమ జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా సముద్ర తీరం పొడవు 19.కి.మీ. జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. జిల్లాలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. కొల్లేరు సరస్సులో సగభాగం జిల్లాలో ఉంది.

జనగణన గణాంకాలు

మార్చు

2022 సవరించిన జిల్లా పరిధికి 2011 జనగణన ప్రకారం, జనాభా 17.80 లక్షలు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490.[5] జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు.

రెవెన్యూ డివిజన్లు, మండలాలు

మార్చు

పశ్చిమ గోదావరి జిల్లా మండలాల పటం (Overpass-turbo)


జిల్లాలో నరసాపురం, భీమవరం అనే రెండు రెవెన్యూ డివిజన్లున్నాయి. వీటిని 20 మండలాలుగా విభజించారు.[1]

మండలాలు

మార్చు

ఈ జిల్లాలో 20 మండలాలున్నాయి. గణపవరం మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏలూరు జిల్లాకు మార్చారు. 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది.[2]

పట్టణాలు

మార్చు

రాజకీయ విభాగాలు

మార్చు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధికి కుదించారు. జిల్లాలో గల శాసనసభ నియోజకవర్గాలు:

  1. ఆచంట
  2. ఉండి
  3. తణుకు
  4. తాడేపల్లిగూడెం
  5. నర్సాపురం
  6. పాలకొల్లు
  7. భీమవరం

రవాణా వ్వవస్థ

మార్చు

జాతీయ రహదారుల 216, జాతీయ రహదారి 216A జిల్లాలో ప్రముఖ రహదారులు. హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము జిల్లాగుండా వెళుతుంది. జిల్లాలో కాలువల ద్వారా గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది. జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉంది. సమీప విమానాశ్రయాలు విజయవాడ, రాజమండ్రిలో ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

జిల్లాలో ఎక్కువ కళాశాలలు నన్నయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి.

ప్రముఖ విద్యా సంస్థలు

మార్చు
  • నన్నయ విశ్వవిద్యాలయం పి.జి కళాశాల, తాడేపల్లిగూడెం
  • డి.ఎన్.ఆర్. కళాశాల. భీమవరం
  • వై.ఎన్ కళాశాల. నర్సాపురం

వృత్తి విద్యాకళాశాలల గణాంకాలు

మార్చు
  • ఇంజినీరింగ్ కళాశాలలు -13 (తాడేపల్లి గూడెం-3, తణుకు-1 భీమవరం-8,నరసాపురం-1)
  • మెడికల్ కళాశాలలు 2 (పాలకొల్లు,భీమవరం)
  • బి.ఎడ్.కళాశాలలు - 4
  • న్యాయశాస్త్ర కళాశాలలు - 1 (భీమవరం)
  • నిట్ -1 - (తాడేపల్లి గూడెం)
  • డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, (తాడేపల్లి గూడెం)

ఉమ్మడి జిల్లా ఆర్ధిక స్థితి గతులు

మార్చు

జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం నగరం రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం.

వ్యవసాయం

మార్చు
 
ధాన్యమును తూర్పారబోస్తున్న రైతు
 
పంట నూర్పిడి కోసం సిద్దముగా ఉన్న ట్రాక్టరులు

జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పాం, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది.[6]

 
రంగాపురం గ్రామం వద్ద పాడిపశువులు
పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు
పంట విస్తీర్ణం

హెక్టేరులు

ఉత్పత్తి

మెట్రిక్ టన్నులు

వరి 219.6 వేల హె. 1,413,108
మొక్కజొన్న 11.5 వేల హె. 39,557
కంది 0.28 వేల హె. 191
మినుము 9.54 వేల హె. 3,885
పెసర 2.79 వేల హె. 1,130
వేరుశనగ 3.21 వేల హె. 6,476
చెరకు 32.22 వేల హె. 2,900,000
పుగాకు 5.76 వేల హె. 12,685
మామిడి 20,483 హె. 1,22,898
నిమ్మ 1,449 హె. 11,592
బత్తాయి 183 హె. 1,464
అరటి 5,021 హె. 3,26,365
జామ 657 హె. 13,140
సపోటా 568 హె. 4,544
జీడిమామిడి 44,744 హె. 22,372
పసుపు 530 హె. 1,855
మిరప 2,703 హె. 5,406
తమలపాకు 175 హె. 700
కొబ్బరి 22,183 హె. 3,327లక్షలు
పామాయిల్ 10,250 హె. 61,500
కోకో 2,800 హె. 1,400
పోక చెక్క 125 హె. 125
కాఫీ 50 హె. 25
మిరియం 150 హె. 45

ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది.

జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉంది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉంది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది.[7]

వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.[7]

నీటి వనరులు

మార్చు
 
నిడదవోలు-నరసాపురం కాలువ.

జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్ - సెప్టెంబరు కాలం) ఉంటుంది.

జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది.[7].

245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలోను సహజంగా వరద నీటిని బాలన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతుంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద యేరులతోబాటు సుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్దయెత్తున ఆర్థిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్‌కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది.[8]

జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి:

  • గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)
  • కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)

ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉంది.[9]

మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది.

పోలవరం ప్రాజెక్టు

నీలి విప్లవం

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.

80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు

శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.

1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది.1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి. రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా.

పరిశ్రమలు

మార్చు

తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది.

జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి[6]:

  • లో టెన్షన్ (తక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 7125
  • హై టెన్షన్ (ఎక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 118
  • కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251
  • జిల్లాలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు: 13,541
  • పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్‌స్టేషన్లు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడే, పాలకొల్లు, ఏలూరు.

సంస్కృతి

మార్చు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ సంస్కృతి ఉంది. భీమవరం, జంగారెడ్డిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తుంది.

సంక్రాంతి ఉత్సవాలు

మార్చు

సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు. కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
 
రామెశ్వర స్వామి వారి ఆలయ గోపురం

క్రీడలు

మార్చు

భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు, 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు.

ప్రముఖవ్యక్తులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. 2.0 2.1 AP GO Number 158, Part-I, Extraordinary dated 16-Feb-2023 for GO MS No:54, Revenue (Lands IV), dated 16-02-2023
  3. "TOURISM POTENTIAL IN WEST GODAVARI DISTRICT". Archived from the original on 2009-01-07. Retrieved 2007-09-13.
  4. "District Rural Development Agency History, East godavari district, Kakinada". Archived from the original on 2007-09-30. Retrieved 2007-09-12.
  5. "District - West Godavari Profile". APonline. Archived from the original on 2015-04-29. Retrieved 2007-09-19.
  6. 6.0 6.1 "West Godavari District" (PDF). Commisioner of Industries. Archived from the original (PDF) on 2006-04-07. Retrieved 2007-09-17.
  7. 7.0 7.1 7.2 "IRRIGATION PROFILE OF WEST GODAVARI DISTRICT". westgodavari.org. Archived from the original on 2008-02-20. Retrieved 2007-09-12.
  8. "Kolleru Lake". WWFIndia. Archived from the original on 2007-02-09. Retrieved 2007-09-17.
  9. "THE AREA OF CROPS IRRIGATED DURING 1996-1997 ARE AS FOLLOWS :". westgodavari.org. Archived from the original on 2008-05-13. Retrieved 2007-09-17.

బయటి లింకులు

మార్చు