భారతీయ జనతా పార్టీ

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ
(భా.జ.పా. నుండి దారిమార్పు చెందింది)

భారతీయ జనతా పార్టీ (భాజపా), భారతదేశంలోని ప్రముఖ జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ
పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్నరేంద్ర మోడీ
లోక్‌సభ నాయకుడునరేంద్ర మోడీ
(ప్రధానమంత్రి)
రాజ్యసభ నాయకుడుపీయూష్ గోయెల్
స్థాపన తేదీ6 ఏప్రిల్ 1980 (44 సంవత్సరాల క్రితం) (1980-04-06)
Preceded byభారతీయ జనసంఘ్
జనతా పార్టీ
ప్రధాన కార్యాలయం11 అశోకా రోడ్,
న్యూఢిల్లీ 110001
పార్టీ పత్రికకమల్ సందేశ్
యువత విభాగంభారతీయ జనతా యువ మోర్చా
మహిళా విభాగంబి.జె.పి మహిళా మోర్చా
రైతు విభాగంబి.జె.పి. కిసన్ మోర్చా
రాజకీయ విధానంసంప్రదాయవాదం
సామాజిక సంప్రదాయవాదం
హిందూ మతం జాతీయవాదం
హిందూత్వం
గాంధేయవాద సామ్యవాదం[1]
సమగ్ర మానవతావాదం
రాజకీయ వర్ణపటంRight-wing[1][2][3]
International affiliationNone
రంగు(లు)  Saffron
ECI StatusNational Party[4]
కూటమిNational Democratic Alliance (NDA)
లోక్‌సభ స్థానాలు
271 / 545
[5](currently 542 members + 1 Speaker)
రాజ్యసభ స్థానాలు
73 / 245
[6](currently 242 members)

స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే (సాంస్కృతిక హిందూ జాతీయవాదం).

భాజపా, అనేక ఇతర పార్టీల మద్దతుతో 1999 నుండి 2004 వరకు భారతదేశ ప్రభుత్వము భారత కేంద్ర ప్రభుత్వాన్ని పాలించింది. దాని సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగాను, లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రిగానూ పనిచేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో ప్రధాన పార్టీ అయిన భాజపా, భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షముగా 2014 మే వరకు కొనసాగింది.

2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్ సభ లోని 543 స్థానాలకు మునుపెన్నడూ లేనన్ని 281 స్థానాలు గెలుచుకున్న భాజపా (మిత్ర పక్షాలతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమికి 337 స్థానాలు) నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం చేబట్టింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపట్టింది.

చరిత్ర

మార్చు

పుట్టుక

మార్చు
 
భాజపా తొలి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి

భారతీయ జనతా పార్టీ మాతృ పార్టీ అయిన జనసంఘ్ 1952లో ఏర్పాటైంది. దీనిని జాతీయోద్యమ నేత, మాజీ కేంద్ర మంత్రి అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశాడు. ఇది హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు రాజకీయ విభాగంగా పరిగణించబడింది. జనసంఘ్ స్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ జైలులో ఉండగా 1953లో మరణించాడు. ఆ తర్వాత జనసంఘ్ 24 సంవత్సరాలు కొనసాగిననూ ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటు లోనూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఈ పార్టీ కేవలం 3 స్థానాలను మాత్రమే పొందినది. కాని క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. అయిననూ ఇది భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన భారత జాతీయ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కాని అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి భవిష్యత్తు నాయకుల తయారీకి మాత్రం దోహదపడింది.

1975లో ఇందిరా గాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించి రాజ్యాంగము కల్పించిన అధికారాన్ని దుర్వినియోగపర్చిన తర్వాత జరిగిన 1977 ఎన్నికలలో మరో 3 రాజకీయ పక్షాలతో కలిసి జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ తో పోటీకి నిలబడింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఎందరో జనసంఘ్ నాయకులను, కార్యకర్తలను జైలులో ఉంచగా ఆ దురదృష్టకర పరిస్థితిని జనతా పార్టీలో భాగంగా ఉన్న మాజీ జనసంఘ్ నేతలు సద్వినియోగపర్చుకున్నారు. 1977 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు ముఖ్యంగా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడి జనతా పార్టీని గెలిపించుకున్నారు. ఆ తర్వాత మురార్జీ దేశాయ్ నాయకత్వంతో కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కీలకమైన విదేశాంగ మంత్రి హోదా పొందగా, లాల్ కృష్ణ అద్వానీ సమాచార శాఖా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు.రెండు సంవత్సరాల స్వల్పకాలంలోనే జనతా పార్టీ ప్రభుత్వం పతనం కావడం, జనతా పార్టీలో చీలిక రావడంతో పూర్వపు జనసంఘ్ నేతలు ఆ పార్టీని వదలి బయటకు వచ్చి 1980, ఏప్రిల్ 6న [7] భారతీయ జనతా పార్టీని స్థాపించారు.

తొలి నాళ్ళు

మార్చు

అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలో ఒకటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్థి గెలుపొందిన గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్‌పేయి, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఫలితంగా 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని జనతాదళ్‌కు మద్దతునిచ్చి వీ.పీ.సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతో రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసిన సందర్భాన అక్టోబరు 23, 1990న భాజపా తన మద్దతును వెనక్కి తీసుకోగా తదుపరి నెలలో జనతాదళ్ ప్రభుత్యం పడిపోయింది.

1991 లోక్‌సభ ఎన్నికలలో మండలం, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వంగా పాలన కొసాగించింది. 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారో వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్ఫలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.

మొదటి భాజపా ప్రభుత్వం

మార్చు

1998లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిగా కొనసాగినారు. కాని 1999 మే మాసములో ఆల్ ఇండియా అన్నా డి.యం.కే అధినేత్రి జయలలిత భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది. 1999 అక్టోబరులో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధానమంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది. భాజపా ప్రభుత్వం ప్రసార భారతి బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్న నేషనల్ ఫ్రంట్ హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది.

రెండవ భాజపా ప్రభుత్వం (1998-2004)

మార్చు
 
భాజపా రెండవ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ

1998లో రాజస్థాన్ లోని పోఖ్రాన్లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సంపాదించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే.

భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) 2002లో టెర్రరిస్ట్ నిరోధక చట్టాన్ని కూడా జారీచేసింది. ఈ చట్టం వల్ల ఇంటలిజెన్స్ కు మరింత అధికారం కల్పించినట్లయింది. 2001 డిసెంబర్ 13పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి కూడా ఈ చట్టం చేయడానికి దోహదపడింది.

ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే వాజ్‌పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వ కార్పోరేషన్లను ప్రైవేటీకరించం, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనల ప్రకారము సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల, ప్రత్యేక ఆర్థిక మండలుల (Special Economic Zones) ఏర్పాటు మొదలగు ఆర్థికపరమైన మార్పులు చేశారు. ప్రభుత్వం ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా తగిన శ్రద్ధ తీసుకుంది. మధ్య తరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించబడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దానితో బాటు విదేశీ వ్యాపారం కూడా వృద్ధి చెందింది. 2004లో ప్రభుత్వం సాప్టా (దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, South Asia Free Trade Agreement) పై పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దక్షిణాసియా లోని 160 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.

అప్పటి ప్రధాని హోదాలో వున్న వాజపేయి పాకిస్తాన్తో స్నేహసంబంధాలకై స్వయంగా ఒంటిచేత్తో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. 1999లో ఢిల్లీ - లాహోర్ బస్సును ప్రారంభం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో లాహోర్ ప్రకటనపై సంతకం చేశారు. 2001లో కార్గిల్ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ అధినేత పర్వేజ్ ముషారఫ్ను భారత్ పిలిపించి చర్చలు జరిపారు, కాని ఆ చర్చలు విఫలమయ్యాయి. టెర్రరిస్టుల దాడి తర్వాత రెండున్నర సంవత్సరాలు భారత్-పాక్ సంబంధాలు క్షీణించిపోయాయి. అటువంటి ఆ సమయంలో ఆగస్టు 2004 వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ "పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకైనా జీవితంలోనే చివరి గొప్ప ప్రయత్నం చేస్తా"నని ప్రకటించి ప్రపంచ దేశాధినేతలను ఆకట్టుకున్నారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అల్లర్ల సమయంలో హిందువుల గుంపులను ఆపలేదని, ముస్లింలను రక్షించుటలో పోలీసులను ఉపయోగించలేదనే విమర్శలున్నాయి. సుమారు 1000 మంది ఈ సంఘటనలో మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నించగా పార్టీలోని అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితితో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. కాని ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి.

2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత

మార్చు

భాజాపా , దాని కూటమి 2004 భారత సార్వత్రిక ఎన్నికల లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పోయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్‌ , దాని ఐక్య ప్రగతిశీల కూటమికి చెందిన మన్మోహన్‌ సింగ్‌కు కోల్పోవాల్సి వచ్చింది.

ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, భాజపా కు చెందిన సుష్మా స్వరాజ్ , ఎల్‌.కె. అద్వానీ వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని , ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలో ప్రావీణ్యం లేకపోవటం, "ఇందిరా గాంధీ కోడలు అయిన నాడే తాను హృదయంలో భారతీయురాలైనానని" చెబుతూ రాజీవ్ గాంధీని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15 సంవత్సరాలు (దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపోవడం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.

ప్రజలలో వాజపేయి కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి, పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాల వలన భాజపా గెలుస్తుందనుకొన్న ఓటర్లకు, రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, భాజపా ప్రచారం కేవలం దూరదర్శన్, ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది., భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థలు రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి మొదలగు భాజపా సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్థిక అభివృద్ధి ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విశ్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంతర్గత సమస్యలు, భాజపా యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య లాల్‌ కృష్ణ అద్వానీని పార్టీ అధినేతగా నిర్ణయించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్.డి.ఎకి సారథ్యం వహించవలసిందిగా కోరింది. వాజ్‌పేయిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నా, అది నామమాత్ర లేదా గౌరవార్థస్థానమే, కానీ భవిష్యత్తులో ఆయన ప్రాబల్యం తగ్గుతుందనటానికి ఒక సూచన కూడా. పైగా వాజ్‌పేయి తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీచేయబోనని ప్రకటించాడు.

జూన్ 2005లో పాకిస్థాన్ సందర్శన సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకోవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కున్నారు, పలు పార్టీ శ్రేణులు రాజీనామా కోరడంతో కొన్ని వారాలు సంయమనం కోల్పోయారు. చివరకు రాజీనామా చేసి, ఉపసంహరించుకొని, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు.

2005 డిసెంబర్ 31న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత రాజ్‌నాథ్ సింగ్ భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యాడు[1]

కీలక సంఘటనలు:
2004:

  • మహారాష్ట్ర అధికారపీఠం తిరిగి చేజిక్కించుకోవడంలో భాజపా, దాని ఎన్‌.డి.ఎ కూటమి భాగస్వామి అయిన శివసేన వైఫల్యం.
  • భాజపా అధ్యక్ష్యపదవి నుంచి తప్పుకున్న వెంకయ్యనాయుడు, అధ్యక్షునిగా అద్వాని ఎన్నిక.

2005:

  • స్వీయ తప్పిదాల వలన గోవా ఎన్నికలలో అధిక్యత తరుగదల, స్వతంత్ర అభ్యర్థులతో కలసి ప్రభుత్వ ఏర్పాటు.
  • జార్ఖండ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ కుయుక్తులను తూర్పారబట్టిన ప్రసారమాధ్యమాలు, ఆ ప్రభుత్వం కుప్పకూలిన తదనంతరం ముఖ్యమంత్రిగా అర్జున్‌ ముండా పునర్నియామకం.
  • బీహార్‌లో జనతాదళ్‌ (యునైటెడ్‌)తో కలసి ఎన్నికల బరిలో పోటి, గణణీయమైన అధిక్యత. భాజపా మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి తన స్వంత పార్టీ ప్రకటిస్తూ భాజపా నుంచి రెండవసారి నిష్క్రమణ.

2006:

  • జనతాదళ్‌తో కలసి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు, దక్షిణ భారతదేశంలో కీలక సంఖ్యా బలంతో మొట్టమొదటి ప్రభుత్వ ఏర్పాటు సఫలీకృతం.
  • పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని మదన్‌ లాల్‌ ఖురానా, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ భాజపా నుంచి బహిష్కరణ.
  • మాజీ కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి భాజపా సభ్యత్వానికి రాజీనామా, స్వీయ పార్టీ వ్యవస్థాపన.
  • పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలు. కేవలం అస్సాంలో అధికంగా పది స్థానాల పెరుగుదల.
  • స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణతో కుప్పకూలిన భాజపా ప్రభుత్వం.
  • అధ్యక్షునిగా రాజ్‌నాథ్‌ సింగ్ ఎకగ్రీవ ఎన్నిక.

సిద్ధాంతాలు

మార్చు

భాజపా మతతత్వ సంప్రదాయ, రాజకీయ సంస్థ. తనను తాను భారతీయ సంసృతీ, భారతీయ మత వ్యవస్థలో భాగమైన హిందూ మతము, జైన మతము, సిక్కు మతము, బౌద్ధమతాల రక్షకురాలిగా భావిస్తుంది. చాలామంది జాతీయవాదులకు భారత్ ఒక హైందవ రాష్ట్రం, అంటే హిందూ దేశం.భాజపా సిద్దాంతం ప్రకారం ముస్లిములు, క్రైస్తవులు మినహాయింపు కాదు. హైందవ రాష్ట్రం అంటే సాంస్కృతిక జాతీయవాదం, గత 5000సంవత్సరాలు పైగా కాలక్రమేణా భారతదేశంలో పుట్టిన సంక్లిష్ఠ హైందవ సంస్కృతి, చరిత్ర, నమ్మకాలు, ఆరాధనలు అని భాజపా ఉద్దేశం. రాజకీయ పరిభాషలో హైందవ జాతీయవాదులు అంటే, భారత ప్రజలు అందరూ, వారి హైందవ వారసత్వ సంపద ఐనటువంటి సంస్కృతి సంప్రదాయాలు.మరో రకంగా చెప్పాలంటే " సింధూ (ఇండస్‌ నది) నది వాస్తవ్యులు లేదా వారి వారసులు".

హైందవ రాష్ట్రం అనే సిద్దాంతం మొదట భారతీయ జన సంఘ్ ప్రతిపాదించింది కాగా ఆ సిద్దాంతంపై భాజపా చారిత్రక అభ్యంతరాలు లేవనెత్తింది. భాజపా ప్రధాన లక్ష్యం సనాతన హైందవ సంస్కృతీ విలువల స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం. పార్టీ కీలక సిద్దాంతకర్త అయిన దీనదయాళ్ ఉపాధ్యాయ రాసిన ఇంటిగ్రల్‌ హ్యూమనిజమ్‌ అన్యే పుస్తకంతో భాజపా హైందవ రాష్ట్రం సిద్దాంతానికి బీజాలు పడ్డాయి. ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారం "రాజు", "రాజ్యము" అనేవి సమాజానికి "ధర్మం", "చిత్తం (సంస్కృత 'చిత్తి', అనగా ఉద్దేశం లేదా బుద్ది)" వంటివి. భారత సమజానికి సరైన అర్థం "జాతీయతా భావన" లోనే వున్నదని ఆయన పదే పదే చెప్పారు. హిందూ (ఉపాధ్యాయ)శాస్త్రాల ప్రకారం, రాజు, రాజ్యం అంటే సమాజపు "ధర్మం", క్షితి. భారతీయ సమాజం అంటే "జాతీయ గుర్తింపు". భాజపా ప్రకారం, హిందూధర్మానుసారం మానవ జీవితం, కామం, అర్థం, ధర్మం, మోక్షములపై ఆధారపడియున్నది.[8]. ప్రత్యుర్థుల నుంచి భాజపా ఒక నిరంకుశ సంస్థగా, అకారణ విదేశీ వ్యతిరేకత గలిగిన సంస్థగా నిందించబడుతూ ఉంది. అటు భాజపా మద్దతుదారులు అది జాతుల (మతాల)ఆధారంగా దేశాన్ని కోణీకరించడానికి (polarise) ఇష్టపడని ఒక కన్సర్వేటివ్, జాతీయ నిబద్ధత కలిగిన పార్టీ తప్పించి మరేమీ కాదని వాదిస్తారు. ఈ ఆరోపణల్లో చాలాభాగం భాజపాను బలహీనపరచడానికి వామపక్ష పండితులు చేసే దుష్ప్రచారమే. అంతేకాక, భాజపా హిందుత్వ వాదంలోని నిరంకుశత్వం పైన వామపక్ష పార్టీలు, క్రిస్టొఫి జాఫ్రిలాట్ వంటి పాశ్చాత్య విద్యాధికులు చేసే ఆరోపణలను "మన హిందూ జాతీయ రాజకీయ జ్ఞనానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సరళీకృత ఆంతరణ (simplistic transference)"గా మునుపటి రాజకీయతత్వ ఆచార్యుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శకుడు [9] జ్యోతిర్మయ శర్మ విమర్శించారు[10]. భాజపా జీవితము, దాని పనితీరు 1947లో జరిగిన భారత విభజనవల్ల బలంగా ప్రభావితమైనట్టు కనిపిస్తుంది. భారతదేశంలోని చాలా మతాలకు బాధాకరమైన గతం ఈ విభజన. లక్షలాది జనం రక్షణార్థమై కొత్తగా ఏర్పడిన రెండు దేశాలకు వలసపోయారు. విభజన కాలంలో నెలకొన్న ఈ అరాచకంలో చెలరేగిన దారుణ మారణహోమంలో యాభై వేలకు పైగా హిందువులు, సిక్కులు, ముస్లిములు చంపబడ్డారు. రాత్రికి రాత్రి తమ తాతలనాటి నుంచి వస్తున్న ఇళ్ళను వదలి మారణహింస, అలజడి, అయోమయాలను ఛేదించుకుంటూ వేరే దేశంలోని తమ కొత్త ఇంటికి పయనమవాల్సి రావటం, హిందూ జాతీయవాదుల నాడుల్లో లోతుగా నాటుకుపోయింది. జమ్ము కాశ్మీర్ పైన జరుగుతున్న సరిహద్దు వివాదం, 1947-48, 1962, 1965, 1971ల యుద్ధాలు, ఇటీవల 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధము భాజపా యొక్క సిద్ధాంత నిర్మాణంలోని మరొక ముఖ్యమైన అంశం. పాకిస్తాన్, ప్రజా గణతంత్ర చైనా, ఇతరత్రా వస్తున్న ముప్పులపై భారతదేశం ఒక కన్నేసి వుండాలన్నది భాజపా, దాని మద్దతుదారుల అభిమతం. మత హింసలో పాల్గొంటుందని, మతపరంగా సున్నితమైన అంశాలను రాజకీయ లాభాలకు వినియోగించుకుంటుందని భాజపాపై తరచుగా ఆరోపణలు వస్తూ వుంటాయి. ఎక్కువగా రాజకీయంగా దెబ్బదీసే ఉద్దేశంతో చేయబడే ఈ ఆరోపణలవల్ల భాజపా పట్ల ఉండాల్సిన సదభిప్రాయాన్ని చాలా మంది భారతీయులలో, ముఖ్యంగా ముస్లిములలో చీల్చివేసింది. చాలామంది వామపక్షవిలేఖరులు, విశ్లేషకులు భాజపాను స్పష్టమైన ముస్లిం వ్యతిరేక పక్షపాతపు నిరంకుశ సంస్థగా భావిస్తారు. గతంలో ముఖ్తర్ అబ్బస్ నక్వీ, దివంగత సికందర్ బఖ్త్, డా. నజ్మా హెప్తుల్లా, ఇండియన్ జ్యూ సమాఖ్యలో ప్రముఖ సభ్యుడు జె. ఎఫ్. ఆర్. జాకోబ్ వంటి ఎందరినో భాజపా తన కీలక స్థానాల్లో నిలబెట్టిందన్న నిజానికి ఈ అభిప్రాయం అలానే ఉంది.భాజపా డిమాండ్లలో, పనులలో కొన్ని నిర్ద్వంద్వంగా వివాదాస్పదమైనవి, జాతిపరమైన ఆందోళనలను రేకెత్తించేవి ఉన్నాయి. అయోధ్యలోని రామజన్మభూమి వీటన్నిటిలోకి ముఖ్యమైనది. మధ్యయుగ కాలంలో ముస్లిం దండయాత్రల్లో అయోధ్యానగరంలోని పురాతన దేవాలయాన్ని నాశనం చేసి, ఆ స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించారని వాదన. ఈ స్థలం విష్ణుమూర్తి అవతారాల్లో ప్రముఖమైన రామాయణ నాయకుడు శ్రీ రామ చంద్రమూర్తి జన్మస్థలంగా భావిస్తున్నందున ఆ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు 1970లో విశ్వహిందూ పరిషత్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. రెండు దశాబ్దాలపాటు ఈ నిరసనలు శాంతియుతంగా జరిగాయి. కాని 1980ల చివరలో, అదివరకు ఎన్నడూలేనంతగా ఈ సమస్య వివాదాస్పదమయ్యింది. నేరుగా మసీదుని పడగొట్టాలని వి హెచ్ పి డిమాండ్ చేయటం మొదలుపెట్టగా, భాజపా దాన్ని తన సొంత సమస్యగా అక్కున చేర్చుకుంది. భాజపా కోర్కెలలో రామాలయం ప్రముఖతను సంతరించుకున్నాక, దాని కార్యకర్తలు పోరాట శ్రేణులలో చేరటం, అయోధ్యలో పెద్ద ర్యాలీలు నిర్వహించడం జరిగాయి. భారతదేశంలోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 1991 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపా గెలుపొంది, జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకోడానికీ ఈ భావశక్తి ఎంతగానో తోడ్పడింది. ఆయితే 1992 డిసెంబరు 6 న ఒక ప్రదర్శనకారుల గుంపు మసీదుపైకి దూసుకువచ్చి, చేతికొడవళ్ళు, పారలతో దాన్ని దెబ్బతీయడం వల్ల ఈ భావజాల దుర్వినియోగం (ఎమోషనల్ మ్యానిప్యులేషన్) హింసాత్మకంగా పరిణమించింది. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహం, మారణహోమం, దోపిడీలు, దహనాల్లో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. ఈ మతఘర్షణల తర్వాత భారత లౌకికవాదమనే తీవెకు ముప్పువాటిల్లినట్లు చాలా వర్గాలు భావించాయి. వి హెచ్ పి నిషేధించబడగా, అద్వానీ, ఇతర నాయకులు అరెస్ట్ అయ్యారు. విధ్వంసానికి సంబంధించి సి. బి. ఐలో దాఖలైన ఛార్జి షీటులో ఉన్న ఇద్దరు భాజపా నాయకులు- అద్వానీ, మురలీ మనోహర్ జోషి. ఈ అరెస్టులు జరిగినప్పటికీ, భాజపా రాజకీయ పలుకుబడి శరవేగంతో పెరుగుతూ వచ్చింది.

సంస్థ

మార్చు

భారతదేశంలో గల రాజకీయ పార్టీలలో ఒకటైన భాజపా ప్రసిద్ధ పార్టీ. దీనికి అన్ని వర్గాలలోనూ సానుభూతిపరులున్నారు. ఈ పార్టీ భారతదేశమంతటా తన పార్టీ యంత్రాంగాన్ని కలిగివున్నది. దీనికి వ్యతిరేకంగా పార్టీబలగాల్లోనే విమర్శలున్ననూ, ఓ బలీయమైన జాతీయస్థాయి పార్టీ. తన సొంత బలం మీద, కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి లేకున్ననూ, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తా ఉన్న పార్టీ.

పార్టీ యొక్క అత్యున్నత నాయకుడు పార్టీ అధ్యక్షుడు. భాజపా అధికారిక నియమావళి ప్రకారం అధ్యక్షుని పదవీకాలము మూడేళ్ళు. కానీ ఇటీవలి కాలములో అధ్యక్షులుగా పనిచేసిన వెంకయ్య నాయుడు, ఎల్.కే.అద్వానీ గడువు ముగియకముందే రాజకీయ పరిస్థితుల కారణంగా రాజీనామా చేయవలసి వచ్చింది. 2006 జనవరి నుండి అధ్యక్షపదవిలో రాజ్‌నాథ్ సింగ్ కొనసాగుతున్నాడు. నవంబరు 26న జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షునిగా కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. అధ్యక్షుని క్రింది స్థాయిలో అనేక ఉపాధ్యక్షులు, సాధారణ కార్యదర్శులు, ట్రెజరర్లు, కార్యదర్శులు ఉంటారు. పార్టీలో అత్యున్నత స్థాయి నిర్ణయాధికార సంఘమైన జాతీయ కార్యవర్గ సంఘంలో అనిర్ణీత సంఖ్యలో దేశం నలుమూలల నుండి సీనియర్ పార్టీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రాలలో కూడా జాతీయస్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి మూడు సంవత్సరాలు పదవిలో కొనసాగే ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, అధ్యక్షత వహిస్తారు.

భాజపా క్రిందిస్థాయి కార్యకర్తలంతా ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క లక్షలాది సభ్యులనుండి వచ్చినవారే. భాజపా, సంఘ పరివారం యొక్క సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్ (దిగుమతి చేసుకున్న విదేశీ వస్తువుల స్థానే స్థానికంగా తయారయ్యే జాతీయ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించే సంస్థ) లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.

భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ సంస్థలు క్రింద ఇవ్వబడినవి:

భారతదేశం బయట, భా.జ.పా. అభిమానులు 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీ.జే.పీ.' అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.

ఆశయాలు , విధానాలు

మార్చు

భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, భారతదేశపు ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడం, దేశాన్ని అభివృద్ధిపథంలోకి పయనింపజేయడం, ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచశాంతి, అంతర్జాతీయ న్యాయంలో భారత పాత్రను పెంచడం మొదలగునవి పార్టీ రాజ్యాంగములో ఉన్న కొన్ని విశాలమైన ఆశయాలు. అంతాకాకుండా దేశాన్ని శక్తివంతమైన ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్ది పౌరులందరికీ కుల, మత, లింగ భేదాలు లేకుండా రాజకీయ, ఆర్థిక, సాంఘిక న్యాయాన్ని, స్వేచ్ఛను కల్పించడం పార్టీ ఆశయాలుగా పెట్టుకుంది.

భాజపా కేంద్ర ప్రణాళిక హిందూ జాతీయవాదం నుండి స్ఫూర్తి పొందింది. ఈ దిగువన ఉన్న విషయాలు ఏ ప్రత్యేక క్రమంలో లేకున్నా భాజపా ప్రధాన లక్ష్యాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.

(1).భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం తొలగింపు, ఈ అధికరణం ముస్లిం ఆధిక్యత ఉన్న జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి నిస్తుంది. దీనిలో ఆ రాష్ట్ర ముస్లిం ఆధిక్యతను కాపాడటానికి కాశ్మీరేతరులు అక్కడ స్థిరాస్థిని సంపాదించడాన్ని నిరోధించటం వంటి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. భారతదేశంలో జమ్మూ కాశ్మీరు పూర్తిస్థాయి రాజకీయ, భౌగోళిక విలీనాన్ని సాధించటం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు భూభాగంలో 40% పైగా పాకిస్తాన్, చైనాల ఆధీనంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ పునఃరేఖికరణ.

(2).యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ ను ప్రకటించడం (The Promulgation of a Uniform Common Civil Code), దీని అనుసారం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సమాన సాధారణ పౌరచట్టం తయారు చేయడం, తద్వారా మతపరమైన తారతమ్యాలను తొలగించి, దేశమంతటా ఒకే చట్టపు ఛాయలో అన్ని మతస్తుల వారికి తేవడం.

(3).గోవధను నిషేధించడం, గోవులను పవిత్రంగా భావించి వాటిని గౌరవించే హిందూ సంప్రదాయానికి అనుగుణంగా ఆవులను చంపటం, మాంసాన్ని తినటాన్ని నిషేధించడం.

(4).విదేశీమతమార్పిడులపై నిషేధం విధించండం. బలవంతపు మార్పిళ్ళను, స్వేచ్ఛాయుత వ్యక్తిగత మార్పిళ్ళను వేరుగా గుర్తించంటం చాలా కష్టమని, అందువల్ల మతమార్పులను నిషేధించాలని భాజపా వాదిస్తుంది.

(5).అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణం. ముస్లిములు, ప్రభుత్వాల చెరనుంచి దేవాలయాలకు స్వాతంత్ర్యం ఇవ్వడం. Free Temples.

(6).జనాభా నియంత్రణ చట్టం

(7).CAA, NPR, NRC

(8).హిందురాష్ట్ర

(9).అఖండ భారత ఉపఖండం

భాజపా పఠిష్టమైన జాతీయ భద్రత, చిన్న ప్రభుత్వం, స్వేచ్ఛా విఫణీ వాణిజ్యాల కోసం పాటుపడినా, ఆవిర్భావం నుండి హిందుత్వనే ఈ పార్టీ ప్రధాన తత్త్వం. 1990వ దశకంలో అప్పటిదాకా స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతునిచ్చిన భాజాపా, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను స్వాగతించడం ఒక అనూహ్యమైన మలుపుగా భావిస్తున్నారు.

సాధారణ ఎన్నికలలో ఫలితాలు

మార్చు
ఎన్నికలలో ఫలితాలు
సంవత్సరం లోక్‌సభ గెలిచిన స్థానాలు సీట్ల సంఖ్యలో మార్పు ఓట్ల శాతము ఓట్ల మార్పు
భారత సాధారణ ఎన్నికలు, 1984 7 వ లోక్‌సభ 2   2 7.74% -
భారత సాధారణ ఎన్నికలు, 1989 8 వ లోక్‌సభ 85   83 11.36%   3.62%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10 వ లోక్‌సభ 120   35 20.11%   8.75%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11 వ లోక్‌సభ 161   41 20.29%   0.18%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12 వ లోక్‌సభ 182   21 25.59%   5.30%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13 వ లోక్‌సభ 182   0 23.75%   1.84%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14 వ లోక్‌సభ 138   44 22.16%   1.69%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15 వ లోక్‌సభ 116   22 18.80%   3.36%
భారత సాధారణ ఎన్నికలు, 2014 16 వ లోక్‌సభ 282   166 31.34%   12.54%
భారత సాధారణ ఎన్నికలు, 2019 17 వ లోక్‌సభ 303   21 37.46%   6.12%
భారత సాధారణ ఎన్నికలు, 2024 18 వ లోక్‌సభ 240   63  
7వ లోక్‌సభ నుండి 17 వ లోక్‌సభ వరకు సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:2019
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:1984

కార్యనిర్వాహక అధికారులు

మార్చు

రాష్ట్రాల స్థాయిలో భాజపా

మార్చు
 
భాజపా పాలిత రాష్ట్రాలు (ఆరెంజ్ రంగులోనివి)

2010 సెప్టెంబరు నాటికి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలు. ఈ రాష్ట్రాలలో ఎలాంటి బయటి మద్దతు లేకుండా భాజపా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. గుజరాత్ లో నరేంద్ర మోడి, మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్ ఘర్ లో రామన్ సింగ్, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమ్ కుమార్ ధుమాల్, కర్ణాటకలో సదానందగౌడలు భాజపా ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. బీహార్, జార్ఖండ్, పంజాబ్, నాగాలాండ్ రాష్ట్రాలలో భాజపా తన జాతీయ ప్రజాతంత్ర కూటమి భాగస్వామ్య పార్టీల ద్వారా అధికారములో ఉంది.

చారిత్రకంగా, భాజపా తన సొంత మద్దతుతో గానీ మిత్రపక్షాల మద్దతుతో గాని అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. చట్టసభలు కలిగిన రెండు కేంద్రపాలితప్రాంతాలలో ఒకటైన ఢిల్లీలో కూడా భాజపా అధికారాన్ని చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో భాజపాకు ప్రభుత్వము ఏర్పాటుచేసే అవకాశం లభించలేదు. అయితే వీటిలో కొన్ని రాష్ట్రాలలో పాలకపార్టీకి బయటినుండి మద్దతు మాత్రము ఇచ్చింది

ఓటు బ్యాంకు

మార్చు

భాజపా సాంప్రదాయక ఓటు బ్యాంకు ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలలోని మధ్యతరగతి హిందూ సాంస్కృతిక సాంప్రదాయవాద ప్రజలుగా ఉండేది. కానీ 1998-2004 మధ్యకాలంలో వాజ్‌పేయ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా సాంప్రదాయవాదులు కాని, స్వేచ్ఛా వాణిజ్యానికి అనుకూలత చూపే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలోని మధ్య తరగతి పట్టణ ప్రజల మద్దతును కూడా పొందగలిగింది. భాజపా చిన్న పరిశ్రమలకు మద్దతుగా ప్రారంభించిన స్వదేశీ పరిరక్షణ ఉద్యమం స్వేచ్ఛా వాణిజ్యానికి దారి తీసింది.

ఆంధ్రప్రదేశ్

మార్చు

ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి తగినంత ప్రాతినిధ్యం లేదు. ఒక దశలో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికలలో పోటీ చేసింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాజపా నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కూడా ఇచ్చింది. భాజపా ప్రభుత్వంలో పాలుపంచుకోలేదు. 2004లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించినప్పుడు భాజపా, తెలుగుదేశం కల్సి పోటీ చేసిననూ భాజపాకు కేవలం 2 శాసనసభ స్థానాలు మాత్రమే లభించాయి. లోక్‌సభ అభ్యర్థులుగా 9 గురు పోటీచేసిననూ ఎవరూ విజయం సాధించలేరు. శాసనసభ స్థానాలకు 29 అభ్యర్థులు పోటీ చేసిననూ ఇద్దరు మాత్రమే యం.ఎల్.ఏ.స్థానాలు పొందినారు. 2009లో భాజపా విడిగా పోటీచేసిననూ రెండు శాసనసభ స్థానాలు సాధించింది.

అరుణాచల్ ప్రదేశ్

మార్చు

అరుణాచల్ ప్రదేశ్‌లో భాజపా చరిత్ర కొంత విలక్షణమైనది. ఈ రాష్ట్రంలో పార్టీ, శాసనసభలో మార్పులతోపాటు త్వరితగతిన ఉద్ధానపతనాలను చవిచూసింది. 1999 లోక్‌సభ ఎన్నికలలో భాజపా, అరుణాచల్ కాంగ్రేస్‌తో కలిసి పోటీచేసింది. అరుణాచల్ కాంగ్రేస్ పశ్చిమ స్థానానికి పోటీ చేయగా, భాజపా తూర్పు స్థానం నుండి పోటీ చేసింది. తూర్పు స్థానంలో భాజాపా అభ్యర్థి తాపీర్ గావ్ 35.45% ఓట్లతో రెండవస్థానంలో నిలిచాడు.

2003, ఆగష్టు 30న, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్, తన యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంటులోని (కాంగ్రేస్ (డోలో)తో సహా) 41మంది శాసనసభా సభ్యులతో సహా భాజపాలో చేరాడు. తద్వారా భాజపా మొట్టమొదటిసారిగా ఈశాన్యభారతంలోని ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

2004 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, భాజపా రెండు స్థానాల్లోనూ పోటీచేసింది. ఖిరేన్ రిజీజూ 55.95% ఓట్లతో అరుణాచల్ పశ్చిమ స్థానాన్ని, తాపిర్ గావ్ 51% అరుణాచల్ తూర్పు స్థానాన్ని గెలుచుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరులో జరిగిన శాసనసభా ఎన్నికల్లో భాజపా మొత్తం 60 స్థానలలో 39 స్థానాలలో పోటీచేసింది. అయితే అపాంగ్, అతని అనుచరవర్గం ఎన్నికలకు కొద్దిరోజుల ముందే తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికలలో ఉపముఖ్యమంత్రి కమేంగ్ డోలోతో సహా తొమ్మిది మంది భాజపా సభ్యులు శాసనసభకు ఎన్నికయ్యారు.

అస్సాం

మార్చు

అస్సాంలో భాజపా అసోం గణపరిషత్తో పొత్తులో వుండేది కాని ఈ లంకె 2004 ఎన్నికలకు ముందు తెగిపోయింది. మొత్తం 14 స్థానాలలో 12 స్థానాలకు భాజపా పోటీ చేసింది. ఒక స్థానంలో ఎన్ డి ఏ మిత్రపక్షమైన జెడి (యు)కి మద్దతునిస్తూ, కొక్రాజడ్ లో అది బోడో ప్రజా జాతీయవాది, స్వతంత్ర అభ్యర్థి సన్సుమ ఖుంగ్గుర్ బ్విశ్వుతియరిని బలపరచింది. భాజపా రండు స్థానాల్లో గెలిచింది.

బీహార్

మార్చు

బీహార్‌లో భాజపా పార్టీ జనతాదళ్ (యునైటెడ్)‌తో పొత్తు పెట్టుకుని ఉంది. పార్టీకి అగ్రవర్ణ హిందువుల్లో మంచి బలం వుండగా, జెడి (యు)తో పొత్తు ద్వారా పెద్ద వోట్ బేస్‌ను సంపాదించుకోగలిగింది. సామాజిక పోరాటాలు ఎక్కువగా వున్న బీహార్ పల్లె ప్రాంతాల్లో, భాజపా నేతలకు తరచుగా అక్కడి భూస్వాములతో సంబంధాలు వుంటాయి. 2005 నవంబరులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించి, కాంగ్రెస్‌ను పడగొట్టి, బిజెపి-జెడి (యు) కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ 2006, సెప్టెంబరు 14న జార్ఖండ్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు అర్జున్ ముండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో, ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది.

కర్ణాటక

మార్చు

1983లో తొలిసారిగా కర్ణాటక శాసనసభలో అడుగుపెట్టిన భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల తరువాత అధికారం దక్కింది. 1983లో తొలిసారిగా 18 శాసనసభ స్థానాలు సాధించిన కమలం పార్టీ రెండేళ్ళ తరువాత జరిగిన ఎన్నికలలో రెండే స్థానాలు నిలబెట్టుకుంది. ఆ తరువాత క్రమక్రమంగా సీట్లు, ఓట్లు పెంచుకుంటూ, దక్షిణ భారతంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కర్ణాటకలో పెద్ద పార్టీగా అవతరించింది. 2004 ఎన్నికలలో ఏకంగా 79 స్థానాలు గెలుపొంది [11] రాజకీయ శక్తిగా రాష్ట్రంలో బలపడింది. 2004 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల ఫలితంగా కర్ణాటక రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగింది. చెరిసగం రోజులు పాలించాలనే ఒప్పందంతో భాజపా తొలుత కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. గడుపు ముగుసిననూ భాజపాకు అధికారం అప్పగించకపోవడంతో మద్దతు ఉపసంహరించుకుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ జనతాదళ్ (ఎస్) ను చీల్చాలని ప్రణాళిక వేయడంతో, భాజపా జాతీయ నేతలు జోక్యం ఫలితంగా ఎట్టకేలకు బి.ఎస్.యడియూరప్ప భాజపా తరఫున కర్ణాటకలోనే కాదు దక్షిణా భారతంలోనే తొలి భాజపా ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ ప్రమాణస్వీకారం చేసిన వారం రోజులకే, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవగౌడ మద్దతు ఉపసంహరించడం వలన ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రేసు పార్టీ అధికారములో ఉన్న కేంద్ర ప్రభుత్వం, వెనువెంటనే ఎన్నికలు జరిపితే, భాజపాకు సానుభూతి ఓట్లు వస్తాయనే భయంతో 6 మాసాలకు పైగా రాష్ట్రాన్ని రాష్ట్రపతి పాలనలోనే ఉంచింది. చివరికి మే 2008లో జరిగిన ఎన్నికలలో కన్నడ ప్రజలు 6 మాసాల క్రితం జరిగిన సంఘటనలను గుర్తించి భాజపాకు ఏకంగా 110 స్థానాలు కట్టబెట్టారు.[12] 224 స్థానాలు కల రాష్ట్ర శాసనసభలో పూర్తి మెజారిటీ ఇది కేవలం మూడే సీట్లు తక్కువ. స్వతంత్రుల సహాయంతో ఏ ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే యడియూరప్ప ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. జనతాదళ్ (ఎస్) అధికార బదిలీలో మోసం చేయడం, ముఖ్యమంత్రి అభ్యర్థి ముందుగానే ప్రకటించడం భాజపాకు లాభం చేకూరింది. మే 30న యడియూరప్ప రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13] లోకాయుక్త ఆరోపణలతో బి.ఎస్.యడ్యూరప్ప ఆగష్టు 2, 2011న రాజీనామా చేయడంతో సదానందగౌడ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. అశోక్ గస్తీ కర్ణాటక రాష్ట్రం నుండి 2020 జూన్ 26 నుండి 2020 సెప్టెంబరు 17 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.

గుజరాత్‌

మార్చు
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి
 
చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రామన్ సింగ్

1995లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చింది. కేశూభాయి పటేళ్ 9 మాసాలు పాలించగా, ఆ తర్వాత సురేష్ మెహతా దాదాపు ఒక సంవత్సరం పాలించాడు. 1998లో మళ్ళీ కేశూభాయి పటేల్ పాలనా పగ్గాలు చేపట్టగా 2001 అక్టోబరు 7 నుంచి నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత రెండు సార్లు ఎన్నికలలో కూడా విజయం సాధించి నిరాటంకంగా పాలన అందిస్తున్నాడు. పెట్టుబడులను రాబట్టుటలో, పారిశ్రామిక అభివృద్ధిలో నరేంద్ర మోడి గుజరాత్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించాడు.

జార్ఖండ్

మార్చు

2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా భాజపాకు చెందిన బాబూలాల్ మరాండి బాధ్యతలు చేపట్టి 2003 వరకు పదవిలో ఉండగా 2003-05 అర్జున్ ముండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన శుబూసోరెన్ పదిరోజుల పాలన అనంతరం మళ్ళీ అర్జున్ ముండాకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. 2006 సెప్టెంబరు వరకు పదవిలో ఉండగా, సెప్టెంబరు 2010 నుండి ప్రస్తుతం వరకు మూడవ పర్యాయం అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు.

2012 శాసనసభ ఎన్నికలలో భాజపా-మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ కూటమి మెజారిటి స్థానాలు సాధించింది.

పంజాబ్

మార్చు

2012 శాసనసభ ఎన్నికలలో భాజపా-శిరోమణి అకాలీదళ్ కూటమి మెజరిటి స్థానాలు సాధించింది,

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Malik & Singh 1992, pp. 318–336.
  2. BBC 2012.
  3. Banerjee 2005, p. 3118.
  4. Election Commission 2013.
  5. Lok Sabha Official Website.
  6. Rajya Sabha Official Website.
  7. http://www.eenadu.net/ems/emsmain.asp?qry=305ems8[permanent dead link]
  8. Smith, David James, Hinduism and Modernity P189, Blackwell Publishing ISBN 0-631-20862-3
  9. Profile, Jyotirmaya Sharma
  10. Hindu Nationalist Politics Archived 2006-05-27 at the Wayback Machine,J. Sharma Times of India
  11. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 2, నీరజా చౌదరి వ్యాసం, తేది 26.05.2008
  12. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-30. Retrieved 2008-05-29.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-31. Retrieved 2008-05-30.

ఉప అధ్యయనం

మార్చు

బయటి లింకులు

మార్చు