తెలంగాణ

భారతదేశ 29వ రాష్ట్రం
(Telengana నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.

తెలంగాణ
తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): చార్మినారు, వరంగల్ కోట, హైదరాబాదు నగరం, నిజామాబాదు రైల్వే స్టేషను, కుంటాల జలపాతం,ఫలక్‌నుమా ప్యాలెస్
Anthem: "జయ జయహే తెలంగాణ "
Telangana
భారతదేశంలో తెలంగాణ ఉనికి
Coordinates (తెలంగాణ): 17°21′58″N 78°28′30″E / 17.366°N 78.475°E / 17.366; 78.475
భారతదేశం భారతదేశం
అవతరణ2 జూన్ 2014
ముఖ్యపట్టణంహైదరాబాదు
జిల్లాలు33
Government
 • Bodyతెలంగాణ ప్రభుత్వం
 • గవర్నరుజిష్ణు దేవ్ వర్మ
 • ముఖ్యమంత్రిఎనుముల రేవంత్ రెడ్డి
 • తెలంగాణ శాసనసభద్వి సభ విధానం (119 + 43 సీట్లు)
 • లోక్‌సభ నియోజకవర్గాలు17
 • హైకోర్టుహైదరాబాదు
విస్తీర్ణం
 • Total1,12,077 కి.మీ2 (43,273 చ. మై)
 • Rank12వ
జనాభా
 (2011)[1]
 • Total3,51,93,978
 • Rank12వ
 • జనసాంద్రత307/కి.మీ2 (800/చ. మై.)
Demonymతెలంగాణీయులు/తెలంగానీ/తెలంగాన్వీ/
జి.డి.పి (2018-19)
 • మొత్తం8.43 లక్ష కోట్లు (US$110 billion)
 • తలసరి ఆదాయం1,75,534 (US$2,200)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-TG
Vehicle registrationTS-
అక్షరాస్యత66.46%
అధికార భాషలుతెలుగు, ఉర్దూ
Symbols of తెలంగాణ
Emblemకాకతీయ కళా తోరణం, చార్మినారు
Songజయజయహే తెలంగాణ జననీ జయకేతనం[3]
Language
తెలుగు & ఉర్దూ
Bird
Pala Pitta
Pala Pitta
పాలపిట్ట[3]
Flower
Tangedu Puvvu
Tangedu Puvvu
తంగేడు పువ్వు[3]
Fruit
Mango tree
Mango tree
మామిడి
Tree
Jammi Chettu
Jammi Chettu
జమ్మి చెట్టు[3]
River
Srisailam Dam on River Krishna
Srisailam Dam on River Krishna
గోదావరి, కృష్ణా నది, మంజీరా నది, మూసీ నది
Sport
Kabaddi Game
Kabaddi Game
కబడ్డీ

తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలంగాణ రాష్ట్రపు వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి

చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు.

ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య పర్యాటక ప్రాంతాలు.[4] 2023 జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినందున రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ శతాబ్ది వేడుకలునిర్వహించారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ జనాభా రెండు కోట్లు ఉండగా 2023 నాటికి కోటి జనాభా పెరిగింది. ప్రస్తుత తెలంగాణ జనాభా మూడు కోట్లు.

పేరు చరిత్ర

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలించిన ప్రాంతం త్రిలింగ దేశం, తెలుగు మాట్లాడే కాకతీయుల రాజ్యం, తెలుగు దేశం + ఆణెం అంటే దేశం, కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది.

చరిత్ర

భారత స్వాతంత్యానికి పూర్వం

 
సా.శ.1150 నాటికి తెలంగాణలో పాలించే రాజ్యాలు

పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగియుంది. పూర్వ రాతియుగం కాలం నాటి ఆవాసస్థలాలు వేములపల్లి, ఏటూరునాగారం, బాసర, బోథ్, హాలియా, క్యాతూర్ తదితర ప్రాంతాలలో బయటపడ్డాయి. వాడపల్లి, వెల్టూరు, పోచంపాడు, ఎల్లారెడ్డిపేట తదితర ప్రాంతాలలో బృహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.[5] షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[6] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[7] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[8] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

మౌర్యుల కాలం:మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేదనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ (కరీంనగర్), పౌదన్యపురం (బోధన్), పిధుండ, ముషిక, ధూళికట్ట, పెద్దబొంకూర్, ఫణిగిరి, కొండాపురం, కోటిలింగాల, గాజులబండ ముఖ్యమైనది.[9] ఇవన్నీ నేటి తెలంగాణ రాష్ట్రంలోనివే. ఇంకనూ బయటపడాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.[10] మెగస్తనీసు ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా ములక అస్సక లేదా ప్రతిష్ఠాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేర్కొన్నారు.[11]

శాతవాహనుల కాలం:శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా ఇదే. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిష్ఠానపురం, ధరణికోటనే తొలి రాజధానిగా పరిగణించారు. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల, దాని పరిసరాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్రస్థానం గోదావరి తీరంలోని తెలంగాణ ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించారు.[12] శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతం మొత్తం కలిపి పాలించిన రాజ్యాలులేవు. విజయపురి కేంద్రంగా పాలించిన ఇక్ష్వాకుల రాజ్యంలో తెలంగాణ తూర్పు ప్రాంతాలు భాగంగా ఉండేవి. ఇదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వాకాటకులు పాలించారు. వాకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వాకాటక రాజ్యంలో కలిసిపోయింది. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్న విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేశారు. ఈ విష్ణుకుండినుల జన్మభూమి తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బి.ఎన్.శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించాడు.[13] ఇంద్రపాలనగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు, కీసరలోని రామలింగేశ్వర, షాద్‌నగర్ సమీపంలోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి.

 
ఆలంపూర్‌లో బాదామి చాళుక్యుల నిర్మించిన దేవాలయాలు

బాదామి చాళుక్య కాలం: బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోఉండేది.ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి-మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్‌లో పలు సంఖ్యలో వీరి రాతిశాసనాలు ఉన్నాయి.తెలంగాణ శాసనాలు, మొదటి భాగంహశ్శిలాయుగం నాటి ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు.షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదం అశ్మక జనపదం ఈ ప్రాంతంలోనిదే. పోదన్ (నేటి బోధన్) దీని రాజధానిగా ఉండింది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైయుంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాజ్ఞయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలికుడు బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు బావనకుర్తి (ఆదిలాబాదు జిల్లాలో నదీద్వీపం) గా పిలుబడుతున్నది. మత్స్యపురాణంలో మంజీరక దేశం (నేటి మంజీరా నది పరీవాహప్రాంతం) ప్రస్తావన కూడా ఉంది.[6] ప్రతిష్ఠానపురం (పైఠాన్) రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాదు జిల్లా ప్రాంతం భాగంగా ఉండింది. అప్పుడు ఉత్తర-దక్షిణ ప్రధానమార్గం ఈ రాజ్యం గుండా ఉండేది.[7] విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకమని పిలిచారు (నేటి మంజీరా నది పరీవాహక ప్రాంతం).[8] షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

రాష్ట్రకూటుల కాలం: రెండో కీర్తివర్మతో చాళుక్యవంశం అంతంకాగా మాన్యఖేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్యశాసనం "కొరివి శాసనం" ఈ కాలం నాటిదే. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాళుక్యులు బోధన్, వేములవాడలలో స్వతంత్ర పాలన చేశారు.

కళ్యాణి చాళుక్యకాలం: రాష్ట్రకూట రాజు రెండోకర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాళుక్యరాజ్యం స్థాపించాడు. కవి రన్నడు ఇతని ఆస్థాన కవి.[14] మహబూబ్‌నగర్ జిల్లా గంగాపురంలోని చెన్నకేశ్వస్వామి ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించబడింది. ఈ ప్రాంతంలోవీరి పలు శాసనాలున్నాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతంలో ముదిగొండ చాళుక్యులు పాలించారు. పాలమూరు జిల్లా మద్యభాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది.

కందూరి చోడులు: క్రమక్రమంగా కందూరు చోళరాజ్యం విస్తరించింది. తొలి కాకతీయుల కాలం నాటికి ఇది కాకతీయ రాజ్యం కంటే పెద్ద రాజ్యంగా విలసిల్లింది.[15] కందూరు, మగతల (నేటి మక్తల్), వర్థమానపురం (నేటి నంది వడ్డెమాన్), గంగాపురం, అమరాబాద్, భువనగిరి, వాడపల్లి, కొలనుపాక ఈ కాలంలో పెద్ద పట్టణాలుగా విలసిల్లాయి. విక్రమాదియుని కుమారుడు తైలపుని కాలంలో రాజ్యాన్ని రెండుగా చేసి ఇద్దరు కుమారులను రాజులుగా చేశాడు. దానితో ఇప్పటి నల్గొండ, పాలమూరు జిల్లా ప్రాంతాలలోవేర్వేరు పాలన సాగింది. గోకర్ణుడు తన రాజధానిని పానగల్లు నుంచి వర్థమాన పురానికి తరలించాడు. కందూరు చోడుల శాసనం ఒకటి మామిళ్ళపల్లిలో కూడా లభ్యమైంది. ఇదే కాలంలో వరంగల్ ప్రాంతంలో పొలవాస పాలకులు రాజ్యం చేశారు. అనుమకొండ (నేటి హన్మకొండ ప్రాంతం) మాత్రం కొలనుపాక రాజధానిగా కళ్యాణి చాళుక్యులే పాలించారు.

 
కాకతీయుల కాలం నాటి ఓరుగల్లు శిలాతోరణం

కాకతీయ కాలం: తొలి కాకతీయుల కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉత్తర తెలంగాణకే పరిమితమై ఉండగా రుద్రదేవుని కందూరు చోడరాజ్యంపై దండెత్తి వర్థమానపురాన్ని నాశనం చేసి తన సామంతులను పీఠం అధిష్టింపచేశాడు. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్ధారెడ్డి ఈ కాలం వాడే. ఈయన సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతిచెందింది. సా.శ1323లో ఢిల్లీ సుల్తానుల దాడితో కాకతీయ సామ్రాజ్యం అంతంకాగా తెలంగాణ ప్రాంతం సుల్తానుల వశమైంది. అయితే కొంతకాలానికే ప్రతాపరుద్రుని సేనానిగా పనిచేసిన రేచర్ల సింగమ నాయకుడు స్వతంత్రించి పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇది దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పాలన సాగించగా, ముసునూరి పాలకులు ఈశాన్య తెలంగాణలో కొంతవరకు పాలించారు. ఆ తర్వాత కృష్ణానదికి దక్షిణభాగం ఉన్న తెలంగాణ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. ఉత్తర భాగం మాత్రం గోల్కొండ సుల్తానుల అధీనంలో ఉండేది.

కుతుబ్‌షాహీల కాలం: సా.శ1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా, దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించారు. బహమనీ సామ్రాజ్యం ఐదు ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్‌షాహీలు రాజ్యమేలారు. కుతుబ్‌షాహీల ఉచ్ఛదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం (రాయచూర్ డోబ్‌లోని నడిగడ్డ ప్రాంతం) ఆదిల్‌షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచుగా చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వశమైంది.

ఆసఫ్‌జాహీల కాలం: సా.శ1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్‌జాహీలు పాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూ ప్రవేశపెట్టారు.[16] స్థానిక ప్రజలను అణకద్రొక్కి ఢిల్లీనుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్ది ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం, 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూర్గుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హన్మంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణరెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

తెలంగాణ విమోచనోద్యమం

 
పాలమూరు పట్టణంలో విమోచనోద్యమానికి గుర్తుగా ఉన్న తూర్పుకమాన్

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం[17] నానా అరాచకాలు సృష్టించారు.[18] అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.[19] హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్ఠుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్ఫూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని 1948 సెప్టెంబరు 18న భారత్ యూనియన్‌లో విలీనం చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు ఈ కాలంలో ముఖ్యమంత్రులుగావ్యవహరించారు.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాయచూర్, గుల్బర్గా, బీదర్ కర్ణాటక ప్రాంతం కన్నడ మాట్లాడే ప్రాంతాలు, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక లకు వెళ్ళిపోగా. ఔరంగాబాద్, బీడ్, పర్భణీ, నాందేడ్, హుస్నాబాద్ మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వేర్పాటు ఉద్యమాలు

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో 11 లోక్‌సభ స్థానలలో విజయం సాధించింది. 2001, ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు.

2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యంకొరకు శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసినా ఫలితంలేకపోయింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది.[20] ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును[21] శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్‌సభ ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యధాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది.[22][23] 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.

భౌగోళిక స్వరూపం

 
తెలంగాణ సరిహద్దుల పటం
 
తెలంగాణ భౌతిక పటం
 
తెలంగాణా జాతీయ రహదారులు

తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉంది. ఈ ప్రాంతము సముద్రమట్టం నుంచి సరాసరిన 1500 అడుగుల ఎత్తున ఉండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.

 
తెలంగాణా నదులు

నదులు: గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

అడవులు: ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం, నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది.[24] మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఈ ప్రాంతంలోని రక్షిత అరణ్యాలు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు.

ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.

కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు.

తెలంగాణ పర్యాటక ప్రదేశాలు

 
పిల్లల మర్రి వృక్షం

తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక, అధ్యాత్మిక, సాంస్కృతిక తదితర పర్యాటక ప్రాంతాలకు కొదువలేదు. ఆలంపూర్‌లో అష్టాదశ శక్తిపీఠం, బాసరలో జ్ఞానసరస్వతి దేవాలయం, భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం, నిజామాబాద్ సారంగపూర్ హనుమాన్ మందిరం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), ఆర్మూర్ సిద్దులగుట్ట, నిజామాబాద్ ఖిల్లా రఘునాధ ఆలయం (ఇది చత్రపతి శివాజి గురువైన సమర్థ రామదాసు నిర్మించినది), డిచ్ పల్లి ఖిల్లా రామాలయం, ( కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం, సిరిచెల్మలో సోమేశ్వరాలయం, జైనాథ్‌లో పల్లవుల కాలం నాటి ఆలయం, గంగాపూర్‌లో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి చెన్నకేశ్వస్వామి ఆలయం, కదిలిలో పాపహరేశ్వరాలయం, ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,[25] కొండగట్టులో ఆంజనేయస్వామి ఆలయం, కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, అచ్చంపేట సమీపంలో ఉమామహేశ్వర ఆలయం, నారాయణపేట సమీపంలో ఔదుంబరేశ్వరాలయం, సిర్సనగండ్లలో సీతారామాలయం, మన్యంకొండలో శ్రీవెంకటేశ్వరాలయం, మామిళ్ళపల్లిలో నృసింహక్షేత్రం, బీచుపల్లిలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం[26][27], మెదక్‌లో పెద్ద చర్చి, ఏడుపాయలలో భావాని మందిరం, కొత్లాపూర్‌లో ఎల్లమ్మ ఆలయం, ఝురాసంగంలో కేతకీ ఆలయం, కొల్చారంలో జైనమందిరం, నాచగిరిలోనృసింహాలయం, బొంతపల్లిలో వీరభద్ర ఆలయం, వరంగల్‌లో వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, నిజామాబాద్ జిల్ల లింబాద్రిగుట్టపై లక్ష్మీనృసింహస్వామి ఆలయం, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, తాండూరులో భద్రేశ్వరస్వామి ఆలయం, అనంతగిరిలో పద్మనాభస్వామి ఆలయం, కీసరలో రామలింగేశ్వరస్వామి ఆలయం, చేవెళ్ళలో వెంకటేశ్వరస్వామి ఆలయం, చిలుకూరులో బాలాజీ ఆలయం, పాంబండలో రామాయణం కాలం నాటి శివాలయం, దామగుండంలో రామలింగేశ్వరాలయం, పాలంపేటలో రామప్పదేవాలయం, కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి ఆలయం, మేడారంలో సమ్మక్క-సారక్క గద్దె ఉన్నాయి.వరంగల్ జిల్లా మేడారానికి 20 కిలోమీటర్ దూరంలో బ్రిటిష్ కాలానికి చెందిన అద్భుతమైన మరో ప్రకృతి వనం అందులోనూ కొలకత్తా హౌరా బ్రిడ్జి నమూనా రెండు వేరు వేరు దీవులను ఏకం చేస్తూ కట్టిన మరో అద్భుతం లక్నవరపు సరస్సు.

 
రామోజీ పిల్మ్ సిటి

ఆదిలాబాదు జిల్లాలో ఎత్తయిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం,[28] బత్తీస్‌ఘఢ్ కోట, హైదరాబాదులో బిర్లామందిరం, బిర్లా ప్లానెటోరియం, చార్మినార్, గోల్కొండ కోట, నెహ్రూ జూపార్క్, రామోజీ ఫిలిం సిటి, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, లుంబినీ పార్క్, ఎన్టీయార్ గార్డెన్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయం, సర్దార్ మహల్, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఖిల్లా, ఎలగందల్, రామగిరిఖిల్లా, ఖమ్మం జిల్లాలో రామాయణం కాలం నాటి పర్ణశాల, పాపికొండలు, కిన్నెరసాని అభయారణ్యం, నేలకొండపల్లి బౌద్ధస్తూపం, ఖమ్మం ఖిల్లా, పాలమూరు జిల్లాలో పిల్లలమర్రి వృక్షం, గద్వాల కోట, ఖిల్లాఘనపురం కోట, అంకాళమ్మ కోట, కోయిలకొండ కోట, పానగల్ కోట, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, వరహాబాదు వ్యూపాయింట్, మల్లెలతీర్థం, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు, భువనగిరి కోట, దేవరకొండ దుర్గం, నిజామాబాదు జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ప్రాజెక్టు, దోమకొండ కోట,నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాద్ కందకుర్తి త్రివేణి సంగమం (గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసే స్థలం), రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవరావ్ హెగ్డేవార్ జన్మస్థలం, రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, కోట్‌పల్లి ప్రాజెక్టు, గండిపేట, శామీర్‌పేట చెరువు, వరంగల్ జిల్లాలో ఓరుగల్లు కోట, రామప్ప, వెయ్యి స్తంభాల గుడి, పాకాల చెరువు, లక్నవరం, భోగత జలపాతం, మెదక్ జిల్లాలో మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, మంజీరా అభయారణ్యం, కొండాపూర్ మ్యూజియం, వనపర్తి జిల్లాలో వనపర్తి సంస్థానం, తిరుమలయ్య గుట్ట దేవాలయం, శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి

 
హైటెక్ సిటి

తెలంగాణలో హైదరాబాదు జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉండగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం జీడిపిలో సేవారంగం వాటా 59.01% ఉంది. వ్యవసాయరంగంలో 55.7% మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6%, పారిశ్రామిక రంగంలో 11% పనిచేస్తున్నారు.[29] హైదరాబాదు జిల్లా నుంచి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తుండగా, పారిశ్రామిక రంగం నుంచి హైదరాబాదు పరిసరాలలోని రంగారెడ్డి జిల్లా ప్రాంతం నుంచి, మెదక్ జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుంచి, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుంచి లభిస్తుంది.

తలసరి ఆదాయం:తెలంగాణ ప్రాంతపు ప్రజల తలసరి ఆదాయం రూ.36082గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే, హైదరాబాదులో అత్యధికంగా ఉండగా ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది.

ఖనిజాలు: తెలంగాణలో అనేక ఖనిజ నిక్షిప్తమై ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు జిల్లాలలో బొగ్గు గనులు, ఆదిలాబాదు, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలలో ముడి ఇనుము, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలలో ముగ్గు రాయి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో సున్నపురాయి నిక్షేపాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి.

పరిశ్రమలు: హైదరాబాదు, పరిసరాలలో అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు లో, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పారిశ్రామికవాడ ఉంది. మెదక్ జిల్లా పటాన్‌చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బోధన్ లో చక్కెర కర్మాగారం, సిర్పూర్‌లో కాగితం పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ ఉంది.

విద్యుత్ కేంద్రాలు:

1921లో హుస్సేన్‌సాహర్ విద్యుత్ కేంద్రం స్థాపించబడింది. 1930లో నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపితమైంది. 1956లో నాగార్జున సాగర్ నిర్మించిన పిదప విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1983లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి ప్రాజెక్టుగా మార్చి జలవిద్యుత్ కేంద్రంగా మార్చారు. 2011లో ప్రియదర్శినీ జూరాలా ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. గట్టు ప్రాంతంలో భారీ సౌరవిద్యుత్ కేంద్రం స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

వ్యవసాయం: ప్రాచీన కాలంలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతం వ్యవసాయికంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయాభివృద్ధి కోసం కాకతీయులు నిర్మించిన పలుచెరువులు నేటికీ కనిపిస్తున్నాయి. రెండొబేతరాజు కేసరి సముద్రం నిర్మించగా, గణపతిదేవుడు దేశం (తెలంగాణ) నలుమూలలా పలు భారీ చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్ల రుద్రుడు ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువును త్రవ్వించాడు. తెలంగాణ ప్రాంతంలో సువాసనలువెదజల్లే బియ్యం పండుతున్నట్లు అప్పట్లోనే సాహితీవేత్తలు పేర్కొన్నారు.[30] కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీల కాలంలో కూడా ఈ ప్రాంతం వ్యవసాయంలో పేరుగాంచింది. 1914లో వ్యవసాయాభివృద్ధి కోసం సహకార వ్యవస్థను ఏర్పాటుచేశారు. నిజాంసాగర్ (1935)జలాశయం, అలీసాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల నిర్మాణం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనా స్థానము (1935) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, జొన్నలు, కందులు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి, నిజామాబాదు జిల్లాలో వరి, చెరుకు, మొక్కజొన్న, కరీంనగర్ జిల్లాలో వరి, ప్రత్తి, మెదక్ జిల్లాలో వరి, మొక్కజొన్న, వరంగల్ జిల్లాలో ప్రత్తి, వరి, నల్గొండ జిల్లాలో వరి, ప్రత్తి, రంగారెడ్డి జిల్లాలో వరి, కందులు అధికంగా పండుతాయి.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా 70 లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.[31]

రవాణా సౌకర్యాలు

 
తెలంగాణలో గ్రామాలను నగరాలను కలిపే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు

రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి, జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, వంటి జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి.

 
కాచిగూడ రైల్వే స్టేషను

రైలు రవాణా: సికింద్రాబాదు, కాజీపేటలు తెలంగాణలోని రైల్వేజంక్షన్లు. సికింద్రాబాదు దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము, డివిజన్ కేంద్రము . హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో వాడి నుండి హైదరాబాదుకు రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు-విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. కాచిగూడ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగబాద్ ల మీదుగా మన్మాడ్ వరకు గోదావరి వ్యాలీ రైలు మార్గం 1899లో మొదలు పెట్టి 1901లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013, అక్టోబరు 12[32] ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, నిజామాబాద్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.

హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి.

వాయు రవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయ ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, రామగుండంలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది.

తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014), తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) చూడండి

 
తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

1948 వరకు ఈ ప్రాంతం హైదరాబాదు రాజ్యంలో భాగంగా ఉండుటచే ఇక్కడ రాజకీయాలకు అవకాశం లేకుండేది. హైదరాబాదు రాజ్య విమోచనం అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రారంభమయ్యాయి. 1952లో తొలిసారిగా ఈ ప్రాంతంలో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, తొలి లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. తొలి లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. హైదరాబాదు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందినారు. 1956 నవంబరులో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది. 1971 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది.[33] 1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందినారు. 11 నెలల రాష్ట్రపతి పాలన అనంతరం 1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి 1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆ తర్వాత 1980 అక్టోబరు నుంచి మెదక్ జిల్లాకు చెందిన టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవి పొంది 1982 ఫిబ్రవరి వరకు పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో 1983 ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది. 1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందలేరు. 2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. 2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులను లోనైంది. 2004 లోక్‌సభ ఎన్నికలలో తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలలో విజయం సాధించింది. 2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 2, తెరాస 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందినది. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటిచేసి, విజయం సాధించారు.[34] 2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్రపు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2018లో గడువు ముందుగా జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి, కె.చంద్రశేఖరరావు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు

తెలంగాణ ప్రముఖులు

 
కోదండరాం

హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి,[35] సహజకవి బమ్మెరపోతన, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు, కవయిత్రి సరోజినీ నాయుడు, కవి పండితుడు వానమామలై వరదాచార్యులు, ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు, విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్, చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ, సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు, సుమతీ శతక కర్త బద్దెన, తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య, సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు, తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు, సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు,[36] విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు, నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి,[37] సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, కవి వేములవాడ భీమకవి, సమరయోధుడు రాధాకిషన్ మోదాని, జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు, తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ, ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు, 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు, కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్, నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్, గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు,[38] సమరయోధుడు జమలాపురం కేశవరావు, చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి, కవి సామల సదాశివ, సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య, సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు,[39] ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్, అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు, కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు, తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి, తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు, నటుడు కత్తి కాంతారావు, విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి,

 
హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు

ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య, సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్, తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు, కవి మల్లినాథ సూరి, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి, కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, సమరయోధుడు మందుముల నరసింగరావు, కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు,[40] గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "గోల్కొండకవుల చరిత్ర"తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి, కవి, చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక, చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ, తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు, నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన[41] అనభేరి ప్రభాకరరావు, 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న, మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న, కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ పండిత్ నరేంద్రజీ, విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి, నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్, ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం, విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు, ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి, చిత్రకారుడు తోట వైకుంఠం, శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు, చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు, చరిత్ర పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు, విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి, విప్లవకవి గద్దర్, రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, ప్రస్తుత కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి,తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి.కణకణలాడే నిప్పును ముద్దాడి తన శ్వాస ఆశ ఆశయం తెలంగాణ రాష్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో మాడి మసి అయిన విద్యార్థి శ్రీకాంతాచారి, 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు[42]. ఈ ప్రాంతానికి చెందిన కొందరు. సందీప్ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రానికి వ్యక్తి 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన 2021లో ఒమాన్ దేశం తరపున టి - 20 వరల్డ్ కప్ లో ఆడాడు.

జనాభా

2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా[43], 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. అప్పటి రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది.

తెలంగాణ సాహిత్యం

 
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి

ప్రాచీనకాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం విలసిల్లింది. ఆలంపూర్‌కు చెందిన మంథాన భైరవుడు 10వశతాబ్దంలోనే ప్రసిద్ధ "భైరవతంత్రం"అనే సంస్కృత గ్రంథం రచించాడు.[44] 13వ శతాబ్దిలో గోన బుద్ధారెడ్డి "రంగనాథ రామాయణం" ద్విపద ఛందస్సులో రచించాడు. ఇది తొలి తెలుగు రామాయణంగా ప్రసిద్ధి చెందినది. గోన బుద్ధారెడ్డి సోదరి కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి పొందింది. ఈమె వేయించిన బూదపురం శాసనం నేటి భూత్పూర్‌లోని దేవాలయంలో ఉంది. తెలంగాణ సాహిత్యంలో కాకతీయ యుగం స్వర్ణయుగంగా భావించబడుతుంది. గణపతిదేవుని బావమరిది జాయపసేనాని నృత్యరత్నావళిని రచించాడు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు తెలుగు సాహిత్యంలోనే ఆదికవిగా నిలిచాడు.[45] వేములవాడ భీమకవి ఈ కాలం నాటివాడే. 13వ శతాబ్దికే చెందిన బద్దెన కాకతీయుల కాలంలో సుమతీ శతకము రచించాడు. తొలి పురాణ అనువాద మహాకవి మారన ఇదే కాలానికి చెందినవాడు. ప్రతాపరుద్రుని ఆస్థానకవి విద్యానాథుడు రచించిన పలు గ్రంథాలలో ప్రతాపరుద్ర యశోభూషణం ప్రఖ్యాతిచెందింది. మూడు తరాల కాకతీయ చక్రవర్తుల వద్ద మంత్రిగా పనిచేసిన శివదేవయ్య కూడా మహాకవి. 14వ శతాబ్దికి చెందిన కాచ-విఠలులు తొలి తెలుగు జంటకవులుగా ప్రసిద్ధి చెందారు. చమత్కార చంద్రిక రచించిన విశ్వేశ్వరుడు కూడా 14వ శతాబ్దికి చెందిన కవి. తెలుగులో తొలి యక్షగాన రచయిత సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఇదే కాలానికి చెందినవాడు. అనపోత నాయకుని కుమారుడు రెండో సింగభూపాలుడు స్వయంగా కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. విజయనగర రాజు బుక్కరాయల కోడలైన గంగాదేవి కాకతీయుల ఆడబిడ్డ, ఈమె కవయిత్రిగా పేరుపొందింది.[46] తొలి తెలుగు వచనకర్త కృష్ణమాచార్యులు కూడా 14వ శతాబ్దికి చెందినవాడు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు స్వయంగా కవి అయి శివయోగసారం లాంటి పలు రచనలు చేశాడు. సింహాసన ద్వాత్రింశిక రచించిన కొరవి గోపరాజు కూడా ఇదే కాలానికి చెందినవారు. సిగ్మండ్ ప్రాయిడ్ కంటే ముందే మానసిక సమస్యలు విశ్లేషించిన వాడిగా గోపరాజు ప్రఖ్యాతిచెందారు. చిత్రవిచిత్రాలతో కూడిన "చిత్రభారతం" రచయిత చరిగొండ ధర్మన్న 15-16వ శతాబ్దికి చెందిన కవి.

 
జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణలో తెలుగు సాహిత్య ప్రభ తగ్గిననూ మరింగంటి సింగరాచార్యులు తన కవిత్వంతో ఇబ్రహీం కుతుబ్‌షానే మెప్పించి అగ్రహారాన్ని పొందాడు. అప్పటి కవులు ఇతనిని మల్కిభరాముడని అభివర్ణించారు. ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థానకవి అద్దంకి గంగాధరుడు ప్రతిభావంతుడైన కవి. ఇతను రచించిన తపతి సంవర్ణోపాఖ్యానం ప్రఖ్యాతిచెందింది. పొన్నెగంటి తెలగనాచార్యుడు 16వ శతాబ్దికి చెందినకవి. కులీకుతుబ్‌షా ఫారసీ కవులను ఆదరించాడు. ఇతని కాలంలో ఫారసీ, ఉర్దూలలో పలు రచనలువెలువడ్డాయి. కులీకుతుబ్‌షా సంస్కృత "శుకసప్తతి"ని "యాతినామా" పేరుతో ఫారసీలోకి అనువాదం చేయించాడు. ఈ కాలంలోనే దోమకొండ సంస్థానం సాహిత్యానికి పేరుగాంచింది. 1600 ప్రాంతానికి చెందిన కాసే సర్వప్ప "సిద్దేశ్వర చరిత్ర" రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి తెలుగులోనే మొట్టమొదటి మహామహోపాధ్యాయ కవిగా గణతికెక్కాడు. కొందరు గుంటూరు జిల్లా కవిగా భావించే కాకునూరి అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల నిరూపించాడు. తానీషా వద్ద పనిచేసే అక్కన్న-మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న (భక్తరామదాసు) కీర్తనలు తెలుగువారికి శతాబ్దాల నుంచి సుపరిచితమే.

 
తెలంగాణ భాషలో కవితలద్దిన కాళోజీ

ఆసఫ్‌జాహీల కాలంలో (1724-1948) తెలంగాణ సాహిత్యం కుంటుపడింది. తెలుగుభాషను అణగద్రొక్కి బలవంతంగా ప్రజలపై ఉర్దూభాష రుద్దడం, తెలుగు కవులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో కాకతీయుల కాలంలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణ సాహిత్యం ఆసఫ్‌జాహీలకాలంలో దారుణంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా తెలుగులో రచించిన గ్రంథాలు కూడా వెలుగులోకి రాకుండా చేశారు. ఈ కాలంలో స్థానిక స్థల మహాత్మ్యాలు, దేవాలయ చరిత్రల విశేషాలు రచించినవి తర్వాతి కాలంలో బయటపడ్డాయి. భజనకీర్తనలు కూడా ఈ కాలంలో వ్రాయబడ్డాయి. మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వేంకటదాసు, వేపూరు హనుమద్దాసు ఈ కాలంలోని సంకీర్తన త్రిమూర్తులుగా పరిగణించబడతారు. రాజవోలు ప్రభువు ముష్టిపల్లి వేంకటభూపాలుడు వేలాది సంకీర్తనలు రచించాడు. ఆసఫ్‌జాహీలు స్వయంగా కవిపండితులకు ఆదరణ ఇవ్వకున్ననూ స్వతంత్రంగా పాలన కొనసాగించిన సంస్థానాలలో మాత్రం సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఆధునిక కాలంలో కవిపండితులకు నిలయమైన గద్వాల సంస్థానం ప్రత్యేకతను కలిగియుంది. సాహితీవేత్తలు ఈ సంస్థానాన్ని విద్వత్గద్వాలగా అభివర్ణించేవారు. గద్వాల సంస్థానాధీశూలు కూడా స్వయంగా కవులుగా ఉండి పలు రచనలు చేశారు. తరుచుగా కవితాగోష్టులు నిర్వహించేవారు. గద్వాల సంస్థానాధీశులు కవులను ఎంతగా అభిమానించేవారంటే, వారి కోసం ఒక ప్రత్యేక ద్వారాన్నే ఏర్పాటు చేసి, వారు నడిచే మార్గంలో తెల్లటి వస్త్రాన్ని పరిచి, కవిపండితుల పాదధూళిని భరిణెలో భద్రపర్చి వాటిని తిలకంగా నుదుటికి పెట్టుకొనేవారు. గద్వాల సంస్థానంతో పాటు పరిసర సంస్థానాలైన వనపర్తి సంస్థానం, జటప్రోలు సంస్థానాధీశూలు కూడా గద్వాల సంస్థానంతో పోటీపడ్డారు. వీరి మధ్య తరుచుగా కవితా గోష్టులు జరిగేవి. తిరుపతి వేంకటకవులను కూడా ఓడించిన ఘనత వనపర్తి సంస్థాన కవులకు దక్కింది.

1920 తర్వాత తెలంగాణలో నీలగిరి, గోల్కొండ పత్రిక లాంటి తెలుగు పత్రికలు రాకతో సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది. అదివరకు వెలుగులోకి రాని కవులు, వారి రచనలను సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలోనే, దానికి అనుబంధమైన సుజాత సాహిత్య పత్రికలోనూ ప్రచురించేవారు. తెలంగాణలో కవులే లేరనే ఒక ఆంధ్రుడి సవాలును తీసుకొని 356 కవుల చరిత్ర, వారి రచనలతో "గోల్కొండ కవుల సంచిక" పేరుతోఒక గ్రంథాన్నే ప్రజల ముందుకు ఉంచిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగులో తొలి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇతనికే లభించింది. గ్రంథాలయోద్యమం సమయంలో ప్రతి ప్రాంతంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, సాహిత్య గ్రంథాలు ఉంచడంతో సాహితీ అభిమానులు కూడా అధికమయ్యారు. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య లాంటి కవులు నిజాం దురాగతాలను ఎలగెత్తడానికి పద్యాలనే ఆధారం చేసుకోగా, కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషలోనే కవితలు చేసి ప్రజలను జాగృతం చేశారు. వట్టికోట ఆళ్వారుస్వామి, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు లాంటి వారు విమోచనోద్యమ కాలంలోనే సాహిత్య రచన చేశారు. సామల సదాశివ బహుభాషావేత్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఆధునిక తెలుగు సాహితీవేత్తలలోనే అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. నందిని సిద్ధారెడ్డి, అందెశ్రీ, గోరటి వెంకన్నలు తెలంగాణపై కవితలు రచించారు.

తెలంగాణ సంస్కృతి

 
బతుకమ్మ ఉత్సవం

పండుగలు: బోనాల ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.[47]

భాష: తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది.

వస్త్రధారణ: తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం,కొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు.

వ్యవసాయం

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కందుల ఉత్పత్తికి మహబూబ్‌నగర్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం పేరుగాంచాయి. మొక్కజొన్న ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. చెరుకు ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో ఉంది. పొగాకు, ఉల్లి సాగులో మహబూబ్ నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్ అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాదు జిల్లాలో ఎలాంటి సాగుభూమి లేదు. తెలంగాణలోని వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తుంది.

ఆనకట్టలు, జలాశయాలు

తెలంగాణ రాష్ట్రం ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, ట్యాంకులకు నిలయంగా పిలువబడుతుంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి.

విద్యాసంస్థలు

 
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం

1959లో వరంగల్లో నిట్ (NIT) జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించబడింది.1919లో హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1964లో ఎన్.జీ.రంగా విశ్వవిద్యాలయం, జే.ఎన్.టి.యూ, 1974లో హైదరాబాదు విశ్వవిద్యాలయం, 1976లో వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రారంభించబడినవి. 2000 తర్వాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నిజామాబాదులో తెలంగాణ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్‌ లో శాతవాహన విశ్వవిద్యాలయం, నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రారంభించబడ్డాయి. హైదరాబాదులో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్,

కళలు

తెలంగాణలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది.[48] ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.

జిల్లాలు-మండలాలు

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్ మండలాలు రెవెన్యూ గ్రామాలు సంఖ్య అందులో నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోగా మిగిలిన రెవెన్యూ గ్రామాలు సంఖ్య వైశాల్యం (చ.కి)
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 4,185.97
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 4,300.16
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 8,951.00
4 జయశంకర్ జిల్లా భూపాలపల్లి 1 11 6,361.70
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 2,928.00
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 3,043.23
8 జనగామ జిల్లా జనగామ 2 12 2,187.50
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 3,651.00
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 2,379.07
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 4,453.00
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 2,876.70
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 4,037.00
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 4,056.36
15 మెదక్ జిల్లా మెదక్ 3 21 2,740.89
16 మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా మెడ్చల్ 2 15 5,005.98
17 నల్గొండ జిల్లా నల్లగొండ 3 31 2,449.79
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 6,545.00
19 నిర్మల్ జిల్లా నిర్మల 2 19 3,562.51
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 4,153.00
21 రంగారెడ్డి జిల్లా హైదరాబాదు 5 27 1,038.00
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 4,614.74
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 26 4,464.87
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 3,425.19
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 1 13 2,030.89
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 1,415.68
27 వికారాబాద్ జిల్లా వికారాబాద్ 2 19 3,385.00
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 2,938.00
29 హన్మకొండ జిల్లా హన్మకొండ 2 14 1,304.50
30 వరంగల్ జిల్లా వరంగల్ 2 13 2,175.50
31 యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరి 2 17 3,091.48
32 ములుగు జిల్లా ములుగు 1 9 3,881.00
33 నారాయణపేట జిల్లా నారాయణపేట 1 11 2,336.00
మొత్తం 73 593 112,077.00

రాష్ట్ర చిహ్నాలు

ఆధునిక తెలంగాణ- కాలరేఖ

తెలంగాణ
తెలంగాణ వ్యాసం చూడండి

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 "Telangana Statistics". Telangana state portal. Retrieved 14 December 2015.
  2. "Telangana Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 17 March 2018.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Telangana State Symbols". Telangana State Portal. Retrieved 15 May 2017.
  4. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358
  5. తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 20
  6. 6.0 6.1 ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, రచన:పి.రామశర్మ
  7. 7.0 7.1 A History of South India, K.A.Neelakanta Shastry, P 65
  8. 8.0 8.1 ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి, పి.రామశర్మ
  9. ఆంధ్రుల చరిత్ర, బి.ఎస్.ఎల్.హన్మంతరావు, పేజీ 52
  10. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి, పేజీ 17
  11. తెలంగాణ చరిత్ర, రచన:సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 37
  12. తెలంగాణ చారిత్రక భౌగోళం, జి.రాంబాబు, పేజి 102
  13. తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 69
  14. పాలమూరు చరిత్ర, దేవీదాస్ రావు
  15. కాకతీయులు, రచన: పి.వి.పరబ్రహ్మశాస్త్రి
  16. తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 196
  17. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి, 2006 ప్రచురణ, పేజీ 176
  18. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-09-209
  19. స్వాతంత్ర్య సమర నిర్మాతలు, స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పరిశోధన సంస్థ ప్రచురణ, 1994, పేజీ 48
  20. "ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం". వన్ ఇండియా. Sep 3, 2013. Archived from the original on 2018-03-21. Retrieved 2014-01-31. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2019-03-22 suggested (help)
  21. "12లోగా అసెంబ్లీకి బిల్లు: కిరణ్ పావులు, 'టి' వ్యుహాలు". వన్ ఇండియా. 2013-12-06. Retrieved 2020-08-03.
  22. "తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా..." వెబ్ దునియా. 2014-02-20. Archived from the original on 2014-03-03. Retrieved 2014-02-24.
  23. "The Andhra Pradesh Reorganisation Act, 2014" (PDF). India Code Legislative Department. Ministry of Law and Justice. 1 March 2014. p. 2. Archived from the original (PDF) on 24 September 2015. Retrieved 14 July 2015.
  24. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది 26-10-2014
  25. మాతల్లి గోదావరి (తితిదే ప్రచురణ)
  26. ఆంధ్రప్రదేశ్ దర్శిని, పేజీ136
  27. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 246
  28. నవ తెలంగాణ, ఆదిలాబాదు (17 November 2019). "పర్యాటకుల మదిదోస్తున్న కవ్వాల్‌". NavaTelangana. Archived from the original on 26 ఏప్రిల్ 2020. Retrieved 26 April 2020.
  29. ఈనాడు దినపత్రిక (తెలంగాణ ఎడిషన్), తేది 07-11-2014
  30. తెలంగాణ చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పేజీ 133
  31. "బీడు భూములను పావనం చేస్తున్న కృష్ణా, గోదావరి జలాలు". ntnews. 2020-05-31. Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.
  32. ఈనాడు దినపత్రిక, తేది 13-10-2013
  33. S. Nagesh Kumar (2010-12-30). "One people, many aspirations". The Hindu. Retrieved 2013-07-20.
  34. కాసం, ప్రవీణ్ (10 November 2018). "'ఆమె'కు ఎందుకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు?". బిబిసి. Archived from the original on 3 December 2018. Retrieved 3 December 2018.
  35. పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ,
  36. పాలమూరు జిల్లా వాగ్గేయకారులు, రచన: పి.భాస్కరయోగి
  37. స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు, రచన: మల్లయ్య
  38. కృష్ణవేణి తరంగాలు, (తితిదే ప్రచురణ)
  39. మహబూబ్‌నగర్ జిల్లా అజ్ఞాత విషయాలు, రచన: పల్లెర్ల జానకి రామశర్మ
  40. పాలమూరు జిల్లా నాటక కళావైభవం, రచన:దుప్పల్లి శ్రీరాములు
  41. శతవసంతాల కరీంనగర్ జిల్లా
  42. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-05. Retrieved 2015-12-04. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  43. http://www.censusindia.gov.in
  44. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు
  45. తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 139
  46. తెలంగాణ చరిత్ర, రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 167
  47. ఈనాడు దినపత్రిక, తేది 27-06-2014
  48. warangal.ap.nic.in/tourism/maintour
  49. నవతెలంగాణ, నవతెలంగాణ బ్యూరో (21 July 2016). "తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమట్ట". Retrieved 21 July 2016.
  50. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది నవంబరు 18, 2014
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఇతర పఠనాలు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=తెలంగాణ&oldid=4311656" నుండి వెలికితీశారు